Suryaa.co.in

Editorial

తరిగిపోతున్నారు.. తస్మాత్ జాగ్రత్త!

– వైసీపీలో మచ్చుకయినా కనిపించని మానవ సంబంధాలు
– టీడీపీ దారిలోనే వైసీపీ నాయకత్వం
– వైసీపీ ప్లీనరీలో ఆత్మపరిశీలన ఉంటుందా?
– రాష్ట్రపతికి మద్దతుపై ఏం చెబుతారు ?
( మార్తి సుబ్రహ్మణ్యం)

“నేను 30 ఏళ్లు ఈ రాష్ట్రానికి సీఎంగా ఉండాలనుకుంటున్నా. నేను పోయిన తర్వాత కూడా నాన్న పక్కనే నా ఫొటో ప్రతీ ఇంట్లో ఉండాలనుకుంటున్నా” – ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి భావోద్వేగంతో చేసిన వ్యాఖ్యలివి. ఇప్పుడు జగనన్న సారథ్యంలోని వైసీపీ ప్లీనరీకి ఆ పార్టీ ముస్తాబవుతోంది. ఈ మూడేళ్ల జగన్ పాలనలో మెరుపులు,మరకలు లెక్కబెడితే మరకలే ఎక్కువగా కనిపిస్తాయి. మెరుపులంటే సంక్షేమ కార్యక్రమాలే. రోజూ పత్రికలు తిరగేస్తే వైసీపీ వీరుల దౌర్జన్యాలు, ఎమ్మెల్యేల నుంచి వాలంటీర్ల వాలంటీ శృంగార కథలు, సొంత పార్టీ కార్యకర్తలపై ఎమ్మెల్యేల దాదాగిరి, సొంత పార్టీ ఎమ్మెల్యే కోటంరెడ్డి లాంటి విభీషణ ఎమ్మెల్యేల వింత నిరసనలు, ఉద్యోగుల హాహాకారాలు, పోలీసుల అతి చర్యలు, గిట్టని అధికారులు, సొంత పార్టీ అసమ్మతి నేతలపై వేధింపులు… కలసి వెరసి ఈ రాష్ట్రానికి 30 ఏళ్లు జగనన్న సీఎంగా కొనసాగే పరిస్థితులుysrcp-plenaryకల్పిస్తున్నాయా? లేవా? అన్న ‘ఉన్నమాట’ పై వైసీపీ ప్లీనరీ ఆత్మపరిశీలన చేసుకుంటే మంచిదే. ఆత్మస్తుతి-పరనింద వంటి రొటీన్ వ్యవహారానికి బదులు, ఈ మూడేళ్లలో తనపై వచ్చిన మరకలు-మెరుపులను విశ్లేషించుకుని, మారిన మనసుతో పరిశుద్ధురాలయితే అది ఆ పార్టీ కార్యకర్తలకు సంబరమే. ఎందుకంటే… తమ పార్టీ పరిశుద్ధురాలు కావాలనుకుంటున్నది వారే కాబట్టి!

నిజానికి జగనన్న సీఎంగా ప్రమాణం చేసిన రెండేళ్ల వరకూ.. ఆయన అనుకున్న 30 ఏళ్ల సీఎం కోరిక నెరవేరటం, పెద్ద కష్టం కాదన్న పరిస్థితులే కనిపించాయి. ప్రతిపక్ష టీడీపీ నైరాశ్యం, విపక్షాల బలహీనత, వైసీపీ ప్రభుత్వ పథకాల అమలు దానికి కారణం. అయితే అదే సమయంలో జగనన్న పాలనా పగ్గాలు అందుకున్న వెంటనే.. చంద్రబాబు నివాసానికి ఆనుకుని నిర్మించిన ప్రభుత్వ భవనాన్ని కూల్చేసిన వైనం, జగనన్న కక్షprajavedika సాధింపు మనస్తత్వాన్ని ప్రపంచానికి తెలియచేసింది. ప్రభుత్వ ఆస్తిని కూల్చేయడం ద్వారా, చంద్రబాబుపై ఎలా పగసాధించినట్లో అప్పట్లో ఎవరికీ బోధపడలేదు. ఆ తర్వాత అచ్చెన్నాయుడు వంటి వారిని జైలుకు పంపించడం, అశోక్ గజపతిరాజుపై వేధింపుల పరిణామాలు చూసిన వారికి.. తాను జైలుకుycp-on-tdpవెళ్లేందుకు కారకులైన వారిని జగనన్న విడిచిపెట్టరని అర్ధమయిందనుకోండి. అది వేరే విషయం. 151 మంది ఎమ్మెల్యేలు, మూడు మినహా అన్ని ఎంపీ సీట్లూ వైసీపీవే ఉన్న పూర్తి రాజకీయ సానుకూల పరిస్థితి, టీడీపీ నేతలు నిర్వేదంతో నియోజకవర్గాలు విడిచివెళ్లిన పరిస్థితులు చూసిన వారికి … జగన్ మళ్లీ సీఎం కావడం నల్లేరునడక అన్న భావన అప్పట్లో తొంగిచూసింది. అసలు అంత తిరుగులేని మెజారిటీతో ఉన్న జగన్.. ప్రధాన విపక్షమైన టీడీపీని దాని మానాన దానిని వదిలిస్తే, అప్పటి పరిస్థితుల ప్రకారం దానంతట అదే నిర్వీర్యమయిపోయేది. అప్పటికే టీడీపీ స్థానిక సంస్థల ఎన్నికలను వదిలేసింది.

