దేశానికి వెన్నెముక రైతు. అటువంటి రైతుకుటుంబము నుండివచ్చి ప్రధాని పదవిని అలంకరించిన చరణ్ సింగ్ జయంతిని (డిసెంబర్ 23 ) జాతీయ వ్యవసాయదారుల దినోత్సవంగా(కిసాన్ దివస్ ) జరుపుకుంటోంది మనదేశం.
ప్రజలందరి ఆకలి బాధను తొలగించే దైవాలు రైతులు. నేలతల్లినినమ్ముకొని,పలురకాలప్రతికూల పరిస్థితులను తట్టుకుంటూ, శ్రమించి పంటలను పండించిదేశ ఆర్ధికవ్యవస్థలో కీలకపాత్ర పోషిస్తారు మన వ్యవసాయదారులు.ఒకప్పుడు అందరి వృత్తీ వ్యవసాయమే. కానీ, ఇప్పుడు పదిమందికీఅన్నం పెట్టే రైతన్నలు కరువైయ్యారు. దేశం ఎంత అభివృద్ధి చెందినారైతుల కష్టాలు మాత్రం తగ్గడం లేదు.
మనది ప్రాధమికంగా వ్యవసాయ దేశం. ఇందులో మహిళలు కూడా కీలక పాత్ర పోషిస్తున్నారు. అయితే రాను రాను వ్యవసాయానికి యువత దూరం అవుతున్నారు. ఫలితంగా వలసలు పెరుగుతున్నాయి. ఈ ఏడాది సుస్థిర ఆహార భద్రత, ఆధునిక వ్యవసాయ పద్దతిలో స్థిరమైన వ్యవసాయాన్ని నిర్మించడం అనే థీమ్ తో జాతీయ వ్యవసాయ దినోత్సవం జరుపుతున్నారు.
మాజీ ప్రధాని చౌదరి చరణ్ సింగ్ చేపట్టిన ఉద్యమాల ఫలితంగానే జమీందారీ చట్టం రద్దు అయింది. కౌలుదారీ చట్టం వచ్చింది.రైతులను వడ్డీవ్యాపారుల కబంధహస్తాలనుండి విడిపించి వారికి బ్యాంకు ఋణాలు అందించే విధానము ప్రవేశ పెట్టేలా చేయడం వెనుక చరణ్ సింగ్ నిర్వహించిన రైతు ఉద్యమాలున్నాయి . రైతుల గురించి , వ్యవసాయం గురించి అంతగా ఆలోచించి , వారి సమస్యల పరిష్కారానికి కృషి చేసిన చరణ్ సింగ్ దేశ ప్రధాని అయినపుడు రైతాంగం ఆనంద పడింది .
అయితే ఆయన పార్లమెంట్ ను ఎదుర్కోలేకపోయి తాత్కాలిక ప్రధానిగానే 1980 వ సంవత్సరము పదవి నుండి తప్పుకోవాల్సి వచ్చింది. చరణ్ సింగ్ రైతునాయకుడిగానే 1987 మే 29 న మరణించారు.రైతులకు ఆయనచేసిన సేవలకు గుర్తుగా ప్రభుత్వము చరణ్ సింగ్ జన్మదినోత్సవాన్ని కిసాన్ దివస్ గా ప్రకటించింది.పంటలు పండించడానికి వారు పడే శ్రమకు గుర్తింపు లేక, చేసిన అప్పులు తీర్చలేక అత్మహత్యలు చేసుకుంటున్న రైతన్నను కాపాడేందుకు మనమందరం నడుం బిగించాలి.
రైతులకు సీలింగ్ మరియు మిగులు భూములని పంపిణీ చేయడం, వ్యవసాయ భూములను, వేరే అవసరాలకు వినియోగించకుండా ఉండటం, పంటల బీమాను సమర్ధవంతంగా అమలు చేయడం, పండిన పంటలకు మంచి మద్దతు ధర ఉండేట్లు చూడటం, రైతులకు వడ్డీ భారం తగ్గించడం వంటి స్వామి నాధన్ కమిషన్ సిఫార్సుల అమలుతోనే అన్నదాతలను ఆదుకోవడం సాధ్యం అవుతుంది.
– యం.రాం ప్రదీప్
జెవివి సభ్యులు,తిరువూరు
9492712836