-ఇటువంటి చర్యలు విద్యార్థుల భవిష్యత్తును దెబ్బతీయడమే
-టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి వర్ల రామయ్య ధ్వజం
ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి “సిద్ధం” పేరుతో నిర్వహిస్తున్న బహిరంగసభలు రాష్ట్ర ప్రజానీకంపై యుద్ధం ప్రకటిస్తున్నట్లుగా ఉన్నాయి. ఈనెల 3వతేదీన ఏలూరులో నిర్వహించే ముఖ్యమంత్రి సిద్ధం సభకోసం ఎపిఎస్ ఆర్టీసి బస్సులన్నింటీ మళ్లిస్తున్నందున విద్యార్థినీ విద్యార్థులు ప్రత్నామ్నాయ ఏర్పాట్లు చేసుకోవాల్సిందిగా కృష్ణా యూనివర్సిటీ విసి కళాశాలల యాజమాన్యాలకు సర్క్యులర్ జారీచేయడం సిగ్గుమాలిన చర్య.
ఇటీవల భీమిలి సమీపంలో నిర్వహించిన సిఎం సభ కోసం ఇంటర్ పరీక్షలను వాయిదావేశారు. మరికొద్దిరోజుల్లో పరీక్షలు జరగనున్న సమయంలో వారి విలువైన సమయాన్ని సిఎం సభల పేరుతో హరించడం విద్యార్థుల భవిష్యత్తును నాశనం చేయడమే. కేవలం తమ స్వార్థ రాజకీయాల కోసం సిఎం రేపటిపౌరుల బంగారు భవితను, విద్యావ్యవస్థను ఫణంగా పెడుతూ వారి పాలిట కంసమామ మాదిరిగా తయారయ్యారు. ముఖ్యమంత్రి సభల కోసం ప్రజలను ఇబ్బందులు పెట్టి ఆర్టీసి బస్సులను మళ్లించడం, అధికార యంత్రాంగాన్ని, కోట్లాదిరూపాయల ప్రజాధనాన్ని దుర్వినియోగం చేయడం దారుణం.
చట్టానికి లోబడి స్వతంత్రంగా పనిచేయాల్సిన వైస్ ఛాన్సలర్లు తమ కుర్చీలు కాపాడుకోవడం కోసం అధికారపార్టీ కార్యకర్తలుగా మారి పనిచేస్తూ విద్యారంగాన్ని భ్రష్టుపట్టించడం ఆత్మహత్యా సదృశ్యం. ముఖ్యమంత్రి, మంత్రులు, ఎమ్మెల్యేలు మరికొద్దిరోజుల్లో ఇంటికెళతారు, వ్యవస్థలు శాశ్వతమన్న విషయాన్ని ఉన్నతస్థాయిలో ఉన్న అధికారులు, విద్యావేత్తలు గమనించాల్సిందిగా కోరుతున్నాను.
సిద్ధం పేరిట నిర్వహించే సభలు జగన్ ఎన్నికల శంఖారావంలో భాగమేనని వైసిపినేతలు బహిరంగంగా చెబుతున్నందున సంబంధిత సభలకు ఏస్థాయి అధికార యంత్రాంగాన్ని కూడా ఉపయోగించకుండా ఎన్నికల కమిషన్ స్పష్టమైన ఆదేశాలు జారీచేయాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాను. సిద్ధం సభల కోసం ప్రజలను ఇబ్బంది పెడుతున్న జగన్ ను ఇంటికి పంపడానికి జనం సిద్ధంగా ఉన్నారన్న విషయాన్ని గుర్తించాల్సి ఉంది.