అమరావతి : స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో టీడీపీ అధినేత చంద్రబాబు కు హైకోర్టు బెయిల్ మంజూరు చేయడంపై ఏపీ సీఐడీ సుప్రీంకోర్టును ఆశ్రయించింది. బెయిల్ మంజూరు చేస్తూ హైకోర్టు ఇచ్చిన తీర్పును సీఐడీ సుప్రీంలో సవాల్ చేస్తూ పిటిషన్ దాఖలు చేసింది. నైపుణ్యాభివృద్ధి సంస్థ కేసులో చంద్రబాబుకు సోమవారం హైకోర్టు బెయిలు మంజూరు చేసింది. చంద్రబాబు, టీడీపీ ఖాతాలకు నిధులను మళ్లించారనేందుకు సీఐడీ ఎలాంటి ప్రాథమిక ఆధారాలూ సమర్పించలేకపోయిందని హైకోర్టు తేల్చిచెప్పింది.
ఇలాంటి తీవ్రమైన ఆరోపణలు చేస్తున్నప్పుడు చంద్రబాబుకు రిమాండ్ విధించాలని అభ్యర్థించక ముందే తగిన ఆధారాలను సేకరించి ఉండాల్సిందని అభిప్రాయపడింది. నిధులు టీడీపీ ఖాతాలోకి చేరాయనేందుకు దర్యాప్తు సంస్థ (సీఐడీ) వద్ద ఆధారాలేవీ లేవని స్పష్టం చేసింది. ఈ విషయాన్ని దర్యాప్తు లోపంగా భావిస్తున్నామని పేర్కొంది. ఇప్పటికే సుప్రీంకోర్టులో చంద్రబాబు క్వాష్ పిటిషన్‌పై తీర్పు పెండింగ్‌లో ఉన్న విషయం తెలిసిందే.