( మార్తి సుబ్రహ్మణ్యం)
ఏపీలో వచ్చే ఎన్నికలకు అన్ని పార్టీలూ కలసి కూటమి కట్టి జగన్ సారథ్యంలోని వైసీపీ దుంపతెచ్చాలన్నది తెలుగుదేశం, జనసేన అధినేతల ఆలోచన. దానిని తొలిసారి నేరుగా బయటపెట్టింది పవనన్న అయితే, ఆలస్యంగా అందుకున్నది చంద్రన్న. వైకాపా ఆయువు తీసేందుకు.. అవసరమైతే తాము త్యాగాలకయినా సిద్ధమన్నది, ఇరువురి వ్యాఖ్యల సారాంశం. కాబట్టి అన్ని పార్టీలూ కలసి తమ కూటమిలో చేరాలన్నది వారి కవి హృదయం. అయితే కూటమిలో ఎవరుంటారు? దానికి నాయకత్వం ఎవరు వహిస్తారన్నది ప్రస్తుతం జరుగుతున్న చర్చ. ఇప్పటివరకూ ఇదీ ఏపీలో పొత్తు పొడుస్తున్న రాజకీయం.
గత ఎన్నికల్లో విడిగా పోటీ చేసి అధికార వియోగం అనుభవిస్తున్న తాజా అనుభవంతో అటు టీడీపీ, ఇటు జనసేనకు తత్వం ఆలస్యంగా బోధపడి ఉండవచ్చు. కాబట్టి ఇకపై అలాంటి తప్పులు చేయకుండా.. కూటమితో సర్దుకుపోయి, ముందు ఉమ్మడి శత్రువయిన వైకాపా పీక నులిమేయాలన్నది రెండు పార్టీల అంతరంగం. ఎందుకంటే వైసీపీతో రెండు పార్టీలూ నష్టపోతున్నాయి కాబట్టి.
అంతా బాగానే ఉంది. కోరికలెప్పుడూ ఉన్నతంగానే ఉంటాయి. కానీ దానిని అమలుచేయడం ఎలాగన్నదే సమస్య. ఇప్పటికయితే జనసేన, బీజేపీ పొత్తు పార్టీలు. కానీ ఏ సందర్భంలోనూ ఒకరికొకరు సహకరించుకున్న సందర్భాలు లేవు. మొన్నటి స్థానిక సంస్థల ఎన్నికల్లోనూ ఎవరి దారి వారిదే. జనసేన-టీడీపీ అవగాహనతో పోటీ చేశాయన్నది బహిరంగ రహస్యం. ఏపీలో బీజేపీది ఆశ లావు పీక సన్నం. పేరుకు అంతా పెద్ద నాయకులే. ఒక్కరికీ సొంత ఇలాకాల్లో ఠికాణా ఉండదు. వీరిలో సగం మంది పేపర్ టైగర్లు. కమ్యూనిస్టుల మాదిరిగా ఆ పార్టీకి పర్మినెంట్ ఓటు బ్యాంకు అంటూ కొంత ఉంది. కాబట్టి ఏ ఎన్నికలొచ్చినా వారి ఓట్లు వారివే. అంటే ఆ ఒక శాతం ఓటు బ్యాంకు ఎక్కడికీ పోదన్నమాట. కాకపోతే అవి కనీస స్థాయిలో కూడా ఉండవు కాబట్టి, ఎవరినీ ప్రభావితం చేసేవి కాదు. గత ఎన్నికల్లో టీడీపీపై వ్యతిరేకతతో, బీజేపీ సానునూతిపరులు వైసీపీకి అయిష్టంగానే ఓట్లు వేశారన్నది నిర్వివాదం. ఐటీ,ఈడీ, ఈసీ వంటి వ్యవస్థలతో తెలుగుదేశం పీక నులిమేయడం వల్ల, వైకాపా అధికారంలోకి వచ్చిందన్నది మనం మనుషులం అన్నంత నిజం.
