Home » చంపాలనుకున్న వాడికి తుపాకీ దొరకదా?

చంపాలనుకున్న వాడికి తుపాకీ దొరకదా?

-అడ్డంగా దొరికేసిన జగన్మోహన్ రెడ్డి
-కనీస ఇంగిత జ్ఞానం ఉండాలి కదా?

-ప్రజలు తింగరోళ్లు అనుకుంటున్నాడా ?
-హత్యాయత్నం అనేది సింపతీ కోసం ఆయన ఆడిన డ్రామానే
-కడపలో మొదలైన వివేకా హత్య ప్రభంజన పవనాలను ఆపడం కోసమే ఈ జగన్నాటకం
-నరసాపురం ఎంపీ రఘురామకృష్ణంరాజు

కడపలో మొదలైన మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య ప్రభంజన పవనాలు రాష్ట్రాన్ని తాకుతున్నాయని, ఆ పవనాలను నిలువరించడానికి ముల్లు ను ముల్లుతోనే తీయాలన్న ఉద్దేశంతో జగన్మోహన్ రెడ్డి సరదాగా, చిలిపిగా తనపై తానే హత్య ప్రయత్నాన్ని చేయించుకున్నారనే అనుమానాలు వస్తున్నాయని నరసాపురం ఎంపీ, తెలుగుదేశం పార్టీ నాయకులు రఘురామ కృష్ణంరాజు అన్నారు.

అతడు సినిమాలో షియాజీ షిండేను హత్య చేస్తారని, కాకపోతే జగన్మోహన్ రెడ్డి ఇక్కడ అన్ని జాగ్రత్తలు తీసుకున్నారని ఎద్దేవా చేశారు. హత్యా ప్రయత్నం జరిగిందని అనాలంటే కూడా కనీస ఇంగిత జ్ఞానం ఉండాలి కదా అని రఘురామ కృష్ణంరాజు ప్రశ్నించారు. ఎవరైనా పంగళి కర్ర తో హత్య చేయాలని అనుకుంటారా?, పంగళి కర్రతో హత్యచేయాలనుకున్న వాడికి తుపాకీ దొరకదా? అని నిలదీశారు. అయినా జగన్ మోహన్ రెడ్డిని ఎవరైనా ఎందుకు హత్య చేస్తారని ప్రశ్నించారు. ఆయన్ని హత్య చేయవలసిన అవసరం ఎవరికి ఉందని నిలదీశారు. రేపో, మాపో ఎన్నికల్లో ఓడిపోయే జగన్మోహన్ రెడ్డిని, ఎవరైనా ఎందుకు హత్య చేస్తారని సూటిగా ప్రశ్నించారు.

ఎన్నికలకు ముందు బుద్ధి ఉన్నవాడు ఎవరైనా ఇటువంటి చిలిపి ప్రయత్నాన్ని కూడా చేయరని, వాళ్లకు వాళ్లే చేసుకుంటే తప్ప అని ఆయన అన్నారు. ఆదివారం నాడు రచ్చబండ కార్యక్రమంలో భాగంగా రఘురామకృష్ణంరాజు మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డికి ఏదైనా జరిగితే ఆయన పార్టీ పెద్ద మెజారిటీతో నెగ్గుతుందని, ఆ విషయం చిన్న పిల్లాడికైనా తెలుస్తుందని… అటువంటప్పుడు ఆయనపై హత్య ప్రయత్నాన్ని ఎవరు చేస్తారంటూ నిలదీశారు. ప్రజల్లో సానుభూతి పొందడానికి పొలిటికల్ అడ్వైజర్లు ఇటువంటి పనికిమాలిన సలహాలను ఇస్తుంటారన్నారు.

2019లో కూడా అలాగే జరిగిందని గుర్తు చేశారు. గతంలో జగన్మోహన్ రెడ్డి పై జరిగిన కోడి కత్తి దాడి, బాబాయి హత్య ఈ కోవకు చెందినవేనని పేర్కొన్నారు. అప్పుడు జగన్మోహన్ రెడ్డి తరఫున ప్రచారం చేసిన చెల్లి షర్మిళా రెడ్డి, ఇప్పుడు వేరేగా ఉంది. తల్లి అమెరికాకు వెళ్లిపోయింది. ఎన్నికల సర్వేల అంచనాలు దారుణంగా ఉన్నాయి. సిద్ధం సభలకు జనాలు రావడం లేదు. ఈ పరిస్థితుల్లో ప్రజల దృష్టిని మరల్చడానికి జగన్మోహన్ రెడ్డి ఈ సరికొత్త డ్రామాను ఆడారని రఘురామ కృష్ణంరాజు అన్నారు.

