విజయవాడ: కోడి కత్తి కేసులో నిందితుడి తల్లి.. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి (సీజేఐ) ఎన్వీ రమణకు లేఖ రాసింది. వెంటనే తగు చర్యలు తీసుకుని తన కుమారుడిని విడుదల చేసేలా చూడాలని ఆ లేఖలో విజ్ఞప్తి చేసింది. నాలుగేండ్లుగా తన కుమారుడు రిమాండ్ ఖైదీగా జైలులో ఉన్నాడని, ఇన్ని రోజులవుతున్నా కోర్టుగానీ, ఎన్‌ఐఏ గానీ ఎలాంటి విచారణ చేయడం లేదని విచారం వ్యక్తం చేశారు.
2018లో విజయనగరం జిల్లాలో పాదయాత్ర చేస్తున్న సమయంలో హైదరాబాద్ వెళ్లేందుకు విశాఖ విమానాశ్రయానికి జగన్ వెళ్లగా.. అక్కడ ఓ యువకుడు కోడిపందాల్లో వాడే కత్తితో జగన్‌పై దాడి చేసి గాయపరిచాడు. ఈ దాడిలో జగన్ ఎడమ చేతికి లోతైన గాయమైంది. ఈ ఘటన అప్పట్లో రాష్ట్ర వ్యాప్తంగా కలకలం రేపింది. విమానాశ్రయంలో పనిచేస్తున్న వెయిటర్ శ్రీనివాస్‌రావు అనే యువకుడు ఈ దాడికి పాల్పడినట్లు పోలీసులు తెలిపారు. అప్పటి నుంచి రిమాండ్ ఖైదీగా శ్రీనివాస్ రావు జైలులో మగ్గుతున్నాడు. ఎంతమందికి విన్నవించినా, ఎందరి కాళ్లపై పడినా తన కుమారుడికి న్యాయం చేయడం లేదని ఈ సందర్భంగా శ్రీనివాస్‌రావు తల్లి సావిత్రి వాపోయింది.
గత నాలుగేండ్లుగా జైలులో ఉంటున్న తన కుమారుడిని విడుదల చేసేందుకు తగు ఆదేశాలివ్వాలని సావిత్రి.. సీజేఐ ఎన్వీరమణకు లేఖ రాసింది.అప్పట్లో ఈ ఘటన రాజకీయ దుమారం రేపింది. కేసు విచారణకు ఎన్‌ఐఏ రంగంలోకి దిగింది. అప్పటి అధికార పార్టీ టీడీపీయే చేయించిందని వైసీపీ ఆరోపించింది. ఎన్నికల్లో సింపతి కోసమే వైసీపీ పన్నాగం పన్నిందని టీడీపీ విమర్శించింది. ఇలాఉండగా, ఈ దాడిలో బొత్స సత్యనారాయణ మేనల్లుడి హస్తం ఉన్నదని నక్క ఆనంద్‌బాబు ఆరోపించారు. కోడి కత్తిని బొత్స మేనల్లుడు చిన్న శ్రీను తీసుకెళ్లాడని, ఆ తర్వాత ఆధారాలు దొరక్కుండా చేశారని ఆయన చెప్పారు.