ఇక జనసేన పరిస్థితి బీజేపీ కంటే పూర్తి భిన్నం. ఆ పార్టీ దాదాపు 6 శాతం ఓట్లు సాధించగలిగింది. పవన్ కల్యాణ్ ఎక్కడికి వెళ్లినా జనం తండోపతండాలుగా వస్తుంటారు. కాకపోతే వారంతా ఆ పార్టీకి ఓటు వేయరు. అది పవనన్నకూ తెలుసు. ఆ ముక్క చాలాసార్లు ఆవేదనతో చెప్పారు. అది వేరే విషయం. అయినా పవన్ నిరాశపడకుండా, తన యుద్ధం కొనసాగిస్తున్నారు. నిజంగా ఆ యుద్ధంలో నిజాయితీ ఉంది. బీజేపీలా తెరపైన వైకాపాతో కుస్తీ, తెరవెనుక దోస్తీ కాకుండా.. నేరుగా వైకాపా సర్కారుతో యుద్ధం చేస్తున్నారన్నది నిష్ఠుర నిజం. ముక్కుసూటిగా వ్యవహరించే పవన్‌కు.. బీజేపీ-వైకాపా రాజకీయ అక్రమ సంబంధం నచ్చటం లేదని, సమయం కోసం ఎదురుచూస్తున్నారన్నది జరుగుతున్న ప్రచారం.
అలాంటి పవన్.. తనకు ఇంకా బీజేపీ రోడ్ మ్యాప్ ఇవ్వలేదని చెప్పడం, బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజేమో.. తమకు 3 నెలల క్రితమే పార్టీ నాయకత్వం రోడ్‌మ్యాప్ ఇచ్చిందని చెప్పడం గందరగోళానికి నిదర్శనం. మళ్లీ తమతో కలసివచ్చే వారితో పనిచేస్తామన్నది పవన్ మరో ప్రకటన. బీజేపీతో కలసి వెళితే జనసేనకు నష్టం. జనసేనతో కలసి వెళితే బీజేపీకి లాభం. ఇదీ జనంతోపాటు.. ఇరుపార్టీల్లో బలంగా గూడుకట్టుకున్న అభిప్రాయం. బీజేపీతో ఉన్న ఏ పార్టీతోనూ వామపక్షాలు, కాంగ్రెస్ కలసిరావన్నది సుస్పష్టం. ఆ కాంగ్రేసేమో ప్రెస్‌మీట్ల నుంచి ప్రెస్‌నోట్ స్ధాయికి పడిపోయింది. పోనీ ఆ ప్రకారంగా పవన్ ప్రకటనబట్టి చూసినా, వస్తే గిస్తే పవన్ పార్టీతో టీడీపీ మాత్రమే జతకలవాలి. మరప్పుడు జనసేన ఇప్పటివరకూ తాను పట్టుకున్న బీజేపీ చేయి వదులుతుందా? అన్నది ప్రశ్న.
ఇంకోవైపు తాము కుటుంబపార్టీలతో పొత్తు పెట్టుకునే ప్రశ్నే లేదని, వచ్చే ఎన్నికల్లో తమ పార్టీ అధికారంలోకి రాబోతోందని బీజేపీ దళపతి వీర్రాజు సెలవిచ్చారు. నిజానికి రాష్ట్ర రాజకీయాల్లో కె.ఏ.పాల్‌కు, సోము వీర్రాజుకు పెద్దగా తేడా ఏమీ ఉండదు. కేఏ పాల్ కూడా.. కేసీఆర్‌ను ఈడీ అరెస్టు చేసిన తర్వాత, తెలంగాణలో తానే సీఎం అవుతానని చాలా సీరియస్‌గా ప్రకటించారు. ఎంత సీరియస్ సినిమాలయినా కామెడీ లేకపోతే కథ రక్తికట్టదు. బీజేపీలోనూ అంతే. కాకపోతే పాపం పాల్ బోళాతనంగా మాట్లాడతారు. కానీ సోము తెలివిగా మాట్లాడతారు. లాభం లేకుండా ఏదీ మాట్లాడరాయన. అది తప్ప కామెడీ మాత్రం సేమ్ టు సేమ్.