దొరికేసిన హత్యాయత్నం డ్రామా
జగన్మోహన్ రెడ్డి ఆడిన హత్యాయత్నం డ్రామా మరీ దొరికేసే విధంగా ఉందని రఘురామకృష్ణం రాజు అపహాస్యం చేశారు. కొద్దిసేపు కన్నుమూసి, కొద్దిసేపు కన్ను తెరిచి ఉంచి, కన్ను కమిలిపోయినట్లుగా ఒకచోట, కన్ను కమిలిపోనట్లుగా మరొకచోట సాక్షి దినపత్రికలోనే ఫోటోలను ముద్రించారని ఆయన పేర్కొన్నారు. జగన్మోహన్ రెడ్డి పై జరిగిన హత్యాయత్నానికి తెదేపా అధినేత నారా చంద్రబాబు నాయుడే బాధ్యత వహించాలని మంత్రి అంబటి రాంబాబు పేర్కొనడం హాస్యాస్పదంగా ఉందన్నారు.

ఈ సంఘటనకు నారా చంద్రబాబు నాయుడుకు ఏమిటి సంబంధమని రఘురామ కృష్ణంరాజు ప్రశ్నించారు. ఆయన కాబోయే ముఖ్యమంత్రి అని, అయినా ఎటువంటి తింగరి పనులు ఎవరైనా మటుకు చేస్తారా? అంటూ నిలదీశారు. దానికి ఆయన్ని బాధ్యత వహించాలని పేర్కొనడం సిగ్గుచేటన్నారు. గతంలో ఇదే తరహా డ్రామాలు ఆడినప్పుడు చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నారని, ఇప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్నది ఎవరని రఘు రామ కృష్ణంరాజు ప్రశ్నించారు. ఒకవేళ జగన్మోహన్ రెడ్డి అపధర్మ ముఖ్యమంత్రి గా కొనసాగుతుంటే, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, డిజిపి బాధ్యత వహించాలన్నారు.

రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, డిజిపి ఇద్దరు కూడా ఉమ్మడి కడప జిల్లాకు చెందిన రెడ్డి అధికారులేనని గుర్తు చేశారు. ఈ సంఘటనకు వారినే బాధ్యులను చేయాలని రఘురామ కృష్ణంరాజు డిమాండ్ చేశారు. అయినా ఎవరైనా హత్యా ప్రయత్నాన్ని పంగళి కర్రతో చేస్తారా? అంటూ ప్రశ్నించి…పంగళి కర్ర దెబ్బకు చిన్న పిట్టలు తప్ప, పెద్ద పిట్టలు చావడం లేదన్నారు. పోనీ జగన్మోహన్ రెడ్డి పై హత్యా ప్రయత్నం జరిగిందని అనుకున్న, ఈ సంఘటన జరిగిన తర్వాత గంటన్నర సేపు తన బస్సు యాత్రను కొనసాగించారని గుర్తు చేశారు.

ఇప్పుడేమో తనపై హత్యా ప్రయత్నం జరిగిందని, విశ్రాంతి తీసుకోవాలని పేర్కొంటూ, బస్సు యాత్ర షెడ్యూల్ ను తర్వాత ప్రకటిస్తానడం హాస్యాస్పదంగా ఉందన్నారు. ఇవన్నీ సినిమా కథలని, తనకు తానే ఈ హత్యా ప్రయత్నాన్ని చేసుకున్నారు. రాయి కూడా వచ్చి తగిలిందో లేదో అన్నది డౌటే. ఓ పెద్ద గజమాల తీసుకొచ్చిన సమయంలో సెక్యూరిటీ కిందకు వంగారు. కరెంటు తీసినప్పుడు, ప్లాస్టిక్ బుల్లెట్ ప్రూఫ్ షీల్డ్ తో సాధారణంగా జెడ్ కేటగిరి సెక్యూరిటీ కలిగిన వ్యక్తి ని కవర్ చేస్తుంటారని, ఈ సంఘటన జరిగిన సమయంలో ఎందుకు కవర్ చేయలేదన్నది అర్థం కావడం లేదన్నారు.

