Suryaa.co.in

Editorial

రేవంత్ పనయిపోయిందా?

– మునుపటి మాదిరిగా ప్రసంగాలకు రాలని ఓట్లు
– చప్పట్లే తప్ప ఓట్లు రాని రివర్స్ గేర్‌లో రేవంత్
– కాళ్లకు బలపాలు కట్టుకుని తిరిగినా తప్పని ఓటమి
– ఏరి కోరి మరీ అభ్యర్ధుల ఎంపిక చేసినా చేదు ఫలితమే
– ఎమ్మెల్సీ ఎన్నికల్లో ప్రచారం చేసిన తొలి సీఎం
– అయినా తప్పని కాంగ్రెస్ అభ్యర్ధుల పరాజయం
– కోదండరామ్ వర్గీయుడికీ తప్పని ఓటమి
– రేవంత్ గ్రాఫ్ పడిపోతోందా?
– ఫలితాలే ప్రమాద ఘంటికలంటున్న సీనియర్లు
– ఏకపక్ష ఎంపికలే ఓటమికి కారణమంటూ ఫైర్
– రేవంత్‌పై ఢిల్లీకి ఫిర్యాదుల వెల్లువ
– రేవంత్ ఏడాది పాలనకు రెఫరెండమేనా?

( మార్తి సుబ్రహ్మణ్యం)

‘‘కేసీఆర్ అనేది ఇప్పుడు ఒక ఎక్సపయిరీ మెడిసన్. ఆయన పనయిపోయింది’’- ఇది ఎన్నికలకు ఆరునెలల ముందు నుంచీ నాటి పిసిసి ఛీఫ్ రేవంత్‌రెడ్డి చేసిన మానసిక ప్రచారం. నిజానికి అది ‘అత్తారింటికి దారే ది’ సినిమాలో, పవన్‌నుద్దేశించి రావు రమేష్ వాడిన డైలాగ్! ‘ప్రతి మెడిసిన్‌కు ఒక ఎక్సపయిరీ డేటుంటుంది. నువ్వు కూడా అలాంటివాడివే సిద్దూ. రావిచెట్టుకు పూజలు చేస్తాం. కానీ అదే మనింటి గోడలో మొలిస్తే పీకేస్తాం’ అంటాడు ఆ సినిమాలో! రేవంత్ కూడా గత ఎన్నికల ముందు, సేమ్ అదే డైలాగ్‌ను కేసీఆర్‌పై ప్రయోగించి సక్సెస్ అయ్యారు.

సీన్‌కట్ చేస్తే..

గతంలో కేసీఆర్‌పై చేసిన అవే వ్యాఖ్యలు, భావన సీఎంగా ఉన్న అదే రేవంత్‌రెడ్డిపై మొదలయిన వైచిత్రి. కారణం.. తాజాగా జరిగిన టీచర్స్, గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ ఘోర పరాజయం! బహుశా ఈ కారణంగానేమో.. రేవంత్‌రెడ్డి పనయిపోయిందా అనే ప్రచారానికి కారణమయింది!! అంటే ఒక రకంగా రేవంత్ పాలనకు ఈ ఫలితాలు రెఫరెండమా?

సహజంగా గ్రాడ్యుయేట్, టీచర్స్ నియోజకవర్గాల ఎన్నికల ప్రచారానికి ముఖ్యమంత్రులు దూరంగా ఉంటారు. వాటిని లీడర్-క్యాడర్‌కు వదిలేసి, తాము ఎన్నికల ప్రక్రియను నిఘా బృందాల నివేదికలతో పర్యవేక్షిస్తుంటారు. జిల్లాలకు మంత్రులను ఇన్చార్జిగా పెట్టి, వారి ద్వారా అన్ని వ్యవహారాలు నడిపిస్తుంటారు. ఇది ఉమ్మడి రాష్ట్రం నుంచి చూస్తున్నదే. కానీ తెలంగాణ కాంగ్రెస్‌లో సీఎం రేవంత్‌రెడ్డి అందుకు భిన్నం. వాటిని కూడా సార్వత్రిక, స్థానిక ఎన్నికల స్థాయిలో ప్రచారం చేశారాయన. ఆకాశమంత సభలు పెట్టారు. ఆర్భాటంగా ప్రచారం చేశారు.

