బార్లను ఐదేళ్ళకు రెన్యూవల్ చేసే అధికారం చంద్రబాబుకు ఎవరిచ్చారు

– పర్మిషన్లు ఇచ్చి ఇప్పుడు రద్దు చేయమంటున్నాడు
– రద్దు చేస్తే కోర్టులకు వెళ్ళి స్టేలతో నడుపుకుంటారా
– రాష్ట్ర ప్రజలకూ వెన్నుపోటు పొడుస్తాడని చెప్పిన ఎన్టీఆర్
– వెన్నుపోటు, కుట్రలు, కుతంత్రాలకు పేటెంట్ చంద్రబాబు
– రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి కొడాలి నాని

అమరావతి (అసెంబ్లీ), మార్చి 24: అధికారం నుండి దిగిపోయే ఆరు నెలల ముందు కమిషన్లకు కక్కుర్తి పడి బార్లను ఐదేళ్ళకు రెన్యువల్ చేశారని, అలా చేసే అధికారం చంద్రబాబుకు ఎవరిచ్చారని రాష్ట్ర పౌరసరఫరాలు, వినియోగదారుల వ్యవహారాల శాఖ మంత్రి కొడాలి శ్రీవెంకటేశ్వరరావు (నాని) ప్రశ్నించారు. గురువారం ఏపీ అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద మంత్రి కొడాలి నాని మాట్లాడారు. గతంలో రెండేళ్ళకు ఒకసారి మాత్రమే మద్యం షాపులకు రెన్యువల్స్ జరిగేవని చెప్పారు. అడ్డమైన బ్రాండ్లు, డిస్టలరీల దగ్గర చంద్రబాబు డబ్బులు తీసుకుని పర్మిషన్లు ఇచ్చి రాష్ట్రాన్ని సర్వనాశనం చేసి వెళ్ళిపోయాడన్నారు. ఇప్పుడు సీఎం జగన్మోహనరెడ్డి పిచ్చి మద్యం బ్రాండ్లను, డిస్టలరీలను రద్దు చేయాలని కోరుతున్నారన్నారు. ప్రభుత్వం రద్దు చేస్తే 24 గంటల్లో కోర్టులకు వెళ్ళి స్టే తెచ్చుకుని వాటిని నడుపుకుంటారా అని ప్రశ్నించారు. ఉపాధిని దృష్టిలో పెట్టుకుని అనుమతులు ఇస్తున్నామని, ప్రభుత్వాన్ని నమ్మి అప్పులు చేసి రాష్ట్రంలో పెట్టుబడులు పెడుతున్నారంటూ డిస్టలరీలను 25 ఏళ్ళు నడుపుకునేందుకు చంద్రబాబు పర్మిషన్లు ఇచ్చారన్నారు. బ్యాంక్ ల నుండి అప్పులు తీసుకుని నడుస్తున్న డిస్టలరీలను రద్దు చేస్తే కోర్టులకు వెళ్ళి స్టేలు తెచ్చుకునే పరిస్థితి ఉంటుందన్నారు. డిస్టలరీలు, పిచ్చి మద్యం బ్రాండ్లను తర్వాత వచ్చే ప్రభుత్వాలు కూడా రద్దు చేసే అవకాశం లేకుండా చంద్రబాబు పర్మిషన్లు ఇచ్చారన్నారు. వాటిని రద్దు చేయవచ్చు కదా అంటూ ఇంటి దగ్గర కూర్చుని చంద్రబాబు ప్రెస్మీట్లు పెడుతున్నాడన్నారు.

చంద్రబాబు తన తండ్రి లాంటి ఎన్టీఆర్ కు వెన్నుపోటు పొడిచి, ఆయనను గద్దె దించాడన్నారు. ఎన్టీఆర్ పెట్టిన అభ్యర్ధిపై చంద్రగిరిలో కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసిన చంద్రబాబు చిత్తుచిత్తుగా ఓడిపోయాడన్నారు. అయినప్పటికీ చంద్రబాబును పార్టీలో చేర్చుకున్న ఎన్టీఆర్ కు వెన్నుపోటు పొడిచాడన్నారు. రాబోయే రోజుల్లో రాష్ట్ర ప్రజలకు కూడా వెన్నుపోటు పొడుస్తాడని ఆనాడే ఎన్టీఆర్ చెప్పారన్నారు. తిన్నింటి వాసాలు లెక్కపెట్టే దుర్మార్గుడు, ఔరంగజేబు చంద్రబాబు అని, అతన్ని నమ్మి నాశనమైపోయానని, ఆంధ్ర రాష్ట్రాన్ని కూడా నాశనం చేస్తాడని ఎన్టీఆర్ ఆవేదన వ్యక్తం చేశారన్నారు. అయినప్పటికీ రాష్ట్ర ప్రజలు ఎన్టీఆర్, సైకిల్ గుర్తు, పసుపు రంగు జెండాపై ఉన్న మమకారంతో చంద్రబాబును ముఖ్యమంత్రిని చేశారన్నారు. వెన్నుపోటు, కుట్రలు, కుతంత్రాలకు పేటెంట్ చంద్రబాబు అని తీవ్ర విమర్శలు చేశారు.

ఎన్టీఆర్ చెప్పిన మాట వినకుండా చంద్రబాబును ముఖ్యమంత్రిని చేయడం వల్ల రాష్ట్రం ఇబ్బందులు పడుతోందన్నారు. విషప్రచారం చేయడంలో తెలుగుదేశం పార్టీ దిట్ట అని అన్నారు. తెలుగుదేశం పార్టీ ఒక విషం పార్టీ అని తెలిపారు. ఎన్టీఆర్ ముఖ్యమంత్రి అయిన తర్వాత మద్య నిషేధాన్ని అమలు చేశారన్నారు. ఈ నిషేధాన్ని ఎందుకు తొలగించాడో చంద్రబాబు చెప్పాలన్నారు. మద్యం, సారాయి గురించి మాట్లాడే సన్నాసులు మద్యపాన నిషేధాన్ని తొలగించి చీప్ లిక్కర్ ను ఎందుకు తెచ్చాడో సమాధానం చెప్పాలన్నారు. చీప్ లిక్కర్ ను ప్రవేశపెట్టిన వ్యక్తి చంద్రబాబు కాదా అని ప్రశ్నించారు. జనం మర్చిపోతారని, ఏది చెబితే అది వింటారని, 420 ఛానల్స్, పేపర్లు ఉన్నాయని, 420 గాళ్ళు మనతో ఉన్నారని అనుకుంటున్నాడన్నారు. సీఎం జగన్ ను చూసి చంద్రబాబు ఓర్వలేక పోతున్నాడన్నారు. చంద్రబాబు హయాంలో చేసిన తప్పులను సీఎం జగన్మోహనరెడ్డిపై నెట్టేందుకు విపరీతంగా ప్రయత్నిస్తున్నారన్నారు. చంద్రబాబు పిచ్చి బ్రాండ్లకు పర్మిషన్లు ఇస్తే జగన్మోహనరెడ్డి ఇచ్చినట్టుగా ప్రచారం చేశారని మంత్రి కొడాలి నాని అన్నారు.

Leave a Reply