అదే సమయంలో కరెంటు తీస్తారని, గజమాల వస్తుందని, సెక్యూరిటీ సిబ్బంది కిందకు వంగుతారని, అదే సమయంలో ముందుగా ఎంచుకున్న ప్రాంతానికి వాహనం వస్తుందని ఊహించి, పంగళి కర్రతో ఎంత బాగా కొట్టారంటే… అది ఎక్కడ తగలకుండా, నిర్దేశించిన ప్రాంతంలో తగలడం అన్నది మానవ మాత్రులకు సాధ్యమయ్యే పనేనా అని రఘురామ కృష్ణంరాజు తనదైన శైలిలో సెటైర్ వేశారు.. జగన్మోహన్ రెడ్డి సానుభూతి కోసం ఆడిన ఈ డ్రామా మాట దేవుడెరుగు… అసలు ఆయన రాష్ట్ర ప్రజలను ఏమైనా తింగరి వాళ్ళని అనుకుంటున్నాడా ? అనే అనుమానాన్ని వ్యక్తం చేశారు.

ఆపరేషన్ దుర్యోధన సినిమాలో హీరో శ్రీకాంత్ మాదిరిగా కత్తితో పొడిపించుకుని ఉంటే ఈ డ్రామా కొంచెం పండి ఉండేదేమో కానీ… అప్పుడు దాన్ని ఆపరేషన్ దుర్యోధన సినిమా కాపీ డ్రామా అని అనేవాళ్లమన్నారు. మరి ఇంత సిల్లీగా ఒంటికి దెబ్బలు తగలకుండానే , జగన్మోహన్ రెడ్డికి టన్నులకొద్దీ సానుభూతి రావాలి… హత్యా ప్రయత్నమన్నది జరిగిపోవాలి, వైయస్ షర్మిళా రెడ్డి, డాక్టర్ సునీతారెడ్డి లు పేర్కొంటున్నట్లుగా, అవినాష్ రెడ్డిపైనున్న హత్యా నేరాభియోగమన్నది ప్రజలు మర్చిపోవాలి.

చంద్రబాబు నాయుడు దుర్మార్గం చేశాడని అనుకోవాలి అంటే… ఎలా అంటూ రఘురామకృష్ణంరాజు ఎద్దేవా చేశారు. ఎన్నికల ముందు అవతలి పార్టీ అభ్యర్థిపై బుద్ధి ఉన్నవారు ఎవరైనా సరే పంగళి కర్రతో హత్యాయత్నం చేస్తారా?, అది జెడ్ ప్లస్ కేటగిరి భద్రత కలిగిన వారిపై, ఏదైనా ఊరికి వస్తుంటే చెట్లను కొట్టేసే వ్యక్తి పై పంగళి కర్రతో హత్యయత్నం సాధ్యమేనా అంటూ నిలదీశారు.

మెజారిటీ ప్రజలు ఇది డ్రామేనని అంటున్నారు
రాష్ట్రంలోని మెజారిటీ ప్రజలు ఇది డ్రామేనని అంటున్నారని రఘురామకృష్ణం రాజు తెలిపారు . రాష్ట్రంలో ఇద్దరు జగన్మోహన్ రెడ్డి, భారతి రెడ్డిలకు కూడా ఇది డ్రామేనని తెలిసినా, ప్రజలు ఈ డ్రామాని విశ్వసించారని అనుకుంటున్నారని, నేను అనుకుంటున్నానని తెలిపారు. జెడ్ ప్లస్ కేటగిరి సెక్యూరిటీ కలిగిన జగన్మోహన్ రెడ్డి ఎప్పుడు బస్సులో నుంచే చేతులు ఊపుతుంటారని, సంఘటన జరిగిన ప్రదేశంలో 100 మంది కూడా లేకపోయినప్పటికీ, బస్సు దిగి ఎందుకు బయటకు వచ్చారని ప్రశ్నించారు. బయటకు వచ్చి ఎందుకు చేతులు ఊపారని నిలదీసిన ఆయన, ముందే అక్కడ స్పాటని డిసైడ్ అయి ఉంటారన్నారు.

అందుకే ఆయన బస్సు దిగి కిందకు రాగానే పక్కనే ఉన్న ఇంట్లో నుంచి పంగళి కర్రతో గురి చూసి కొట్టినట్లుగా, స్క్రిప్టు రచించారని పేర్కొన్నారు. రాళ్లదాడిలో ఎవరికీ దెబ్బలు తగలలేదని, కేవలం జగన్మోహన్ రెడ్డికి, విజయవాడ సెంట్రల్ నియోజకవర్గం వైకాపా అభ్యర్థి వెల్లంపల్లి శ్రీనివాస్ కు మాత్రమే రాళ్ల దెబ్బలు తగిలినట్టు చెప్పడం ఆశ్చర్యాన్ని కలిగించిందన్నారు. వెల్లంపల్లి కి కన్ను కింద దెబ్బ తగలగా, స్థానికంగా ఆయనకు ఎంతో కొంత సింపతి, రాష్ట్రస్థాయిలో జగన్మోహన్ రెడ్డికి సింపతి కోసమే ఈ డ్రామా ఆడినట్లు స్పష్టమవుతోందన్నారు.

