– రిమాండ్ రిపోర్టులో అవినాష్‌రెడ్డి పేరు వెల్లడించిన వర్రా రవీందర్‌రెడ్డి
– వర్రాపై కారాలు మిరియాలు నూరుతున్న కడప వైసీపీ వర్గాలు
– వర్రాకు అంత ధైర్యం ఎలా వచ్చిందన్న ఆశ్చర్యం
– కొట్టకుండానే నిజాలు కక్కిన వర్రా రవీందర్‌రెడ్డి?
– వర్రా అప్రూవర్‌గా మారితే అవినాష్ అండ్ కోకు ప్రమాదమే
– షర్మిల, సునీత ఫిర్యాదు చేస్తే అవినాష్‌రెడ్డికి చిక్కులే
– ఇప్పటివరకూ అవినాష్‌పై ఫిర్యాదు చేయని షర్మిల, సునీత
(మార్తి సుబ్రహ్మణ్యం)
జగన్ అధికారంలో ఉండగా టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు కుటుంబ సభ్యులు, పవన్ కల్యాణ్, షర్మిల, వివేకా కూతురు డాక్టర్ సునీత, విజయమ్మ ఇతర టీడీపీ నేతలపై సోషల్‌మీడియాలో అసభ్యంగా పోస్టింగులు పెట్టిన వైసీపీ సోషల్‌మీడియా వెనుక సజ్జల భార్గవరెడ్డి, కడప ఎంపి అవినాష్‌రెడ్డి ఉన్నారంటూ ఆ పార్టీ సోషల్‌మీడియా యాక్టివిస్టు, భారతీరెడ్డి పీఏగా ప్రచారంలో ఉన్న వర్రా రవీందర్‌రెడ్డి… పోలీసులకు ఇచ్చిన స్టేట్‌మెంట్ సజ్జల, అవినాష్‌రెడ్డి మెడకు చుట్టుకునే ఉంది. ఈ క్రమంలో వర్రా ఒప్పుకోలు కీలకం కానుంది. ఫలితంగా వర్రాకు ప్రాణహాని ఉందన్న ఆందోళన వివిధ వర్గాల్లో వ్యక్తమవుతోంది.
తమపై అవినాష్‌రెడ్డి ప్రోద్బలంతోనే వర్రా పోస్టులు పెట్టినందున, ఆయనపై చర్యలు తీసుకోవాలని వైఎస్ కూతురు షర్మిల, వివేకా కూతురు డాక్టర్ సునీత, విజయమ్మ పోలీసులకు ఫిర్యాదు చేస్తే.. అప్పుడు అవినాష్ మెడకు సోషల్‌మీడియా ఉచ్చు బిగించడం ఖాయంగా కనిపిస్తోంది. వారిలో ఒకరు ఇచ్చిన ఫిర్యాదు మేరకు, అవినాష్‌ను విచారణకు పిలిచే అవకాశం ఉంటుంది. విశ్వసనీయ సమాచారం మేరకు డాక్టర్ సునీత పోలీసులకు ఫిర్యాదు చేసేందుకు సిద్ధమవుతుండగా, షర్మిల కూడా ఆమెనే అనుసరించే అవకాశాలున్నట్లు తెలుస్తోంది.
ఈ వ్యవహారంలో పోలీసులు సజ్జల భార్గవరెడ్డికి నోటీసులు ఇచ్చి విచారణకు పిలిచే అవకాశం కనిపిస్తోంది. ప్రధానంగా వర్రా.. తాను ఎవరి ప్రోద్బలంతో పోస్టింగులు పెట్టానన్న విషయాన్ని వె ల్లడించిన తర్వాత, నిబంధనల ప్రకారం పోలీసులు వారిని విచారించక తప్పని పరిస్థితి.
ఆ ప్రకారంగా అప్పటి ప్రతిపక్ష నాయకులపై అసభ్య పోస్టింగులు ప్రోత్సహించిన సజ్జల భార్గవరెడ్డి, అవినాష్‌రెడ్డి పీఏ రాఘవరెడ్డి, అర్జున్‌రెడ్డి, సుమారెడ్డి, సోషల్‌మీడియా కన్వీనర్ వివేక్‌రెడ్డిపై కేసులు నమోదు చేయడం.. దానిక ంటే ముందు వారికి నోటీసులు ఇచ్చి విచారించడం అనివార్యంగా కనిపిస్తోంది. షర్మిల లేదా సునీతలో ఏ ఒక్కరు అవినాష్‌రెడ్డిపై ఫిర్యాదు చేసినా ఆయన మెడకూ ఈ కేసు బిగిసికోవడం ఖాయం.
