-
పీఎస్సార్, రాణా, గున్నీపై సస్పెన్షన్ వేటు
-
సస్పెండ్ చేస్తూ సర్కారు నిర్ణయం
-
జిత్వానీ కేసులో కీలక మలుపు
-
ఐపిఎస్ సునీల్‌పై గత జులైలోనే ఎఫ్‌ఐఆర్
-
పారిపోయిన విజయపాల్‌ను పట్టుకోలేని పోలీసులు
-
ఇంతవరకూ సస్పెండ్ చేయని వైనంపై టీడీపీ సోల్జర్స్ అసంతృప్తి
-
అప్పటి మరో ఏడీసీపీని వదిలేయడంపై విస్మయం
-
జిత్వానీ కేసుతోపాటు, బోండాపై అక్రమ కేసుకు యత్నం
-
జగన్‌పై రాళ్ల కేసుపై బాబును ఇరికించే యత్నం
-
ఆ అధికారిని వదిలేయడంపై పోలీసు వర్గాల్లో ఆశ్చర్యం
(మార్తి సుబ్రహ్మణ్యం)
ముంబయి నటి కాదంబరి జిత్వానీ కుటుంబసభ్యులను తీసుకువచ్చి.. వారిని వేధించి జైలుకు పంపించేందు కారణమైన ముగ్గురు ఐపిఎస్ అధికారులపై కూటమి సర్కారు ఎట్టకేలకు వేటు వేసింది. నాటి నిఘా దళపతి పీఎస్సార్ ఆంజనేయులు, విజయవాడ సీపీ కాంతిరాణా, డీసీపీ విశాల్ గున్నీలను సస్పెండ్ చేస్తూ ప్రభుత్వం ఆదివారం ఉత్తర్వులు జారీ చేయడం సంచలనం సృష్టించింది.
రెండురోజుల క్రితమే ముంబయి నుంచి వచ్చిన జిత్వానీ, ఆ ముగ్గురు అధికారులపై ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. అయితే చంద్రబాబునాయుడు ప్రభుత్వం వారిపై ఇంత వేగంగా చర్యలు తీసుకుంటుందని ఎవరూ ఊహించలేదు. నిజానికి డీజీపీ ద్వారకా తిరుమలరావు ఈ కేసుపై ప్రభుత్వానికి నివేదిక ఇచ్చి.. ముందు తన స్థాయిలో ఇబ్రహీంపట్నం సీఐ సత్యనారాయణ, ఏసీపీ హన్మంతరావును సస్పెండ్ చేశారు. దానితో ప్రభుత్వం కూడా డీజీపీ నివేదిక ప్రకారం ముగ్గురు ఐపిఎస్‌లను సస్పెండ్ చేసింది.
తాజా పరిణామాలు కూటమి శ్రేణుల సంతృప్తికి కారణమయ్యాయి. సాయంత్రం నుంచి టీడీపీ సోషల్‌మీడియా గ్రూపులలో, చంద్రబాబు తీసుకున్న ఈ సంచలన నిర్ణయంపై హర్షం వ్యక్తమవుతోంది. జగన్ జమానాలో ఆ పార్టీ కార్యకర్తలుగా పనిచేసిన పోలీసు అధికారులపై చర్యలు తీసుకోవడంలో, బాబు ప్రభుత్వం భయపడుతోదంటూ.. ఇదే సోషల్‌మీడియా సైనికులు అసంతృప్తి వ్యక్తం చేస్తూ వచ్చారు. అయితే వారిని సస్పెండ్ చేయడంతో, శభాష్ బాబూ అని కితాబులిచ్చే వారి సంఖ్య వేలకు చేరడం ప్రస్తావనార్హం.
ఉండి ఎమ్మెల్యే, నాటి ఎంపి రఘురామకృష్ణంరాజును హైదరాబాద్ నుంచి చెరబట్టి, గుంటూరుకు తీసుకువచ్చి ఆయనపై థర్డ్ డిగ్రీ ప్రయోగించిన వ్యవహారంలో.. కీలకపాత్ర పోషించిన ఐపిఎస్ అధికారి సునీల్‌పై కేసు రెండునెలల క్రితమే నమోదయింది. తనను ఐపిఎస్ సునీల్‌తోపాటు అప్పటి పోలీసు అధికారి విజయ్‌పాల్ ధర్డ్‌డిగ్రీ ప్రయోగించి హత్యాయత్నం చేశారంటూ రఘరామజు జూన్ 11న గుంటూరు పోలీసులకు ఫిర్యాదు చేశారు. అది జులై 11వ తేదీ నాటికి గానీ ఎఫ్‌ఐఆర్ నమోదు కాలేదు.
