Suryaa.co.in

Editorial

గోరంట్లకు ప్రేమతో… ఇట్లు గుంటూరు పోలీసులు!

– మాజీ ఎంపి గోరంట్ల మాధవ్ అనంతపురం టు గుంటూరు జైత్రయాత్ర
– టీడీపీ కార్యకర్త కిరణ్‌పై పోలీసుల సమక్షంలోనే దాడికి యత్నం
– కిరణ్ ఆనుపానులు మాధవ్‌కు చెప్పిందెవరు?
– పోలీసులలో వైసీపీ వేగులున్నారా?
– ఆరుగురు నిందితులలో నలుగురికి ముసుగేసిన పోలీసులు
– మాధవ్‌ను మాత్రం మినహాయించిన గుంటూరు పోలీసులు
-కిరణ్ కు మాత్రం ముసుగేసిన పోలీసులు
– అసలు నిందితులకు ముసుగువేయమని ఆదేశించింది ఎవరు?
– కారులోనే ఉండి ఖాకీలపై మాధవ్ కన్నెర్ర
– కిరణ్‌పై 111 సెక్షన్ ఎలా నమోదుచేస్తారన్న జడ్జి
– మంగళగిరి సీఐ ఓవరాక్షన్‌పై జడ్జి ఆగ్రహ ం, సీఐ మెమో కు ఉత్తర్వు
– మాధవ్‌ను ఆడుమగాడ్రా బుజ్జీ అంటూ తమ్ముళ్ల కితాబు

( మార్తి సుబ్రహ్మణ్యం)

అద్భుతాలు సృష్టించేవాడిని.. సాహసికుడిని.. దమ్మున్నవాడిని చూసి.. ‘ఆడు మగాడ్రా బుజ్జీ’ అని, ముద్దుగా నోరారా కీర్తిస్తుంటాం. మహేష్ హీరోగా వచ్చిన ‘అతడు’ సినిమాలో, తనికెళ్ల భరణి పాపులర్ డైలాగిది. ఇప్పుడు.. అనంతపురం జిల్లా నుంచి గుంటూరుకు కాన్వాయ్‌తో జైత్రయాత్రగా వచ్చి, టీడీపీ కార్యకర్తను పోలీసుల ఎదుటే కొట్టబోయి, పోలీసులను గడగడలాడించి, వారితోనే సెల్‌ఫోను సేవ లు చేయించుకుని, సహ నిందితులతోపాటు ముసుగువేయించుకోకుండా, విజయగర్వంతో రెచ్చిపోయిన వైసీపీ మాజీ ఎంపి గోరంట్ల మాధవ్‌ను స్వయంగా తమ్ముళ్లు.. ‘ఆడు మగాడ్రా బుజ్జీ’ అని నోరారా కితాబు ఇస్తున్న వైచిత్రి ఇది.

గోరంట్ల మాధవ్ గుర్తున్నారా? అదేనండి.. సెల్‌ఫోన్‌లో ఒక మహిళకు తన ఫ్యాంటు జిప్పు తీసి చూపించిన మదనగోపాలుడు. పోక్సోతోపాటు బోలెడు కేసులున్న ఘనుడాయన. ఇప్పుడాయన తన అనంతపురం జిల్లా నుంచి గుంటూరుకు, అనుచరులతో వచ్చి.. పోలీసుల అదుపులో ఉన్న టీడీపీ కార్యకర్త చేబ్రోలు కిరణ్‌పై, పోలీసు సమక్షంలోనే దాడికి తెగబడిన గోరంట్ల దాదాగిరి హాట్‌టాపిక్‌గా మారింది.

వైసీపీ అధికారం కోల్పోయి తొమ్మిదినెలలయినా.. టీడీపీ గద్దెనెక్కి 9 నె లలవుతున్నప్పటికీ.. ఇంత గుండెధైర్యంతో పోలీసులపై దాదాగిరి చేయడమే అందరి ఆశ్చర్యానికి అసలు కారణం. ఇది వైసీపీలో పెరిగిన మనోధైర్యమా? టీడీపీలో తగ్గుతున్న ఆత్మవిశ్వాసమా? గోరంట్ల తెగింపు కూటమి కార్యకర్తలకు ఇస్తున్న సంకేతం ఏమిటి? అసలు పోలీసులు ఇస్తున్న సందేశం ఏమిటి?

పిల్లి గుడ్డిదయితే ఎలుక ఏదో చూపించిందన్నది ముతక సామెత. గుంటూరులో గోరంట్ల దాదాగిరి చూసిన తర్వాత.. తెలుగు తమ్ముళ్ల మనసులో బలంగా నాటుకుపోయిన భావన ఇది. టీడీపీ అధికారంలో ఉందన్న స్పృహ, భయం లేకుండా.. ఏకంగా పోలీసులపైనే తెగబడిన గోరంట్ల దౌర్జన్యం పరిశీలిస్తే, ముఖ్యమంత్రిగా ఎవరున్నారు? వైసీపీ అధికారంలో ఉందా? టీడీపీ అధికారంలో ఉందా? అన్న అనుమానం రావడం సహజం. ఇప్పుడు జరుగుతోంది అదే.

