Suryaa.co.in

Editorial

వీరప్పన్.. ఒక వైసీపీ ఎమ్మెల్సీ!

– వీరప్పన్‌కు వైసీపీ ఎమ్మెల్సీ స్మారక’వీరపూజ
– ఎరచందనం స్మగ్లర్‌కు వైసీపీ ఎమ్మెల్సీ భరత్ నీరాజనం
– ఇదేం దేశభక్తి అని వెక్కిరింపు
– వీరప్పన్ చర్యలను వైసీపీ సమర్ధిస్తుందా?
– ఎమ్మెల్సీ తీరుపై సోషల్‌మీడియాలో కన్నెర్ర
( మార్తి సుబ్మ్రహ్మణ్యం)

ఆయన అధికార వైసీపీ ఎమ్మెల్సీ భరత్. టీడీపీ అధినేత చంద్రబాబునాయుడుకు పోటీగా కుప్పం నుంచి సదరు నేతను ఎమ్మెల్సీగా ఏరికోరి నియమించారు. సదరు ఎమ్మెల్సీ తాజాగా ఒక స్మారక స్తూపం ఆవిష్కరించి.. ఆయన విగ్రహానికి పూలమాల వేసి, భక్తిప్రపత్తులతో పూజ చేశారు. తప్పేమీలేదు. మరణించిన మహనీయుల స్మారక స్తూపం ఏర్పాటుచేయడం, దానికి వీరపూజలు చేయడంలో ఎలాంటి ఆక్షేపణ లేదు.

అయితే సదరు వైసీపీ ఎమ్మెల్సీ…మహాత్మాగాంధీ, టంగుటూరి ప్రకాశం, తిలక్, భగత్‌సింగ్, వీరసావర్కర్, వాజపేయి, ఎన్టీఆర్ వంటి మహనీయుల స్మారక స్తూపానికి పూలమాలవేసి నివాళుర్పించారనుకుంటే, కచ్చితంగా తప్పులో కాలేసినట్లే. ఆయన ఆవిష్కరించిన స్మారక స్తూపం, అందులో పెట్టిన చిత్రపటం ఏ నేతాజీ సుభాష్ చంద్రబోసుదో, ఏ వైఎస్ రాజశేఖరరెడ్డిదో, మన్నెం వీరుడు అల్లూరి సీతారామరాజుదో అనుకుంటే మళ్లీ ఇంకోసారి పప్పులో కాలేసినట్లే.

ఆయన దండేసి దండం పెట్టిన మహానుభావుడి పేరు దిగ్రేట్ ఎర్రచందనం స్మగ్లర్ వీరప్పన్. అవును. మీరు చదివేది నిఖార్సయిన నిజం. చిత్తూరు జిల్లా వైసీపీ అధ్యక్షుడు కమ్ ఎమ్మెల్సీ భరత్ అనే మహానుభావుడు.. చిత్తూరు జిల్లా కుప్పం నియోజకవర్గం, శాంతిపురం మండలం కాకర్లవంక లోని అబకలొడ్డి అనే పంచాయితీలో స్థానిక ‘దేశభక్తులు’ కొందరు వీరప్పన్ స్మారస్తూపం నిర్మించి, అందులో ఆయన చిత్రపటం ఉంచారు.

దానిని వైసీపీ ఎమ్మెల్సీ భరత్ సగర్వంగా, సవినయంగా ఆవిష్కరించి స్మగ్లర్ వీరప్పన్‌పై తనకున్న భక్తిని ప్రపంచానికి చాటి, ఆవిధంగా ముందుకెళ్లారన్నమాట.

దీనితో సహజంగానే చిత్తూరు జిల్లాకు వీరప్పన్‌కు విడదీయలేని, అవినావభావసంబంధం ఉందన్న అనుమానం తెరపైకొచ్చింది.. దానికితోడు తాజాగా ఎర్రచందనం స్మగ్లర్‌కు, వైసీపీ టికెట్ ఇచ్చిందని టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు కూడా ఆరోపించారు. అసలు చిత్తూరు, కడప జిల్లాల్లోని చాలా నియోజకవర్గాల్లో ఎర్రచందనం స్మగ్లర్లే.. అనేమంది అభ్యర్ధులకు నిధుల సాయం చేస్తారన్న ప్రచారం ఇప్పటిది కాదు.

అన్నట్లు… చిత్తూరు జిల్లాలో ఓ అధికారపార్టీ ఎమ్మెల్యే.. పాలకులకు అత్యంత ఇష్టుడు, పాలకుడి మంచి- చెడ్డ, సర్వేల లెక్క డొక్కా, సొంత మీడియా కష్టసుఖాలు చూసే ఆ ఎమ్మెల్యే మనసు ‘శేషాచలం’ అడవులంత విశాలమట. ప్రతి పండుగకూ నియోజకవర్గంలో ఎన్ని గడపలు ఉంటే అన్ని గడపలకూ.. ప్రతిపండగకూ ఖరీదైన బట్టలు, నిత్యావసర వస్తువులు ఠంచనుగా పంపిస్తారట.

