Suryaa.co.in

Andhra Pradesh

వైవీ సుబ్బారెడ్డిని అరెస్టు చేయాలి

– జగన్ నిర్వహించింది ‘సిద్ధం’ సభ కాదు ‘మయ’సభ
– జగన్ సంభాషణలోని బేలతనాన్ని చూసి ఓడిపోవడానికి సిద్ధమైనట్లు ప్రజలు అర్థం చేసుకున్నారు.
– వాలంటర్లను అడ్డం పెట్టుకొని అధికారంలోకి రావాలనుకునే ప్రయత్నాలు ఫలించవు
– ఒక్క వికలాంగుడికైనా ఒక్క ఉద్యోగం ఇచ్చారా?
– జగన్ ఇచ్చిన హామీలన్నీ గాలిలో కొట్టుకుపోయాయి
– సిద్ధం సభ ఏర్పాట్లకు అవతార్, టైటానిక్, జురాసిక్ పార్క్ సినిమాల డైరెక్టర్ ‘జేమ్స్ కేమ్ రోన్’ సహాయమేమైనా తీసుకున్నారా?
– పెద్ద కాల నాగుపాము కూడా చలిచీమల చేత చిక్కి చచ్చినట్లు జగన్ గతి కూడా అంతే.

– టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు వర్ల రామయ్య

మేదరమెట్లలో జగన్ నిర్వహించింది సిద్ధం సభ కాదని అదొక మయసభ అని టిడిపి పొలిట్ బ్యూరో సభ్యులు వర్ల రామయ్య పేర్కొన్నారు మంగళగిరిలోని తెలుగుదేశం పార్టీ జాతీయ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడిన మాటలు … మేదరమెట్లలో ఆదివారం జరిగిన ‘సిద్ధం’ 4వ సభకు 15 లక్షల మంది వస్తారని వైసీపీ ప్రచారం చేసుకోగా.. ఈ సభ అభాసుపాలైంది. మేదరమెట్ల సిద్ధం సభలో ఉన్నది లేనట్లుగా, లేనిది ఉన్నట్లుగా చూపారు. ఈ సభను ఓ మయసభలా మార్చారు. మేమే మళ్లీ అధికారంలోకి వస్తామని బీరాలు పలికిన జగన్.. ఈ సభలో ఓటమిని అంగీకరించినట్లుగా తెలుస్తోంది. తాను ఓడిపోబోతున్నట్లు ముందస్తు సంతకం చేశారు.

ఉమ్మారెడ్డి తయారు చేసిన మేనిఫెస్టోను జగన్ విసిరికొట్టారు. సభలో విడుదల చేయాల్సిన వైసీపీ మేనిఫెస్టోను ఎందుకు విడుదల చేయలేదు? ప్రధాన హామీలు అమలు చేయకపోగా.. 95% హామీలు అమలు చేశామనడం శుద్ద అబద్ధం. మద్యపాన నిషేధం చేసిన తరువాతనే ఓట్లు అడగడానికి వస్తానన్న హామీ ప్రస్తుతం ఏమైంది? సింహం ఒంటరిగానే వస్తుందని బీరాలు పలికిన జగన్.. చంద్రబాబు కూటమిని చూసి భయపడుతున్నారు?

ఆర్థిక పరిపుష్టిని ఏ విధంగా మదింపు చేస్తారో చంద్రబాబుకు బాగా తెలుసు, ఏ ఒక్క సంక్షేమ పథకాన్ని కూడ చంద్రబాబు రద్దు చేయరు. మెరుగైన రీతిలో అమలు చేస్తారు. చంద్రబాబు 2014-19 హయాంలో ఏటా రూ.65 వేల కోట్లు సంక్షేమానికి ఖర్చు చేసింది వాస్తవం కాదా? చంద్రబాబు ఎన్డీయేలో చేరడం కేంద్ర సంక్షేమ పథకాలను పరుగులు పెట్టించడానికే. కందుకూరు సభలో తొక్కిసలాటలో నలుగురు చనిపోతే ఇద్దరు టీడీపీ నాయకులను అరెస్టు చేశారు.

