Suryaa.co.in

Andhra Pradesh

సజ్జల ‘చిరు’ విమర్శలు వైసీపీకి శాపం కానుందా?

-సజ్జల వ్యాఖ్యలపై కాపులు సీరియస్
-కాపుల పునరేకీకరణకు కారణమవుతున్న సజ్జల
( ఘంటా వీరభద్రరావు)

మెగాస్టార్ చిరంజీవిపై.. వైసీపీ ప్రధాన కార్యదర్శి, సర్కారు సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి విమర్శలు చేసి తప్పు చేశారా? సజ్జల వ్యాఖ్యలు.. ఇప్పటివరకూ మౌనంగా ఉన్న చిరంజీవి అభిమానులను, ఎన్డీఏ కూటమి విజయంలో ప్రధాన పాత్ర పోషించేందుకు కారణమవుతున్నాయా? అంతకుమించి.. కాపులలో పునరేకీకరణకు సజ్జల వ్యాఖ్యలు కారణమవుతున్నాయా? సజ్జల వ్యాఖ్యలు కాపులలో వైసీపీ అంతానికి దారితీస్తున్నాయా? చిరంజీవిపై వ్యాఖ్యలతో వైసీపీ ఏరికోరి తలనొప్పి తెచ్చుకుందా? ఇదీ ఇప్పుడు ఏపీలో హాట్ టాపిక్.

చిరంజీవి ఎన్డీఏ కూటమి అభ్యర్థులకు మద్దతు ప్రకటించగానే వైసీపీ విషం చిమ్మడం ప్రారంభించింది. సజ్జల రామకృష్ణా రెడ్డి కూడా విచిత్రంగా స్పందించారు. ఆయన తీరు చూసి సోషల్ మీడియాలో కూడా చిరంజీవిపై ఘోరమైన వ్యాఖ్యలు చేయడం ప్రారంభించారు వైసీపీ నేతలు. అసలు చిరంజీవి తన సోదరుడికి కాకుండా మరెవరికి మద్దతిస్తారని వైసీపీ నేతలు అనుకుంటారో వైసీపీ నేతలకూ అర్థం కాదు.

చిరంజీవిని అధికారం చూపించి బ్లాక్ మెయిల్ చేసే ప్రయత్నం చేశారు. కానీ ఆయన మధ్యస్థంగా ఉండిపోయారు. ఎన్నికల సమయంలోనూ అలాగే ఉండిపోవాలని అనుకున్నారు. కానీ చిరంజీవి తమ్ముడికి తాను ఎప్పుడూ అండగా ఉంటానని మరోసారి నిరూపించారు. ఆయన జనసేన పార్టీకి రూ. ఐదు కోట్ల విరాళం ఇచ్చినప్పుడే … కూటమికి మద్దతిచ్చారని అర్థమైపోతుంది. ఇప్పుడు కూటమి ఏర్పాడటం మంచి పరిణామం అని.. తన సన్నిహితులైన వారికి ఓటు వేయాలని కోరారు. ఇదే తప్పన్నట్లుగా చిరంజీవిపై వ్యక్తిగత దాడికి దిగుతున్నారు వైసీపీ నేతలు.

చిరంజీవి నుంచి వైసీపీ మద్దతు ఆశించడం లేదా ఆయన తటస్థంగా ఉడిపోవాలనుకోవడం వైసీపీ అత్యాశ. ఎందుకంటే జగన్ రెడ్డి సొంత చెల్లి కూడా ఆయనకు మద్దతుగా లేరు. ఆయనను ఓడించాలని పిలుపునిస్తున్నారు. అలాంటిది ప్రత్యర్థి పార్టీ నేత సోదరుడు.. అదీ కూడా ఆయన కుటుంబ సభ్యుడ్ని ఘోరంగా కించ పరుస్తున్న ముఖ్యమంత్రిపై చిరంజీవి కనీసం సాఫ్ట్ కార్నర్ కూడా ఉండదు. ఇంకా రెచ్చగొడితే ఆయన జగన్ పై ఘాటు వ్యాఖ్యలు చేస్తే.. వైసీపీ నేతలకు తల ఎక్కడ పెట్టుకోవాలో తెలియని పరిస్థితి ఏర్పడుతుంది.

LEAVE A RESPONSE