ఎమ్మెల్యేలు, మంత్రులుగా పనిచేసిన వారంతా వేరే రాష్ట్రాలకు వెళ్లి తలదాచుకున్నారు. ఆ సమయంలో కన్నా లక్ష్మీనారాయణ బీజేపీ అధ్యక్షుడిగా మరికొంత కాలం కొనసాగిఉంటే, టీడీపీ ప్రముఖుల్లో చాలామంది కమలతీర్ధం తీసుకునేవారు. ఆ క్రమంలో వైసీపీ నేతలు, ఎమ్మెల్యేలు, మంత్రులు విపక్షాన్ని పట్టించుకోకుండా… తమ సర్కారు పథకాలు ప్రచారం చేసుకుని ఉంటే, వైసీపీ జనక్షేత్రంలో బలంగా నాటుకుపోయేది. నిజంగా అలా జరిగితే బాగేనే ఉండేది. కానీ, పగతో రగిలిపోయి రాజకీయ ప్రత్యర్థులనుcbn-ysశత్రువుగా చూడటం, అధికారులను వేధించడమనే తెలివితక్కువ పనులకు తెరలేపడమే… నిర్వీర్యమయిన తెలుగుదేశం పార్టీ తిరిగి నిటారుగా నిలిచి, మళ్లీ అధికారం కోసం తెగించేందుకు కారణమయింది. ఈ పరిస్థితికి నిస్సందేహంగా జగన్, ఆయన సలహాదారులే కారణమన్నది సొంత పార్టీ సీనియర్ల విశ్లేషణ. టీడీపీ ప్రధాన కార్యాలయంపై దాడి నుంచి.. ఆ పార్టీలో కసిపెరగడానికీ, చంద్రబాబుScreenshot-2022-07-07-223017తిరిగి జనంలోకి వెళ్లడానికీ, పవన్ కల్యాణ్ తిరిగి రోడ్డెక్కడానికీ కచ్చితంగా తమ పార్టీ వ్యూహబృంద వైఫల్యమేనన్నది వైసీపీ సీనియర్ల మనోగతం.