మరి నిన్న సిద్ధం సభలో ఇద్దరు చనిపోయారు, ఇంకొకరు చావు బతుకుల్లో ఉన్నారు. ఈ సంఘటనకు బాధ్యులైన వైవీ సుబ్బారెడ్డిని అరెస్టు చేయాలి. అన్ని కోణాల నుండి లోతుగా పరిశీలించి చంద్రబాబు హామీలిచ్చారు, అవన్నీ తప్పక అమలు చేస్తారు. టీడీపీ తప్పక అధికారంలోకి వస్తుంది.. శాస్త్రబద్ధంగా, చట్టబద్ధంగా వాలంటీర్ల సేవలు ఇంకా మెరుగైన రీతిలో ప్రజలకు అందేలా చేస్తాం.

దుర్యోధన సార్వభౌముడిలా జగన్ వచ్చాడు, వెళ్లాడు
దుర్యోధన సార్వభౌముడిలా వచ్చాడు, వెళ్లాడు. మొదటి మూడు సభల్లో మేం సిద్ధం, మేమే అధికారంలోకి వస్తామన్నారు. నాలగవదైన ఆఖరి సభలో ఓటమిని ఇన్ డైరెక్టర్ గా చెప్పినట్లే చెప్పారు. బేలతనం, కంగారు జగన్ లో కొట్టొచ్చినట్లు కనబడింది. చంద్రబాబు అధికారంలోకి రాబోతున్నారన్న భయం జగన్ లో సుస్పష్టంగా కనబడింది. ఇది కాదనే ధైర్యం వైసీపీ నాయకులకు ఉందా?

జనం విపరీతంగా వచ్చారని ప్రచారం:

గ్రీన్ మ్యాట్ వేసి పైన డ్రోన్లు తిప్పి విపరీతంగా జనం వచ్చారని ప్రచారం చేసుకున్నారు. డ్రోన్ లు వస్తున్నాయి స్పీచ్ ఆపేయండని అంబటి రాంబాబు చెప్పడంలో అర్తమేంటి? అవి వైసీపీ ఐప్యాక్ ఉపయోగించిన డ్రోన్లు కాదా? లోకేష్ డ్రోన్లు పంపానరడంలో అర్థంలేదు. జనాన్ని మభ్యపెట్టడంలో ఇది ఒక భాగమే. ఈ సభలో మేనిఫెస్టో విడుదల చేస్తామని అనేక రోజులుగా ప్రచారం చేశారు. ఏదీ విడుదల చేయలేదే? ఎందుకు విడుదల చేయలేదు? దీన్ని బట్టి వైసీపీకి ఓటమి భయం వెంటాడుతోంది. ఉమ్మారెడ్డి తయారు చేసిన మేనిఫెస్టోను జగన్ విసిరికొట్టారు. ఈ మేనిఫెస్టోతో మనమేం అధికారంలోకి వస్తామన్నారు. జనాన్ని ఇంకా మభ్య పెట్టాలనుకున్నారు. భ్రమల్లో ముంచాలనుకున్నారు. చిన్న పొరపాటు వల్ల మేనిఫెస్టోను విడుదల చేయలేకపోయామని ఎందుకు చెప్పలేకపోయారు?

జగన్ ప్రసంగంలో బేలతనం :

జగన్ మాటల్లో ఓడిపోయేవాడు ఎలా మాట్లాడుతాడో ఆ రకమైన బేలతనం జగన్ లో కనబడింది. చంద్రబాబు, ఆయన కూటమి గురించి అర్ధగంట మాట్లాడి సభ సమయాన్ని వృధా చేశారు. చంద్రబాబు బీజేపీ, జనసేనతో కలిసి నడిస్తే వైసీపీకి ఉలికిపాటెందుకు? నేను సింహం అని చెప్పుకుంటావు కదా! మరి సింహం ఎందుకు భయపడుతోంది? బేలతనమే జగన్ ఓటమిని అంగీకరిస్తోంది. పెద్ద కాల నాగుపాము కూడా చలిచీమల చేత చిక్కి చచ్చే వాస్తవాన్ని ఒకసారి జగన్ గుర్తుకు తెచ్చుకోవాలి.