అంటే కొన్ని లక్షల కుటుంబాలకు ఆ ప్యాకేజీ చేరుతుందన్నమాట. వాటిపై ఎమ్మెల్యే గారి ఫొటో కూడా ఉంటుంద ట. ఆరకంగా పొద్దునే తలుపు తీసిన ఆడవారికి, సదరు ఎమ్మెల్యే ముఖారవిందమే దర్శనమిస్తుందట. ఇదోరకం సేవ! సదరు ఎమ్మెల్యే గారి చేతికి ఎముక ఉండదట. మీడియా నుంచి అన్ని వర్గాలను బాగా‘చూసుకుంటారట’. తనకు నష్టం కలగనంతవరకూ, ఎవరికీ కష్టం రాకుండా చూసుకుంటారట. మరి ‘శేషాచలం అడవి’ అంత దొడ్డ మనసున్న ఎమ్మెల్యే గారిని అభినందించాల్సిందే కదా?

కానీ ఏడాదిలో వచ్చే అన్ని పండుగలకూ ఖరీదైన బట్టలు కొనడానికి, సారు దగ్గర అంత సొమ్మెక్కడిది? ఆయన జీతమేమైనా నెలకు పదికోట్లంటే అయిదు లక్షలు కూడా రావు. పోనీ ఎమ్మెల్యేగారి అభిమానులు, పక్కనే ఉన్న నాలుగైదు నియోజకవర్గాల ప్రజల ఆస్తులు అమ్మినా అంతరావు కదా? మరైతే అవి ఎర్రచందనం తాలూకు సొమ్ముల ఘుమఘుమలేనన్నది, అనుమానపు జీవుల ఉవాచ. అయినా.. ఇచ్చినవి గమ్మున తీసుకోక.. ఆ డబ్బులు శేషాచలం అడవుల నుంచి వస్తే ఎందుకు? వీరప్పన్ లాంటి దేశభక్తులిస్తే ఎందుకు?

వీరప్పన్ ఘనకార్యాల గురించి శేషాచలం అడవుల్లో ఏ చెట్టునడిగినా చెబుతుంది. ఏ ఆకునడిగినా చెబుతుంది. చివరకు ఏ ఏనుగును అడిగినా చెబుతుంది. వీరప్పన్ గురించి ఈ తరం వారికి పెద్దగా తెలియకపోవచ్చు. వైసీపీ ఎమ్మెల్సీ ఆయన స్మారకస్తూపం ఆవిష్కరిస్తే తప్పేమిటని అనుకోవచ్చు. అయితే ఎంతోమంది పోలీసులను పొట్టనపెట్టుకుని, ఎన్నో డజన్ల ఏనుగులను చంపి, వాటి దంతాలు నరికేసిన రాక్షసుడు వీరప్పన్.

చివరకు ప్రకృతి ప్రసాదించిన ఎర్రచందనాన్ని తెగనరికి, వాటిని అమ్మి సొమ్ము చేసుకున్న వీరప్పన్ అనే నరహంతకుడికి, వైసీపీ ఎమ్మెల్సీ పూలమాల వేయడం కరెక్టయితే.. జగన్ సర్కారు వీరప్పన్ వర్ధంతి- జయంతిని అధికారికంగా జరిపిస్తే సరి. వీలుంటే ఆయన పేరుమీద ఒక స్టాంపును విడుదల చేయమనో… శేషాచలం అడవికి వీరప్పన్ పేరు పెట్టాలనో కేంద్రానికి లేఖ రాస్తే, జగన్ సర్కారు ప్రతిష్ఠ ఆకాశమంత ఎత్తు-శేషాచల అడవి అంత విస్తరించేది.

పనిలోపనిగా విజయవాడ బెంజ్ సర్కిల్‌లోనో, తిరుపతి అలిపిరి సెంటర్‌లోనో, లేకపోతే శేషాచలం అడవి మధ్యలో.. ఎర్రచందన బాంధువుడైన వీరప్పన్ వందడుగుల విగ్రహం ఏర్పాటుచేసి, ఆ విగ్రహ ఏర్పాటు కమిటీకి ఎమ్మెల్సీ భరత్‌ను చైర్మన్‌గా నియమిస్తే.. ఆ దృశ్యం చూడముచ్చటగా ఉంటుంది కదా?!

అయితే ఎంకిపెళ్లి సుబ్బిచావుకొచ్చినట్లు.. ఎమ్మెల్సీ భరత్ ఘనకార్యం ఇప్పుడు వైసీపీ చావుకొచ్చిపడింది. వీరప్పన్ ఘాతుకాలను వైసీపీ సమర్ధిస్తుందా? ఎర్రచందనం స్మగ్లర్లే మీకు బ్రాండ్ అంబాసిడర్లా? ఎర్రచందనం స్మగ్లింగ్.. పోలీసులను పొట్టనపెట్టుకోవడాన్ని వైసీపీ సమర్థిస్తుందా? అంటూ ఊపిరాడని విపక్షాల ప్రశ్నలతో, జవాబులేక వైసీపీ ఉక్కిరిబిక్కిరవుతోంది. రేపు వీరప్పన్ వ్యవహారం విపక్షాలకు ప్రచారాంశమైతే, ఏం సమాధానం చెప్పాలని తలపట్టుకుందట.

LEAVE A RESPONSE