ఈ కేసులో ఒకవేళ రవీందర్‌రెడ్డి తన నేరం అంగీకరించి, అప్రూవర్‌గా మారితే ఆయనను సాక్షిగా మార్చే అవకాశం లేకపోలేదు. అదే జరిగితే వైసీపీ అధినేత జగన్ కోటరీ అంతా చిక్కుల్లో పడక తప్పదంటున్నారు.
కాగా చంద్రబాబునాయుడు, పవన్, లోకేష్ ఇతర టీడీపీ నేతలపై జుగుస్పాకర పోస్టులు పెట్టిన వర్రా పిరికివాడనే తెలుస్తోంది. పోలీసులు ఒంటిపై చేయి వేయకుండానే, భయంతో అన్ని వివరాలూ వెల్లడించినట్లు సమాచారం. తనను కొట్టవద్దని, తనకు తెలిసిన నిజాలు చెబుతానని ముందుగానే కాళ్లబేరానికి వచ్చినట్లు తెలుస్తోంది.
అయితే వర్రా తనంతట తాను అవినాష్‌రెడ్డి పేరు, ఆయన పీఏ పేరు వెల్లడించటంపై వైసీపీలో ఆందోళన కనిపిస్తోంది. వర్రా ప్రాణభయానికి అవినాష్‌రెడ్డి పేరు చెప్పారా? లేక అవినాష్‌రెడ్డి పేరు చెప్పినా తనను పోలీసులు రక్షిస్తారన్న ధైర్యంతో ఆయన పేరు చెప్పారా? అన్నది తేలాల్సి ఉంది.
ఇప్పటికయితే తమ అవినాష్‌రెడ్డి పేరు వెల్లడించినందుకు… వర్రాపై అవినాష్‌రెడ్డి అనుచరులు, జగన్ అభిమానులు కారాలు మిరియాలు నూరుతున్నారు. అసలు వర్రా అంత పనిచేస్తారని వైసీపీ వర్గాలు ఊహించలేదు. అవినాష్ ఆదేశాలతో నే షర్మిల, సునీత, విజయమ్మపై పోస్టులు పెట్టామన్న వర్రా ప్రకటన ఆధారంగా.. షర్మిల లేదా సునీత అవినాష్‌రెడ్డిపై ఫిర్యాదు చేస్తే, అప్పుడు అవినాష్‌రెడ్డి చిక్కుల్లో పడక తప్పదన్న ఆందోళన వైసీపీ వర్గాల్లో వ్యక్తమవుతోంది.
ఈ నేపథ్యంలో వర్రాకు ప్రాణహాని ఉన్నట్లు కనిపిస్తోందన్న వ్యాఖ్యలు టీడీపీ వర్గాల నుంచి వినిపిస్తున్నాయి. గతంలో మొద్దుశీను, ఓంప్రకాష్ వంటి ముద్దాయిలు జైల్లోనే హత్యకు గురైన ఉదంతాలను గుర్తు చేస్తున్నారు. అందువల్ల వర్రా ఉన్న జైల్లో, కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటుచేయాల్సిన అవసరం ఉందంటున్నారు. ఇకపై కోర్టు విచారణ సైతం నేరుగా కాకుండా.. భద్రత దృష్ట్యా వర్చువల్‌గా జరపాలని కోరే అవకాశం లేకపోలేదంటున్నారు.
భారతీ నోరు విప్పరేం?
కాగా చంద్రబాబునాయుడు, పవన్, లోకేష్, షర్మిల, సునీత, విజయమ్మపై అసభ్యకరమైన పోస్టులు పెట్టిన వర్రా రవీందర్‌రెడ్డి.. వైసీపీ అధినేత జగన్ భార్య భారతీరెడ్డి పీఏ అంటూ, చాలాకాలం నుంచీ ప్రచారం జరుగుతున్న విషయం తెలిసిందే. అయితే తాజా పోలీసుల విచారణలో అతను భారతీరెడ్డి పీఏ కాదని, ఆ పేరుతో చెలామణి అవుతున్నాడన్న జవాబు వచ్చిందని సమాచారం.
ప్రతిపోస్టుకు ఇంత అని.. నెలవారీ మరోచోట నుంచి జీతం రూపంలో సంపాదించుకుంటాడని చెబుతున్నారు.
