Suryaa.co.in

Editorial

నవ్విపోదురుగాక.. నాకేటి సిగ్గు!

– కొమ్మినేని అరెస్టుపై సుద్దపూసల ప్రజాస్వామ్య-పాత్రికేయ ప్రవచనాలు
– గతం మరచి వైకాపేయుల గావుకేకలు
– వారెంటు, ఎఫ్‌ఐఆర్‌లపై సూక్తిముక్తావళి
– అప్పుడు చంద్రబాబు, అయ్యన్నపాత్రుడు, అంకబాబు, రంగనాయకమ్మ వయసు గుర్తురాలేదా?
– బాబు, రఘురామకృష్ణంరాజుకు వారంట్ ఇచ్చే అరెస్టు చేశారా?
– నాడు నవరంధ్రాలూ మూసుకుని ఇప్పుడు గావుకేకలెందుకు?
– బాబు వంటి వృద్ధుడిని అరెస్టు చేసినప్పుడు నాడు ఏపీయుడబ్ల్యుజె ఇలాగే గొంతెత్తలేదేం?

( మార్తి సుబహ్మణ్యం)

‘‘మేధావులు, ప్రజాస్వామ్యవాదులను భయకంపితులను చేస్తున్నారు. 70 ఏళ్ల వృద్ధుడైన సీనియర్ జర్నలిస్టు కొమ్మినేని అరెస్టు విష సంస్కృతికి పరాకాష్ఠ. సహజంగా ఒక డిబేట్ జరిగేటప్పుడు వక్తలు మాట్లాడే మాటలకు యాంకర్‌కు ఏం సంబంధం?

– వైసీపీ అధినేత, మాజీ సీఎం జగన్ ఉవాచ

‘‘ 70 ఏళ్ల వయసులో కొమ్మినేనిని వేధించడం సరికాదు. మీడియాను కూటమి ప్రభుత్వం శత్రువుగా చూస్తోంది’’

– ఏపీ మాజీ సలహాదారు, జర్నలిస్టు సంఘం నాయకుడు దేవులపల్లి అమర్ ఆవేదన

‘‘ సాక్షి కార్యాలయాలపై దాడులు తగవు. కొమ్మినేని తన షోలో జరిగిన పొరపాటుకు క్షమాపణ చెప్పినందున ఆయన సీనియారిటీ,వయసును దృష్టిలో ఉంచుకుని కొమ్మినేనిపై తదుపరి చర్యలు నిలిపివేయాలి’’

– ఏపీయుడబ్ల్యుజె, ఐజెయు లౌక్యం
* * *
కాకి నలుపు గురించి మాట్లాడటం.. ద య్యాలు వేదాలు వల్లించడం.. రాక్షసులు శాంతిహోమం చేయడం.. రక్తం రుచిమరిగిన పులి శాఖాహారిగా మారడం.. వంద ఎలుకలను తిన్న పిల్లి తీర్ధయాత్రలకు వెళితే ఎలా ఉంటుందో.. కొమ్మినేని శ్రీనివాసరావు అనే యాంకర్ అరె స్టుపై, ఈ మూక స్పందనలూ అంతే చక్కదనంతో ఉన్నాయన్నది నిష్ఠుర నిజం.

అమరావతిని వేశ్యల రాజధానితో పోల్చిన వ్యవహారంలో సాక్షి యాంకర్ కొమ్మినేని శ్రీనివాసరావు అనే వృద్ధుడిని అరెస్టు చేయడం అన్యాయం, అక్రమం, దుర్మార్గమట. చేతిలో కర్ర, పట్టుకోవడానికి సహాయకుడు లేకపోతే తప్ప నడవలేని ఈ ‘వృద్ధ జర్నలిసు’్టను అరెస్టు చేయడం దారుణమని, వైకాపేయులు తెగ బాధపడుతున్నారు. రాష్ట్రంలో పాత్రికేయ ప్రమాణాలు పడిపోతున్నాయని, జర్నలిస్టులకు భద్రత లేకుండా పోయిందన్నది వారి ఆవేదన.

వృద్ధనారీ పతివ్రత అని చిన్నప్పుడు చదివిన గుర్తు. ఇప్పుడు వైకాపేయుల గావుకేకలు, గ త్తర చూస్తుంటే అది నిజమనిపించ మానదు. జగన్ జమానాలో పాత్రికేయులను ‘పువ్వుల్లో పెటి’్ట చూసుకున్న వైకాపేయులు, ఇప్పుడు ఇలాంటివి జరగడం ఎప్పుడూ జరగలేదని వాపోవడం వింతల్లో వింత.