సరే.. వైఎస్ భారతీరెడ్డిపై అసభ్యకరంగా పోస్టింగులు పెట్టిన చేబ్రోలు కిరణ్ అనే టీడీపీ కార్యకర్తపై బిఎన్‌ఎస్ 111 సెక్షన్ పెట్టి అరెస్టు చేసి రిమాండ్‌కు పంపారు. కిరణ్‌ను కోర్టులో ప్రవేశపెట్టిన సందర్భంలో జడ్జి పోలీసులపై ఆగ్ర హం వ్యక్తం చేశారు. ఇష్టానుసారం సెక్షన్లు పెట్టిచట్టాన్ని అపహాస్యం చేస్తారా? ఈ కేసులో 111 సెక్షన్ ఎలా పెడతారు? అంటూ కన్నెర్ర చేసిన జడ్జి.. మంగళగిరి సీఐ శ్రీనివాసరావుకు చార్జిమెమో ఇవ్వాలని ఎస్పీని ఆదేశించారు.

దాన్నలా పక్కనపెడితే.. నిందితులకు ముసుగువేసిన వైనం విమర్శలపాలవుతోంది. నిందితుడైన టీడీపీ కార్యకర్త తలకు నల్లక్యారీబాగును తగిలించి, మీడియా ముందు ప్రవే శపెట్టిన వైనంపై పసుపుసైనికులు భగ్గుమంటున్నారు. కిరణ్ ఏమైనా దేశద్రోహినా? టెర్రరిస్టా? హంతకుడా? మరి మరి వల్లభనేని వంశీ, పోసాని కృష్ణమురళికి ఎందుకు ముసుగు వేయలేదు? అని పోలీసులపై ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు.

కిరణ్‌తోపాటు.. మాధవ్ సహ నిందితులయిన నలుగురుకి ముసుగువేసిన పోలీసులు, అదే కేసులో నిందితుడైన గోరంట్ల మాధవ్‌కు ముసుగు వేయకపోగా.. కారులోనే కూర్చునే అవకాశం కల్పించిన, గుంటూరు ‘మంచి పోలీసుల విశాల హృదయం’పై పసుపు సైనికులు విరుచుకుపడుతున్నారు.

తొలుత ముసుగు వేసేందుకు ప్రయత్నించిన పోలీసులపై, మాధవ్ ఆగ్రహం వ్యక్తంచేసి రూల్సు మాట్లాడగా, భయపడిన పోలీసులు వెనుకంజ వేసినట్లు సమాచారం. మరి కిరణ్ సహా ఐదుగురికి ముసుగులేసి మీడియా ముందు ప్రవేశపెట్టిన పోలీసులు, మాధవ్‌కు మినహాయింపు ఎలా ఇచ్చారు? ఎందుకు ఇచ్చారు? అసలు ముసుగులు వేయాలని ఆదేశించిన అధికారి ఎవరన్నది తేలాల్సిన ప్రశ్నలు. నిందితులకు ముసుగు వేయకూడన్న సుప్రీంకోర్టు రూలింగ్‌ను ఉల్లంఘించి ఎవరన్నది మరో ప్రశ్న.

నేను పోలీసు ఆఫీసర్‌ను.. మాజీ ఎంపీని అని గోరంట్ల గుడ్లురిమితే, గుంటూరు పోలీసులు గజగజ వణికిపోయి.. చిత్తం ప్రభూ అని సారుకు, సాగిలపడటంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. గోరంట్ల మాధవ్ ఇప్పుడు నిందితుడు. ఆయన ప్రస్తుత ఎంపి కాదు. మాజీ పోలీసు అధికారి. అదికూడా రాజీనామా ఇచ్చిన వ్యక్తి. మరి అలాంటి నిందితుడికి చట్టంలో ఏమైనా ప్రత్యేక హక్కులుంటాయా? అని ప్రశ్నలవర్షం కురిపిస్తున్నారు.

పైగా మాధవ్‌కు ఒక సీఐ స్వయంగా తన ఫోన్ ఇచ్చి మాట్లాడుకునే వెసులుబాటు కల్పించారని, స్పెషల్ బ్రాంచిలో ఉన్న వైసీపీ అభిమానులు, కిరణ్ ఉన్న రూట్‌మ్యాప్‌ను మాధవ్‌కు అందచేశారన్నది మరో ఆరోపణ. గుంటూరు జిల్లాలో ఎస్‌బీ అధికారుల ఫోన్లపై నిఘా వేస్తే, ఇంటిదొంగలెవరో తేలుతుందన్నది తమ్ముళ్ల డిమాండ్.

 

LEAVE A RESPONSE