– కొందరు యూట్యూబ్ విశ్లేషకుల కేకలు పట్టించుకోని టీడీపీ ఓటరు
– ఫలితాల్లో జగన్‌కు మేలు చేయకూడదన్న కోణం
– అందుకే అసంతృప్తి ఉన్నా సైకిల్‌కే జై కొట్టిన క్యాడర్
– పార్టీ అభ్యర్ధులను ఓడించే స్థాయిలో లేని అసంతృప్తి
-ఫలితాల్లో కనిపించని జీవీరెడ్డి, ఏపీపీఎస్సీ ప్రభావం
– అడ్డం తిరిగిన పార్టీ అసంతృప్తి నేతల అంచనాలు
– లోకేష్ రంగంలోకి దిగడంతో రోడ్డెక్కిన నేతలు
– భవిష్యత్తుపై భయంతో పనిచేసిన మంత్రులు, ఎమ్మెల్యేలు
– గుంటూరులో లక్ష్మణరావును ముంచిన జగన్ పిలుపు
– గోదావరిలో టీడీపీ ఇక డోంట్‘వర్రీ’
– ఒక ఫలితం.. అనేక సంకేతాలు
( మార్తి సుబ్రహ్మణ్యం)
గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీడీపీ విజయం ఒక చరిత్ర. ఒక సభలో మొత్తం గ్రాడ్యుయేట్ సభ్యులు ఒకే పార్టీకి చెందిన వారుండటం మరో అద్భుతం. సహజంగా గ్రాడ్యుయేట్ ఎన్నికలు, పాలకులకు వ్యతిరేకంగా తీర్పు ఇస్తుంటాయి. పక్కన తెలంగాణ లో కూడా జరిగింది అదే. గతంలో ఏపీలో జగన్ హయాంలో జరిగిందీ అదే. కానీ దానికి భిన్నంగా అనూహ్య మెజారిటీతో, అది కూడా తొలి ప్రాధాన్య ఓటుతోనే ఇప్పుడు పాలకపార్టీ గెలవడం ఇంకో ఆశ్చర్యం. అసలు తొలి ప్రాధాన్య ఓటుతో ఎప్పుడూ గెలవని టీడీపీ.. ఈసారి అందరి అంచనాలు తల్లకిందులు చేస్తూ, తొలి వరసలో జెండా ఎగురవేయడం అద్భుతాల్లో అద్భుతం. నిజానికి జర్నలిస్టులు, విశ్లేషకుల అంచనాలకు అందని విజయం. ఎందుకంటే ప్రచార సమయంలో కనిపించి-వినిపించిన అంచనాలవి. ఈ విజయానికి టీడీపీ అర్హురాలే.
గుంటూరు-కృష్ణా గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ అభ్యర్ధి ఆలపాటి రాజేంద్రప్రసాద్, ఉభయ గోదావరి జిల్లాల అభ్యర్ధి పేరాబత్తుల రాజశేఖరం, ఎవరూ ఊహించనంత భారీ మెజారిటీతో టీడీపీ విజయపతాక ఎగురవేశారు. అయితే వారిద్దరి విజయం ఆ స్థాయిలో ఉంటుందని ఊహించిన వారు తక్కువ. ఎందు ంటే పోలింగ్ ముందు వరకూ టీడీపీ శిబిరంలో ఆందోళన కనిపించింది. గుంటూరు-కృష్ణా జిల్లాల అభ్యర్ధి ఆలపాటి సంగతి పక్కనపెడితే, గోదావరి జిల్లాల అభ్యర్ధి పేరాబత్తుల విజయం అనుమానమేనన్న ప్రచారం విస్తృతంగా జరిగింది.
అక్కడ దళిత ఓటర్లు ఎక్కువ కావడం, పిడిఎఫ్ అభ్యర్ధి కూడా ఆ వర్గానికే చెందిన వారు కావడంతో, పేరాబత్తుల ఓడిపోతారన్న ప్రచారం తీవ్రస్థాయిలో జరిగిన మాట వాస్తవం. పైగా పరీక్ష వాయిదా వేయనందుకు.. ఏపీపీఎస్సీ అభ్యర్ధులు, తమ ఆగ్రహాన్ని పోలింగ్‌లో చూపించబోతున్నారన్న ప్రచారం దానికి తోడయింది.
