– తెలంగాణలో ఆంధ్రా ‘కాపు’లపై వల వర్కవుటవుతుందా?
– కాపు-మున్నూరు కాపుల ఓట్లు కొల్లగట్టడం సాధ్యమేనా?
– కాపు-మున్నూరు కాపులు కలుస్తారా?
– పవన్‌తో కలిస్తే కాపుల ఓట్లు చీలుతాయా?
– పవన్ ‘కాపు’లర్ అవుతారా?
– కాపులతో బలిజలు కలిసొస్తారా?
– కాపులతో సంబంధం లేదంటున్న బలిజలు
– జగన్‌ను గెలిపించాలన్న కేసీఆర్ కలలు పవన్‌తో పండుతాయా?
( మార్తి సుబ్రహ్మణ్యం)
బీఆర్ఎస్ విస్తరణ కోసం రాజకీయ వ్యూహాలు రచిస్తున్న తెలంగాణ సీఎం కేసీఆర్ కన్ను, ఇప్పుడు కాపు-మున్నూరు కాపులపై పడింది. అందుకు వారధి-సారథిగా జనసేనాధిపతి పవన్ కల్యాణ్ ఆయన దృష్టిలో పడ్డారు. పవన్ పార్టీతో పొత్తు పెట్టుకుని .. అటు ఆంధ్రాలో ఓట్లు, ఇటు తెలంగాణలో సీట్ల సంఖ్య పెంచుకోవాలన్నది కేసీఆర్ అసలు లక్ష్యం. ఏపీలో వీలైనంత ఓట్ల సంఖ్య, తెలంగాణలో కులాల చీలికతో సీట్ల సంఖ్య పెంచుకోవాలన్న కేసీఆర్ ఎత్తుగడ ఫలిస్తుందా? తెలంగాణలో కాపు-మున్నూరు కాపులు కలుస్తారా? క్షేత్రస్థాయిలో ఆ భావన ఉందా? అసలు ‘కాపు’లర్ అయ్యేంత శక్తి సామర్థ్యాలు పవన్‌కు ఉన్నాయా?.. ఇదీ ఇప్పుడు రాజకీయవర్గాల్లో జరుగుతున్న చర్చ.
ఏపీలో తన మిత్రుడు జగన్‌ను గెలిపించి, రాజకీయ శత్రువైన చంద్రబాబును మళ్లీ ఓడించేందుకు, కేసీఆర్ పాచిక పారుతుందా? కాపులను గంపగుత్తగా తనవైపు మళ్లించుకోవడం ద్వారా, రెండు రాష్ట్రాలపై పట్టు సాధించాలన్న కేసీఆర్ వ్యూహాలకు పవన్ కల్యాణ్ ఊ అంటారా? ఊహూ అంటారా? అన్న ఆసక్తి రాజకీయ వర్గాల్లో కనిపిస్తోంది. కాపులలో క్రేజ్ ఉందనుకుంటున్న పవన్‌పై వల వేయడం ద్వారా, తన రాజకీయ లక్ష్యం నెరవేర్చుకోవాలన్న కేసీఆర్ రాజకీయ వలలో పవన్ చిక్కుకుంటారా? బీఆర్ఎస్తో చేతులు కలిపి ఏపీలో ఉనికి లేకుండా చేసుకుంటారా? అన్న చర్చ అటు రాజకీయవర్గాలు, ఇటు పవన్ అభిమానుల్లోనూ జరుగుతోంది.
ఏపీలో 24 శాతం ఉన్న బలిజ కాపు- తెలగ కులాల హవా ఎక్కువే. అయితే ఇప్పటిదాకా ఈ వర్గానికి సీఎం పదవి దక్కింది లేదు. అది తీరని కోరికగానే మిగిలిపోయింది. చిరంజీవితో ఆ ఆశలు ఆవిరయ్యాయి. కమ్మ-రెడ్డి సంఖ్య కలిపి 15 శాతం కూడా లేకపోయినా, ఆ ఇద్దరే రాష్ట్రాన్ని సుదీర్ఘంగా పాలిస్తున్న పరిస్థితి. కాపులలో సరైన నేతలు లేకపోవడం, ఉన్న వారికి వ్యక్తిగత అజెండాలు ఉండటం, తమ అవసరం వచ్చినప్పుడు మాత్రమే కులం కార్డు తీయడంతో, కాపు ఉద్యమాలకు సొంత వర్గంలోనే మద్దతు కరవయింది.