వాలంటీర్లను అడ్డం పెట్టుకొని అధికారంలోకి రావాలని ప్రయత్నం:

వాలంటీర్లను అడ్డం పెట్టుకొని మళ్లీ అధికారంలోకి రావాలని చేసే జగన్ ప్రయత్నాలు ఫలించవు. వాలంటీర్లు జగన్ మాటలు నమ్మొద్దని విజ్ఞప్తి చేస్తున్నాను. జగన్ వాలంటీర్లను కట్టుబానిసల్లా, కూలీల్లా చూస్తున్నారు. మేము అలా చూడము. గౌరవిస్తాం.

పంచాయతీ వ్యవస్థని నాశనం చేశాడు:

ఎంపీటీసీలు, జడ్పీటీసీలు, ఛైర్ పర్సన్ లు, సర్పంచ్ ల వ్యవస్థని పూర్తిగా నాశనం చేశాడు. 56 కార్పొరేషన్లు మంజూరు చేసి ఒక్క కార్పొరేషన్ కు ఒక్క పైసా విదిల్చలేదు.

27 రోజుల్లో జగన్ అధికారం ముగుస్తుంది
మీరు సిద్ధంగా ఉండండి మీ కలలను నెరవేరుస్తానని జగన్ రాష్ట్ర ప్రజలకు అన్నారు. ఇంకేం నెరవేరుస్తావు?. అబ్బబ్బా అంటే 30 రోజులు. ఈ 30 రోజుల్లో ఎవరి కలలను సాకారం చేస్తారు? అధికారంలోకి రాగానే 2 లక్షల ఉద్యోగాలిస్తానన్నావు ఏవీ? ఒక్కొరికి ఒక్క ఉద్యోగం ఇచ్చావా? దళితుల, బీసీల, వికలాంగుల బ్యాక్ లాగ్ పోస్టులు ఒక్కటి కూడా భర్తీ చేయలేదు. ఇలాంటి మాయ మాటలు చెప్పొద్దని జగన్ కు విన్నపం. జగన్ ఇచ్చిన హామీలన్నీ గాలిలో కొట్టుకుపోయాయి.

అనేకమంది నిరుద్యోగులు ఉద్యోగాలు లేక ఇబ్బందులు పడుతున్నారు. ఆర్థిక శాస్త్రంలో దిట్ట అయిన చంద్రబాబు ఏ ఒక్క సంక్షేమ పథకాన్ని రద్దు చేయరు.
డీజీపీ రాజేంద్రనాధరెడ్డి నేను ఏది చెబితే అది జరుగుతుందనుకోవడం భ్రమ :
డీజీపీ రాజేంద్రనాధరెడ్డి నేను ఏది చెబితే అది జరుగుతుందనుకోవడం భ్రమే. ఎవరైనా సరే చట్టబద్దంగానే వెళ్లాలి. ఇష్టమొచ్చినట్లు వెళ్లాలంటే కుదరదు. మేదరమెట్ల సభలో చనిపోయిన వారిపై కేసు రిజిష్టర్ చేయలేదు. గతంలో టీడీపీ సభలో తొక్కిసలాటలో చనిపోయిన సంఘటనలో టీడీపీ నాయకులను ఏ విధంగా అరెస్టు చేశారో ఆ విధంగానే ప్రస్తుతం వైవీ సుబ్బారెడ్డిని అరెస్టు చేయాలి.

మేదరమెట్ల సిద్ధం ఆఖరి సభ ఏర్పాట్లలో అవతార్, టైటానిక్, జురాసిక్ పార్క్ సినిమాల డైరెక్టర్ ‘జేమ్స్ కేమ్ రోన్’ సహాయమేమైనా తీసుకున్నారా? గ్రాఫిక్ లో వీడియోలు చూపించి లక్షకు మించి జనం రాకపోయినా పది లక్షలకు పైగా జనం వచ్చారని ప్రచారం చేసుకుంటున్నారని టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు వర్ల రామయ్య వివరించారు.

 

LEAVE A RESPONSE