ఇక ప్రధానంగా అధికారంలోకి వచ్చినప్పటికీ.. కార్యకర్తలను పట్టించుకోవడం లేదన్న అసంతృప్తితో రగిలిపోతున్న టీడీపీ ఓటరు, పోలింగ్‌రోజున తన అసంతృప్తిని.. ఓటు ద్వారా వ్యక్తం చేస్తారన్న చర్చ కూడా అన్ని చోట్లా జరిగింది. వీటికి తోడు జీవీ రెడ్డి ఎపిసోడ్ కూడా, పార్టీ అభ్యర్ధులకు తీరని నష్టం కలిగిస్తుందన్న చర్చ కూడా జరగకపోలేదు.
ఇక గుంటూరు జిల్లాలో గుంటూరు ఎమ్మెల్యే మాధవి, పొన్నూరు ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్ర సహాయ నిరాకరణ, కృష్ణా జిల్లాలో మరికొందరి నేతల వ్యవహారశైలి, పిడిఎఫ్ అభ్యర్ధి లక్ష్మణరావు కూడా కమ్మవర్గానికి చెందడం వంటి కారణాలతో ఆలపాటి రాజా గట్టిపోటీ ఇచ్చినప్పటికీ, పిడిఎఫ్ చేతిలో స్వల్ప ఓట్ల తేడాతో ఓడిపోతారన్న ప్రచారం జరగకపోలేదు. అయితే పార్టీ నేతలు మాత్రం రెండవ ప్రాధాన్యంలోనయినా బయటపడతామన్న ధీమాతో కనిపించారు. అయితే ఇక్కడ పార్టీ అభ్యర్ధిని చాలా ముందుగానే ప్రకటించటం ఆలపాటికి లాభించి, ఓట్లు నమోదు చేసుకుని అది గెలుపునకు కారణమయిందన్న విషయం ఫలితాలలో వె ల్లడయింది.
నిజానికి లక్ష్మణరావు గట్టి నాయకుడే. అందుకే రెండుసార్లు గెలవగలిగారు. ఈసారి కూడా ఆయన తీవ్రమైన పోటీ ఇచ్చి ఆలపాటిని ఓడిస్తారన్న ప్రచారం తీవ్రంగా జరిగింది. అయితే ఎప్పుడైతే వైసీపీ అధినేత జగన్ రంగంలోకి దిగి, లక్ష్మణరావును గెలిపించాలని పిలుపునిచ్చారో, అప్పుడే లక్ష్మణరావు పతనం ఖాయమయిందని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. స్వతహాగా కమ్మ వర్గానికి చెందిన లక్ష్మణరావుకు, టీడీపీ కమ్మ ఓటర్లు తొలి ప్రాధాన్య ఓటు వేయకపోయినా, కులాభిమానంతో రెండో ప్రాధాన్య ఓట్లు మాత్రం కచ్చితంగా వేసేవారు. అయితే ఇంకా జగన్‌పై కోపంతో ఉన్న కమ్మ ఓటర్లు, లక్ష్మణరావుకు జగన్ మద్దతునిస్తున్నారని తెలియడంతో అసలు రెండవ ప్రాధాన్య ఓటునే వినియోగించుకోకుండా, ఆలపాటితోనే సరిపెట్టారు. ఆ విధంగా జగన్ వల్ల లక్ష్మణరావు, తన అసలు ఓటర్లను కూడా కోల్పోయారన్నమాట.
అటు నాయకత్వం సైతం.. ఏపీపీఎస్సీ విద్యార్ధులు-పార్టీలో కార్యకర్తల అసంతృప్తి, ఈ ఎన్నికలపై ప్రభావం చూపిస్తుందా అని వివిధ మార్గాల్లో ఆరాతీసింది. అంటే గత కొద్దిరోజుల నుంచి కొందరు పార్టీకి అనుకూలురని భావించే విశ్లేషకులు.. తమ యూట్యూబ్ చానెళ్లు, చర్చల ద్వారా నాయకత్వంపై చే స్తున్న విమర్శలు, ‘‘కార్యకర్తలకు అన్యాయం జరుగుతోంది . వైసీపీ వారే లాభపడుతున్నార’’ంటూ చేస్తున్న విశ్లేషణల ప్రభావం, ఎన్నికలపై చూపిస్తుందా అన్న కోణం, నాయకత్వాన్ని కలవరపెట్టిన మాట నిజం. ఇవన్నీ రహస్యమేమీకాదు. అంతా బహిరంగమే.