కాపు వర్గానికి చెందిన చిరంజీవి ప్రజారాజ్యం పెట్టి, 75 లక్షల ఓట్లు, 18 మంది ఎమ్మెల్యేలను సాధించారే తప్ప, సీఎం కాలేకపోయారు. చివరకు తన పార్టీని కాంగ్రెస్‌లో విలీనం చేశారు. అప్పుడు యువరాజ్యం అధ్యక్షుడిగా పవన్ కల్యాణ్ కూడా, పీఆర్పీ గెలుపు కోసం అవిశ్రాంతంగా ప్రచారం చేసినా, అధికారంలోకి రాలేకపోయారు. అంత గ్లామర్, కులబలం ఉన్నా కాపులు సీఎం కాలేకపోయిన వైఫల్యం ఇంకా వారిని వెంటాడుతోంది. కానీ అది ఫలించే మార్గం కనిపించకపోవడమే కాపు జాతి విషాదం.
కాపులకు ముద్రగడ పద్మనాభంపై ఉన్న సదభిప్రాయం పోయి చాలాకాలమయింది. ఆయన కేవలం చంద్రబాబుపై కోపంతోనే కాపునాడు ఉద్యమం చేశారన్న విమర్శ, జగన్ అధికారంలోకి వచ్చిన తర్వాత రుజువయింది. జగన్ సర్కారుపై పోరాటం చేయకుండా, కేవలం ఉత్తరాలతో సరిపుచ్చడాన్ని కాపులు జీర్ణించుకోలేకపోతున్నారు. ఫలితంగా ముద్రగడ టీడీపీ అధికారంలోకి వచ్చినప్పుడే కాపు సమస్యలపై మాట్లాడతారన్న భావన కాపుల్లో స్థిరపడింది.
రంగా తర్వాత.. కాపుల్లో ఆ స్థాయిలో ఇమేజ్ ఉన్న మాజీ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ బీజేపీ నుంచి నిష్క్రమించి, టీడీపీలో చేరేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నారు. కాపుల్లో పెద్ద మనిషిగా పేరున్న హరిరామజోగయ్య కూడా టీడీపీ-జనసేన కలసి పోటీచేయడమే మంచిదని స్పష్టం చేస్తున్నారు. ఇక కాపునాడు, కాపు సంఘాలు, కాపు నాయకులు చాలామంది ఉన్నప్పటికీ, వారికి ఆ వర్గంలో పలుకుబడి లేదు. అవి లెటర్‌హెడ్ సంఘాలుగానే మిగిలిపోయాయి.
ఇక రాష్ట్రంలో కాపులను విబేధించే బలిజల సంఖ్య.. కాపులకంటే ఎక్కువగా ఉండటం విశేషం. రాయలసీమ లోని కడప, కర్నూలు, అనంతపురం, చిత్తూరు, నెల్లూరు జిల్లాల్లో బలిజల సంఖ్య ఎక్కువ. అక్కడ కాపులు ఉండరు. ఇక ప్రకాశం, గుంటూరు జిల్లాల్లో తెలగ-బలిజల సంఖ్య ఎక్కువ. కేవలం ఉభయ గోదావరి, కృష్ణా, గుంటూరు జిల్లాల్లో మాత్రమే కాపులు పూర్తి స్థాయిలో కనిపిస్తారు.
తమను కాపులు.. తమ రాజకీయ అవసరాలకు వాడుకుంటున్నారన్న ఆగ్రహం, బలిజల్లో చాలాకాలం నుంచి పాతుకుపోయింది. అందుకే చంద్రబాబు హయాంలో ముద్రగడ కాపు ఉద్యమాన్ని, బలిజలు వ్యతిరేకించడం గమనార్హం.
ఎన్టీఆర్ హయాంలో తమకు ఇచ్చిన ప్రాధాన్యం ఇతరులెవరూ ఇవ్వలేదని, కాపు నేతలు కూడా బలిజలను.. రాజకీయ ఆయుధంగా వాడుకుని పదవులు పొందారని, బలిజనాడు కన్వీనర్ డాక్టర్ ఓ.వి.రమణ చాలాకాలం నుంచి విమర్శలు సంధిస్తున్నారు. అసలు కాపులకు-బలిజలకు సంబంధం లేదన్న వాదనకు ఆయనే తెరలేపారు. బలిజలకు ప్రాధాన్యం ఇచ్చిన పార్టీలనే గెలిపించాలన్న నినాదంతో, బలిజనాడు త్వరలో రాజకీయ కార్యక్రమాలకు శ్రీకారం చుట్టనుంది.