ఆ వేదికలపై.. ఈ ఏడాదిలో తన సర్కారు చేసిన అభివృద్ధి-సంక్షేమ కార్యక్రమాలు పేరు పేరునా ఏకరవు పెట్టారు. మధ్యలో మోదీని, కేసీఆర్‌ను తనదైన శైలిలో విమర్శించారు. ఆ సందర్భంలో జనం నుంచి చప్పట్లు బ్రహ్మాండంగా వచ్చాయి. మీడియాలో పతాక శీర్షికల్లో చోటు సంపాదించారు. కానీ చప్పట్లు కొట్టినవాళ్లెవరూ, ఎమ్మెల్సీ ఎన్నికల్లో రేవంత్ నిలబెట్టిన అభ్యర్ధులకు ఓట్లు మాత్రం వేయలేదు. కారణం.. వారిలో గ్రాడ్యుయేట్, టీచరు ఓటర్లు అతి తక్కువ కాబట్టి!

సహజంగా రేవంత్‌రెడ్డి ఒరిజినల్ క్రౌడ్‌పుల్లర్. తెలంగాణలో కేసీఆర్, సంజయ్, ఒవైసీ లాంటి జనాకర్షణ ఉన్న అతికొద్దిమంది నేతల్లో రేవంత్ ఒకరు. కాంగ్రెస్‌లో రేవంత్ స్థాయిలో ఇమేజ్ ఉన్న నేతలు లేరు. చాలామంది సీనియర్లు ఉన్నప్పటికీ, రేవంత్ వంటి వాగ్దాటి ఉన్న నేత కరవు. ఆయన సభలకు పెద్దగా తరలింపు అవసరం ఉండదు. ఎందుకంటే రేవంత్ కష్టపడి తెచ్చుకున్న ఇమేజ్ అది. అయితే ఎక్కువ కాలం విపక్షంలో ఉన్నందున, సీఎంగా ఉన్నప్పటికీ ఇప్పటికీ విపక్ష నేతగానే మాట్లాడతారు. కేసీఆర్ కుటుంబాన్ని, సంజయ్-కిషన్‌రెడ్డిని తిడుతున్న సందర్భంలో అది స్పష్టంగా కనిపిస్తుంటుంది.

జనం పల్సు తెలిసిన మాటల మరాఠా కాబట్టే, ఆయన ప్రసంగంలో వేసే పంచ్‌లు జనక్షేత్రంలో టపాసుల మాదిరి పేలుతుంటాయి. ఆ ఇమేజ్‌తోనే ఆయన శిధిలావస్థలో కాంగ్రెస్‌ను పీసీసీ చీఫ్‌గా వెలిగించి, పార్టీని ఏకంగా అధికారంలోకి తీసుకురాగలిగారు. అసలు తెలంగాణలో కలగా మారిన కాంగ్రెస్ అధికారాన్ని, నిజం చేయడంలో రేవంత్‌దే కీలకపాత్ర. సూటిగా చెప్పాలంటే అది రేవంత్ రెక్కల కష్టమే. ఆయన పీసీసీ చీఫ్‌గా లేకపోతే, కాంగ్రెస్ ప్రతిపక్షంలోకి రావడం కూడా కష్టమయ్యేదేమో?!

అలాంటి రేవంత్‌రెడ్డి నేతృత్వంలో జరిగిన మూడు ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ ఓడిన ముచ్చట, సహజంగా రేవంత్‌రెడ్డి పనయిపోయింది.. ఆయన గ్రాఫ్ పడిపోతోందన్న సంకేతాలకు కారణమవుతోంది. అంటే ఈ ఏడాదిలో ఆయన సర్కారు సాధించిన విజయాలను పట్టభద్రులు, టీచర్లు పెద్దగా పట్టించుకోవడం లేదన్నమాట.