గుడివాడ వైకాపా అభ్యర్థి కొడాలి నాని ఈ డ్రామాలను అంగీకరించి ఉండరని, అందుకే అక్కడ ఎటువంటి సంఘటన జరగలేదన్నారు. చెప్పులు వేసి నిరసన తెలియజేయడం ప్రజల హక్కు అని గతంలో పనిచేసిన డీజీపీ పేర్కొన్నారని, ఇప్పుడు రాళ్లు విసిరి నిరసన తెలియజేయడం ప్రజల హక్కుని ప్రస్తుత డిజిపి అనరని రఘురామ కృష్ణంరాజు పేర్కొన్నారు. ఎందుకంటే ప్రస్తుత డిజిపిని నియమించింది జగన్మోహన్ రెడ్డే నని గుర్తు చేశారు. అయినా రానున్న రెండు, మూడు రోజుల్లో రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని, డీజీపీ ని ఎన్నికల సంఘం బదిలీ చేయనుందని రఘురామ కృష్ణంరాజు తెలిపారు .

జగన్మోహన్ రెడ్డి పై దాడిని ఖండించిన ప్రధాని మోడీ, తెదేపా అధినేత చంద్రబాబు నాయుడు
జగన్మోహన్ రెడ్డి పై జరిగిన దాడి ని ప్రధానమంత్రి నరేంద్ర మోడీతో సహా తెదేపా అధినేత నారా చంద్రబాబు నాయుడు ఖండించారని, నేను కూడా ఖండిస్తున్నట్లుగా రఘురామ కృష్ణంరాజు తెలిపారు. అయితే ఈ సంఘటన పై నాకు కొన్ని డౌటానుమానాలు ఉన్నాయన్నారు. నీరా అంటే సారా అని పేర్కొన్న ఆయన, “నీరా ” జనాలతో సాగుతున్న అపూర్వ యాత్ర లో జగన్మోహన్ రెడ్డి పై హత్యా ప్రయత్నం చేశారని చెప్పడం ఆశ్చర్యాన్ని కలిగించిందన్నారు.

ఈ సందర్భంగా సాక్షి దినపత్రికను మీడియా ప్రతినిధుల సమావేశంలో ప్రదర్శిస్తూ, జగన్మోహన్ రెడ్డికి నుదిటిపై దెబ్బ తగిలినట్టు చెబుతున్న ప్రదేశాన్ని చూపించారు. అక్కడ చిన్నగా గీరుకు పోయిందని, ప్రజలు ఎప్పుడైనా తమతో కరచాలనం చేసినప్పుడు దీనికంటే ఎక్కువగానే గీరుకు పోతుందన్నారు.. చిన్నగా గీరుకుపోయినప్పటికీ, రక్తం కారలేదని… అయినా దానికి ఎవరైనా కుట్లు వేస్తారా? అంటూ ప్రశ్నించి సాధారణంగా కుట్లను వేయరన్నారు. కన్ను చుట్టూ కమిలినట్లుగా ఉన్న ఫోటోను చూపించిన రఘురామ కృష్ణంరాజు, సాక్షి దినపత్రికలో మరొక చోట ప్రచురించిన ఫోటోలో జగన్మోహన్ రెడ్డి కన్ను సాధారణంగా తెరిచి ఉండడంతో పాటు, కన్ను చుట్టూ కమిలినట్లుగా ఎటువంటి ఆనవాళ్లు లేకపోవడాన్ని ప్రస్తావించారు.

ఒకచోట కన్ను మూసి ఉంటే మరొకచోట కన్ను ఎలా తెరిచాడని ప్రశ్నించిన ఆయన, ఒక చోటు కన్ను చుట్టూ కమిలినట్లుగా ఫోటోజనిక్ లో ఏర్పాటు చేశారని, ఇది మరొక చోట కన్ను పూర్తిగా తెరిచి ఉంచి, కన్ను కింద కమిలినట్టు లేకపోవడం ద్వారా స్పష్టమవుతుందన్నారు. ఈ సంఘటన జరిగిన రెండు గంటల తర్వాత ఆసుపత్రికి వెళ్లిన జగన్మోహన్ రెడ్డి చకచకా నడిచి వస్తున్న ఫోటోను సాక్షి దినపత్రికలో ప్రచురించిందని, విలేకరుల సమావేశం లో ప్రదర్శించారు. విజయవాడ సింగ్ నగర్ లో జగన్మోహన్ రెడ్డి పై దాడి జరిగితే, ఆయన గుడివాడ వరకు తన బస్సు పర్యటనను కొనసాగించారన్నారు.