అసలు ఇప్పుడు కొమ్మినేని వృద్ధుడన్న కారణంగా అరెస్టు చేయడం అన్యాయమంటున్నారా? లేక అమరావతిలో నివసించే మహిళలను పరోక్షంగా వ్యభిచారులని కృష్ణంరాజు అనే వ్యక్తితో చెప్పించిన కారణంగా అరెస్టు చేసినందుకు వ్యతిరేకిస్తున్నారా? అన్నదే ప్రశ్న. జగన్ నుంచి సజ్జల వరకూ, కొమ్మినేనిని ‘పెన్షన్ తీసుకునే వృద్దుడి’గానే డిక్లేర్ చేశారు కాబట్టి.. కాసేపు ఆ వాదననే నిజమనుకుందాం.

జగన్ జమానాలో ఓ వాట్సాప్‌లో వచ్చిన ఓ పోస్టింగ్‌ను ఫార్వార్డ్ చేసిన 75 ఏళ్ల సీనియర్ జర్నలిస్టు కొల్లు అంకబాబును, లుంగీ మీదనే చెరపట్టి తీసుకువెళ్లిన వైనం మర్చిపోతే ఎలా? మరి ఆయనకు వారెంటు గట్రాలేమైనా చూపించారా? లేదు కదా?! పోనీ అంకబాబు… సాక్షి ‘దంతా’క్షరుడి లెక్క , హనుమాన్‌జంక్షన్‌లో బర్రెలు కాచుకుని జర్నలిజం లోకి వచ్చిన జర్నలిస్టుకాదు. హనుమాన్‌జంక్షన్ కొమ్మినేని నుంచి.. జస్టిస్ ఎన్వీరమణ, సీఐడీ మాజీ చీఫ్ పివి సునీల్ వంటి ప్రముఖులు అంకబాబు దగ్గర పనిచేసిన ప్రముఖులే.

ఈనాడు, ఉదయం వంటి దిగ్గజ పత్రికలను వెలిగించిన లబ్థప్రతిష్ఠుడైన సీనియర్ జర్నలిస్టు. మరి కోర్టుకు హాజరుపరిచిన రెండుగంటలముందు అంకబాబు అరెస్టు చూపిన జగన్ జమానా స్వర్ణయుగమా? టీవీ 5 మూర్తిని మూడురోజులపాటు పోలీసుస్టేషన్ చుట్టూ తిప్పిన జగనన్న హయాం రామరాజ్యమా? దిగ్రేట్ వీరవిప్లర జర్నలిస్టు నేత దేవులపల్లి అమర్, జర్నలిజం విలువల గురించి ఉపన్యాసాలిచ్చే సజ్జల గారే సెలవివ్వాలి.

‘‘సహజంగా ఒక డిబేట్ జరిగేటప్పుడు వక్తలు మాట్లాడే మాటలకు యాంకర్‌కు ఏం సంబంధం?’’ అని స్వాతిముత్యం కమలహన్ మాదిరిగా అమాయకంగా అడిగిన జగన్..మరి తన జమానాలో రఘురామకృష్ణంరాజుతో డిబేట్ చేసినందుకు టివి 5 యజమాని బీఆర్‌నాయుడు, ఆ డిబేట్ నిర్వహించిన యాంకర్ దేవగుప్తాపు మూర్తిపై రాజద్రోహం పెట్టడం కరె క్టేనా? అప్పుడు కేవలం డిబేట్ నిర్వహించినందుకే టివి5పై రాజద్రోహం పెడితే, ఇప్పుడు అమరావతిలోని మహిళలను వేశ్యలుగా అభివర్ణించేందుకు కారణమైన కొమ్మినేని డిబేట్‌పై.. ఎన్ని రాజద్రోహం కేసులు పెట్టాలని ప్రశ్నిస్తే, జగన్ తల ఎక్కడపెట్టుకుంటారన్నది బుద్ధిజీవుల ప్రశ్న. నాడు వారిపై కేసు సక్రమమైతే, నేటి సాక్షి ‘దంతా’క్షరుడిపై కేసు కూడా సక్రమమే కదా? కాదంటారా?!

