Suryaa.co.in

Andhra Pradesh

రాజధానిపై మళ్లీ ఎందుకీ రచ్చ?

– ఇచ్చేవారికి, తీసుకునేవారికి లేని నొప్పి మనకెందుకు?
– అలా మౌనంగా ఉంటే హైదరాబాద్ ఇంత అభివృద్ధి చెందేదా?
– శంషాబాద్ ఎయిర్‌పోర్టు, ఇన్నర్, అవుటర్ రింగ్‌రోడ్డు వచ్చేదా?
– బాబుది దీర్ఘకాలిక ఆలోచన ఇంకా అర్ధం చేసుకోకపోతే ఎలా?

రాజధానికి భూసమీకరణ అంటే ఇప్పటికే ఇచ్చిన వారికి, ఇవ్వబోతున్న వారికి మధ్యలో మనకెందుకు నొప్పి?

ఇక్కడ జనం డబ్బు రూపాయి ఖర్చు కాకుండా రైతుల భూములను సమీకరణ చేసి, దాని మీద అప్పు తెచ్చి నిర్మించి, మిగిలింది అమ్మి అప్పు తీర్చే ప్రాజెక్టు అయినా ఎందుకు ఏడుపులు?
ముందుగా చుట్టూ వున్న పొరుగు రాష్ట్రాలలో ఏమి జరుగుతున్నదో తెలుసుకొందాం.

తమిళనాడు ప్రభుత్వం చెన్నైలో, కర్ణాటక ప్రభుత్వం బెంగళూరులో, తెలంగాణ ప్రభుత్వం హైదరాబాద్‌లో కొత్త నగరాలను అభివృద్ధి చేయనున్నట్లు ప్రకటించాయి. ఈ నేపథ్యంలో, ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలో భూసమీకరణ చేసిన విధంగానే ఈ రాష్ట్రాలు కూడా భూసేకరణ కోసం భూసమీకరణ (Land Pooling) వంటి పద్ధతులను ఉపయోగిస్తున్నాయి. అయితే ఆయా రాష్ట్రాల పరిస్థితులు, అవసరాలకు అనుగుణంగా కొన్ని మార్పులు చేశారు.

తమిళనాడు (చెన్నై): చెన్నై చుట్టూ ఉప పట్టణాలను అభివృద్ధి చేయడానికి చెన్నై మెట్రోపాలిటన్ డెవలప్‌మెంట్ అథారిటీ (CMDA) భూసమీకరణ ప్రాంత అభివృద్ధి పథకం (LPADS)ను ఉపయోగిస్తోంది. ఉదాహరణకు, తిరుమళిసై కొత్త పట్టణంలో లూప్ రోడ్డు అభివృద్ధి కోసం సుమారు 330 ఎకరాల భూమిని LPADS ద్వారా సేకరించాలని యోచిస్తున్నారు.

ఈ విధానంలో అనేక మంది భూ యజమానుల నుండి భూమిని సేకరించి అభివృద్ధి చేస్తారు. అభివృద్ధి చేసిన భూమిలో కొంత భాగాన్ని తిరిగి యజమానులకు ఇస్తారు. మిగిలిన భూమిని ప్రజా సౌకర్యాల కోసం లేదా అమ్మకానికి ఉపయోగిస్తారు. తిరుమళిసైలో ఒక లూప్ రోడ్డు ప్రాజెక్ట్ కోసం సుమారు 1605.75 ఎకరాల భూమిని సమీకరిస్తారు. అభివృద్ధి చేసిన భూమిలో 60% భూమి యజమానులకు తిరిగి ఇస్తారు.

కర్ణాటక (బెంగళూరు): బెంగళూరు నగరంపై ఒత్తిడిని తగ్గించడానికి కర్ణాటక ప్రభుత్వం బిడది టౌన్‌షిప్ అభివృద్ధి కోసం భూసేకరణను ప్రారంభించింది. 10 గ్రామాలలో సుమారు 8,943 ఎకరాల భూమిని సేకరించనున్నారు. ఈ సేకరణ బెంగళూరు డెవలప్‌మెంట్ అథారిటీ (BDA) యొక్క రెసిడెన్షియల్ లేఅవుట్ ప్రాజెక్ట్‌ల తరహాలోనే ఉంటుంది. భూ యజమానులు తమ భూమి హక్కులను అప్పగిస్తే వారికి అభివృద్ధి చేసిన భూమిలో 40% తిరిగి ఇస్తారు.

