- వైసీపీ ప్రలోభాలకు లొంగితే భవిష్యత్తు నాశనం
- కూటమి ప్రభుత్వంలో జోడెద్దుల్లా అభివృద్ధి, సంక్షేమం
- సంపద సృష్టించి సంక్షేమాన్ని అందిస్తాం
- యువతకు ఉద్యోగాలు ఇవ్వడం మద్యం, గంజాయి అమ్ముకునే వాళ్ల వల్ల కాదు
- కూటమి ప్రభుత్వం రాగానే ప్రభుత్వ శాఖల్లో ఖాళీలను గుర్తించి నోటిఫికేషన్ ఇస్తాం
- కూటమి అభ్యర్థులను గెలిపించండి
- గన్నవరం వారాహి విజయభేరి బహిరంగ సభలో పవన్ కళ్యాణ్
యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు చూపని… ప్రభుత్వ ఉద్యోగులకు సకాలంలో జీతాలు ఇవ్వని… నిండు శాసనసభలో ఆడబిడ్డలను అగౌరపరిచిన…. రైతులకు సాగు, ప్రజలకు తాగు నీరు అందించలేని వైసీపీ ప్రభుత్వం సార్వత్రిక ఎన్నికల్లో చిత్తు చిత్తుగా ఓడిపోతోందని జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు. ప్రకృతి వనరులైన ఇసుక, మట్టి, గనులను ఇష్టానుసారం దోచుకున్నారని, గతంలో రూ.1800 ఉన్న ఇసుకను రూ.5 వేలుకు పెంచారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే ఉచిత ఇసుక అందిస్తామని, సంక్షేమం, అభివృద్ధిని జోడెద్దుల్లా పరిగెట్టిస్తామని హామీ ఇచ్చారు. బుధవారం గన్నవరం నియోజకవర్గం హనుమాన్ జంక్షన్ లో ఎన్నికల ప్రచార సభలో పాల్గొన్నారు.
ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ “ఇంకా ఎన్నికలకు నాలుగు రోజులే సమయం ఉంది. మన భవిష్యత్తును దిశానిర్దేశం చేసే ఎన్నికలు ఇవి. ప్రతి ఒక్కరూ ఎంతో జాగ్రత్తగా ఆలోచించి ఓటు వేయాలి. కూటమి తరఫున గన్నవరం నుంచి పోటీ చేస్తున్న యార్లగడ్డ వెంకట్రావు, నూజివీడు నుంచి పోటీ చేస్తున్న కొలుసు పార్థసారథి, మచిలీటప్నం ఎంపీగా పోటీ చేస్తున్న వల్లభనేని బాలశౌరి వీళ్లంతా వైసీపీ నుంచి బయటకు వచ్చిన వారు. వైసీపీలో దాస్యం చేయలేక, ఆత్మ గౌరవాన్ని తాకట్టు పెట్టలేక బయటకు వచ్చి కూటమి తరఫున బరిలో నిలబడ్డారు. వారిని గెలిపించే బాధ్యత మనదే.
వంశీకి ఓటు వేస్తే… ఆడబిడ్డలను అగౌరవపరిచినట్లే
2014లో తెలుగుదేశం, భారతీయ జనతా పార్టీలకు మద్దతుగా నిలబడ్డాను. ఆ సమయంలో వల్లభనేని వంశీకి మద్దతుగా ప్రచారం చేశాను. ఆ సమయంలో ఆయన నాతో ఒక మాట చెప్పాడు. మీరు చెప్పడం వల్లే ఎప్పుడు నాకు ఓటు వేయని కొన్ని ప్రాంతాల్లో ఓట్లు పడ్డాయని చెప్పారు. ఆయన వివేకం ఉన్న నాయకుడు, ప్రజలకు మంచి చేస్తాడని భావించి ఆ రోజు అండగా నిలబడ్డాను. కానీ ఆయన ఓట్లు వేసిన ప్రజలను మోసం చేసి వైసీపీలో చేరాడు. రాజకీయాల్లో విభేదాలు సహజం. పాలసీలపరంగా అభిప్రాయభేదాలు ఉండొచ్చు. నేను కూడా చంద్రబాబుతో పాలసీలపరంగా విభేదించాను. అంతే తప్ప వ్యక్తిగత దూషణలకు ఏనాడు పాల్పడలేదు. ఇంట్లో ఆడవాళ్లను అగౌరవపరిచేలా మాట్లాడలేదు. వంశీ మాత్రం ఎన్డీఆర్ కుమార్తె, చంద్రబాబు సతీమణి భువనేశ్వరిని తూలనాడటం బాధనిపించింది. జగన్ తో నాకు, చంద్రబాబుకి రాజకీయంగా విభేదాలు ఉండొచ్చు. ఏనాడు కూడా మేము భారతీని ఒక్క మాట అనలేదు.