అసలు వీర్రాజు మాటలను ఆ పార్టీలో ఎవరూ సీరియస్‌గా పట్టించుకోరు. గత స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేసేందుకు అభ్యర్ధులకే దిక్కులేని పార్టీ, ఏకంగా అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచి అధికారంలోకి వస్తుందని చెబితే, నవ్వు రాక మరేం వస్తుంది? వెంకయ్యనాయుడు సహా అరడజను మంది అగ్రనేతలున్నప్పుడే అధికారంలోకి రాని బీజేపీ, కామెడీ పాత్రధారులతో వస్తుందా అన్నది సొంత పార్టీ శ్రేణుల ఉవాచ. 2009 పార్లమెంటు ఎన్నికల్లో పోటీ చేసిన బీజేపీ అభ్యర్ధుల్లో ఎవరికీ 31 వేల ఓట్లు దాటితే ఒట్టు. స్వయంగా
రాజమండ్రి ఎంపీగా పోటీ చేసిన సోము వీర్రాజుకు వచ్చిన ఓట్లు అక్షరాలా 7,123 మాత్రమే. విశాఖ, రాజంపేట అభ్యర్ధులకే 31 వేల ఓట్లు లోపు వచ్చాయి. అదీ బీజేపీ అసలు బలం. మిగితాదంతా బిల్డప్పులే. అసలు నిజంగా ఇరవై, ఇరవై ఐదు నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేలుండి, 30,40 నియోజకవర్గాల్లో నెంబర్‌టూ స్థానంలో ఉంటే, పువ్వు పార్టీ నేతలు, భూమ్మీద నిల్చోరేమోననిపిస్తుంది. వారి ప్రకటనల గాంభీర్యం చూసే వారికి అలాగే ఉంటుంది మరి!
సరే. ఇప్పుడు పొత్తులో త్యాగరాజులెవరో చూద్దాం. టీడీపీ-జనసేన రెండూ త్యాగాల గురించే మాట్లాడుతున్నాయి. ఎవరి రాజకీయావసరాలు వారివి. మధ్యలో అష్టావధానంలో అప్రస్తుత ప్రసంగం మాదిరిగా, వీటితో ఏమాత్రం సంబంధం లేని వైకాపా గళధారి సజ్జల రామకృష్ణారెడ్డి.. ‘‘మరి అట్లయితే సీఎం పదవిని చంద్రబాబు త్యాగం చేస్తారా? లేక ఇద్దరూ పంచుకుంటారా? ఒక రాష్ట్రానికి ఇద్దరు సీఎంలు ఉండరు కదా’ అని లా పాయింట్లు తీశారు. ఒక రాష్ట్రానికి ఇద్దరు హోంమంత్రులు ఉండగా లేనిది, ఇద్దరు సీఎంలు ఉండటానికేం అన్నది కొందరి వ్యంగ్యాస్త్రం.
అసలు ఇద్దరి త్యాగరాజుల మధ్య జరిగే పంచాయతీతో సజ్జలకు ఏం సంబంధం? అంటే ఈ పొత్తు పొడిచే ఎపిసోడ్, నిజంగానే తాడేపల్లి శిబిరాన్ని భయపెడుతోందా? లేక ఇద్దరి పొత్తులు ప్రారంభంలోనే పుటుక్కుమనాలని ఆశిస్తోందా? సజ్జల చెప్పినట్లు.. నిజంగా ఎవరు కలిసినా తమకేం ఫర్వాలేదనుకుంటే, వారి మధ్య ఏం జరిగితే ఆయనకెందుకు? ఎవరు సీఎం అయితే ఆయనకేం సంబంధం? వైసీపీ ఆత్రుత చూస్తే మెడ మీద తల ఉన్న ఎవరికయినా అలాంటి ప్రశ్నలు, అనుమానాలే వస్తాయి.