లేకపోతే రేవంత్ ఎన్నికల ప్రచార వేదికలపై ఏకరవు పెట్టిన ప్రభుత్వ విజయాలన్నీ ఓటర్లు నిజమని భావించి ఉంటే, ఆయన పార్టీకే మళ్లీ చేతెత్తి జైకొట్టేవాళ్లే కదా?! తాను ఫలానా హామీ నెరవేరిస్తేనే మా పార్టీకి ఓటేయాలని రేవంత్ చెవినిల్లు కట్టుకుని,పథకాలుకరు పెట్టినా, ఓటరు కాంగ్రెస్‌కు ఓటు వేయలేదు. అంటే ఆ ప్రకారంగా.. రేవంత్ చెప్పినవేమీ చేయలేదన్నట్లే కదా?!

నిజానికి కేసీఆర్ జమానాలో ప్రభుత్వ ఉద్యోగులకు జీతం ఎప్పుడు వస్తుందో, ఏ జిల్లాకు ముందు ఇస్తారో తెలియని పరిస్థితి. తెలంగాణ వస్తే నిరుద్యోగులకు ఇంటికో ఉద్యోగం ఇస్తారన్న ఆశలు నెరవేరని పరిస్థితి. నిర్బంధాలు, స్వేచ్ఛపై కత్తిగాట్లు పడిన, నియంతృత్వ వాతావరణం ఉండేది. ఇప్పుడు వీటిలో బీఆర్‌ఎస్ నేతలపై కేసులు, వేధింపులు తప్ప.. మరేమీ లేని వాస్తవ దృశ్యం. అయినా అధికార కాంగ్రెస్ పార్టీ అభ్యర్ధులు దారుణంగా ఓడిపోయి, కమలం వికసించిందంటే.. ఉద్యోగులు, చదువుకున్న మేధావులు, నిరుద్యోగులు ఇంకా ఏదో కోరుకుంటున్నారని సుస్పష్టం. అదేమిటో అన్వేషించుకోవాల్సిన బాధ్యత రేవంత్‌రెడ్డి సర్కారుదే.

గత అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ విజయం.. ఏవిధంగా అయితే రేవంత్ రెడ్డి ఖాతాలో వేశారో, ఇప్పుడు ఎమ్మెల్సీ ఎన్నికల పరాజయం కూడా, సహజంగా ఆయన ఖాతాలోనే వెళుతుంది. గెలిస్తే అది నా గొప్పతనం, ఓడితే అది మీ వైఫల్యం అని తప్పించుకోవడం కుదరదు. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ ఓడితే తమ కొచ్చే నష్టం లేదని రేవంత్ ముందే చెప్పినప్పటికీ.. పార్టీ ఓటమికి నైతిక బాధ్యత నిస్సందేహంగా రేవంత్‌రెడ్డిదేనన్నది సీనియర్ల ఉవాచ.

అసలు అభ్యర్ధుల ఎంపికలో పడిన తప్పులే, ఫలితం వరకూ కొనసాగాయని.. రేవంత్ తొలుత తాను అభ్యర్ధిని ఎంపిక చేసి, దానిని మిగిలిన వారితో ఒప్పించడమనే తెలివితేటలు ఎంపిక వరకూ సక్సెస్ అయినప్పటికీ.. వారిని ఓడిపోకుండా, కాపాడేందుకు మాత్రం పనికిరాకుండా పోయాయి. అదే విషాదం. అదే ఇప్పుడు రేవంత్ పయినపోయిందన్న భావన-రేవంత్ గ్రాఫ్ పడిపోయిందన్న ప్రచారానికి కారణం.

సంస్థాగ త కోణంలో చూస్తే.. ఈ పరాజయంలో పీసీసీ చీఫ్ మహేష్‌కుమార్ గౌడ్‌కూ భాగస్వామ్యం ఉండాలి. కానీ ఆయన నిమిత్తమాత్రుడని, రేవంత్ చెప్పిన దానిని ఆమోదించడమే ఆయన కర్తవ్యమన్న ప్రచారం బహిరంగమే. కాబట్టి అభ్యర్ధుల ఎంపిక- ప్రచారాన్ని జమిలిగా భుజాన వేసుకున్న సీఎం రేవంత్‌రెడ్డి ఒక్కరే, ఈ అవమానం భరించడం అనివార్యమవుతోందన్నది సీనియర్ల వ్యాఖ్య.