ఇప్పటికిమూడునెలలయినా కేసులో పురోగతి లేకపోగా.. నిందితుడిగా ఉన్న విజయపాల్ పరారీలో ఉండటం విశేషం. ఇప్పటిదాకా సునీల్‌ను సస్పెండ్ చేయకపోవడంపై, టీడీపీ సోషల్‌మీడియా సైనికులు భగ్గుమంటున్నారు. ఎఫ్‌ఐఆర్ నమోదైన నిందితుడే ఐపిఎస్ అధికారయితే.. ఆయనను సస్పెండ్ చేయకుండా, ఆయన కింద స్థాయి అధికారి ఏవిధంగా స్వేచ్ఛగా విచారించగలరన్న ప్రశ్నలు వెల్లువెత్తుతున్నాయి. జిత్వానీ కంటే ముందే ఫిర్యాదు చేసిన రఘురామకృష్ణంరాజు కేసులో నిందితుడైన సునీల్‌ను వదిలేయటం ఏమిటన్న ప్రశ్నల వర్షం కురుస్తోంది. రెడ్‌బుక్ ఏమైంది? అంటూ టీడీపీ సోల్జర్స్ విమర్శల వర్షం కురిపిస్తున్నారు.
‘జిత్వానీ ఫిర్యాదు చేసిన 24 గంటల్లో ముగ్గురు ఐపిఎస్‌లను సస్పెండ్ చేయడం గొప్ప విషయమే. ఇది కార్యకర్తల్లో పార్టీపై నమ్మకం పెంచే చర్యనే. మరి ఇంకో ఐపిఎస్ సునీల్‌పై రెండునెలలక్రితమే ఫిర్యాదు చేసి, ఆయనపై ఎఫ్‌ఐఆర్ నమోదైనా సునీల్ ఎందుకు సస్పెండ్ చేయలేదు? ఎఫ్‌ఐఆర్ నమోదైన అధికారులందరినీ ప్రభుత్వం అదేవిధంగా సస్పెండ్ చేయకుండా కొనసాగిస్తుందా?’’ అంటూ నెటిజన్లు ప్రశ్నలవర్షం సంధిస్తున్నారు.
జగన్‌కు ఉన్న ధైర్యం బాబుకు లేదని, డీజీపీ ఏబీ వెంకటేశ్వరరావుకు రిటైర్మెంట్ చివరిరోజువరకూ పోస్టింగ్ ఇవ్వలేదని గుర్తు చేస్తూ.. అంత దమ్ము చంద్రబాబుకు లేదని ఇప్పటిదాకా కన్నెర్ర చేస్తూ వచ్చారు. ‘‘జగన్‌ను ధైర్యంగా ఎదిరించిన ఏబీకి ఇప్పటిదాకా న్యాయం చేయలేదు. అదే జగన్ అయితే ఏబీలాంటి వారిని పిలిచి పెద్దపీట వేసేవారు. అదీ జగన్-బాబుకు తేడా అంటూ కామెంట్లు కురిపిస్తూ వస్తున్నారు. అయితే ఒక్కసారిగా ముగ్గురు ఐపిఎస్‌లను సస్పెండ్ చేయడం, వారిని సంతృప్తిపరిచినట్టయింది. దానితో చంద్రబాబు ధైర్యాన్ని, డీజీపీ నిర్ణయాన్ని తెగ మెచ్చుకుంటూ ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.
అయితే.. ఇదే కేసులో చురుకైన పాత్ర పోషించిన, నాటి అడిషనల్ డీ సీపీని విడిచిపెట్టడంపై టీడీపీ కార్యకర్తల్లో విస్మయం వ్యక్తమవుతోంది. సదరు అధికారి ఎన్నికల ముందు, విజయవాడలో జగన్‌పై జరిగిన గులకరాయి కేసులో.. ఇప్పటి ఎమ్మెల్యే బోండా ఉమపై కేసు పెట్టి అరెస్టు చేసేందుకు అత్యుత్సాహం ప్రదర్శించారని టీడీపీ నేతలు గర్తు చేస్తున్నారు.
అసలు చంద్రబాబునాయుడు రెచ్చగొట్టడం వల్ల, ఆయన మాటలకు ప్రభావితమైన దుండగులు జగన్‌పై రాళ్ల దాడితో హత్యాయత్నానికి ప్రయత్నించారన్న బిల్డప్ ఇచ్చారని టీడీపీ నేతలు చెబుతున్నారు. అలాంటి అధికారి జిత్వానీ కేసులోనూ చురుకైన పాత్ర పోషించినప్పటికీ, ఆయనపై మాత్రం చర్యలు తీసుకోకపోవడం ఏమిటన్న ప్రశ్నలు వినిపిస్తున్నాయి. సదరు అధికారి ఇప్పుడు అమరావతి జిల్లాలో అడిషనల్ ఎస్పీగా పనిచేస్తున్నారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.
కాగా విచారణ ఇంకా పూర్తి కానందున, అందరిపై ఒకే సారి చర్యలు తీసుకోవడం కష్టమని పోలీసు వర్గాలు చెబుతున్నాయి. బహుశా జిత్వానీ కేసులో, సదరు అధికారిని సాక్షిగా చూపించే అవకాశం ఉందంటున్నారు.