తాము విపక్షంలో ఉన్నప్పుడు ఐఏఎస్ సతీష్ చంద్ర, ఐపీఎస్ ఏబీ వెంకటేశ్వరరావు కలసి తమ పార్టీకి చెందిన 23 మంది ఎమ్మెల్యేలను, టీడీపీలోకి ఫిరాయించేలా చేశారన్నది అప్పట్లో జగన్-విజయసాయిరెడ్డి మీడియా సాక్షిగా చేసిన ఆరోపణ. ఆ మేరకు వారు కేంద్రానికి ఫిర్యాదు చేశారు. వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత సతీష్ చంద్ర-ఏబీకి చాలాకాలం పోస్టింగ్ ఇవ్వలేదు. అప్పట్లో తమను వేధించారు కాబట్టి,ias-ipsవారిద్దరికీ పోస్టింగు ఇవ్వకపోవచ్చు. కానీ ఆ తర్వాత సతీష్ చంద్రకు కీలకమైన పోస్టింగు ఇచ్చిన జగన్.. అదే తప్పు చేసిన ఏబీకి రెండేళ్లు పోస్టింగు ఇవ్వకపోగా సస్పెండ్ చేయటం, కోర్టు ఆదేశాలతో పోస్టింగు ఇచ్చి మళ్లీ ఏబీని సస్పెండ్ చేయడం వంటి చిత్రవిచిత్ర నిర్ణయాలు పరిశీలిస్తే.. తాను 30 ఏళ్లు సీఎంగా కొనసాగేందుకు, ఇలాంటి నిర్ణయాలన్నీ సహకరిస్తాయా? శ్రీలక్ష్మి వంటి కళంకిత అధికారులను తెచ్చుకుని, ఇతరులపై బురద చల్లవచ్చా? లేదా? చల్లితే దాన్ని సమాజం హర్షిస్తుందా? అన్న ఆత్మపరిశీలన చేసుకోవాలి కదా? కనీసం ఇప్పుడయినా చేసుకుంయటారా అన్నదే ప్రశ్న. రేపు ఒకవేళ అధికార మార్పిడి జరిగి, ఇప్పుడు జగనన్న సేవలో తరిస్తున్న ఐఏఎస్-ఐపిఎస్ అధికారులకూ కొత్త ప్రభుత్వంలో ఇలాంటి వేధింపులే ఎదురవుతాయన్న స్పృహ ఉంటే, ఇలాంటి నిర్ణయాలు తీసుకోరేమో?! ఇప్పుడు పైనుంచి కింద వరకూ అలాంటి స్పృహనే కొరవడింది. కారణం.. అందరూ జగనన్నలు కావడమేనన్నది ఓ సీనియర్ ఎమ్మెల్యే విశ్లేషణ. నిజం జగన్నాధుడికెరుక?!

ఇక సొంత పార్టీ ఎంపీ రఘురామకృష్ణంరాజు తిరుగుబాటుకు కారణం ఎవరు? ఆ పరిస్థితి అసలు ఎందుకొచ్చింది? జగన్ తీసుకున్న ప్రతి నిర్ణయాన్ని కోర్టులో సవాల్ చేయడంతోపాటు, కేంద్రానికి ఫిర్యాదు చేసి తలనొప్పి తెచ్చుకున్నది ఎవరు? ఏరికోరి తెచ్చుకున్న రాజును సొంత నియోజకవర్గానికే రానిచ్చే పరిస్థితులు ఎందుకొచ్చాయి? వీటిపై పార్టీ అధినేతగా జగనన్న ఎప్పుడైనా సమీక్షించారా ? కనీసం ఆత్మపరిశీలన చేసుకున్నారా? ముఖ్యమంత్రిగా ఉండే నేతకు ఎంత ఈగో ఉంటుందో, ఎంపీ, ఎమ్మెల్యేలకూ అంతే ఉంటుందని గ్రహించకపోవడమే పొరపాటు. అసలు 70 శాతం నాయకులు రాజకీయాల్లో కొనసాగేదే ఆత్మగౌరవం కోసం. అలాంటి వారు పదవుల కంటే గౌరవం, మర్యాదనే ఎక్కువగా కోరుకుంటారు. మరి అలాంటి వారికి అపాయింట్మెంట్ ఇవ్వకపోతే, ఏ ముఖ్యమంత్రినయినా వారు ఎందుకు గౌరవిస్తారు ? అని జగనన్న కోటరీ ఆలోచించకపోవడమే ఆశ్చర్యం!

జగన్ ఏ విధంగా పులివెందుల నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారో, మిగిలిన వాళ్లు కూడా ఆయా నియోజకవర్గాల నుంచి ఎమ్మెల్యే, ఎంపీలుగా గెలిచినవారే కదా? పైగా వారిలో 60 శాతం మంది జగన్ కంటే వయసు-అనుభవంలో పెద్ద. మరి అలాంటప్పుడు సహచరుల సమస్యలు తాను వినకుండా.. రాజకీయాల్లో ఏమాత్రం అనుభవం లేని సలహాదారులు, అధికారుల వద్దకు వెళ్లమనడం ఏం హుందాతనం? ఈ విషయంలో జగన్ కు వేరే ఉద్దేశం ఉండకపోవచ్చు. కానీ అది అహంకార ప్రదర్శనగానే భావించే ప్రమాదం వచ్చింది. ఈ మూడేళ్లలో ముఖ్యమంత్రిగా, పార్టీ అధినేతగా జగనన్న ఎంతమంది మంత్రులు, ఎంపీ ఎమ్మెల్యే-పార్టీ నేతలను కలిశారని ప్రశ్నిస్తే, వారిని వేళ్లమీదే లెక్కించవచ్చన్న సమాధానం వస్తుంది. ఎందుకీ లెక్కలేనితనం? ఏమిటీ అవమానం? చిన్న వయసులో ఎంతో రాజకీయ భవిష్యత్తు ఉన్న నేతకు ఈ అహంకార ప్రదర్శన అవసరమా? ఇవన్నీ ఆయన 30 ఏళ్లు సీఎంగా కొనసాగేందుకు దోహదపడతాయా? అన్నవి జగనన్నను ప్రేమించే వారు సంధిస్తున్న ప్రశ్నలు.