అందరికీ అన్ని కాలాలు కలసిరావు. విజయలక్ష్మి ఎప్పుడూ పర్మినెంట్‌గా ఒకరి భుజం మీదపనే వాలిపోదు. ఈ తత్వం తెలియకనే చాలామంది పాలకులు, నాయకులు.. ఇక ఈ పదవి శాశ్వతమని, తమ తెలివికితామే మురిసిపోతుంటారు. అన్ని చోట్లా తమ చక్రం.. విష్ణు చక్రం-భూచక్రంలా తిరుగుతుందని భ్రమిస్తుంటారు. అందుకు ఎవరూ మినహాయింపు కాదు.

అదేం విచిత్రమోగానీ కాంగ్రెస్‌లో పరిణామాలు ఎప్పుడు? ఎందుకు? ఎలా మారతాయన్నది ఎవరికీ అంతుపట్టదు. జరుగుతున్న సంఘటనల ఆధారంగా, విధి తారుమారైన సీఎంలు బోలెడు. అంటే వాటికోసమే కాచుకుని కూర్చునే వర్గం పార్టీలో ఒకటి ఉంటుంది. వీరికి జనంలో బలం లేకపోయినా, ఢిల్లీలో కావలసినంత బలం ఉంటుంది. రేవంత్ మాదిరిగా వారు క్రౌడ్‌పుల్లర్స్ కాకపోయినా, నోటిమాట రాకపోయినా ఫర్వాలేదు. అది అర్హత కానేకాదు. సోనియమ్మ కోటరీ చల్లనిచూపులంటే చాలు.

అందుకే క్షేత్రస్థాయిలో.. నయాపైసాకి సైతం పనికిరాని నేతల ప్రభ, ఢిల్లీలో దేదీప్యమానంగా వెలిగిపోతుంటుంది. వారే ఆయా రాష్ట్రాల్లో జరిగే వ్యవహారాలన్నీ పూసగుచ్చినట్లు ఢిల్లీకి చేరవేస్తుంటారు. కాంగ్రెస్ హైకమాండ్ కూడా అటు సీఎంలను, ఇటు వాళ్లను వ్యతిరేకించే నాయకులూ చేరదీస్తుంంటుంది. మొత్తంగా రాష్ట్రాల్లో ఏం జరుగుతుందో తెలుసుకోవడమే వారి విధి. అందుకే సమ్మతి-అసమ్మతిని దువ్వుతుంటుంది. ఇది దశాబ్దాలుగా కాంగ్రెస్ కొనసాగిస్తున్న రాజకీయ ఎత్తుగడ.

ఒక్క దివంగత వైఎస్‌కు మాత్రమే ఆ విషయంలో మినిహాయింపు ఇచ్చింది. ఎందుకంటే సోనియా వైఎస్‌ను, పార్టీ నేతగా కాకుండా సొంత కుటుంబసభ్యుడిగా భావించారు కాబట్టి. వైఎస్ సైతం తన బిడ్డలతో మనకు కాంగ్రెస్ పార్టీ భవిష్యత్తు ఇచ్చింది. రాహుల్‌ను ప్రధాని చేయాల్సిన బాధ్యత మనపై ఉంది. ఆరోజు నేను ఫ్లైట్‌లో రాజీవ్‌ను కలిసిన సందర్భమే నన్ను పీసీసీ అధ్యక్షుడిని చేసింది. కాబట్టి మన కుటుంబం ఇందిరా కుటుంబానికి రుణపడి ఉండాలి అని చెప్పేవారట. వైఎస్ మృతి చెందిన తర్వాత సోనియాను కలసిన షర్మిలను హత్తుకున్న సోనియా.. ‘ వైఎస్ మా ఇంటి మనిషి. ఆయన మరణించడం వ్యక్తిగతంగా మా కుటుంబానికి తీరని నష్టం’ అని అన్నారంటే, సోనియా మనసులో వైఎస్ స్థానమేమిటన్నది సుస్పష్టం.