ఇది సుమారు ఎకరాకు 9,583 చదరపు అడుగుల అభివృద్ధి చేసిన భూమి. మిగిలిన 60% మౌలిక సదుపాయాలు, బహిరంగ ప్రదేశాల కోసం ఉపయోగిస్తారు. బెంగళూరు చుట్టూ ఇతర శాటిలైట్ టౌన్‌షిప్‌ల (నందగుడి, సోలూరు, రామనగర, సాతనూరు) కోసం కూడా ప్రణాళికలు ఉన్నాయి. ధరల పెరుగుదలను నివారించడానికి భూసమీకరణను ప్రాథమిక పద్ధతిగా సిఫార్సు చేశారు.

కర్ణాటక ప్రభుత్వం బెంగళూరులోని పెరిఫెరల్ రింగ్ రోడ్డు (PRR) ప్రాజెక్ట్ కోసం హైదరాబాద్ తరహా భూసమీకరణ నమూనాను కూడా పరిశీలిస్తోంది. ఇక్కడ భూమి యజమానులకు 40% భూమి తిరిగి ఇస్తారు.

తెలంగాణ (హైదరాబాద్): తెలంగాణ ప్రభుత్వం హైదరాబాద్ సమీపంలో 30,000 ఎకరాల విస్తీర్ణంలో “ఫ్యూచర్ సిటీ” ప్రాజెక్ట్‌ను వేగవంతం చేస్తోంది. ఫార్మా సిటీ ప్రాజెక్ట్ కోసం గతంలో సేకరించిన 13,973 ఎకరాల భూమిని ఫ్యూచర్ సిటీ కోసం తిరిగి కేటాయిస్తారు. మిగిలిన 16,000 ఎకరాలను భూసమీకరణ ద్వారా సేకరించాలని ప్రభుత్వం యోచిస్తోంది.

తెలంగాణలో భూసమీకరణ నమూనాలో భూ యజమానులు అభివృద్ధి చేసిన ప్లాట్లు, ఆర్థిక పరిహారం లేదా ప్రాజెక్ట్‌లో వాటా వంటి ప్రయోజనాల కోసం తమ భూమిని అందిస్తారు. తెలంగాణలో HMDA సహకారంతో రంగారెడ్డి జిల్లాలో 95 ఎకరాల “పావని రాయల్” వంటి ఇతర భూసమీకరణ ప్రాజెక్ట్‌లు కూడా ఉన్నాయి. ఇక్కడ భూ యజమానులకు అభివృద్ధి చేసిన ప్లాట్లు లభిస్తాయి.

ఆంధ్రప్రదేశ్ తన రాజధాని అమరావతి కోసం స్వచ్ఛంద భూసమీకరణ పథకం (VLP)ను ఉపయోగించింది. ఈ పథకం కింద రైతులు స్వచ్ఛందంగా తమ భూమిని అభివృద్ధి చేసిన ప్లాట్లు, పదేళ్ల పాటు కౌలు కోసం ఇచ్చారు. ఈ పద్ధతి ద్వారా తక్కువ సమయంలోనే సుమారు 33,000 ఎకరాల భూమిని సమీకరించారు.

ఆంధ్రప్రదేశ్ రాజధాని ప్రాంత అభివృద్ధి సంస్థ (CRDA) అందరికీ న్యాయం చేసింది. సాగునీటి ఉన్న రైతులకు మంచి ప్యాకేజీలు ఇచ్చింది. ప్రజల అభిప్రాయాలు తీసుకుంది. భూ యజమానులకు ప్లాట్లు కేటాయించింది. వాటి అభివృద్ధికి ఇప్పటికే టెండర్లు పిలిచి ఆమోదించారు. ప్రధాని రాక తరువాత పనులు శరవేగంతో జరగనున్నాయి.

మరి కొత్తగా ఇంకా వేల ఎకరాలు ఎందుకంటే.. రింగు రోడ్లు, ఇంకో ఎయిర్పోర్టు, రైల్వే లైను కోసం రైతులు ముందుకు వచ్చి మాకు కూడా ల్యాండ్ పూలింగ్ అమలు చెయ్యండి అని అభ్యర్థిస్తున్నారు. వాటిని మన్నించకపోతే రాజధాని సమీపంలో సేకరణలో తీసుకోవడానికి ప్రభుత్వం వేల కోట్లు చెల్లించాలి. అంత డబ్బులు మనవద్ద లేవు. కేంద్రం మౌళికవసతులతో పాటు ఇవన్నీ భరించదు. ఇక్కడ చేస్తే మిగిలిన రాష్ట్రాలు కూడా అడుగుతాయి. ఎలాగూ ఈ పద్దతిలో తీసుకొంటే భవిష్యత్తులో పొరుగు రాష్ట్రాల లెక్కన ఇబ్బందులు పడే పని వుండదు.