ఉమ్మడి రాష్ట్రంలోనే ముఖ్యమంత్రులు ఎమ్మెల్యేల, ఎంపీలు, పార్టీ నేతలను విస్తృతంగా కలిసేవారు. వైఎస్ రోజుకు వందలమందిని కలిసి, కష్టసుఖాలు విచారించేవారు. చంద్రబాబు నాయుడూ అంతే. మరి అంత పెద్ద రాష్ట్రానికి సీఎంలుగా ఉన్న వారే అందరినీ కలిసినప్పుడు.. ఒక చిన్న రాష్ట్రానికి సీఎం అయిన జగన్ ఎందుకు కలవరు? అందుకు ఆయనకున్న ఇబ్బందులేమిటి? ఎవరినీ కలవనంతగా ఆయన చేసే పనులేమిటి? వారంతా తనకంటే తక్కువ అన్న చిన్నచూపా? లేక తనను కలిసే స్థాయి వారికి లేదన్న భావనా? అధికారులను ఆదేశించాల్సిన మంత్రులే, అధికారుల అపాయింట్ మెంట్ల కోసం దేబిరించే అవమానకర పరిస్థితులు తీసుకురావడం వల్ల జగన్ ప్రతిష్ఠ , వారి దృష్టిలో పెరుగుతుందా? తరుగుతుందా? .. ఇవీ ఇప్పుడు వైసీపీ సీనియర్ల మనసులో గూడుకట్టుకున్న భావన. ఏ నాయకుడి మనసులో అయినా, తన అధినేతపై గౌరవం నిండి ఉండాలి. కానీ అది కృతకం అయితే అద ప్రమాద సంకేతమే. ఇది అప్పట్లో చంద్రబాబు విషయంలో జరిగితే, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి విషయంలో జరుగుతోంది. చంద్రబాబు కనీసం మంత్రులు, ఎమ్మెల్యేలు, నేతలతో మాట్లాడేవారు. జగనన్న ఆ నలుగురైదుగురితో తప్ప మాట్లాడరన్న భావన పార్టీలో ఉంది.

అప్పట్లో టీడీపీ దుర్మార్గాలను చూపుడువేలితో ప్రశ్నించిన అదే వైసీపీ, ఇప్పుడు గద్దెనెక్కి చేస్తున్నదేమిటి? అప్పట్లో సోషల్ మీడియాలో పోస్టింగులు పెట్టిన వారిని టీడీపీ సర్కారు వేధించిందని ఆరోపించిన964468-virtual-attackవైసీపీ….ఇప్పుడు అదే పనిచేస్తున్న టీడీపీ కార్యకర్తలనూ వేధిస్తోంది కదా? గతంలో జన్మభూమి కమిటీలు చేసిన పనే , ఇప్పుడు వాలంటీర్లు చేస్తున్నారు కదా? మరి అప్పటి టీడీపీ, ఇప్పటి వైసీపీ ప్రభుత్వానికీ తేడా ఏముంది? గతంలో మీరు ఆవిధంగా చేయలేదా అన్న వైసీపీ నేతల ఎదరుదాడి, కోడలికి బుద్ధి చెప్పిన అత్త తెడ్డునాకిన చందమే కదా? ఇక ఇందులో వైసీపీ ప్రత్యేకత ఏముంది? గతంలో టీడీపీ అరాచకాలు చేసిందనే కదా ప్రజలు వైసీపీకి పట్టం కట్టింది? మరిప్పుడు వైసీపీ కూడా అదే పనిచేస్తే వైసీపీని ఎందుకు కొనసాగనివ్వాలి ? స్థూలంగా చూస్తే గతంలో టీడీపీ దారిలోనే ఇప్పుడు వైసీపీ నడిస్తే, ఇక జగనన్న 30 ఏళ్లు సీఎంగా ఉండి ఏం ఫాయిదా? అన్న ప్రశ్న.. సామాన్యుడి మదిలో మెదులుతున్న ప్రమాదాన్ని వైసీపీ వ్యూహబృందం, సర్కారును అప్రమత్తం చేసే నిఘా బృందం ఇంకా గ్రహించిందా? లేదా ? అన్నదే సందేహం.