బస్సులో ఉన్న వైద్యుడు హరికృష్ణ జగన్మోహన్ రెడ్డి కి గీరుకుపోయిన చోట ఒక ప్యాచ్ ను వేయగా, క్యాన్సర్ స్పెషలిస్ట్ వైద్యుడు అయిన సింహాద్రి చంద్రశేఖర్ మరొక ప్యాచ్ వేశాడట. అక్కడ ప్రభుత్వ ఆసుపత్రిలో జగన్మోహన్ రెడ్డికి 18 నుంచి 20 మంది వైద్య బృందం తో ప్లాస్టిక్ సర్జన్ ఆధ్వర్యంలో కుట్లు వేయించినట్లుగా తెలిసిందన్నారు. 20 20 డిసెంబర్ లో నాకు ఓపెన్ హార్ట్ సర్జరీ జరిగింది. ఈ సందర్భంగా నాకు మత్తు ఇవ్వకముందు, సర్జరీ చేయడానికి ఆరు మంది వైద్య బృందం ఉన్నట్లుగా గుర్తించాను. ఓపెన్ హార్ట్ సర్జరీ చేయడానికి 6 మంది వైద్య బృందం సరిపోగా, కేవలం ప్లాస్టిక్ సర్జన్ తో కుట్లు వేయించడానికి 18 నుంచి 20 మంది వైద్య బృందం అవసరమా? అంటూ ప్రశ్నించారు.

జగన్మోహన్ రెడ్డి పై దాడి జరిగినట్టు గా చెబుతున్న సంఘటన తర్వాత పంగళి కర్రతో దాడి జరిగినట్టుగా పేర్కొన్నారు. ఒరిజినల్ డ్రామా ప్రకారం, అక్కడ ఒక పంగళి కర్రను వదిలేసి ఉంటారని, కొట్టిన వాడు అక్కడే దాన్ని వదిలేసి పోయినట్టు గా ముందుగా అనుకున్న స్క్రిప్ట్ ప్రకారం మాట్లాడి ఉంటారన్నారు . ఈ సంఘటన చూస్తే 2019లో జరిగిన కోడి కత్తి డ్రామా తో పాటు, బాబాయిని లేపేసిన ఘటన గుర్తుకు వస్తుందన్నారు.

కోడి కత్తి డ్రామాలు కేసు పెట్టిన జగన్మోహన్ రెడ్డి, అసలు కోర్టుకే వెళ్లడం లేదని, అసలు తాను దాడినే చేయలేదని శ్రీను చెబుతున్నారని పేర్కొన్నారు. వైఎస్ వివేకానంద రెడ్డిని హత్య చేసి చంద్రబాబు నాయుడు అకౌంట్లో జమ చేయాలనుకున్నారని, కానీ ఆయన్ని హత్య చేసింది వైయస్ కుటుంబీకులేనని, అందులోనూ అత్యంత సన్నిహితుల సలహాలు సూచనల మేరకే చేశారని స్పష్టమవుతోంది అన్నారు.

విదేశీ నిధుల వెనుక ఎవరున్నారనేది నిగ్గు తేల్చాలి
ఆంధ్ర ప్రదేశ్ మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ( ఏపీ ఎండీ సీ ) పేరిట విదేశీ సంస్థ వద్ద జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం గ్యారెంటీని ఇచ్చి ఏడు వేల కోట్ల రూపాయల అప్పులను చేసిందని, ఈ విదేశీ రుణం వెనుక ఎవరున్నారనేది నిగ్గు తేల్చాలని రఘురామకృష్ణంరాజు డిమాండ్ చేశారు. ఏపిఎండిసికి అసలు అప్పు చేయాల్సిన అవసరమే లేదు. వారికి వచ్చేదంతా డబ్బే. ఎవరైతే గనులను తవ్వుకుంటారో వారి వద్ద నుంచి రాయల్టీ కింద ఏపీఎండిసి డబ్బులను వసూలు చేసుకుంటుందన్నారు. మైనింగ్ లైసెన్సుల జారీ ద్వారా కూడా ఆ సంస్థకు ఆదాయం సమకూరుతుందని పేర్కొన్నారు.

