Suryaa.co.in

Telangana

టిఎస్ బి-పాస్ ను దేశంలో ఆదర్శంగా నిలపాలి

– పురపాలక శాఖ ఉన్నతాధికారులకు మంత్రి కేటీఆర్ సూచన

రాష్ట్రంలో జరుగుతున్న పలు మున్సిపల్ ప్రాజెక్టులు, అభివృద్ధి కార్యక్రమాల పైన మంత్రి కే. తారకరామారావు ఈరోజు సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా టియుఎఫ్ఐడిసి ద్వారా వివిధ పురపాలికల్లో చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాలకు సంబంధించిన పురోగతినిపురోగతిపై మంత్రి కే. తారకరామారావు అధికారుల నుంచి వివరాలు అడిగి తెలుసుకున్నారు. తెలంగాణ ప్రభుత్వం పట్టణాల రూపురేఖలను సమగ్రంగా మార్చేందుకు అవసరమైన సౌకర్యాలను కల్పించేందుకు ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నదని, ఈ దిశగా పట్టణ ప్రగతి కార్యక్రమాన్ని చేపట్టిందని మంత్రి కేటీఆర్ అన్నారు.

ఈ కార్యక్రమానికి ప్రతి నెల పురపాలికలకు ప్రత్యేకంగా నిధులను అందజేస్తున్నమన్నారు. పట్టణ ప్రగతికి అదనంగా టియుఎఫ్ఐడిసి సంస్థను ఏర్పాటు చేసి పెద్ద ఎత్తున మునిసిపాలిటీలకు నిధులను అందజేస్తుందని, తద్వారా ఆయా పట్టణాల్లో పౌర, మౌలిక సదుపాయాలు వేగంగా ఏర్పాటు చేయగలుగుతున్నట్లు తెలిపారు. తెలంగాణ ప్రభుత్వం ప్రవేశపెట్టిన టిఎస్ బి-పాస్ విధానం క్షేత్ర స్థాయిలో అమలవుతున్న తీరు పైన మంత్రి కేటీఆర్ ఈ సందర్భంగా సమీక్ష నిర్వహించారు.

టిఎస్ బి-పాస్ తొలినాళ్ళలో దశలో కొన్ని ప్రారంభ ఇబ్బందులు ఉన్నప్పటికీ క్రమంగా దాన్ని బలోపేతం చేసినట్లు తెలిపిన అధికారులు, ప్రస్తుతం టీఎస్ బి-పాస్ ను పౌరులు విస్తృతంగా ఉపయోగిస్తున్నారని, గణాంకాలతో సహా వివరించారు. టిఎస్ బి-పాస్ కి సంబంధించి అనుమతుల జారీ ప్రక్రియలో గతంలో ఉన్న ఆలస్యం పెద్ద ఎత్తున తగ్గిందని ఈ సందర్భంగా అధికారులు ఒక ప్రజెంటేషన్ ఇచ్చారు.
ముఖ్యమంత్రి కేసీఆర్ఆ లోచన మేరకు రూపొందించిన టిఎస్ బి-పాస్ చట్టంలో పేర్కొన్న అన్ని రకాల సౌకర్యాలను ప్రజలకు అందించడమే లక్ష్యంగా పురపాలక శాఖ పని చేయాలని ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు. టిఎస్ బి-పాస్ వచ్చిన తర్వాత అనుమతుల ప్రక్రియ గతం కంటే సులభం అయిందన్నారు.

టిఎస్ బి-పాస్ ను ప్రజల వద్దకు మరింతగా చేర్చేలా అవసరమైన మార్పులను వెబ్సైట్ లో చేయడం, ప్రజల ఫిర్యాదులకు సంబంధించి మరింత వేగంగా రెస్పాన్స్ ఇచ్చే విధంగా ప్రస్తుతమున్న ఫిర్యాదుల పరిష్కార వ్యవస్థను బలోపేతం చేయడం, టిఎస్ బి-పాస్ టోల్ ఫ్రీ నెంబర్ కు మరింత ప్రచారం కల్పించడం వంటి చర్యలను చేపట్టాలని కేటీఆర్ అధికారులకు సూచించారు. పరిశ్రమల అనుమతుల ప్రక్రియలో ts-ipass మాదిరే దేశంలో భవన నిర్మాణ మరియు లేఅవుట్ అనుమతులకు సంబంధించి టిఎస్ బి-పాస్ సైతం దేశానికి ఆదర్శంగా నిలిచే ఒక వ్యవస్థగా మార్చాలని ఈ సందర్భంగా కేటీఆర్ అధికారులకు సూచించారు.

ఈ సమీక్షా సమావేశంలో మంత్రి కేటీఆర్ ఔటర్ రింగ్ రోడ్ పరిధి లోపల పురపాలక శాఖ తరఫున కొనసాగిస్తున్న త్రాగునీటి ప్రాజెక్టుల పురోగతిని సమీక్షించారు. దీంతోపాటు జిహెచ్ఎంసి పరిధిలో చేపట్టిన ఎస్ ఆర్ డి పి వంటి అభివృద్ధి కార్యక్రమాలను సమీక్షించారు. ఈ వారంలోనే ఎస్ ఆర్ డి పి ప్రాజెక్టులో భాగంగా నిర్మాణమైన మరో రెండు కీలకమైన ఫ్లైఓవర్ లను ప్రజలకు అందుబాటులోకి తేనున్నట్లు కేటీఆర్ తెలిపారు.

ఈ సమీక్ష సమావేశంలో రాష్ట్రంలోని పురపాలికల మాస్టర్ ప్లాన్ తయారీ పైన మంత్రి కేటీఆర్ అధికారుల నుంచి వివరాలు అడిగి తెలుసుకున్నారు. మాస్టర్ ప్లాన్ ల తయారీ ప్రక్రియ ఇప్పటికే అనేక పురపాలికలు, అన్ని కార్పొరేషన్లలో పూర్తయిందని, నూతనంగా తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటు చేసిన మునిసిపాలిటీలలో మాస్టర్ ప్లాన్ లను సాధ్యమైనంత తొందరగా పూర్తిచేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేయాలని ఈ సందర్భంగా కేటీఆర్ అధికారులను ఆదేశించారు. ఈ సమీక్ష సమావేశంలో పురపాలక శాఖ, జిహెచ్ఎంసి, జలమండలి, టౌన్ ప్లానింగ్ ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

LEAVE A RESPONSE