– జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి
పశ్చిమగోదావరి జిల్లాను అభివృద్దిలో అగ్రగామిగా నిలిపేందుకు అవసరమైన ప్రణాళికలతో ముందుకు వెళుతున్నామని కలెక్టర్, జిల్లా న్యాయమూర్తి చదలవాడ నాగరాణి తెలిపారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయిడు మార్గనిర్దేశకత్వంలో జిల్లా యంత్రాంగం ముందడుగు వేస్తోందన్నారు.
నూతన సంవత్సర ఆగమనం నేపధ్యంలో బుధవారం వివిధ సందర్భాలలో మాట్లాడుతూ ప్రజల ఆరోగ్య భ్రదతకు పెద్దపీట వేసేలా జిల్లాలో చేపట్టిన ఎలక్ట్రానిక్ హెల్త్ రికార్డ్స్ డిజిటలైజేషన్ కార్యక్రమం ఆయుష్మాన్ భారత్ డిజిటల్ హెల్త్ మిషన్ నుండి గుర్తింపును దక్కించుకుందన్నారు.
2023-24 సంవత్సరానికి తాడేపల్లిగూడెం ఏరియా ఆసుపత్రి పారిశుధ్యం, పరిశుభ్రత విభాగంలో రాష్ట్ర స్థాయి లో కాయకల్ప అవార్డుల రూపేణా రూ లక్ష ప్రైజ్ మనీతో మొదటి బహుమతి సాధించిందని కలెక్టర్ వివరించారు. రాష్ట్రం మొత్తం 11 అవార్డులు అందుకోగా, పశ్చిమగోదావరి జిల్లా 3 విభాగాలలో 5 అవార్డులను అందుకోవటం గర్వకారణమని నాగరాణి పేర్కొన్నారు.
రాష్ట్రీయ కృషి వికాస్ యోజన కింద రూ.12 లక్షలతో 24 హెక్టార్లలో హైబ్రిడ్ కూరగాయల సాగును ప్రోత్సహించామని, వ్యవసాయం, అనుబంధ రంగ పునరుజ్జీవనం కోసం రెమ్యునరేటివ్ అప్రోచ్‌లు అమలు చేస్తున్నమని తెలిపారు. 84 హెక్టార్లలో రూ.23.34 లక్షలతో ఆయిల్ పామ్ కింద నేషనల్ మిషన్ ఆన్ ఎడిబుల్ ఆయిల్స్ చేపట్టామన్నారు. పశుసంవర్ధక శాఖ పరంగా మంచి పురోగతి సాధించామని, ఐవిఎఫ్ టెక్నాలజీ ద్వారా జిల్లాలో మొదటి దేశీయ ఆడ ఒంగోలు జాతి దూడ జన్మించగా, రైతుల ప్రయోజనం కోసం ఒంగోలు, షాహివాల్, గిర్, పుంగనూరు జాతులకు చెందిన పిండాలు అందుబాటులో ఉంచామన్నారు.
జిల్లాలోని 1430 పాఠశాలల్లో 67415 మంది తల్లిదండ్రులు, 11653 మంది ప్రజల భాగస్వామ్యంతో మెగా పేరెంట్ టీచర్ సమావేశాలు నిర్వహించి విద్యోన్నతికి బాటలు వేసామన్నారు. ఉపాధ్యాయుల సహకారంతో పనితీరు రేటింగ్స్‌లో 2వ ర్యాంక్‌ను, రాష్ట్ర స్దాయి అభ్యసన ఫలితాలలో 5వ ర్యాంక్‌ను పొందగలిగామన్నారు.
స్వచ్ఛత హి సేవా అవార్డులు – 2024 కింద రాష్ట్ర స్ధాయిలో ఉత్తమ జిల్లా అవార్డు, తణుకు మున్సిపాలిటీ ఉత్తమ మున్సిపాలిటీ అవార్డు సాధించాయన్నారు. పశ్చిమగోదావరి జిల్లాలో 35 సాంఘిక సంక్షేమ హాస్టళ్లు ఉండగా, 8 హాస్టళ్లకు మరమ్మతులు, మౌలిక సదుపాయాలను మెరుగుపరిచామని, మిగిలిన హాస్టళ్ల పునరుద్ధరణ కోసం ప్రభుత్వం రూ. 129.38 లక్షలు కేటాయించిందని, పనులు త్వరలో ప్రారంభిస్తామని నాగరాణి వివరించారు.
విద్యార్ధుల సౌకర్యార్ధం తాడేపల్లిగూడెం నిట్ లో రూ.3.86 కోట్ల అంచనా వ్యయంతో 5 ఎంవిఎ పవర్ ట్రాన్స్‌ఫార్మర్‌తో కూడిన 33/11 కెవి సబ్‌స్టేషన్ ఏర్పాటు చేసామన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన “పల్లె పండుగ” కింద 355 సిసి రోడ్లు మంజూరు కాగా, 305 పనులు పురోగతిలో ఉండగా, 10 పూర్తయ్యాయన్నారు. నరసాపూర్ క్రోచెట్ లేస్ పార్క్ 2030 వరకు చెల్లుబాటు అయ్యే భౌగోళిక గుర్తింపు ట్యాగింగ్‌ను పొందిదన్నారు.
నాబార్దు, ఎపిఎస్ ఎస్ డిసి సహకారంతో నైపుణ్య పెంపుదల శిక్షణలు అందిస్తున్నామని, క్రాఫ్ట్ బేస్డ్ విలేజ్ టూరిజంను అభివృద్ధి చేయడానికి కూడా ప్రణాళికలు సిద్ధం చేసామని తెలిపారు. చాలా కాలంగా పెండింగ్‌లో ఉన్న భూ సమస్యలకు రెవెన్యూ సదస్సులలో శాశ్వత పరిష్కారం చూపుతూ పూర్తి స్థాయిలో ప్రజలు సంతృప్తి పరిచేలా వ్యవహరిస్తున్నామని జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి తెలిపారు.