ఒక విదేశీ సంస్థ వద్ద నుంచి ఏపీఎండీసీ పేరిట జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం 7000 కోట్ల రూపాయల రుణాన్ని పొందిందని, రెండవ తేదీన మరో ఏడు వేల కోట్ల రూపాయలను రుణంగా పొందబోతుందని తెలిపారు. విదేశీ సంస్థల వద్ద రాష్ట్ర ప్రభుత్వం రుణం తీసుకోవాలంటే, కేంద్ర ప్రభుత్వ క్లియరెన్స్ అవసరం. అటువంటిది ఒక కార్పొరేషన్ పేరిట రాష్ట్ర ప్రభుత్వం గ్యారెంటీగా ఉంటూ అప్పులు చేయడం నిబంధనలను ఉల్లంఘించడమే కాకుండా, రాజ్యాంగ విరుద్ధమని రఘురామ కృష్ణంరాజు తెలిపారు.

రాష్ట్రంలో కొట్టేసిన డబ్బులను ఆఫ్రికా దేశాలకు తరలిస్తున్న ప్రభుత్వ పెద్దలు, అంత డబ్బు విదేశాలలో ఉంచడం సురక్షితం కాదని భావించి, విదేశీ సంస్థల రూపేనా రాష్ట్రాన్ని కొనేయాలని ఈ విధంగా చేస్తున్నారేమోనని అనుమానాన్ని వ్యక్తం చేశారు. గతంలో ఒక దేవుడి పేరు గలిగిన ఎలక్ట్రికల్ కంపెనీకి లక్షా 50 వేల ఎకరాల భూములను కట్టబెట్టారని గుర్తు చేశారు. ఆ కంపెనీ మూలధనం 500 కోట్ల రూపాయలు లేకపోయినప్పటికీ, రెండు లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులు పెడతారని పేర్కొన్న విషయం తెలిసిందేనని అన్నారు.

ఏపీ ఎండీసీ షేర్లను విదేశీ సంస్థ కు తాకట్టుపెట్టి, అప్పులు చేయడం ఆశ్చర్యంగా ఉందన్నారు. ఇదే విషయమై నేను గతంలో సీ ఏ జీ ( కాగ్ ), ప్రధానమంత్రి కార్యాలయానికి లేఖలు రాశానని గుర్తు చేశారు. అప్పులు చేసినా, సంక్షేమం కార్యక్రమాలను అమలు చేస్తున్న జగన్మోహన్ రెడ్డికి రఘురామకృష్ణం రాజు అడ్డుపడుతున్నారని, ఆయన వెనుక నారా చంద్రబాబు నాయుడు ఉన్నారని గతంలో సాక్షి పత్రికలో రాశారని, మళ్లీ ఇప్పుడు రాస్తారేమోనని అన్నారు. ఎంతో ఆదాయ వనరులు కలిగిన ఏపీఎండీసీ వంటి సంస్థ కు సీనియర్ ఐఏఎస్ అధికారిని నియమించాల్సి ఉండగా, పనికిమాలిన సర్వీసులకు చెందిన జూనియర్ రెడ్డి అధికారులను తెచ్చి జగన్మోహన్ రెడ్డి నియమించారన్నారు.

ఏపీఎండిసికి డైరెక్టర్ గా వెంకట్ రెడ్డి అనే వ్యక్తిని నియమించారని, అలాగే బేవరేజెస్ కార్పొరేషన్ కు వాసుదేవ రెడ్డి అనే రైల్వే సర్వీస్ కు చెందిన అధికారిని నియమించి 30 వేల కోట్ల రూపాయల అప్పులు చేశారన్నారు. వెంకట్ రెడ్డి, వాసు దేవ రెడ్డి లను ఏ ప్రాతిపదికన కీలకమైన శాఖల బాధ్యతలను అప్పగించావో చెప్పాలని జగన్మోహన్ రెడ్డిని ప్రశ్నిస్తున్నానని రఘురామ కృష్ణంరాజు తెలిపారు. ఎన్నికల సమయంలో ఏపీఎండిసికి 7వేల కోట్ల రూపాయల రుణాన్ని ఎవరైనా ఇస్తారా అంటూ ప్రశ్నించిన ఆయన, రాష్ట్రానికి ఇటీవల 25 టన్నుల డ్రగ్స్ దిగుమతి అయితే ఎవరూ మాట్లాడడం లేదన్నారు.