పొరుగు రాష్ట్రాలలోని నగరాలు నీరు, మౌళికవసతులు కల్పించలేక చేతులెత్తేసాయి. జనం వారి బాధలు వారు పడుతున్నారు. మెట్రో విస్తరణ నుండి ఏమి చేయాలన్నా ట్రాఫిక్ ఇబ్బందుల్లో నరకం చూపిస్తూ నత్తనడకన సాగుతూనే వున్నాయి. బెంగుళూరుకు ఆ పెరిపరల్ రోడ్డు వేసుకోవాలని రెండు దశాబ్దాలుగా ప్రయత్నాలు చేస్తూనే వున్నారు. కోర్టు కేసులు, బిడ్ వెయ్యడానికి పిలుస్తున్నా ఎవరూ రాకపోవడం సవాలక్ష సమస్యలు.

అలాంటి బాధలు లేకుండా తెలివిగా దూరదృష్టితో చంద్రబాబు నాయుడు ప్రజల సొమ్ము ఖర్చు చెయ్యకుండా తనను మాత్రమే నమ్మి వస్తున్న రైతుల భూములతో ఆమోదయోగ్యమైన అద్భుతమైన ప్రణాళికలు వేశారు. ప్రపంచ బ్యాంకు నుండి మన దేశ జాతీయ బ్యాంకుల వరకు ఆ ప్రాజెక్టు చూసి అప్పులు ఇవ్వడానికి వస్తున్నాయి.

ఏమీ ఖర్చు కాకుండా అద్భుతమైన రాజధాని వస్తోంది రాష్ట్రానికి. ఇప్పటికే ఇచ్చిన రైతులు అవసరమైన మేరకు కొంత అమ్ముకొని ఆనందంగా ఆతృతగా ఎదురుచూస్తున్నారు. వచ్చిన ప్లాట్లు గజం తక్కువలో తక్కువ 40 వేలకు పైగా ధర పలుకుతోంది. ఈ రేట్లు చూసి పొరుగున వున్న రైతులు మా భూములు కూడా కలపండి అని అభ్యర్థిస్తున్నారు.

అవసరం అయితే దశలవారీగా తీసుకొంటారు. విస్తరణ పనులు ఆలస్యం అవ్వవచ్చు. కానీ ప్రస్తుత రాజధాని ప్రణాళిక ప్రకారం ఒకటి రెండు మినహా టెండర్లు పిలిచి ఆమోదించడం జరిగిపోయింది. వాటికి గడువు పెట్టారు. ఆ ప్రకారం నిర్మాణం యుద్ధ ప్రాతిపదికన జరగబోతోంది.

తొలుత నిర్మాణం జరిగే ప్రదేశంలో రేట్లు తాత్కాలికంగా కొంచం దిద్దుబాటుకు గురవ్వవచ్చు. కానీ 9 నగరాల కోర్ కేపిటల్ కాబట్టి దాని రేటు యథావిధిగా పనుల వేగం బట్టి పెరగవచ్చు. ఎందుకంటే అక్కడ మౌలిక సదుపాయాలకే పదిహేడు వేల కోట్లకు పైగా ఖర్చు పెడుతున్నారు కాబట్టి.

ఆ పనులు జరుగుతుంటే ప్రభుత్వం పర్యవేక్షణ చేస్తూ ఏవన్నా సమస్యలు ఎదురైతే తీర్చే పని తప్ప వేరే పనిలేదు. కానీ ప్రపంచ ప్రఖ్యాత సంస్థలను, ప్రభుత్వ సంస్థలను ఫాలో అప్ చేసి పెట్టించే పనులు సమాంతరంగా చేస్తుంది. అలాగ్ విస్తరణ మీద దృష్టి పెట్టే సమయం దొరుకుతుంది. మధ్యలో రాజకీయ పార్టీలకు, బయటవారికి వస్తున్న బాధ ఎందుకో అర్థం కావడం లేదు.

-శ్రీనివాసరావు

LEAVE A RESPONSE