వంద ఎలకలను తిన్న పిల్లి తీర్థయాత్రకు బయలుదేరినట్టు..

-పంటలు ఎండి నష్టపోయిన రైతులను ప్రభుత్వం ఆదుకోవాలి
– కెసిఆర్ కరువు పర్యటనపై టీడీపీ టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఐలయ్య యాదవ్

మాజీ ముఖ్యమంత్రి కెసిఆర్ కరువు పర్యటన 100 ఎలుకలను తిన్న పిల్లి తీర్థయాత్రకు బయలుదేరినట్టుగా ఉందని టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జక్కలి ఐలయ్య యాదవ్ విమర్శించారు. కెసిఆర్ అధికారంలో ఉన్న పది సంవత్సరాలు అతివృష్టి అనావృష్టి తో పంటలు నష్టపోయిన రైతులను ఏనాడూ పట్టించుకోలేదన్నారు. కరువు వచ్చి ఎండిపోయిన పంటలను ఎప్పుడైనా పర్యటించి రైతులకు ధైర్యం చెప్పారా అని ప్రశ్నించారు.

అతివృష్టి అనావృష్టి తో పంటలు నష్టపోయిన రైతులను పట్టించుకున్న పాపాన పోలేదని ఆరోపించారు. బిఆర్ఎస్ ప్రభుత్వంలో భారీ వర్షాలతో చెరువులు కుంటలు రోడ్లు దెబ్బతిన్నందుకు నష్టం అంచనా వేసిన ప్రభుత్వం పంటలు కొట్టుకుపోయి రైతులు నష్టపోతే కనీసం పంట నష్టం అంచనా కూడా వేయలేదని ఆరోపించారు. కేంద్ర ప్రభుత్వం నుండి ఇన్ పుట్ సబ్సిడీ నిధులు ఇచ్చిన రైతులకు పంపిణీ చేయకుండా దారి మళ్లించిన సంఘటనలు చాలా ఉన్నాయని పంటల బీమా పథకం కూడా తీసివేశారని ఆరోపించారు.

తొమ్మిది సంవత్సరాల తర్వాత చివరగా అధికారం పోయే ముందు వర్షాలతో పంటలు దెబ్బతిని నష్టపోతే మొదటిసారిగా పర్యటించి పంటలను పరిశీలించి ఎకరాకు పదివేల ఇస్తానని కెసిఆర్ ప్రభుత్వం ప్రకటించి పంపిణీ చేయకుండా పత్తా లేకుండా పోయారని ఆరోపించారు. అధికారం ఉన్నప్పుడు మీరు చేసిన ఘనకార్యాలను ప్రజలు మర్చిపోలేదని.. మీ జిమ్మిక్కులను పార్లమెంట్ ఎన్నికల్లో ప్రజలు నమ్మే అవకాశం లేదన్నారు.

బిఆర్ఎస్ ప్రభుత్వం లాగా కాంగ్రెస్ ప్రభుత్వం చేయకూడదని అన్నారు.భూగర్భ జలాలు అడుగంటిపోయి ఎండిపోతున్న వరి పంటలను మంత్రులు ఎమ్మెల్యేలు ప్రభుత్వం అధికారులు పర్యటించాలన్నారు . ప్రభుత్వ అధికారులు పంట నష్ట అంచనా వేసి పంటలు నష్టపోయిన రైతులను ప్రభుత్వం ఆదుకోవాలని విజ్ఞప్తి చేశారు.

Leave a Reply