అందుకే తన దొడ్లో కట్టేసిన ఓ టీవీ చానెల్‌తో, ఆరోజు సాయంత్రమే పొత్తులపై డిబేట్ పెట్టించారు కామోసు! అందులో ఒకవేళ వైసీపీ ఓడిపోతే సీఎం ఎవరు అవుతారు? చంద్రబాబును సీఎంగా మీరు అంగీకరిస్తారా అని యాంకరుడు జనసేన నేతను ప్రశ్నిస్తే, పవనే సీఎంగా ఉంటారని సెలవిచ్చారు. ఈలోగా చర్చలో ఉన్న టీడీపీ నేత బాబూ రాజేంద్రప్రసాద్… ‘ఆశకయినా అంతం ఉండాలి. సీపీఐ రామకృష్ణ కూడా సీఎం కావాలని కోరుకుంటే ఎలా? ఇదీ అలాగే ఉంది’ అనడం, తర్వాత క్షమాపణ చెప్పడం జరిపోయింది. నిజానికి వైసీపీ శిబిరం టీడీపీ-జనసేన నుంచి ఆశించేది ఇదే.అందుకు తగ్గట్లే వైసీపీ సోషల్‌మీడియా కథ నడిపిస్తున్నట్లుంది.
టీడీపీ-జనసేన మధ్య పొత్తు ఖరారయిందని, అందులో భాగంగా 40-45 అసెంబ్లీ, 5-6 ఎంపీ సీట్లు జనసేనకు ఇచ్చేందుకు నిర్ణయమయిందన్నది వైసీపీ సోషల్‌మీడియా మొదలుపెట్టిన ప్రచారం . అందులో ఏయే నియోజకవర్గాలు జనసేనకు ఇవ్వాలన్నదీ డిసైడ్ చేసేశారు. అంటే అది ఇరు పార్టీ నియోజకవర్గ నేతలు నిజమని నమ్మి.. ఐదేళ్ల నుంచి ఆ నియోజకవర్గాల చూరు పట్టుకుని వేళ్లాడుతున్న తమ సంగతేమిటని.. ఇరు పార్టీల నేతలూ ఆందోళనతో తమ నాయకత్వాలపై ఒత్తిడి చేసి, ఆనక వారంతా వైసీపీలోకి వెళ్లాలన్నమాట. ఆ ప్రచార అసలు లక్ష్యం కూడా అదే అన్నది బుర్ర-బుద్ధీ ఉన్న ఎవరికయినా అర్ధమవుతుంది. ఇలాంటివన్నీ ప్రశాంత్ కిశోర్ స్కూలు ‘అతి’ తెలివితేటలన్నమాట. ఒకసారి సక్సెస్ అయిన సినిమాలే మళ్లీ తీస్తే చూసేవారెవరు?
సరే. ఇప్పుడు మళ్లీ త్యాగరాజుల వద్దకు వద్దాం. ఇప్పటివరకూ జరుగుతున్న ప్రచారం ప్రకారం.. టీడీపీ-జన సేన మధ్య సూత్రప్రాయంగా పొత్తు ఖరారయిందని, బీజేపీ చేతిని జనసేన చివరలో వదిలేస్తుందని చెబుతున్నారు. బీజేపీ మాత్రం తమకు అధికారం రాకపోయినా ఫర్వాలేదు. మరో 20 ఏళ్లయినా ఒంటరిగా పోటీ చేసి, గెలిచే స్థాయికి వస్తామన్న వైఖరితో ఉన్నట్లు కనిపిస్తోంది. సో అండ్ కో అయితే టీడీపీతో పొత్తుకు ససేమిరా అంటోంది. మరో వర్గం మాత్రం టీడీపీతో పోటీ చేస్తే నాలుగు సీట్లయినా వస్తాయని వాదిస్తోంది. మంచిదే. అంటే ఆ ప్రకారంగా టీడీపీ-జనసేన-వామపక్షాలు కలసి పోటీ చేస్తాయని ప్రత్యేకించి చెప్పాల్సిన పనిలేదు. మరి ఇందులో సీపీఎం ఉంటుందా? ఉండదా అన్నది ఇప్పుడే చెప్పడం కష్టం. ఎందుకంటే..ఏపీలో సీపీఐ జగనన్న సర్కారుకు వ్యతిరేకంగా ఉంటే, సీపీఎం ఆ విషయంలో అంత సీరియస్‌గా కనిపించడ ం లేదు. సీపీఎంకి చెందిన పత్రికకు ప్రకటనలిస్తున్న ప్రభుత్వం, సీపీఐకి చెందిన పత్రికకు మాత్రం ఇవ్వడం లేదు. లోగుట్టు పెరెమాళ్ల కెరుక?