జనసేన మద్దతుదారులకు ఒకటే విన్నవిస్తున్నాను… వంశీకి ఓటు వేస్తే ఆడబిడ్డలను అగౌరపరిచే వ్యక్తికి మద్దతు తెలిపినట్లే. ఆడబిడ్డలను అగౌరపరిచే నైజం ఉన్నవాళ్లు గెలిస్తే… రేపు మన ఇంట్లో ఆడబిడ్డలను కూడా ఇలానే దూషిస్తారు. ఎమ్మెల్యే ఓటు నాకు వేసి ఎంపీ ఓటు ఎవరికైనా వేసుకోండి అని వంశీ ఓటర్లకు చెబుతున్నట్లు నా దృష్టికి వచ్చింది. ఆయన ప్రలోభాలకు, ఆయన ఇచ్చిన రూ.2 వేలకు మనం లొంగిపోతే మన భవిష్యత్తును మనం నాశనం చేసుకున్నట్లే. ఈ ఎన్నికల్లో సరైన వ్యక్తిని ఎన్నుకోవడం చాలా అవసరం. వంశీలా యార్లగడ్డ వెంకట్రావుకి బూతులు తిట్టడం రాదు. సంస్కారం ఉన్న వ్యక్తి. రాజకీయాలను రాజకీయాలుగానే చూస్తాడు తప్ప బూతులు తిడుతూ నీచంగా మాట్లాడడు. గత ఎన్నికల్లో కేవలం అతి స్వల్ప ఓట్ల తేడాతో ఓడిపోయాడు. అయినా ఎక్కడికి పారిపోలేదు. ఓట్లు వేసిన ప్రజల కోసం నిలబడే ఉన్నాడు. ఇలాంటి వ్యక్తిని ఎన్నుకుంటే మన భవిష్యత్తు బాగుంటుంది.
పోలవరం కుడి కెనాల్ ను ఏలూరు కెనాల్ తో అనుసంధానం చేస్తాం
కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే బందరుపోర్టును సకాలంలో పూర్తి చేస్తాం. గన్నవరం ఎయిర్ పోర్టు కోసం భూములు కోల్పోయిన నిర్వాసితులకు న్యాయం చేస్తాం. మచిలీపట్నం-కల్లూరు బైపాస్ రోడ్డును నిర్మిస్తాం. బ్రహ్మలింగయ్య చెరువును రిజర్వాయర్ గా అభివృద్ధి చేసి రూ. 12 వేల ఎకరాలకు సాగునీరు అందిస్తాం. మల్లవల్లి రైతులకు అండగా ఉండటంతో పాటు… మల్లవల్లి ఎస్ఈజెడ్ లో పూర్తిస్థాయిలో పరిశ్రమలు తీసుకొచ్చి యువతకు ఉపాధి కల్పిస్తాం. ఇండస్ట్రియల్ పార్క్ ఏ ఉద్దేశంతో ఏర్పడిందో.. దానిని నెరవేరుస్తాం. నియోజకవర్గంలో రెండు అండర్ పాస్ లు కావాలని ప్రజలు కోరుకుంటున్నారు.. వాటి నిర్మాణానికి బాధత్య తీసుకుంటాం. చిoతలపూడి ప్రాజెక్టును పూర్తి చేస్తాం. పామాయిల్ పంటకు రాయితీలు కల్పిస్తాం. రామవరప్పాడు ట్రాఫిక్ సమస్యను పరిష్కరిస్తాం. కేసరపల్లి బ్రిడ్జ్ నిర్మాణాన్ని పూర్తి చేస్తాం. పోలవరం కుడి కెనాల్ ను ఏలూరు కెనాల్ తో అనుసంధానం చేసి సాగు, తాగు నీటి కష్టాలు తీరుస్తాం.
మద్యం, గంజాయి అమ్మేవాడు ఉద్యోగాలు ఇస్తాడా..?
మాట్లాడితే క్లాస్ వార్ … క్లాస్ వార్ అని కథలు చెప్పే జగన్… అధికారంలోకి రాగానే ఒక్క మద్యం అమ్మకాల్లోనే రూ.41 వేల కోట్లు దోచేశాడు. ఇసుకలో మరో రూ. 40 వేల కోట్లు దోచుకున్నాడు. రూ. 450 కోట్ల భవననిర్మాణ కార్మికుల సంక్షేమ నిధిని పక్కదారి పట్టించాడు. మద్యం, గంజాయి అమ్మే ఇలాంటి వ్యక్తి యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించగలడా..? బాధ్యతగా ఉండే వాడు అయితేనే యువతకు న్యాయం చేయగలడు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే తొలి సంతకం మెగా డీఎస్సీపై పెడతాం. పోలీస్ వ్యవస్థలో ఖాళీలను భర్తీ చేస్తాం. సీపీఎస్ కు ఏడాదిలోగా పరిష్కారం చూపిస్తాం. భవన నిర్మాణ కార్మికులతో పాటు ముఠా కూలీల సంక్షేమానికి పెద్దపీట వేస్తాం. తాత్కాలికమైన ప్రలోభాలకు, వైసీపీ ఇచ్చే డబ్బులకు ఆశపడి ఓటు వేస్తే మన భవిష్యత్తను మనమే నాశనం చేసుకున్నట్లే. ఈ ఎన్నికల్లో ధర్మందే విజయం.. పొత్తుదే గెలుపు… కూటమిదే పీఠం.