అయితే వివిధ వర్గాల నుంచి తెప్పించుకున్న సమాచారం.. క్షేత్రస్థాయిలో జరుగుతున్న పరిణామాలను తెలుసుకున్న చంద్రబాబు- లోకేష్.. ఎప్పటికప్పుడు మంత్రులు, ఎమ్మెల్యేలను అప్రమత్తం చేయడం అభ్యర్ధులకు లాభించింది. ప్రధానంగా లోకేష్ ఎమ్మెల్యేలు, మంత్రులకు జారీ చేసిన హెచ్చరికలు, వారిని గాడిన పడేందుకు కారణమయ్యాయి. ప్రధానంగా ఈ ఫలితాలు అనుకూలంగా రాకపోతే ఏం జరుగుతుందో తెలిసిన మంత్రులు, జిల్లా ఇన్చార్జి మంత్రులు ఒళ్లు దగ్గరపెట్టుకుని పనిచేశారన్నది సుస్పష్టం. తొలుత చంద్రబాబు ఓటర్ల నమోదు సమయంలో చేసిన హెచ్చరికలు ఓటర్ల నమోదు సంఖ్య పెరిగేందుకు దోహదపడింది. ఇక ఇప్పుడు ఎన్నికలు జరిగిన జిల్లాల మంత్రులు, హాయిగా గుండెపై చేయి వేసుకుని పడుకోవచ్చు. తాజా ఫలితాలతో, గోదావరి ప్రాంతాల్లో టీడీపీకి ఇక డోంట్ ‘వర్రీ’నే!
కానీ ఉత్తరాంధ్ర టీచర్ ఎమ్మెల్సీ విషయంలో పార్టీ నాయకత్వం సరైన నిర్ణయం తీసుకోలేదని ఫలితం స్పష్టం చేసింది. అసలు టీచర్ ఎన్నికల జోలికి పార్టీ ఎప్పుడూ వెళ్లలేదు. పార్టీ స్థాపించి ఇన్నేళ్లయినా, అనేకసార్లు అధికారంలోకి వచ్చినప్పటికీ.. టీచర్స్ యూనియన్‌ను బలోపేతం చేసుకుందామన్న ఆలోచన ఇప్పటివరకూ చే యలేదు. అలాంటిది వర్మకు చివరి నిమిషంలో మద్దతునివ్వడం వ్యూహాత్మక త ప్పిదమే.
ఫలితం వెలువడిన తర్వాత మద్దతు విషయంలో మంత్రుల నాలుక మడతేయడం, వైసీపీ విమర్శలకు కార ణమయింది. ఎన్నికల్లో వర్మకు మద్దతు ఇవ్వాలంటూ టీడీపీ, జనసేన ఇచ్చిన పిలుపు, వాటికి సంబంధించిన ప్రకటనలను వైసీపీ బయటపెట్టి, పార్టీని ఇరుకున పెట్టడంలో సక్సెస్ అయింది.
పోనీ మద్దతు ప్రకటించిన వర్మ కోసం ఉత్తరాంధ్ర మంత్రులు అచ్చెన్నాయుడు, శ్రీనివాస్, అనిత ఏమైనా.. గుంటూరు-కృష్ణా-ఉభయ గోదావరి జిల్లాల మంత్రుల మాదిరిగా కష్టపడ్డారా అంటే అదీలేదు. మరి వర్మకు ఎందుకు మద్దతు ప్రకటించారో అర్ధం కాని అంశం. అసలు అక్కడ వర్మకు మద్దతు ఇవ్వాలని పార్టీపై ఒత్తిడి తెచ్చింది ఎవరన్నదే ప్రశ్న. ఒత్తిడి తెచ్చి మద్దతు ప్రకటి ంచిన తర్వాత అభ్యర్ధిని గెలిపించాల్సిన బాధ్యత మంత్రులదే కదా?
ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలు పరిశీలిస్తే.. పార్టీ నిర్ణయాలను ప్రశ్నిస్తూ, విమర్శిస్తున్న టీడీపీ సోషల్‌మీడియా వర్గాలు కానీ, కరుడుగట్టిన కార్యకర్తలుగానీ.. ఎన్నికల్లో మాత్రం టీడీపీ ఓడిపోవాలని కోరుకోవడం లేదని, వారిది కేవలం ‘ధర్మాగ్రహం’ మాత్రమేనని తేలిపోయింది. పార్టీ అభ్యర్ధులకు వ్యతిరేకంగా ఓటు వేసి, జగన్‌లో ఆశలు కల్పించడాన్ని.. కరుడుగట్టిన టీడీపీ కార్యకర్తలెవరూ ఇష్టపడటం లేదన్నది ఫలితాలు స్పష్టం చేశాయి.
ఎన్నికల ముందు జరిగిన జీవీ రెడ్డి ఎపిసోడ్‌లో.. ఆయన పట్ల క్యాడర్‌లో సానుభూతి వెల్లువెత్తినప్పటికీ, అది అసంతృప్తి-ఆగ్రహంగా మారి, పార్టీ అభ్యర్ధుల ఓటమికి కారణం కాలేదన్నది కనిపిస్తూనే ఉంది. ఇక ఏపీపీఎస్సీ అభ్యర్ధుల ఆగ్రహం-అసంతృప్తి సైతం తాత్కాలికమే తప్ప, అందులో కూటమిని ఓడించాలన్న కసి లేనేలేదని ఫలితాలు చాటాయి.
ఎటొచ్చీ గత కొంతకాలం నుంచీ కూటమి తీసుకుంటున్న నిర్ణయాలపై కార్యకర్తల తరఫున తామే ఆలోచిస్తూ, తమ యూట్యూబ్ చానెళ్లలో, చర్చలలో విమర్శనాస్త్రాలు సంధిస్తున్న కొందరు విశ్లేషకులకు మాత్రం, తాజా ఫలితాలు తీరని నిరాశే. తమ ఆలోచనలకు అనుగుణంగా పార్టీ నడవాలని, అలా జరగనందుకు లక్షలాది కార్యకర్తల ప్రతినిధులుగా మారి, విమర్శనాస్త్రాలు సంధిస్తున్న వారు.. ఈ ఎన్నికల్లో పార్టీ ఓడితే నాయకత్వం నింగి నుంచి నేలకు దిగివచ్చి, పార్టీ కోసం పనిచేసిన కార్యకర్తల గురించి ఆలోచించడం మొదలుపెడుతుందన్న ఒక ఆశను ఈ ఫలితాలు నీరుకార్చాయి.
సో.. తాజా ఫలితాలతో, పార్టీ నాయకత్వం తమ మెదడుతో ఆలోచించి, తమ కళ్లతో చూసి, తమ ఆలోచన ప్రకారం నిర్ణయాలు తీసుకోవాలని అత్యాశపడే యూట్యూబ్ చానెళ్ల విశ్లేషణకు- క్షేత్రస్థాయి కార్యకర్తల ఆలోచనలకూ పొంతన లేదని తేలింది. వివిధ కారణాలతో కార్యకర్తల్లో అసంతప్తి ఉన్నప్పటికీ, అది పార్టీ అభ్యర్ధులను ఓడించే స్థాయిలో లేదని విశ్లేషకులు గుర్తించాల్సిన అవసరాన్ని ఫలితాలు చాటాయి.
అయితే బోటు కాంట్రాక్టులు, కృష్ణా జలహారతి కాంట్రాక్టులు దక్కని తమ అసంతృప్తిని.. విశ్లేషకులు కార్యకర్తల అసంతృప్తిగా చూపిస్తున్నారన్నది కొత్తగా పార్టీలో వినిపిస్తున్న చర్చ. గత టీడీపీ ప్రభుత్వంలో లబ్థిపొందిన వీరికి ఇప్పుడు అలాంటి అవకాశాలు దక్కని క్రమంలోనే, తమ అసంతృప్తిని కార్యకర్తల అసంతృప్తిగా చూపిస్తున్నారన్నది పార్టీ వర్గాల విశ్లేషణ. నిజం నారాయణుడికెరుక.