మరి తన పీఏ అంటూ మీడియా-సోషల్ మీడియాలో చాలాకాలం నుంచి జరుగుతున్న ప్రచారాన్ని, భారతీరెడ్డి ఇప్పటిదాకా ఎందుకు ఖండించడం లేదన్న ప్రశ్నలు వినిపిస్తున్నాయి. సహజంగా ఇలాంటి ఆరోపణలు వచ్చినప్పుడు, సంబంధిత వ్యక్తులు తెరపైకి వచ్చి వాటికి వివరణ ఇస్తుంటారు. అలాంటిది అనేక కేసుల్లో నిందితుడిగా ఉన్న వర్రా.. తన పీఏ అని విస్తృతంగా ప్రచారం జరుగుతున్నప్పటికీ, భారతీరెడ్డి మౌనంగా ఉండటంపై విస్మయం వ్యక్తమవుతోంది.
జూన్ ఐదునే భార్గవ దుకాణం సర్దేశారా?
కాగా సోషల్‌మీడియా పోస్టింగుల వ్యవహారంలో ఆరోపణలు ఎదుర్కొంటున్న సజ్జల భార్గవ రెడ్డి.. ఎన్నికల ఫలితాలు వచ్చిన మరుసటి రోజునే, విజయవాడ నుంచి దుకాణం సర్దేసినట్లు పోలీసు వర్గాలు చెబుతున్నాయి. ఫలితాలు వెలువడిన జూన4న మరుసటి రోజునే భార్గవ.. తమ సోషల్‌మీడియాకు సంబంధించిన డిైవె స్, హార్డుడిస్క్‌లను హైదరాబాద్‌కు తరలించినట్లు గుర్తించామని పోలీసులు అంటున్నారు. ప్రస్తుతం సోషల్‌మీడియా పోస్టింగులపై విచారణ జరగనున్న నేపథ్యంలో.. వైసీపీ సోషల్‌మీడియా పోస్టింగులకు సంబంధించిన, అన్ని సాంకేతిక అంశాలను ధ్వంసం చేసినట్లు చెబుతున్నారు.
నా ఫేస్‌బుక్ ఐడీతో భార్గవరెడ్డి పోస్టులు
– జడ్జిలకు వ్యతిరేకంగా పోస్టులు పెట్టాలని భార్గవరెడ్డి బెదిరించాడు
– ఎలాంటి పోస్టులు పెట్టాలనేది అవినాష్‌రెడ్డి, రాఘవరెడ్డి చర్చించేవారు
– షర్మిల, సునీత, విజయమ్మపై అసభ్యకర పోస్టులు పెట్టాం
– వైసీపీ సోషల్ మీడియాలో భార్గవరెడ్డి, అర్జున్‌రెడ్డి, సుమారెడ్డి కీలకం
– వర్రా రవీందర్‌రెడ్డి రిమాండ్ రిపోర్ట్ లోని వివరాలు
ఐప్యాక్ టీం కంటెంట్ ఇస్తే ఫేస్‌బుక్‌లో పోస్ట్ చేసేవాళ్లం. జగనే కావాలి, జగనన్న రావాలి యాప్‌లో పోస్ట్ చేసేవాళ్లం. వైసీపీకి వ్యతిరేకంగా మాట్లాడేవారిని లక్ష్యంగా చేసుకుని పోస్టులు పెట్టాం.
నాయకులు, వారి కుటుంబసభ్యులపై పోస్టులు పెట్టేవాళ్లం. వైసీపీ సోషల్ మీడియా కన్వీనర్ వివేక్‌రెడ్డి సూచనలతో పోస్టులు పెట్టాం. సజ్జల భార్గవరెడ్డి బాధ్యత తీసుకున్నాక మరింత రెచ్చిపోయాం. జడ్జిలకు వ్యతిరేకంగా పోస్టులు పెట్టాలని భార్గవరెడ్డి బెదిరించాడు.
2023 నుంచి నా ఫేస్‌బుక్ ఐడీతో భార్గవరెడ్డి పోస్టులు పెట్టేవారు. షర్మిల, సునీత, విజయమ్మపై అసభ్యకర పోస్టులు పెట్టాం. ఆ పోస్టులు పెట్టాలని అవినాష్ పీఏ రాఘవరెడ్డి మాకు కంటెంట్ ఇచ్చారు. ఎలాంటి పోస్టులు పెట్టాలనేది అవినాష్‌రెడ్డి, రాఘవరెడ్డి చర్చించేవారు. పవన్, ఆయన పిల్లలపై అసభ్యకరమైన పోస్టులు పెట్టా. వైసీపీ సోషల్ మీడియాలో భార్గవరెడ్డి, అర్జున్‌రెడ్డి, సుమారెడ్డి కీలకం.