తనకి తానే సవాల్ విసురుకున్న ఆర్కే
– తాడేపల్లి ప్యాలెస్ ముందు జగన్ రెడ్డికి ఈ ఛాలెంజ్ విసరాలని లోకేష్ సూచన
మాట తప్పుడు తీవ్రమై..మడమ తిప్పుడు ఎక్కువై..తనకు తానే సవాల్ విసురుకున్న ఆళ్ల రామకృష్ణారెడ్డికి టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ వినూత్నంగా కౌంటర్ ఇస్తూ ఓ వీడియో విడుదల చేశారు.
మంగళగిరి ఎమ్మెల్యేగా ఎటువంటి అభివృద్ధి చేయలేకపోయానని, 1200 కోట్లు అభివృద్ధికి తెస్తానని 12 కోట్లు కూడా తేలేకపోయానని, ఏ మొఖం పెట్టుకుని ఓట్లు అడిగేందుకు ప్రజల్లోకి వెళ్లాలనే సిగ్గుతో వైసీపీకి, ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తున్నానని ఇటీవలే ప్రకటించిన మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి మాటలు..నేడు అభివృద్ధిపై చర్చకు రమ్మంటూ టిడిపికి విసిరిన సవాల్‌ని ఒక వీడియోగా లోకేష్ విడుదల చేశారు.
మంగళగిరి నియోజకవర్గ అభివృద్ధిని ఎవరు చేశారో ప్రజలను అడిగి తేల్చుకుందామని సవాల్ విసిరిన ఆర్కే, ఇదే సవాల్ తాడేపల్లి ప్యాలెస్ ముందు జగన్ రెడ్డికి విసరాలని లోకేష్ సూచించారు. జగన్ రెడ్డి మంగళగిరి నియోజకవర్గానికి తీవ్ర అన్యాయం చేశాడని, జనానికి మొఖం కూడా చూపించలేనని ప్రకటించిన ఆర్కే, అదే నోటితోనే అభివృద్ధికి కేరాఫ్ అడ్రస్ అయిన టిడిపికి సవాల్ విసరడం హాస్యాస్పదంగా ఉందని ఎద్దేవ చేశారు. ఇదే సవాల్ నీకు నువ్వు విసురుకోవాలని, ఇంకా ధైర్యం ఉంటే తాడేపల్లి సీఎం కొంపముందుకెళ్లి ఇదే ఛాలెంజ్ చేయాలని లోకేష్ ఘాటుగా స్పందించారు.