ఇక్కడో చ్న్ని ఉదాహరణ. కర్నాటకలోని శైవులలో కొన్ని తెగలుంటాయి. ఏపీ-తెలంగాణలో కూడా అవి కనిపిస్తుంటాయి. అందులోని ఒక తెగ తమ ఒంటిని రక్తం వచ్చేలా చర్నాకోల్‌తో కొట్టుకుంటుంది. మరొక తెగ శంఖం ఊదుతుంటుంది. కానీ లక్షలాదిమందిని ప్రభావితం చేసే శైవ పీఠాథిపతులు మాత్రం వీటికి దూరంగా ఉంటారు. ప్రజలు ఆ పీఠాథీపతి వైపే ఉంటారు తప్ప, ఒంటిని చెర్నాకోల్‌తో రక్తం వచ్చేలా కొట్టుకునే వారిని ఆదరించరు. కాకపోతే ఆ విన్యాసాలను అక్కడే చాలాసేపు ఉండి ఆసక్తితో తిలకిస్తారు. అంతమాత్రాన వారిని ఆదరించినట్లు కాదు. అయితే చర్నాకోల్‌తో కొట్టుకునే సదరు శైవ మతాభిమాని మాత్రం.. అక్కడ గుంపుగా చేరిన వారంతా తను చెప్పిందే చేస్తారని, తను చెప్పిన మాట వింటారని భ్రమపడుతుంటారు. ఆ ప్రకారంగా.. ఏపీలో చంద్రబాబు శైవపీఠాథిపతి అయితే, ఒంటిని రక్తం వచ్చేలా చర్నాకోల్‌తో కొట్టుకునే వారంతా పార్టీకి దిక్సూచిగా మారాలనుకునే యూట్యూబ్ విశ్లేషకుల లాంటివాళ్లన్నది.. టీడీపీ అంతర్గత పరిణామాలను నిశితంగా పరిశీలిస్తున్న ఓ సీనియర్ న్యాయవాది అద్భుత విశ్లేషణ.
నిజానికి నాయకత్వ వ్యవహార శైలి మింగుడుపడని చాలామంది ఎమ్మెల్యేలు, సీనియర్లు, పార్టీని అభిమానిస్తున్నా తీరు మారిన పార్టీ వైఖరిపై అసంతృప్తిగా ఉన్న జర్నలిస్టులు సైతం.. అదే కోరుకున్నారన్నది నిష్ఠుర నిజం. అంటే ఈ ఎన్నికల్లో పార్టీ ఓడితే, నాయకత్వం కాళ్లు నేలపైకి వచ్చి, తమను పట్టించుకుంటారని ఆశించాయన్నమాట. అయితే దానికి కారణాలు ఏమిటన్నది విశ్లేషించుకోవాల్సింది నాయకత్వమే.
ఎందుకంటే ఇది ప్రమాదకరమైన వైఖరి. ఇప్పుడు ఎన్నికల్లో గెలిచారు కాబట్టి ఫర్వాలేదు. అసలు అలాంటి ప్రమాదకరమైన ఆలోచనా ధోరణి ఎందుకు మొదలయిందో తెలుసుకుని, దానిని మొగ్గలోనే తుంచేయడం నాయకత్వ తక్షణ కర్తవ్యమన్నది సీనియర్ల ఉవాచ.
తాజా ఎన్నికల ఫలితాలు యువనేత లోకేష్ నాయకత్వ సామర్థ్యాన్ని మరోసారి చాటిచెప్పాయన్నది నిష్ఠుర నిజం. ఒక నాయకుడిగా పరిణతి చెందిన నిర్ణయాలు తీసుకునే క్రమంలో, కార్యకర్తల మనోభావాలతోపాటు.. దూరంగా ఉంటూ రాజకీయ పరిణామాలు పరిశీలించే వారి అభిప్రాయాలు గమనంలోకి తీసుకుంటే లోకేష్ నాయకత్వం మరింత మెరుగుపడుతుందన్నది పార్టీవర్గాల సూచన.