ఉచిత కరెంటు రావడం లేదు.. జనరేటర్ల వ్యాపారం పెరిగింది.. కాంగ్రెస్ తెచ్చిన మార్పు ఇదే

– వందరోజుల్లో హామీలు నెరవేర్చకపతే కర్రు కాల్చి వాతపెడతారు
– 2 రెండు లక్షల రుణమాఫీ చేయకుండా పార్లమెంటు ఎన్నికలకు వెళ్తే ఓటు చేయరు
– మెదక్ అసెంబ్లీ నియోజకవర్గ బీఆర్ఎస్ కార్యకర్తల సమావేశంలో పాల్గొన్న మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీష్ రావు

జ్వరం వచ్చినా మెదక్ మీటింగ్ కదా అని ఓపిక చేసుకుని వచ్చాను.మెదక్ పార్లమెంటులోని 7 అసెంబ్లీల్లో 6 చోట్ల మనమే గెలిచారు. స్వల్పఓట్ల తేడాతోనే పద్మమ్మ ఓడిపోయింది. ఏది జరిగినా మన మంచిదే.. ఇప్పుడు చూస్తుంటే అర్థమవుతోంది. ప్రజలు ఆలోచిస్తున్నారు. ఏవి పాలో, ఏవి నీళ్లో తేలిపోయింది. బడ్జెట్ లేదని తెలిసినా కాంగ్రెస్ ప్రజలను ఆశపెట్టి మోసం చేసింది. కర్ణాటకలో 5 గ్యారంటీలతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ 8 నెలలు దాటినా హామీలను అమలు చేయలేదు.

పార్లమెంటు ఎన్నికల్లో ఆ పార్టీ గెలిచే సరిస్థితి లేదని అక్కడి ప్రజలు చెప్పారు. ఆరు నెలల దాటితే స్థానిక ఎన్నికలు వస్తాయి. ప్రజలే మనల్ని వెతుక్కుని మరీ ఓటు వేస్తారు. ఉచిత కరెంటు రావడం లేదు. మోటర్లు, ట్రాన్స్ ఫార్మర్లు కాలిపోతున్నాయి. కరెంట్ మోటార్లను రిపేర్ చేసే వ్యాపారం పెరిగింది. జనరేటర్ల వ్యాపారం పెరిగింది. కాంగ్రెస్ తెచ్చిన మార్పు ఇదే.

రేవంత్‌కు సీఎం కుర్చీ కేసీఆర్ బెట్టిన భిక్ష. పదవి వస్తే బాధ్యత పెరగాలి. కానీ రేవంత్ సీఎం పదవిని కించపరుస్తున్నారు. కాంగ్రెస్ ప్రచారంలో అబద్ధాలు, పాలనలో అసమర్థత. పాలించడం చేతగాక ప్రతిపక్షాలను వేధిస్తున్నారు. కాంగ్రెస్ ఇచ్చిన హామీలనే అమలు చేయాలని కోరుతుంటే అసహనంతో దాడులు చేస్తున్నారు. కేసులుపెట్టి బెదిరిస్తున్నారు. మేం కేసులు పెట్టివుంటే సగం మంది కాంగ్రెస్ వాళ్లు జైళ్లలో ఉండేవారు.

రైతుబంధు 15 వేలకు పెంచలేదు. పదివేలు కూడా సరిగ్గా రావడం లేదు. 2లక్షల రైతు రుణమాఫీ చేయలేదు. పింఛన్ 4 వేలు పెరగలేదు. వడ్లకు బోనస్ పెరగలేదు. అక్కాచెల్లెళ్లకు 2500 రాలేదు. అధికారంలోకి వచ్చి రెండు నెలలైనా పింఛన్ పెంచలేదు. పింఛన్ పెంచడానికి ఏ ప్రక్రియ కూడా అసరం లేకపోయినా ఎందుకు పెంచడం లేదు? వందరోజుల్లో హామీలు నెరవేర్చకపతే కర్రు కాల్చి వాతపెడతారు. 2 రెండు లక్షల రుణమాఫీ చేయకుండా పార్లమెంటు ఎన్నికలకు వెళ్తే ఓటు చేయరు.

పార్లమెంటు ఎన్నికల కోడ్ రాకముందే కాంగ్రెస్ హామీలను నిలబెట్టుకుని చిత్తశుద్ధి నిరూపించుకోవాలి.మేం ఎన్నికల మేనిఫెస్టోలో ఇవ్వని హామీలను కూడా అమలుచేశాం. కాళేశ్వరం నీళ్లు తెచ్చి రైతుల కాళ్ళు కడిగాం.ఇంటింటికి మంచినీళ్లు, 11 లక్షలమంది ఆడబిడ్డలకు కల్యాణ లక్ష్మి, రైతు బంధు హామీలను ఎన్నికల్లో ఇవ్వకపోయినా అమలు చేశాం. కరోనా కష్ట సమయంలో సైతం ప్రభుత్వం దగ్గర పైసల్లేకపోయినా బిల్లులు, ఎమ్మెల్యల జీతాలు ఆపి రైతుంబంధు ఇచ్చాం. ఇప్పుడు ఏ సమస్యా లేకపోయినా కాంగ్రెస్ ఎందుకు ఇవ్వడం లేదు?

రేవత్ పాలనను కేసీఆర్ పాలనతో పోల్చి చర్చలు పెట్టండి. కాంగ్రెస్ దళితబంధు పక్కన పెట్టింది. గొల్లకుర్మలకు గొర్రెలు ఇవ్వడం లేదు, 2 లక్షల సాయం కూడా అందలేదు. కేసీఆర్ ప్రారంభించిన పనులను అడ్డుకుంటున్నారు. వచ్చిన నిధులను వెనక్కి పంపుతున్నారు. ఇదేనా అభివృద్ధి? భవిష్యత్ మనదే. పార్లమెంటు ఎన్నికల్లో కష్టపడి పనిచేసి మెదక్‌లో భారీగా ఓట్లు వేయిద్దాం. పద్మమ్మ ఓడిపోయినా ప్రజలకు అందుబాటులో ఉంటున్నారు. మనం చేసిన మంచి పనులను ప్రచారం చేసుకోలేకపోయాం.

కాంగ్రెస్ హామీలపై చర్చ పెట్టాలి. ఇచ్చిన హామీలు అమలు చేసేదాక ప్రభుత్వం మెడలు వంచుతాం. అసెంబ్లీలో ప్రజల పక్షాన కొట్లాడుతాం. కార్యకర్తలు అధైర్యపడొద్దు. పార్టీ మీకు అండగా ఉంటుంది. చీకటి తర్వాత వెలుగు వస్తుంది. ఓటమి తర్వాత గెలుపు దక్కుతుంది. మెదక్‌లో గులాబీ జెండా ఎగరేస్తాం.

Leave a Reply