ఈ రుణం గురించైనా ఎవరైనా మాట్లాడుతారా అంటూ సందేహాన్ని వ్యక్తం చేశారు. మన బ్రతుకుల్ని డ్రగ్స్, మద్యం ద్వారా చిద్రం చేస్తూ, భావితరాల భవిష్యత్తును కార్పొరేషన్ల పేరిట రాష్ట్ర ప్రభుత్వ గ్యారంటీ గా ఉంటూ, రుణాలను తీసుకువచ్చి తాకట్టు పెడుతోన్న జగన్మోహన్ రెడ్డికి ఓట్లు వేయాలా అన్నది విజ్ఞులైన ప్రజలు ఒక్కసారి ఆలోచించాలని రఘురామకృష్ణం రాజు కోరారు.

పుసుక్కున నిజం చెప్పిన విజయసాయిరెడ్డి
వైకాపా రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి ఇటీవల టీవీ9 నిర్వహించిన క్రాస్ ఫైర్ కార్యక్రమంలో పుసుక్కున నిజం చెప్పారని రఘురామకృష్ణం రాజు తెలిపారు. మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్యకు గురైనట్లు తెల్లవారుజామునే పులివెందుల నుంచి తనకు ఒక విలేఖరి ఫోన్ చేశారని చెప్పారన్న ఆయన,అంతలోనే మాట మార్చి, వివేకా చనిపోయారని సదరు విలేఖరి పేర్కొన్నట్లుగా వెల్లడించారు. తాను పులివెందులకు ఫోన్ చేయగా గుండెపోటుతో మృతి చెందారని చెప్పడంతో నేను ఆ విషయాన్ని మీడియాకు వివరించానని విజయ సాయి వెల్లడించారని దానికి సంబంధించిన వీడియో క్లిప్పింగ్ రఘురామకృష్ణం రాజు మీడియా ప్రతినిధుల సమావేశంలో ప్రదర్శించారు.

ఈ విషయాన్ని అటు ప్రతిపక్షాలు, ఇటు మీడియా కూడా క్యాచ్ చేయలేదని తెలిపారు. వివేకానంద రెడ్డి హత్య చేయబడ్డారని, తెల్లవారుజామునే వారు, వీరు ఫోన్లో మాట్లాడుకున్నది నిజం. తెల్లవారుజామున 5:30 గంటలకు అజయ్ కల్లం రెడ్డికి బాబాయి చనిపోయారని జగన్మోహన్ రెడ్డి చెప్పింది నిజం. ఈ విషయాన్ని అజయ్ కల్లం రెడ్డి సిబిఐ అధికారులకిచ్చిన వాంగ్మూలంలో పేర్కొన్నారు. అందుకే ఆ కేసును ముందుకు సాగనివ్వడం లేదని చెప్పారు. వివేకాను వైయస్ కుటుంబమే, ఇంకా క్లోజ్ కుటుంబ సభ్యుల సలహాలు సూచనల మేరకే హత్య చేశారన్నారు.

కేసు కంటిన్యూ చేయాలని కోరుతున్న సునీత, విజయ సాయి చెప్పిన మాటలను దర్యాప్తు బృందం దృష్టికి తీసుకువెళ్లాలన్నారు. వైఎస్ వివేకాను హత్య చేశారన్నది నిజం, ఎందుకు హత్య చేశారో అందరికీ తెలుసునన్నారు. ఎవరు చేయించారో కూడా రాష్ట్ర ప్రజలకు తెలుసునని చెప్పారు. వైయస్ వివేకను హత్య చేసి, చంద్రబాబు నాయుడు అకౌంట్ లో ఖర్చుగా రాయడంలో గతంలో సక్సెస్ అయిన, ఇప్పుడు చెల్లెళ్ల రూపంలో ప్రాణాల మీదకు వచ్చిందన్నారు. షర్మిల మాట్లాడిన మాటలు హృదయ విదారకంగా ఉన్నాయని తెలిపారు.