ప్రస్తుతం వైసీపీలో కాపు ఎమ్మెల్యేల సంఖ్య ఎక్కువ. కానీ పవన్‌పై సర్కారు వేధింపులతో వారు కూడా ఇరకాటంలో ఉన్నారు. వైసీపీ కాపు నేతలు, పవన్‌ను విమర్శించిన ప్రతిసారీ తమ సొంత సామాజికవర్గం వారితో దూషణలు ఎదుర్కొంటున్న పరిస్థితి. పవన్‌పై రాజకీయదాడిని కింది స్థాయిలోని కాపులు సహించలేకపోతున్నారు. అంతమాత్రాన వారంతా జనసేనకు రాజకీయకోణంలో జై కొడతారన్నది అనుమానమే. పవన్ ఇంతవరకూ కాపుల కోసం గళమెత్తలేదు. ఇప్పటికీ తనకు అన్ని కులాలు సమానమేనంటున్నారు. కాపు యువత పవన్‌తో ఉన్నప్పటికీ, వారికి ఓటు హక్కులేని పరిస్థితి.
చంద్రబాబునాయుడు కాపులకు 5 శాతం రిజర్వేషన్ ఇచ్చిన తర్వాత, కాపుల్లో టీడీపీపై ఉన్న వ్యతిరేకత భావన గణనీయంగా తగ్గింది. జగన్ ప్రభుత్వం, చంద్రబాబు ఇచ్చిన 5 శాతం రిజర్వేషన్లను అమలు చేయడం లేదన్న ఆగ్రహం కాపులలో లేకపోలేదు.
తన సభలకు జనం వస్తారు గానీ, ఓటు వేయరన్న విషయాన్ని స్వయంగా పవన్ అనేకసార్లు అంగీకరించారు. అభిమానం వేరు-రాజకీయం వేరని ఆయనకు స్పష్టంగా అర్ధమయింది. కాపులకు 5 శాతం రిజర్వేషన్లపై జనసేన బలంగా పోరాడటం లేదు. అయితే ఆ డిమాండ్ కోసం టీడీపీ పోరాడుతుండటం ఆశ్చర్యం. ఏదేమైనా ఈసారి జనసేనకు, కాపుల ఓట్లు గతంలో కంటే ఎక్కువ వచ్చే అవకాశాలయితే స్పష్టంగా కనిపిస్తున్నాయి. అది ఎంత శాతం అన్నది ఇప్పుడే చెప్పడం కష్టం. కాపులను జగన్ అణచివేస్తున్నారన్న భావనయితే వారిలో బలంగా నాటుకుపోయింది.
ఇక బీఆర్ఎస్ ఏపీ అధ్యక్షుడిగా నియమితుడైన తోట చంద్రశేఖర్‌కు, కాపుల్లో పలుకుబడి శూన్యం. తోట ఏనాడూ ఏపీ కాపు కార్యకలాపాల్లో కీలకపాత్ర పోషించారన్నది పక్కకు పెడితే, పాల్గొన్న దాఖలాలు కూడా లేవు. కాపు వర్గం ఆయనను సొంతం చేసుకోవడం దుర్లభం. మరి ఏ అంచనాతో ఆయనకు రాష్ట్ర అధ్యక్ష పదవి ఇచ్చారన్నది ఆశ్చర్యం. కేవలం కాపు అయినంతమాత్రాన ఆ వర్గమంతా, ఆయన వైపు ఉంటుందనుకోవడం భ్రమ.
వంగవీటి రంగాతో కలసి కాపు ఉద్యమం నిర్మించిన కన్నా లక్ష్మీనారాయణ.. పిళ్లా వెంకటేశ్వరరావు, గాళ్ల సుబ్రమణ్యం, ముద్రగడ పద్మనాభం, హరిరామజోగయ్య వంటి కాపు ప్రముఖులు, బలిజ నేత ఓవి రమణ వంటి నేతలతో పోలిస్తే.. తోట స్థానం ఎక్కడన్నది భూతద్దం వేసి వెతికినా కనిపించదు. ఇదీ ఏపీలో కాపు-బలిజల పరిస్థితి.