గతంలో మాణిక్యం ఠాకూర్ తెలంగాణ కాంగ్రెస్ ఇచ్చార్జిగా ఉన్నప్పడు, ఆయన పార్లమెంటు క్యాంటీన్‌లో ఉన్న సోనియాను కలిశారట. ఆ సందర్భంగా.. తెలంగాణలో రేవంత్ బ్రహ్మాండంగా పనిచేస్తున్నారని, వైఎస్‌లా దూసుకుపోతున్నారంటూ చిన్న భజన కార్యక్రమం మొదలుపెట్టబోయారట. దానికి సీరియస్ అయిన సోనియా.. తాగుతున్న టీని ఆపి, ‘ఇంకెప్పుడూ వైఎస్‌ను ఇతరులతో పోల్చవద్దు. అతను కాంగ్రెస్ మనిషి. నా ఫ్యామిలీ మెంబర్ లాంటివాడ’ని మెత్తగా మందలించారట.

దానితో దిద్దుబాటుకు దిగిన ఠాకూర్.. అంటే రేవంత్ కూడా వైఎస్ మాదిరిగానే పాలిస్తున్నాడని చెప్పబోతే, మరోసారి వైఎస్‌ను ఎవరితోనూ పోల్చవద్దని హెచ్చరించారట. సహజంగా కాంగ్రెస్ రాష్ట్ర ఇన్చార్జులు సీఎంలకు సింక్ అయితే, వారి కోసం ఏమైనా చేస్తుంటడారు. గతంలో వైఎస్ జీవించినప్పుడు గులాంనబీ ఆజాద్ చేసింది కూడా అదే.

ఇప్పుడు తెలంగాణ ఎమ్మెల్సీ ఎన్నికల్లో విజయానికి నీళ్లు ఒదులుకున్న సందర్భం, అసమ్మతి దళాలకు బాగా కలసివచ్చినట్లుంది. కేవలం రేవంత్ అసమర్థత వల్లనే పార్టీ ఓడిపోయిందని, ఎవరినీ సంప్రదించకుండానే అభ్యర్ధులను ఎంపిక చేశారన్న ఫిర్యాదుల పర్వానికి తెరలేపారట. తన చుట్టూ తిరిగేవారిని, తన కులం వారినే రేవంత్ ప్రోత్సహిస్తున్నారంటూ పితూరీలు పంపారట. జనంలో ఏమాత్రం బలం లేనివారంతా రేవంత్ ఇంటి దగ్గర, సచివాలయం, ఢిల్లీ పర్యటనల్లో కనిపిస్తున్నారంటూ, వాటికి సంబంధించిన ఫొటోలను కూడా సాక్ష్యంగా పంపించారట.

ఎంపికల సమయంలో తానే ముందుగా అభ్యర్ధులను నిర్ణయించి, దానిని తన రాజకీయ చతురత, లౌక్యంతో ఆమోదించుకునే తెలివైన రాజకీయాలు చేస్తున్నారని, అసలు ఇప్పటివరకూ జరిగిన ఏ ఎంపికలోనూ నాయకుల అభిప్రాయాలు తీసుకున్న దాఖలాలు లేవని ఏకరు పెట్టారట. సోషల్‌మీడియా సహా మీడియాలో తన వ్యక్తిగత ప్రచారానికే ప్రాధాన్యం ఇస్తున్న రేవంత్‌రెడ్డి, పార్టీని పట్టించుకోవడం లేదని మరో ఫిర్యాదు చేశారట.