అటు వామపక్షాల బలం పూర్తిగా నీరసించిపోయింది. ఉనికి కోసం చేస్తున్న ఉద్యమాలు కూడా, ఏదో సంసారపక్షంగా లాగిస్తున్న పరిస్థితి. ఇక జనసేన బలం కొన్ని ప్రాంతాలయినా, అది కూడా ఇప్పటిదాకా గెలిచిన దాఖలాలు లేవు. ఉన్న ఒక్కగానొక్క ఎమ్మెల్యే నలుసు కూడా వైసీపీ దొడ్లో చేరిపోయారు. పార్టీలో పవన్ తర్వాత చెప్పుకోతగ్గ లీడరు లేడు. అన్ని రీళ్లలోనూ ఆయనే కనిపిస్తారు. నాదెండ్ల మనోహర్ ఉన్నప్పటికీ, ఆయనది నియోజకవర్గానికి ఎక్కువ, జిల్లాకు తక్కువ స్థాయి. ఏ చెట్టూ లేని చోట ఆముదం చెట్టే మహావృక్షమన్నది ఒక సామెత.
స్పీకర్‌గా తప్ప.. రాష్ట్ర స్ధాయి రాజకీయాల్లో ఎప్పుడూ నాదెండ్ల తనదైన పాత్ర పోషించిన దాఖలా లేదు. తెనాలితో సహా, ఆయనను చూసి పార్టీలో చేరేవారెవరూ ఉండరు. అయినా పవన్, పార్టీని ఆయనకు అప్పగించడమే ఆశ్చర్యం. బహుశా తాను సినిమాల్లో బిజీగా ఉన్నప్పుడు, పార్టీ పనులు మనోహర్ చూసుకుంటారన్న ముందుచూపు కావచ్చు. ఇప్పటిదాకా పవన్ ప్రెస్‌కాన్ఫరెన్సులో తప్ప, పాత్రికేయ ప్రముఖులను కలిసినట్లు లేదు. ఆయనకు సరైన రాజకీయ సలహాదారులు లేరని, ఈ విషయంలో ‘అక్కమొగుడే దిక్కన్న’ట్లుగా తమ పరిస్థితి ఉందన్నది జనసేన నేతల ఉవాచ.
ఇక మిగిలిన ఇద్దరు ముగ్గురు టీవీల్లో డిబేట్లకు పనికొస్తారు. కాకపోతే పవన్ పార్టీకి ఓటు బ్యాంకు ఉందన్నది నిజం. అది కలిసిన పార్టీకి ఉపయోగమే తప్ప, జనసేనకు ఏమాత్రం ఉపయోగపడదు. ఇద్దరూ కలిస్తేనే పుణ్యం, పురుషార్ధమని గత ఎన్నికలే నిరూపించాయి. మొన్నటి స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా.. టీడీపీ- జనసేన అనధికార పొత్తుతో పోటీచేసిన స్థానాల్లో రెండు పార్టీలూ గెలిచి, బీజేపీ ఒంటరిగా పోటీచేసిన చోట ఓడిపోయిందన్న వాస్తవం విస్మరించకూడదు. సో.. ఇప్పుడు త్యాగరాజు ఎవరు?