– రెండు కేంద్ర ప్రభుత్వ సంస్థలు సరఫరాకు పనికిరావట
– ఇప్పటికంటే 25 శాతం ఎక్కువ రేటుకు టెండర్
– హైకోర్టులో స్టే తెచ్చిన కేంద్రీయ భండార్
– తర్వాత దానిపై ఒత్తిడి తెచ్చి పిటిషన్ ఉపసంహరణ
– అర్హత లేకున్నా బాలాజీ గ్రౌండ్‌నట్ ఆయిల్ మిల్ కంపెనీ, మారుతీ ఆగ్రోస్‌కు టెండర్
– టెండరు దక్కించుకున్న కంపెనీల్లో చిక్కీ తయారుదారులేరీ?
– 198 కోట్ల రూపాయల జగనన్న గోరుముద్ద చిక్కీ టెండర్లపై అనుమానాలు వేయి
– ఆ మంత్రి ఒత్తిళ్లు ఫలించాయా?
( మార్తి సుబ్రహ్మణ్యం)
అమరావతి: చిన్నారులలో పోషకాహారం పెంచే ‘చిక్కీ’ సరఫరా కోసం కేంద్ర ప్రభుత్వం అమలుచేస్తున్న ‘పీఎం పోషణ’ పథకం.. ఆంధ్రప్రదేశ్‌లో ‘జగనన్న గోరుముద్ద’గా మారిన నేపథ్యంలో, ప్రభుత్వం ఆహ్వానించిన 198 కోట్ల రూపాయల టెండర్లలో బిడ్లు దక్కించుకున్న కంపెనీల అర్హతపై అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. నిజానికి ఈ పథకానికి కేంద్రప్రభుత్వం, ప్రతిరాష్ట్రానికి ‘పీఎం పోషణ’ పథకం కింద 60 శాతం నిధులు ఇస్తోంది.
ఆంధ్రప్రదేశ్‌లో కూడా ఆ మేరకు టెండర్ నెంబర్ 53/ఎండిఎం/2021: 29-9-20121 తో టెండరు పిలిచారు. ప్యాకేజీ-1 లో శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం జిల్లాల్లోని ఏడాది పాటు పల్లీ చిక్కీని ఈ మూడు జిల్లాలోని 9,799 స్కూళ్లలోని 7,52,707 మంది విద్యార్థినీ విద్యార్ధులకు ఒక్కో చిక్కీ 25 గ్రాముల చొప్పున, మొత్తం 20,69,944 కిలోలు సరఫరా చేయాలని టెండరు నోటీసులో పేర్కొన్నారు. ఆ మూడు జిల్లాల్లో విక్టరీబజార్ రావులపాలెం, శ్రీ బాలాజీ గ్రౌండ్‌నట్ ఆయిల్ మిల్, విశాఖకు టెండరు దక్కింది. ప్యాకేజీ-2లో ఈస్ట్-వెస్ట్ గోదావరి జిల్లాలకు విక్టరీబజార్, ప్యాకేజీ-3లో గుంటూరు- కృష్ణా జిల్లాలకు
విక్టరీబజార్, మారుతీ ఆగ్రోస్ లిమిటెడ్ శ్రీకాకుళం, శ్రీబాలాజీ గ్రౌండ్‌నట్ ఆయిల్‌మిల్, ప్యాకేజీ-4లో ప్రకాశం, నెల్లూరు జిల్లాలకు విక్టరీబజార్, ఎం ఫర్ మిల్లెట్స్ హైదరాబాద్, శ్రీ సాంబశివ డైరీ ప్రొడక్స్, సన్వారియా స్వీట్స్ ప్రైవేట్ లిమిటెడ్, ప్యాకేజీ-5లో కడప, చిత్తూరు జిల్లాలకు విక్టరీబజార్, ఎం ఫర్ మిల్లెట్స్, శ్రీ సాంబశివ డైరీ, సన్వారియా స్వీట్స్, మారుతీ ఆగ్రోస్, బాలాజీ గ్రౌండ్‌నట్ ఆయిల్‌మిల్, ప్యాకేజీ-6లో కర్నూలు, అనంతపురం జిల్లాలకు విక్టరీబజార్, సాంబశివ డైరీ, సన్వారియా స్వీట్స్, శ్రీబాలాజీ గ్రౌండ్‌నట్ ఆయిల్‌మిల్ టెండర్లు దక్కించుకున్నాయి. ఆ ప్రకారంగా ఈ కంపెనీలు వారంలో సోమవారం, బుధవారం, శుక్రవారం రోజున .. నేరుగా స్కూళ్లకు 25 గ్రాముల పల్లీ చిక్కీని సరఫరా చేయాల్సి ఉంటుంది.