మౌత్ పబ్లిసిటీలో మిగిలిన పార్టీల కంటే కాంగ్రెస్‌లోనే ఎక్కువ గత్తర ఉంటుంది. ఆ ప్రకారంగా ఎమ్మెల్సీ ఎన్నికల్లో పార్టీ పరాజయం పాలైనందున రేవంత్‌ను తొలగించబోతున్నారని, ఉత్తమ్‌కుమార్‌రెడ్డిని గద్దెనెక్కించబోతున్నారని కొందరు, భట్టిని సీఎం చేయబోతున్నారని ఇంకొందరు అప్పుడే ప్రచారం ప్రారంభించడమే కాదు. వాటిని కొన్ని మీడియా సంస్థల ద్వారా అప్పుడే ప్రచారంలోకి పెట్టేశారు. ‘ఢిల్లీ అవసరాలు’ ఎవరైనా తీర్చాల్సిందే కాబట్టి, ఆ పని రేవంత్ స్థానంలో ఎవరున్నా చేస్తారన్నది తమ వాదనకు వారు వినిపించే ఓ గొప్ప సూత్రీకరణ. నిజం సోనియమ్మకెరుక?

ప్రతిదానికీ ‘మరి నా సంగతేమిట’ని అడుగుతున్న పాత ఇన్చార్జి మున్షీని మార్చి, కఠినంగా ఉండే మీనాక్షమ్మను తెచ్చారన్నది ఆ వర్గాల మరో లాజిక్. అసలు మీనాక్షమ్మ వచ్చిందే కొత్త సీఎం ఎంపిక కోసమని, ఆమె ఆ పనిలో భాగంగానే నాయకులతో భేటీలు వేస్తున్నారంటున్నారు. రేవంత్‌కు కత్తెర వేసేందుకే ఆమె అసలు కాంగ్రెస్- కొసరు కాంగ్రెస్- కొత్త కాంగ్రెస్ అనే మూడు ప్రాతిపదికలకు ఊపిరిపోసి, పదవులు కూడా ఆ ప్రకారంగా ఇస్తారన్నది కొత్త ప్రచారం.

అంటే తొలి నుంచి పార్టీ మారకుండా కాంగ్రెస్‌లోనే కొనసాగుతున్న భట్టి, ఉత్తమ్, శ్రీధర్‌బాబు, కోమటిరెడ్డి, పొన్నం లాంటి ‘పుట్టు కాంగ్రెస్’ నాయకులన్నమాట. మరికొందరు ఎన్నికల ముందు కాంగ్రెస్‌లో చేరినవారు. మూడవ కేటగిరీ వాళ్లెవరంటే, అధికారం వచ్చిన తర్వాత పార్టీలో చేరిన వారు. ఆ లెక్కన రేవంత్‌ది ఎన్నికలకు ముందు పార్టీలో చేరిన కేటగిరీ అన్నమాట.

సరే.. ఇప్పుడు కాంగ్రెస్ పరాజయ ప్రస్థానం సంగతి పక్కనబెడితే, తెలంగాణలో కమల వికాసం ఖాయమన్న స్పష్టమైన సంకేతాలు వెలువడటమే, కాంగ్రెస్ ఢిల్లీ పార్టీకి ఆందోళన కలిగించే అంశం. పార్టీకి ఆక్సిజన్ అందిస్తున్న తెలంగాణ, కర్నాటకలో తెలంగాణలో పార్టీ బలహీనపడుతుండటం సహజంగా పార్టీ బాసులకు ఆందోళన కలిగించే వ్యవహారమే. తెలంగాణలో చాపకింద నీరులా విస్తరిస్తున్న పువ్వు పార్టీని అడ్డుకోకపోతే.. తమకు ‘బొచ్చెలో రాయి’ ఖాయమన్న ఆందోళనతో ఉన్న హైకమాండ్, ఇక పూర్తిగా తెలంగాణ పార్టీని, మీనాక్షమ్మ ద్వారా తన చేతుల్లోకి తీసుకోవడం ఖాయమన్నది సీనియర్ల మరో కథనం.

పువ్వు పార్టీనే ప్రత్యామ్నాయం!