వైసీపీకి ఓటు వేస్తే మన ధర్మాన్ని మనమే అవమానించినట్లు
విజయవాడ కనకదుర్గమ్మ రథానికి ఉండే వెండి సింహాలు మాయమైతే… వైసీపీ నాయకులు ఏం మాట్లాడారో ఒక్కసారి గుర్తు తెచ్చుకోండి. ఆ వెండి సింహాలతో మేడలు, మిద్దెలు కట్టుకుంటారా అని హేళనగా మాట్లాడారు. కాల్ మనీ కేసులో పోలీస్ స్టేషన్ల చుట్టూ తిరిగిన వ్యక్తికి దుర్గ గుడి ఛైర్మన్ పదవి ఇచ్చారు. నకిలీ దర్శనం టికెట్లు ముద్రించి డబ్బులు దోచేశారు. వైసీపీ హయాంలో రాష్ట్రంలో దాదాపు 200 పైగా దేవాలయాలపై దాడులు జరిగాయి. దేవతామూర్తుల విగ్రహాలను అపవిత్రం చేశారు. ఒక్కరంటే ఒక్కరిని కూడా వైసీపీ ప్రభుత్వం పట్టుకోలేదు. ఒక్క హిందూ మతాన్నే కాదు అన్ని మతాలను చిన్నచూపు చూశారు. మసీదుల అభివృద్ధి పనులకు నిధులు ఇవ్వలేదు. వైసీపీ కి మరోసారి ఓటు వేస్తే మన సనాతన ధర్మానికి తూట్లు పొడిచినట్లే.
కూటమి నాయకులను నిండు మనసుతో ఆశీర్వదించండి
వైసీపీ కనుసన్నల్లో ఏ స్థాయికి అయినా వైసీపీ నాయకులు దిగజారిపోతారు. యుద్ధం కూడా కొన్ని నియమాలతో చేస్తారు. రాష్ట్ర రాజకీయాల్లో నియమాలు లేవు. దిగజారిపోయాయి. జగన్ మొసలి కన్నీరు కారుస్తున్నాడు.. అందరూ ఒక్కటై నన్ను ఓడించాలని చూస్తున్నారని ప్రజల మధ్య సింపతి నాటకాలు ఆడుతున్నాడు. ప్రతిపక్షాలు ఉన్నది జగన్ ను గెలిపించడానికా..? మేము గెలవడానికా..? ఇంత చిన్న లాజిక్ మరిచిపోయి డ్రామాలు ఆడుతున్నాడు. అధికారం ఉంది కదా అని వ్యవస్థలను గుప్పెట్లో పెట్టుకొని స్థానిక సంస్థల ఎన్నికల్లో ఒక్కడినైనా నామినేషన్ వేయనిచ్చావా..? ఇప్పుడు ఎలక్షన్ కమిషన్ అధికారులను మారుస్తుంటే ప్రతిపక్షాలపై పడి ఏడుస్తున్నాడు. అభివృద్ధి, సంక్షేమం పక్క పక్కన ఉండాలి. డబ్బులు లేకపోతే సంక్షేమం చేయలేం.
కూటమి ప్రభుత్వంలో అభివృద్ధితోపాటు సంక్షేమాన్ని సమపాళ్లలో పరుగులు పెట్టిస్తాం. యువత ఒక్కటే తేల్చుకోవాలి. మార్పు కోసం ముందుకు వెళ్లకపోతే రౌడీయిజం చేసే నాయకులకు భయపడి బతకాలి. మీ కోసం నిలబడే నాయకుల సమూహాం అండగా ఉంది. ధైర్యంగా ముందుకు వచ్చి ఓటు అనే ఆయుధంతో వైసీపీ అవినీతి కోటలు బద్ధలు కొట్టండి. కూటమి తరఫున మచిలీపట్నం ఎంపీ అభ్యర్థిగా వల్లభనేని బాలశౌరి, గన్నవరం నియోజకవర్గం నుంచి యార్లగడ్డ వెంకట్రావు, నూజివీడు నుంచి కొలుసు పార్థసారథి, పెనమలూరు నుంచి బోడే ప్రసాద్, దెందులూరు నుంచి చింతమనేని ప్రభాకర్ పోటీ చేస్తున్నారు. వారిని అఖండ మెజార్టీతో గెలిపించాల”ని ప్రజలను కోరారు.