కాగా తొలుత.. కేంద్ర ప్రభుత్వానికి చెందిన కేంద్రీయ భండార్, నేషనల్ కోఆపరేటివ్ కన్జూమర్స్ ఫెడరేషన్ ఇండియా లిమిటెడ్ (ఎన్‌సిసిఎఫ్)తోపాటు ఎం ఫర్ మిల్లెట్స్, విక్టరీబజార్ రావులపాలెం, శ్రీ సాంబశివ డైరీ ప్రొడక్ట్స్, సన్వారియా స్వీట్స్ ప్రైవేట్ లిమిటెడ్, మారుతీ ఆగ్రోస్, శ్రీ బాలాజీ గ్రౌండ్‌నట్ కంపెనీలు బిడ్లు వేశాయి. అయితే విచిత్రంగా టెక్నికల్ స్టేజ్‌లో కేంద్రానికి చెందిన కేంద్రీయ భండార్, ఎన్‌సిసిఎఫ్ కంపెనీలు డిస్‌క్వాలిఫై కావడం ఆశ్చర్యపరిచింది. నిజానికి ఈ కంపెనీలే దేశంలోని అనేక రాష్ట్రాల్లో ఇదే ‘పీఎం పోషణ’ కింద పల్లీ చిక్కీలు సరఫరా చేస్తుండటం గమనార్హం.
కేంద్రానికి చెందిన ఆ రెండు కంపెనీలు మినహా, మిగిలిన 6 కంపెనీలు క్వాలిఫై అయినట్లు ప్రభుత్వం ప్రకటించింది. అయితే విచిత్రంగా ఆ ఆరు కంపెనీలకు కావలసిన అర్హతలనే ప్రాతిపదికగా నిర్ణయించి, మిగిలిన వారికి టెండర్లలో పాల్గొనే అవకాశం లేకుండా చేశారన్న ఆరోపణలు వచ్చాయి. అయితే.. టాటా కంపెనీకి చెందిన ఓ కన్సల్టెల్టీని ధర్డ్‌పార్టీగా ఏర్పాటుచేసి, అది సిఫార్సు చేసిన కంపెనీకే అర్హత ఇచ్చినట్లు అధికారులు చెబుతున్నారు. ఈ మొత్తం వ్యవహారంలో ఒక కీలక మంత్రి, ప్రభుత్వాధికారిపై ప్రభావం చూపారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి.
నిజాయితీపరుడిగా పేరున్న ఓ అధికారి కూడా, సదరు కీలక నేత సిఫార్సు చేసిన టెండర్లకే మొగ్గు చూపినట్లు విమర్శలు వినవస్తున్నాయి. కాగా టెండరు దక్కించుకున్న కంపెనీల్లో రాజస్థాన్‌కు చెందిన ఓ సంస్థ కూడా ఉండటం గమనార్హం. అయితే ఈ మొత్తం వ్యవహారంలో టాటా కంపెనీకి చెందిన ఓ ఏజెన్సీని థర్డ్‌పార్టీగా ముందుపెట్టి, తెరవెనుక తమకు కావలసిన వారికి టెండర్లు దక్కేలా చేశారన్న ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి.
దీనితో కేంద్ర ప్రభుత్వానికి చెందిన కేంద్రీయ భండార్ 3-12-2012న రిట్ పిటిషన్ నెంబర్ -28648 ఆఫ్ 2021 పేరుతో హైకోర్టులో కేసు వేసింది. తనకు అన్ని అర్హతలున్నా టెక్నికల్ స్టేజ్‌లో, డిస్‌క్వాలిఫై చేశారంటూ పిటిషన్ దాఖలు చేసింది. ఆ మేరకు తనకున్న అర్హతలు కూడా హైకోర్టుకు సమర్పించింది. దానితో పాటు టెండరులో పాల్గొన్న మరో రెండు కంపెనీల అనర్హతలనూ సాక్ష్యాలతో సహా కోర్టు దృష్టికి తీసుకువెళ్లింది. దానితో కోర్టు కేంద్రీయ భండార్‌కు అనుకూలంగా స్టే ఇచ్చింది.
