Suryaa.co.in

National

హస్తినవాసుల ఆయువు తగ్గుతోందట!

-ఐదేళ్ల ఆయువు తల్ల‘ఢిల్లీ’

-దేశ రాజధాని ప్రజలను కాలుష్యం మింగేస్తోంది. వాయు కాలుష్యంతో వారి ఆయువు అక్షరాలా అయిదేళ్లు తగ్గిపోతోందట. నిజంగా ఇది నిఝం. కావాలంటే మీరే చూడండి.

వాయుకాలుష్యం (Air Pollution) కారణంగా ప్రపంచ వ్యాప్తంగా ప్రతిఏటా లక్షల మంది ప్రాణాలు కోల్పోతున్నట్లు అంతర్జాతీయ నివేదికలు వెల్లడిస్తోన్న సంగతి తెలిసిందే.ఇదే సమయంలో రానున్న రోజుల్లో ప్రజా ఆరోగ్యానికి ఇది పెను ముప్పుగా పరిణమించనుందని తాజా అధ్యయనం వెల్లడించింది. ఈ విషపూరితమైన కాలుష్యం భారత ప్రజల్లో ఐదేళ్ల జీవితకాలాన్ని (Life Expectancy) తగ్గిస్తోందని యూనివర్సిటీ ఆఫ్‌ షికాగోలోని ఎనర్జీ పాలసీ ఇన్‌స్టిట్యూట్‌ అధ్యయనం పేర్కొంది. దేశ రాజధాని దిల్లీలో మాత్రం కాలుష్యం కారణంగా మానవ జీవితకాలం పదేళ్లు తగ్గిపోతున్నట్లు అంచనా వేసింది. ఇక దేశంలో అత్యంత కాలుష్య రాష్ట్రాల్లో ఉత్తర్‌ప్రదేశ్‌, బిహార్‌, హరియాణా, త్రిపుర రాష్ట్రాలు ముందువరుసలో ఉన్నాయని ఎయిర్‌ క్వాలిటీ లైఫ్‌ ఇండెక్స్‌ (AQLI) నివేదిక తెలిపింది.

దక్షిణాసియా దేశాలు తీవ్ర కాలుష్య భూతాన్ని ఎదుర్కొంటున్నాయని తాజా నివేదిక పేర్కొంది. ప్రపంచంలోనే అత్యంత కాలుష్య దేశాల్లో భారత్‌, పాకిస్థాన్‌, బంగ్లాదేశ్‌, నేపాల్‌లు అగ్ర స్థానాల్లో ఉన్నట్లు వెల్లడించింది. తొలిస్థానంలో బంగ్లాదేశ్‌ ఉండగా.. భారత్‌ రెండో స్థానంలో ఉంది. కేవలం కాలుష్యం కారణంగా బంగ్లాదేశ్‌లో 2020లో ప్రజల జీవనకాలం 6.9 సంవత్సరాలు తగ్గిపోయింది. ప్రపంచ సగటు 2.2 ఏళ్లతో పోలిస్తే భారత్‌లో ఐదేళ్ల జీవితకాలం తగ్గిపోనుంది. ఇక భారత్‌ పొరుగు దేశాలైన నేపాల్‌, పాకిస్థాన్‌లు కూడా కాలుష్యంతో అల్లాడిపోతున్నాయి. వీటివల్ల నేపాల్‌లో 4.1 సంవత్సరాలు, పాకిస్థాన్‌లో 3.8ఏళ్ల జీవిత కాలం తగ్గుతోంది. ఇక చైనా విషయానికొస్తే.. కాలుష్యం వల్ల 2.5ఏళ్ల ఆయుర్దాయాన్ని కోల్పోయే స్థితిలో ఉన్నప్పటికీ 2013 నుంచి అక్కడ వాయు కాలుష్యం తగ్గుముఖం పట్టడంతో రెండేళ్ల కాలం పుంజుకున్నట్లు తాజా నివేదిక పేర్కొంది.

ఇక భారత్‌లో పొగ పీల్చడం (Smoking) కంటే వాయుకాలుష్యమే (Air Pollution) అత్యంత ప్రాణాంతకంగా మారుతోందని తాజా నివేదిక హెచ్చరించింది. ముఖ్యంగా చిన్నారులు, పోషకాహారలోపంతో బాధపడుతోన్న వారికి 1.8 ఏళ్ల జీవిత కాలాన్ని తగ్గిస్తోంది. ఈ కాలుష్య తీవ్రత ఇదేవిధంగా కొనసాగితే గంగా, బ్రహ్మపుత్ర, సింధూ నదుల పరివాహక ప్రాంతాల్లో నివసించే దాదాపు యాభై కోట్ల ప్రజల ఆయుర్దాయం 7.6 సంవత్సరాలు తగ్గిపోనుందని తాజా నివేదిక అంచనా వేసింది. ముఖ్యంగా లఖ్‌నవూ ప్రజలు 9.5ఏళ్ల జీవిత కాలాన్ని కోల్పోయే ప్రమాదముందని హెచ్చరించింది.

గడిచిన రెండు దశాబ్దాల్లో వాహనాల రద్దీ, బొగ్గు విద్యుత్‌ ఉత్పత్తి కేంద్రాలు మూడు, నాలుగు రెట్లు పెరిగాయి. వీటికితోడు పంటల వ్యర్థాలు కాల్చడం, ఇటుక బట్టీలతో పాటు పారిశ్రామిక కార్యకలాపాలు పెరగడంతో దేశంలో వాయుకాలుష్యం భారీగా పెరుగుతోంది. దీంతో గాలిలో అత్యంత ప్రమాదకరమైన పీఎం2.5 స్థాయిలు విపరీతంగా పెరిగిపోతున్నాయి. ముఖ్యంగా 2013-2020 మధ్యకాలంలో ప్రపంచవ్యాప్తంగా పెరిగిన వాయుకాలుష్యంలో 44శాతం భారత్‌ నుంచే ఉన్నట్లు ఎయిర్‌ క్వాలిటీ లైఫ్‌ ఇండెక్స్‌ (AQLI) డైరెక్టర్‌ డాక్టర్‌ క్రిస్టా హాసెన్‌కోఫ్‌ పేర్కొన్నారు.

LEAVE A RESPONSE