పగలు, ప్రతీకారాలు, ప్రత్యర్ధులపై దాడులు, మర్యాద మరచిన మాటల వల్ల ఏ పార్టీ గౌరవం పెరగదు. సరికదా.. తరిగిపోతుంది. వైసీపీలో ఆరుపదుల వయసు దాటిన అగ్రనేతల ట్వీట్లు చూస్తే, రాజకీయంగా ఆ పార్టీని, వ్యక్తిగతంగా జగన్ ను అభిమానించే వారికి ఆ పార్టీ అంటే రోత, నేతలంటే గౌరవం తగ్గిపోతుంది. ఇప్పుడు అదే జరుగుతోంది. ఒరేయ్, వాడు,వీడు,ముసలోడు,బొల్లోడు, పంది, బ్రోతల్ హౌస్ ఓనరు వంటి పదాలు వాడి.. సొంత పార్టీ కార్యకర్తల్లో జోష్ నింపవచ్చు. కానీ, ఏ పార్టీకి చెందని తటస్థులు, విద్యావంతులు, యువత అనే కొన్ని పరిశీలించి నిరంతరం విశ్లేషించే’ వర్గాలుంటాయి. ఏ పార్టీ విజయానికయినా ఈ వర్గాలే మూలస్తంభాలు. రోజూ సమాజ పరిస్థితులను విశ్లేషించేది వీళ్లే. గత ఎన్నికల్లో వైసీపీ చెప్పిన ‘ఒక్క చాన్సు ప్లీజ్’ నినాదానికి ఆకర్షితులయిందీ ఈ వర్గాలే. అలాంటి వర్గాలు ఇలాంటి స్థాయి తక్కువ ట్వీట్ల బూతులను ఏవిధంగా ఆమోదించి, ఆహ్వానిస్తారన్న స్పృహ వైసీపీ నాయకత్వానికి రాకవడమే విచిత్రం. ప్రధానంగా ఇలాంటి బూతుల సంస్కృతి వల్ల, జగనన్న ఇమేజీకి డామేజీ అన్న స్పృహ కూడా ఎవరిలోనూ ఉన్నట్లు కనిపించడం లేదు.

లోకేష్ ను హీరో చేసిన వైసీపీ
వైసీపీ అనాలోచిత, వ్యూహలో పం, సలహాదారుల అనుభవరాహిత్యం కలసి వెరసి లోకేష్ ను హీరోను చేశాయి. మంత్రిగా పనిచేసినప్పుడు పప్పు అన్న ముద్ర వేసిన అదే లోకేష్, ఇప్పుడు పంచ్ లతో జగన్ సర్కారును ఉక్కిరిబిక్కిరి చేస్తున్న పరిస్థితి. అసలు మాట్లాడటమే రాని లోకేష్ కు మాటలతోపాటు, తూటాలు ఇచ్చి తమపై సంధింపచేసుకున్న ఘనత కూడా వైసీపీదే. లోకేష్ ఎక్కడకు వెళ్లినా జనసందోహం. చూపుడువేలితో జగన్ ను ప్రశ్నిస్తున్న దృశ్యాలు. ఆయన ప్రసంగానికి చప్పట్లు. ఇవన్నీ.. వైసీపీ వ్యూహబృందం లోకేష్ ను మాటలతో వేధించిన ఫలితంగా, ఆయన కసితో నేర్చుకున్న, వైసీపీ వ్యూహబృందం నేర్పిన ప్రసంగాలే.