అసలు కథ అక్కడి నుంచే మొదలయింది. తర్వాత ఏమైందో.. తెరవెనుక ఎవరు కథనడిపించారో గానీ.. హటాత్తుగా అదే కేంద్రీయ భండార్ సంస్థ, తన పిటిషన్‌ను ఉపసంహరించుకుంటున్నట్లు 20 డిసెంబర్ 2021న మరో పిటిషన్ దాఖలు చేయగా, హైకోర్టు దానిని ఆమోదించింది.
అయితే టెండరు దక్కించుకున్న మారుతీ ఆగ్రోస్ సంస్థ సెప్టెంబర్ 2020లో మాత్రమే జీఎస్టీ తీసుకుందని, కానీ టెండరు నిబంధనలో 3 సంవత్సరాల ఇన్‌కంటాక్స్ రిటర్న్స్‌తోపాటు ఫుడ్ సప్లై చేసి ఉండాలని స్పష్టంగా ఉందని కేంద్రీయ భండార్ వాదించింది. పైగా మారుతీ ఆగ్రోస్ పల్లీ చిక్కీ తయారుచేసే సంస్థ కానేకాదని, దాని యజమాని పౌల్ట్రీ రైతు మాత్రమే అని కోర్టు దృష్టికి తీసుకువెళ్లింది. వీటికి మించి.. ఫ్యాక్టరీ లైసెన్సు కూడా 10, 2021న దరఖాస్తు చేసిందని వాదించింది.
టెండరు దక్కించుకున్న బాలాజీ గ్రౌండ్‌నట్ ఆయిల్ మిల్ కంపెనీ కూడా, టెండరు షరతులో పేర్కొన్న నిబంధనల ప్రకారం 25 శాతం కూడా పల్లీ చిక్కీ సరఫరా చేసే సామర్థ్యం కూడా లేదని కోర్టుకు తెలిపింది. మారుతీ ఆగ్రోస్ మాదిరిగానే బాలాజీ గ్రౌండ్‌నట్ ఆయిల్ మిల్ కంపెనీ కూడా, చిక్కీ తయారుచేసే కంపెనీ కాదని స్పష్టం చేసింది. అయితే తయారీదారు పేరుతో నెల్లూరు జిల్లాలో మాన్యుఫ్యాక్చర్ యూనిట్ నడుపుతోందంటూ దాని జీఎస్టీ రిటర్నులను కోర్టుకు అందించింది.
ఈ నేపథ్యంలో కేంద్రీయ భండార్ తన కేసు ఉపసంహరించుకున్నప్పటికీ, మారుతీ ఆగ్రోస్- బాలాజీ గ్రౌండ్‌నట్ ఆయిల్ మిల్ కంపెనీలకు, టెండరులో పాల్గొనే అర్హత లేదంటూ ఇచ్చిన తిరుగులేని సాక్ష్యాలు మాత్రం సజీవంగానే ఉండటం విశేషం. ఆ రెండు కంపెనీల జీఎస్టీ, ఫ్యాక్టరీ లైసెన్సు పత్రాల ఆధారంగా చూస్తే, వాటికి చిక్కీ సరఫరా చేసే సామర్థ్యం లేనట్లు స్పష్టమవుతోంది. అయినప్పటికీ, డైరక్టర్ ఆఫ్ మిడ్ డే మీల్స్ అండ్ స్కూల్ శానిటేషన్ అధికారులు.. ఆ కంపెనీలకే టెండరు కట్టబెట్టడం వెనుక మతలబేమిటన్న చర్చ జరుగుతోంది. పైగా ఇప్పటిధరలకన్నా 25 శాతం అదనంగా ఇవ్వడంపైనా అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
అందుబాటులో లేని మంత్రి, కార్యదర్శి
కాగా రెండు కంపెనీల అనర్హతపై వివరణ కోరేందుకు విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి బి.రాజశేఖర్, విద్యాశాఖ మంత్రి సురేష్‌ను ఫోన్‌లో ప్రయత్నించగా, వారిద్దరూ అందుబాటులోకి రాలేదు.