ఇప్పుడు కొత్తగా వాళ్ళ మేనత్త క్యారెక్టర్ ను రంగంలోకి దించారు. వాళ్ళ అబ్బాయి పైనున్న చిట్ ఫండ్ కేసు ఆధారంగా బెదిరించి, జగన్మోహన్ రెడ్డి మాట్లాడిస్తున్నారని షర్మిల పేర్కొన్నారని గుర్తు చేశారు . వీళ్లు ఎంత నీచస్థితికైనా దిగజారుతారని, పిల్ల సజ్జల గ్యాంగ్ ప్రతిరోజు తనను ఐ వి ఆర్ ఎస్ ద్వారా రికార్డు చేసిన మెసేజ్లను పంపుతూ బండ బూతులు తిడుతున్నారని చెప్పారు. సొంత చెల్లెల్ని ఒకడు తిడితే, వాడిపై జగన్మోహన్ రెడ్డి ఎటువంటి చర్యలు తీసుకోలేదు సరి కదా… వైయస్సార్ బిడ్డని కాదని నన్ను నా తల్లిని అవమానించారని స్వయంగా షర్మిలే పేర్కొన్నారని గుర్తు చేశారు.

సొంత చెల్లెకు అన్న కాలేని జగన్మోహన్ రెడ్డి రాష్ట్రంలోని మహిళలకు అన్న ఎలా అవుతారని రఘురామ కృష్ణంరాజు ప్రశ్నించారు. సొంత తల్లికి కొడుకు కాలేని జగన్మోహన్ రెడ్డి రాష్ట్రంలోని అందరికీ బిడ్డ ఎలా అవుతారని, ఏ చెల్లికి నువ్వు అన్నవు కావు, ఏ తల్లికి బిడ్డవు కావని, నీ సొంత తల్లికి మాత్రమే కొడుకు అవుతావని… ఇకనైనా ఈ డ్రామాలను ఆపాలన్నారు.

జగన్ చెబుతున్న అబద్ధం నిజమని ప్రజలకు తెలియజేస్తున్నా
జగన్మోహన్ రెడ్డి తనపై హత్యాయత్నం జరిగిందని చెబుతున్న అబద్ధాన్ని నిజమని నేను ప్రజలకు తెలియజేస్తున్నానని రఘురామకృష్ణంరాజు వివరించారు. గతంలో నన్ను కిడ్నాప్ చేసి లాకప్ లో చిత్రహింసలకు గురి చేసిన తరువాత, నా సహచర పార్లమెంట్ సభ్యులకు జగన్మోహన్ రెడ్డి ఫోన్ చేసి అది అబద్ధమని చెప్పారన్నారు. జగన్మోహన్ రెడ్డి నిజాన్ని అబద్ధమని చెప్పినప్పుడు, నేను జగన్మోహన్ రెడ్డి చెబుతున్న అబద్ధం లోని నిజాన్ని ప్రజలకు తెలియజేస్తున్నానని తెలిపారు .

జగన్మోహన్ రెడ్డి మోసాల గురించి మాట్లాడే అర్హత నాకు, చంద్రబాబు నాయుడుకు మాత్రమే ఉన్నదని చెప్పారు. చంద్రబాబు నాయుడు ఎంతో పరిణితి చెందిన నాయకులు. ఈ దాడి ఘటనపై రాజకీయాలలో ఇటువంటి సంఘటనలకు తావు లేదని ఆయన ఎంతో గొప్పగా చెప్పారు. నేను ఆయన అంత గొప్ప వ్యక్తిని కాదు. జగన్మోహన్ రెడ్డి ఒక నిజాన్ని అబద్ధమని ప్రచారం చేశారు. నేను ఇప్పుడు ఆయన ఆడిన డ్రామా నిజమని చెబుతున్నానన్నారు.

22వ తేదీన నామినేషన్ దాఖలు
ఈనెల 22వ తేదీన నామినేషన్ దాఖలు చేస్తున్నట్లు రఘురామకృష్ణం రాజు తెలిపారు. 22వ తేదీ ఉదయం 11 నుంచి 11:30 గంటల మధ్య నామినేషన్ దాఖలు చేస్తానన్న ఆయన, ఈ కార్యక్రమానికి తన అభిమానులు సన్నిహితులు మాత్రమే హాజరవుతారని, రాష్ట్ర స్థాయి నాయకులు ఎవరూ హాజరు కావడం లేదని చెప్పారు. ఎవరి నామినేషన్ దాఖలు కార్యక్రమంలో వారు బిజీగా ఉంటారని, అందుకే ఎవరిని ఆహ్వానించడం లేదన్నారు. ఎంపీ గానా ఎమ్మెల్యే గానా పోటీ చేసేది అన్నదానిపై ఒకటి రెండు రోజుల వ్యవధిలో స్పష్టత వస్తుందని పేర్కొన్నారు. ఇక నిరాహార దీక్షల పై, జూదరులు అంటూ నేను చేసిన వ్యాఖ్యలను వెనక్కి తీసుకుంటున్నానని చెప్పారు

Leave a Reply