-జై జవాన్..జై కిసాన్ కాంగ్రెస్ నినాదం
-కాంగ్రెస్ 55 ఏళ్ల పాలనలో ఏనాడు పూజలను అడ్డుకోలేదు
-పంజాబ్ ఎన్నికల ప్రచారంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు
కాంగ్రెస్ పేదల కోసం పనిచేస్తుంటే బిజెపి మాత్రం కొద్ది మంది పెద్దల కోసం పనిచేస్తుందని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు అన్నారు. బుధవారం రాత్రి నుంచి గురువారం సాయంత్రం వరకు ఆయన పంజాబ్ రాష్ట్రంలోని ఫరీద్ కోట్ లోక్ సభ నియోజకవర్గ కాంగ్రెస్ అభ్యర్థి అమర్జీత్ కౌర్ సాహో కు మద్దతుగా పలు ప్రాంతాల్లో ఏర్పాటుచేసిన సభల్లో ప్రసంగించారు.
బుధవారం సాయంత్రం కొట్కాపుర అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలో ఏర్పాటుచేసిన కార్నర్ మీటింగ్ లో ప్రసంగించారు. గురువారం ఉదయం ఫరీద్ కోట్ లోక్ సభ నియోజకవర్గ కేంద్రంలో పంజాబ్ రాష్ట్రంలో ప్రతిపక్ష నేత ప్రతాప్ సింగ్ బజ్వ తో కలిసి మీడియా సమావేశంలో పాల్గొన్నారు. తదుపరి ఫరీద్ కోట్ లోక్ సభ నియోజకవర్గ పరిధిలోని మచకి కలన్ గ్రామంలో ప్రశ్న-సమాధానం కార్యక్రమంలో పాల్గొన్నారు. గురువారం సాయంత్రం బాగా పురాణ లో ఏర్పాటుచేసిన సభలో ప్రసంగించారు.
ఇండియా కూటమి అధికారంలోకి రాగానే దేశవ్యాప్తంగా ఇంటి పెద్ద బ్యాంకు ఖాతాలో లక్ష రూపాయల నగదు జమ చేస్తామన్నారు. తాము మహిళలను మహారాణులుగా చూస్తామన్నారు. కాంగ్రెస్ సర్కారు ఎప్పుడు పేదల గురించే ఆలోచన చేస్తుందని, బిజెపి పేదలకు రూపాయి కూడా ఇవ్వలేదు, అదా నీ అంబానీ వంటి కొద్ది మంది పెద్దలకు మాత్రం 16 లక్షల కోట్ల రూపాయల రుణమాఫీ చేసి, మోడీ 10 ఏళ్ల పాలనలో 100 లక్షల కోట్ల అప్పులు చేసి దేశాన్ని అప్పులకుప్పగా మార్చారని విమర్శించారు.
జనాభా దామాషా ప్రకారం దేశ సంపద పంపిణీ జరగాలి, తమిళనాడులో 69% రిజర్వేషన్లు అమలవుతున్నాయి అదే విధంగా అన్ని చోట్ల రిజర్వేషన్లు పెంచుతామని ఇండియా కూటమి స్పష్టం చేసిందన్నారు. మేం పేదల కోసం ఎప్పుడు పథకాలు ప్రకటించిన బిజెపి వారు మమ్ములను విమర్శిస్తూనే ఉంటారని తెలిపారు. యూపీఏ హయాంలో ఉపాధి హామీ పథకం, ఆహార భద్రత, రూరల్ హెల్త్ మిషన్, భూ సంస్కరణలు, బ్యాంకుల జాతీయకరణ చేసినప్పుడు సైతం వారు విమర్శించారని గుర్తు చేశారు.
ప్రాణాలు లెక్కచేయకుండా సరిహద్దుల్లో కాపలాకాస్తున్న వీర జవాన్ల స్థాయిని మోడీ ప్రభుత్వం కార్మికుల స్థాయికి దిగజార్చిందని విమర్శించారు. ఇండియా కూటమి అధికారంలోకి రాగానే అగ్నివీర్ పథకాన్ని రద్దు చేస్తుందని ప్రకటించారు. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే పేదల ఆరోగ్య భీమాకు సంబంధించిన రాజీవ్ ఆరోగ్యశ్రీ పరిమితిని ఐదు లక్షల నుంచి పది లక్షలకు పెంచాలని, ఇండియా కూటమి అధికారంలోకి రాగానే దేశవ్యాప్తంగా ఉచిత ఆరోగ్య భీమా పథకాన్ని అమలు చేస్తుందని తెలిపారు.
మద్దతు ధర, రుణమాఫీ కోసం ఢిల్లీలో రైతులు నెలల తరబడి ఆందోళన చేస్తే మోడీ 10 నిమిషాలు కూడా వారికోసం కేటాయించలేదని ఆ పోరాటంలో వందలాది మంది రైతులు ప్రాణాలు కోల్పోయిన విషయాన్ని భట్టి విక్రమార్క గుర్తు చేశారు. జై జవాన్ జై కిసాన్ కాంగ్రెస్ నినాదం అన్నారు. నెహ్రూ కాలం నుంచి మొన్నటి మన్మోహన్ సింగ్ కాలం వరకు వారి సంక్షేమమే ధ్యేయంగా పనిచేశామని గుర్తు చేశారు. ఈ దేశంలో హరిత విప్లవం తీసుకువచ్చి వ్యవసాయ ఉత్పత్తులను మూడింతలు పెంచిన ఘనత కాంగ్రెస్ ప్రభుత్వాలదే అన్నారు.
రైతు, శ్రామికుల రుణమాఫీకి ఇండియా కూటమి కట్టుబడి ఉందన్నారు. తెలంగాణలో రైతు రుణమాఫీ చేయబోతున్న విషయాన్ని వివరించారు. ఉపాధి హామీ పథకం ద్వారా ప్రతిరోజు 400 రూపాయల కూలి భద్రతను ఇండియా కూటమి కల్పిస్తుంది అన్నారు. ఈ దేశం కోసం దేహాలను ముక్కలు చేసుకున్న చరిత్ర దివంగత ప్రధానులు ఇందిరా, రాజీవ్ గాంధీ లది వారి వారసత్వాన్ని యువనేత రాహుల్ గాంధీ కొనసాగిస్తున్నట్టు వివరించారు.
జనాభా దామాషా ప్రకారం ఈ దేశ సంపద, వనరులు పంపిణీ చేయడమే లక్ష్యంగా ఆయన కన్యాకుమారి నుంచి కాశ్మీర్ వరకు పాదయాత్ర, మణిపూర్ నుంచి ముంబై వరకు బస్సు యాత్ర చేసిన విషయాన్ని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క స్థానిక ప్రజలకు వివరించారు.