నీళ్లు ఉన్నచోట జీవం ఉంటుందనేది సహజ విశ్వసూత్రం! చంద్రమండలం దక్షిణ ధృవంలో నీటి జాడలున్నాయని ఖగోళ శాస్త్రజ్ఞులు భావిస్తునడటం వల్లనే ఇస్రో తన పరిశోధనల కోసం అత్యంత సంక్లిష్టమైన ఆ ప్రాంతాన్ని ఎంచుకుంది! సూర్య కిరణాల ప్రసరణ కూడా లేకపోవడంతో ఆ ప్రాంతంలో ఉష్ణోగ్రత మైనస్ డిగ్రీల్లో ఉంటుంది. అక్కడ ఐస్ క్రిస్టల్స్ రూపంలో నీటి నిల్వలు ఉన్నాయని నాసా ధృవీకరిస్తోంది! ఇస్రో అంచనా ప్రకారం అక్కడ 10 కోట్ల క్యూబిక్ టన్నుల నీటి నిల్వలున్నాయి! ఇక్కడ గురుత్వాక్షణశక్తి కూడా చాలా తక్కువగా ఉంటుంది. చంద్రగ్రహం దక్షిణ ధృవంపై రాళ్లు, శిలలు తక్కువగా ఉంటాయి. విక్రమ్ ల్యాండర్ దిగడానికి ఈ ప్రాంతం చాలా అనుకూలం.
ఇస్రో అంచనా వేసినట్టుగానే చంద్రయాన్ 3 ల్యాండింగ్ మాడ్యూల్ అక్కడ సురక్షితంగా దిగింది. ఐతే, ఇటీవల రష్యా ప్రయోగించిన లూనా 25 మూన్ సౌత్ పోల్ పై ల్యాండవుతున్న సమయంలో విఫలమై కుప్ప కూలిన విషయం తెలిసిందే! ఆ మాటకొస్తే జాబిల్లిపై జైత్రయాత్ర కోసం ఇప్పటివరకు 12 దేశాల నుంచి 141 ప్రయత్నాలు జరిగాయి. జాబిల్లిపై భారత్ జెండా పాతింది. అంతరిక్ష చరిత్రలో ఇస్రో సరికొత్త రికార్డు సృష్టించింది.
చంద్రయాన్ 3 ఘనవిజయంతో దేశవ్యాప్తంగా సంబరాలు మిన్నంటాయి. చంద్రుడి దక్షిణ ధ్రువంపై అడుగుపెట్టిన తొలి దేశంగా ఇండియా సంచలనం సృష్టించింది. ఈ ప్రాజెక్టు కోసం ఇస్రో ₹ 615 కోట్లు ఖర్చు చేసింది. 45 రోజుల పాటు 3.84 లక్షల కిలోమీటర్లు ప్రయాణించిన చంద్రయాన్ 3 లూనార్ మాడ్యూల్ చంద్రగ్రహంపై సక్సెస్ ఫుల్ గా ల్యాండయింది. ఇక 14 రోజుల పాటు అక్కడి ఉపరితలపై ప్రజ్ఞాన్ రోవర్ క్షుణ్ణంగా పరిశోధనలు చేస్తూ చంద్రుడి నిర్మాణం, పరిమాణం, అక్కడి వాతావరణం తదితర అంశాల నిగ్గు తేల్చనుంది.
– సూరజ్ భరద్వాజ్