తనను అరెస్టు చేసే సమయంలో వారెంటు కూడా చూపలేదన్నది పోలీసు చర్యతో ‘నల్ల’బోయిన కొమ్మినేని వారి ఆవేదన. ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షిలో పెద్ద పదవులు వెలగబెట్టిన కొమ్మినేని, మరీ అంత అమాయకత్వంగా ప్రశ్నించడమే అమాయకత్వం!

జగన్ జమానాలో విపక్ష నేత చంద్రబాబునాయుడు, రఘురామకృంరాజు, హనుమాన్ జంక్షన్‌లో పశుసేవలో ఉన్న తనను జర్నలిజం లోకి తీసుకువచ్చిన సీనియర్ జర్నలిస్టు కొల్లు అంకబాబు, వృద్ధురాలైన రంగనాయకమ్మను కూడా ఎలాంటి వారెంటు, ఎఫ్‌ఐఆర్ లేకుండానే తన జగన్నాధుడి ‘ప్రజాస్వామ్య ప్రభుత్వం’ చెరబట్టి.. చెరసాల పాలు చేసిన విషయం విస్మరించడమే వింత.

ఇక కొమ్మినేని క్షమాపణ కోరారు కాబట్టి ఆయన వయసు, సీనియారిటీని దృష్టిలో ఉంచుకుని, ఆయనపై తదుపరి చర్యలు నిలిపివేయాలని జర్నలిస్టుల పెద్దమ్మ ఏపీయుడబ్ల్యుజె, ఐజెయు సంఘ నేతలు సెలవివ్వడం మరో వింత. అమరావతి మహిళలపై కొమ్మినేని తన వాచాలతకు ఎప్పుడు, ఎక్కడ, ఏమని క్షమాపణ చెప్పారు? వాటిని సదరు సంఘ నేతల చెవిలో చెప్పారా? లేక సాక్షి ఆఫీసులో చెప్పారా? వారే సెలవివ్వాలి.

ఇక్కడ నేరానికి, వయసుకూ సంబంధం ఏమిటన్నదే ప్రశ్న. సంఘనాయకుల వాదన ప్రకారమయితే.. చంద్రబాబునాయుడు వయసు, కొమ్మినేని కంటే ఎక్కువ. సీనియారిటీ సంగతికొస్తే, ఇప్పుడు దేశంలో ఉన్న అత్యంత సీనియర్ నాయకుల్లో చంద్రబాబు ఒకరు. మరి తమ సిద్ధాంతం ప్రకారం.. పాదయాత్ర సమయంలో ఎలాంటి వారెంట్ లేకుండా, అంత వయసున్న చంద్రబాబును చెరబట్టడం కూడా నేరమే అయినప్పుడు.. మరి ఇదే జర్నలిస్టు సంఘం, ఇంతే విశాల హృదయంతో ఎందుకు నాటి జగన్ సర్కారును డిమాండ్ చేయలేదన్నదే ప్రశ్న.

నిర్నిరోధంగా రెండు తెలుగు రాష్టాల్లో దశాబ్దాల నుంచి, అక్రెడిటేషన్ కమిటీలు-ఐఅండ్ పీఆర్‌పై కస్రపెత్తనం కమ్ ప్రెస్ అకాడెమీలను చెరబడుతున్న ఈ పెద్దనోరు సంఘం అభిప్రాయంతో.. అదే సంఘాన్ని సుదీర్ఘకాలం వెలిగించిన, నేటి ప్రెస్ అకాడెమీ చైర్మన్ ఏకీభవిస్తారా? విబేధిస్తూ ప్రకటన ఇస్తారా?

సాక్షి కార్యాలయాలపై మూకదాడి చేయడం అనాగరికం, అప్రజాస్వామ్యమని గావకేకలు పెడుతున్న ‘ప్రజాస్వామ్య పిపాసులు’.. తమ జమానాలో, డీజీపీ ఆఫీసుకు కూతవేటు దూరంలో ఉన్న టీడీపీ అనే రాజకీయ పార్టీ ఆఫీసుపై రాళ్లదాడి చేసి, అందులో పనిచేసే ఉద్యోగులను చావగొట్టి, విధ్వంసం సృష్టించడాన్ని మర్చిపోయి వేదాలు వల్లిస్తే, దయ్యాలు కూడా సిగ్గుపడతాయి!అయినా నవ్విపోదురుగాక నాకేటి సిగ్గనుకుంటే చేసేదేమీలేదు!! మరోసారి సిగ్గుపడటం తప్ప!!

 

LEAVE A RESPONSE