అనుభవాలే మనిషికి గుణపాఠాలు. ఒకప్పుడు లోకేష్ ప్రసంగిస్తున్నాడంటే బోలెడు వెటకారాలు, ట్రోలింగులు. భాషాలోపాలపై సోషల్ మీడియాలో లెక్కలేనన్ని వ్యంగ్యాస్త్రాలు. ఇప్పుడు అదే లోకేష్ ప్రసంగానికి చప్పట్లు. ఆయన పర్యటనలకు అనవసర అడ్డంకులు సృష్టిస్తున్న ఫలితంగా అతనంటేNara-Lokesh-1పెరిగిన క్రేజ్. ఇవన్నీ వైసీపీ పుణ్యమే కాబట్టి, ఒకరకంగా లోకేష్ వైసీపీ వ్యూహబృందానికి కృతజ్ఞతలు చెప్పాల్సిందే. మరి ఒకప్పుడు లోకేష్ అనుభవించిన భాషారోదన, ట్రోలింగుల వేదన వంతు ఇప్పుడు సీఎం జగన్ ది. ఆయన తెలుగు భాషపై వస్తున్న ట్రోలింగులు, వ్యంగాస్త్రాలను లోకేష్ తో పోలిస్తే, జగన్ ప్రసంగంలోని భాషాదోషాలే ఎక్కువ. జగన్ ప్రసంగిస్తున్నారంటే.. అందులో ఎన్ని తప్పులున్నాయని రంధ్రాన్వేషణ చేసి, వాటిని ట్రోలింగ్ చేసే పరిస్థితి. అప్పుడు వైసీపీ చేసిన పనే ఇప్పుడు టీడీపీ చేస్తోంది. సో.. ప్రతీకారం, వేధించే తత్వం వల్ల ఎంత ఉంఎయోగం? ఎవరికి ఉపయోగం అన్నది వైసీపీ నాయకత్వం ఇప్పటికయినా ఆత్మపరిశీలన చేసుకుంటే మంచిది.

చేసిన పనులు చెప్పుకోరేం?
ఈ మూడేళ్లలో జగన్ పాలనపై ఎన్ని మరకలున్నా, సంక్షేమపథకాల మెరుపులే ఆయనకు జవం, జీవం. దాదాపు ప్రతి ఇంటికీ 77 వేల నుంచి లక్ష రూపాయలు లబ్ధి పొందుతున్న వాస్తవాన్ని ఎవరూ కాదనరు. సామాన్యుడి పెదవులపై ఇప్పటివరకయితే చిరునవ్వే కనిపిస్తోంది. ఒకరకంగా ఇన్ని పథకాలు దేశంలోని మరే రాష్ట్రంలోనూ కనిపించవు. జగన్ పథకాలపై పక్క రాష్ట్రాలు కూడా అధ్యయనానికి వస్తున్నాయి. వాలంటీర్ల వ్యవస్థ జగన్ కు బలం, బలహీనత కూడా. ఇన్ని పథకాల అమలు కోసం అప్పులు చేసి,1073365-ys-jagan-mohan-reddyచివరాఖరకు ఉద్యోగులు దాచుకున్న డబ్బును కూడా దారిమళ్లించి మరీ.. అక్కాచెల్లెమ్మల కోసం పథకాలు కొనసాగిస్తున్న పరిస్థితి. మరి జగన్ కష్టానికి తగిన ప్రతిఫలం క్షేత్రస్థాయిలో ఏమైనా కనిపిస్తుందా అంటే అదీ లేదు. వాటిని ప్రచారం చేయాల్సిన ఎమ్మెల్యేలు, మంత్రులు, పార్టీ నేతలు.. రాజకీయ ప్రత్యర్ధులపై ఎదురుదాడులు, ఆస్తుల స్వాధీనం, కబాలతోనే కాలక్షేపం చేస్తున్న పరిస్థితి ఉందన్నది మనం మనుషులం అన్నంత నిజం. ఫలితంగా వేల కోట్ల రూపాయలు వెచ్చించి చేస్తున్న పథకాలు పక్కకువెళ్లి, ప్రత్యర్ధులను వేధిస్తున్నారన్న అపవాదు మూటకట్టుకోవలసి వస్తోందన్నది వైసీపీ సీనియర్ల ఆవేదన.