ఇక తెలంగాణలో 18 శాతానికి పైగా ఉన్న మున్నూరు కాపులు, ఇప్పుడు బీఆర్ఎస్-కాంగ్రెస్-బీజేపీలో ఉన్నారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలలో మున్నూరు కాపుల సంఖ్య ఎక్కువే. వీహెచ్, పొన్నాల, కొండా మురళి వంటి నేతలంతా కాంగ్రెస్‌లో ఉన్నారు. ఇక బీజేపీ అధ్యక్షుడిగా బండి సంజయ్ బాధ్యతలు స్వీకరించిన తర్వాత, మున్నూరు కాపుల్లో చీలిక మరింత పెరిగింది. మరి మున్నూరు కాపుల ఓట్లు, గంపగుత్తగా ఎవరికి పడతాయన్నది చెప్పడం కష్టమేనని మున్నూరు కాపు నేతలు చెబుతున్నారు.
తెలంగాణలో ఆంధ్రా కాపుల సంఖ్య కూడా గణనీయంగా ఉంది. గ్రేటర్ హైదరాబాద్‌లోనే వారి సంఖ్య ఎక్కువ. అయితే కమ్మ వర్గంతో పోలిస్తే, ఆంధ్రా కాపుల సంఖ్య తక్కువ. శ్రీకాకుళం, విజయనగరం, విశాఖ జిల్లాలకు చెందిన తూర్పు కాపులు సంఖ్య హైదరాబాద్‌లో ఎక్కువ. వారంతా ఏపీలో బీసీలు. అయితే కేసీఆర్ సీఎం అయిన తర్వాత.. తెలంగాణలో వారికి అంతకుముందున్న, బీసీ హోదా తొలగించారు. దానితో వారంతా సహజంగా బీఆర్ఎస్కు వ్యతిరేకంగా నిలుస్తారు.
తెలంగాణలో మున్నూరు కాపులు, ఆంధ్రా కాపులతో సన్నిహితంగానే ఉంటున్నారు. పెళ్లిళ్లు కూడా చేసుకుంటున్న పరిస్థితి. కాపు-మున్నూరు కాపు నేతలు తరచూ, హైదరాబాద్‌లో కాపు రాజకీయ సమావేశాలు నిర్వహిస్తుంటారు. దానికి అన్ని పార్టీల్లోని కాపు-మున్నూరు కాపు నేతలు, కాపు అధికారులు హాజరవుతుంటారు. దానివల్ల ఇప్పటివరకూ మీడియాలో హడావిడి మినహా, సాధించిందంటూ ఏమీ లేదు.
అయితే ఆంధ్రా కాపుల రాజకీయ పెత్తనాన్ని మాత్రం, తెలంగాణ మున్నూరు కాపులు అంగీకరించే పరిస్థితి లేదు. ఆ లెక్కన జనసేన-బీఆర్ఎస్ కలసి పోటీ చేస్తే, ఆ కలయికకు ఎన్ని ఓట్లు రాలతాయో చెప్పడం కష్టమని, మున్నూరు కాపు నేతలు చెబుతున్నారు. పైగా తమకు దశాబ్దాల నుంచి ఉన్న బీసీ హోదాను కేసీఆర్ తొలగించారన్న ఆగ్రహం.. తెలంగాణలోని ఆంధ్రా కాపులు, తూర్పుల్లో బలంగా ఉంది.
ఇక ఆంధ్రాలో బీఆర్ఎస్-జనసేన కలసి పోటీ చేస్తే… తెలంగాణలో తమ బీసీ హోదాను తొలగించిన బీఆర్ఎస్కు.. తూర్పు కాపు, కళింగ, కొప్పుల వెలమ, పొలినాటి వెలమ వంటి సంఖ్య ఎక్కువ కులాలు, ఓటు వేయటం కష్టమేనని తూర్పు కాపు నేతలు స్పష్టం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో పవన్ పార్టీతో కలసి ఏపీలో ఓట్లు కొల్లగొట్టి, తెలంగాణలో ఓట్ల చీలికతో మళ్లీ అధికారంలోకి రావాలన్న కేసీఆర్ కల, ఎంతవరకూ ఫలిస్తుందన్నదే ప్రశ్న.