నిజంగా మందు బాటిళ్లు, ఓటర్లకు డబ్బులు పంచకుండా ఇద్దరు బీజేపీ ఎమ్మెల్సీ అభ్యర్ధులు భారీ మెజారిటీతో గెలవడం అద్భుతమే. అంటే దీన్నిబట్టి తెలంగాణ ప్రజలు, బీజేపీని ప్రత్యామ్నాయ పార్టీగా ఎంచుకుంటున్నట్లు.. మెడపై తల ఉన్న ఎవరయినా భావించక తప్పదు. రేవంత్ తన హయాంలో అన్ని చేశా.. ఇన్ని చేశానని చెప్పి, మోదీ-కేసీఆర్‌ను ఎన్ని తిట్టి చప్పట్లు కొట్టించుకున్నప్పటికీ, ఆయన వాదన అరణ్యరోదనే అయిందనేది నిష్ఠుర నిజం.

అయితే ఈ ఎన్నికల్లో బీఆర్‌ఎస్ పోటీ చేసి ఉంటే, ఓట్లు చీలి కాంగ్రెస్ కథ మరోలా ఉండేదమో? అందుకే స్థితప్రజ్ఞత-ప్రాప్తకాలజ్ఞత కలబోసిన కేసీఆర్, తన పార్టీని ఈ ఎన్నికలకు వ్యూహాత్మంగా దూరంగా ఉంచడాన్ని విస్మరించలేం. అంటే పువ్వు పార్టీ, ఆ మేరకు కేసీఆర్‌కు కృతజ్ఞత చెప్పాల్సిందే. గత అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ కూడా.. పోటీకి దూరంగా ఉండటం వ ల్లనే కాంగ్రెస్ పడవ విజయతీరానికి చేరడాన్ని విస్మరించకూడదు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఒక రెడ్డి, ఒక బీసీ అభ్యర్ధి విజయం సాధించారంటే.. తెలంగాణలో ఇక బీజేపీ అడుగులు, సచివాలయానికి కొద్ది దూరంలోనే ఉందన్నమాట.

బీసీలూ బీజేపీకే జైకొట్టారా?

ఇక తెలంగాణ ఎమ్మెల్సీ ఎన్నికల ముందు వినిపించిన బీసీ వాదానికి ఓట్లు రాలకపోవడం మరో ఆసక్తికర అంశం. ఆ పార్టీకి చెందిన ఒక బీసీ, ఒక ఓసీ అభ్యర్ధి గెలిచారంటే.. దానర్ధం బీసీలు, బీజేపీ వైపు ఉన్నట్లే కదా?! బీసీ అభ్యర్ధులకే ఓట్లు వేయాలంటూ ఎన్నికల ముందు మొదలైన ఉద్యమం, ఫలితాల్లో భూతద్దం పెట్టి వెతికినా కనిపించలేదంటే, ఓటరు కోణం వేరన్నది సుస్పష్టం.

కరీంనగర్ బీజేపీ ఎమ్మెల్సీ అభ్యర్ధి బీసీ అయినప్పటికీ, ఆయన గెలుపును పార్టీ కోణంలో చూడాలే తప్ప, కులం కోణంలో కాదు. పోనీ ఆ లెక్క ప్రకారం చూసినా, గెలుపులో కీలకపాత్ర పోషించిన సంజయ్, అర్వింద్ అండ్ అదర్స్ మున్నూరు కాపులే! పైగా బీసీ నేత, ఎంపీ ఆర్.కృష్ణయ్య, బీజేపీ అభ్యర్థులకే ఓటు వేయమని పిలుపునివ్వడాన్ని విస్మరించకూడదు.

అంటే బీజేపీలో ఉన్న బీసీ నేత కృష్ణయ్య గెలిచారా? బీజేపీ బీసీ అభ్యర్ధులకు వ్యతిరేకంగా ఉన్న బీసీ అభ్యర్ధులకు ఓటేయమని చెప్పిన బీసీ నేతలు గెలిచారా? ఇదో పెద్ద చర్చ. సో.. ఎన్నికల ముందు తెరపైకి వచ్చే ఇలాంటి వాదాలకు ఓట్లు పడటం లేదని దీన్ని బట్టి స్పష్టమవుతోంది.

 

LEAVE A RESPONSE