రాష్ట్రపతి అభ్యర్థికి మద్దతుపై ఏం చెబుతారో?
“మన అవసరం ఉంటేనే కేంద్రం మన మాట వింటుంది. ఇప్పుడు మన మద్దతు బీజేపీకి అవసరం లేద”ని సీఎం అయిన కొత్తలో జగన్ వ్యాఖ్యానించారు. ఇప్పుడు జగన్ అవసరం, బీజేపీకి రాష్ట్రపతి ఎన్నిక రూపంలో వచ్చింది. దాన్ని అడ్డు పెట్టి హోదాతోపాటు, అనేక డిమాండ్లు సాధించుకోవచ్చు. అయినా జగనన్న పార్టీ బేషరతుగా, బీజేపీ కోరకుండానే రాష్ట్రపతి అభ్యర్ధికి మద్దతునిచ్చింది. దీనికి కారణమేమిటన్నది ప్లీనరీలో క్యాడర్‌కు జవాబు చెప్పాల్సిన బాధ్యత, పార్టీ అధ్యక్షుడిగా జగన్ పై ఉంది. లేకపోతే… ”మేం మూడేళ్లుగా బీజేపీకి మద్దతునిస్తూనే ఉన్నాం. రేపూ మద్దతునిస్తాం. మా మధ్య మూడేళ్లుగా మిత్రత్వం కొనసాగుతోంద”న్న ఎంపీ శ్రీధర్ వ్యాఖ్యలే నిజమనుకోవలసి వస్తుంది. జగన్ ఈ బంధంపై స్పందించకపోతే… ఇప్పటివరకూ బీజేపీ-వైసీపీ మధ్య రహస్యంగా ఉన్న పొత్తు బంధం, ఇకపై బహిరంగమవుతుంది. అంతే తేడా. దానివల్ల బీజేపీకి లాభమా? నష్టమా అన్నది పక్కనపెడితే, రాజకీయంగా వైసీపీకే నష్టం. ఆ బంధం వైసీపీని అభిమానించే క్రైస్తవ, ముస్లిం వర్గాల మనోభావాలు గాయపరుస్తుందా? లేదా అన్న అంశం కూడా పరిగణనలోకి తీసుకోకప్పదు. ఎందుకంటే.. బీజేపీ అభ్యర్ధిని జగన్ సమర్ధించడాన్ని, మైనారిటీలు వేరే కోణంలో చూస్తారు కాబట్టి!

అయినా.. సమయం మించిపోలేదు!
ఎన్నికలకు మరో రెండేళ్ల సమయం ఉంది. ఈలోగా ఇప్పటి ధోరణిలో మార్పు వస్తే మంచిది. ఇప్పటికయినా రాజకీయ ప్రత్యర్ధులను శత్రువులుగా చూసి, వారిపై వేధింపులు, కక్ష సాధింపులు మానుకుంటే.. ఏ పార్టీకి చెందని తటస్తుల మనసు సగం గెలిచినట్లే. అప్పులు చేసి మరీ అమలుచేస్తున్నjagan పథకాలను, జనక్షేత్రం లోకి తీసుకు వెళ్లడం ద్వారానే ప్రజలలో బలపడవచ్చు. వాలంటీర్లు-ముఖ్యమంత్రి మధ్య ఎమ్మెల్యేలు, ఎంపీలు మరెవరూ అవసరం లేదని, ‘ఓటర్ టు జగన్’ అన్న ఫిలాసఫీ మాట్లాడుకోవడం వరకూ బాగానే ఉంటుంది. కానీ, ఓటరును పోలింగ్ బూత్ వరకూ తీసుకువచ్చే సైనికుడయిన కార్యకర్త కన్నెర్ర చేస్తే, ఏ పార్టీకి భవిష్యత్తు ఉండదని గ్రహిస్తే మంచిది.

నిన్నటి వరకూ జరిగిన నియోజకవర్గాల ప్లీనరీలో… ఎమ్మెల్యేల నుంచి కార్యకర్తల వరకూ తమకేమీ జరగడం లేదని, తమను ఎవరూ లెక్కచేయడం లేదన్న నిర్వేదం వినిపించడాన్ని తేలిగ్గా తీసుకోకూడదు. అదొక ప్రమాదఘంటికగా భావించక తప్పదు. ఇక ప్రజాప్రతినిధులతో మాట్లాడటమనే ఆత్మగౌరవాన్ని కాపాడవలసింది కూడా జగనన్నే అన్న విషయం కూడా గుర్తిస్తేనే, ఒక అధినేతగా ప్రజాప్రతినిధుల మనసులో స్థానం సంపాదించుకుంటారు. ఏదేమైనా.. మరో రెండేళ్లపాటు.. తటస్తులు, విద్యావంతులు, మేధావులను సంతృప్తి పరచడంపైనే జగనన్న రాజకీయ భవిష్యత్తు ఆధారపడి ఉందన్న నిజాన్ని గ్రహస్తే మంచిది.

LEAVE A RESPONSE