Suryaa.co.in

Andhra Pradesh

నిరుద్యోగులారా.. జ‌గ‌న్ మోసంపై ఆందోళ‌న వ‌ద్దు.. అధైర్య‌ప‌డొద్దు..

-టిడిపి-జ‌న‌సేన ప్ర‌భుత్వం రాగానే డిఎస్సీ వేసి టీచర్ పోస్టుల ఖాళీలన్నీ భర్తీ చేస్తాం
– నిరుద్యోగుల‌కు టిడిపి జాతీయ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి నారా లోకేష్ బ‌హిరంగ లేఖ‌

జ‌గ‌న్ మోసంతో నిండా మునిగిన నిరుద్యోగులారా ఆందోళ‌న వ‌ద్దు, అధైర్య‌ప‌డొద్దు. త్వ‌ర‌లో టిడిపి-జ‌న‌సేన ప్ర‌భుత్వం వ‌స్తుంది. ఖాళీ టీచ‌ర్ పోస్టులు పార‌ద‌ర్శ‌కంగా భ‌ర్తీ చేస్తుంది. 2019 ఎన్నిక‌ల‌కి ముందు అధికారంలోకి రాగానే 23వేల ఖాళీ టీచ‌ర్ పోస్టుల భ‌ర్తీకి మెగా డీఎస్సీ తీస్తాన‌ని జ‌గ‌న్ హామీ ఇచ్చాడు. న‌మ్మి ఓట్లేసి గెలిపించిన నిరుద్యోగుల‌కు ఇచ్చిన హామీని ఐదేళ్లపాటు మ‌రిచిపోయాడు జ‌గ‌న్‌.

దిగిపోయే ముందు 6వేల పోస్టుల భర్తీకి డిఎస్సీ వేస్తున్నామంటూ జ‌గ‌న్ మ‌రోసారి చేస్తున్న మోసాన్ని గుర్తించండి. 2013లో ర‌ద్ద‌యిన అప్రెంటిషిప్ విధానాన్ని మ‌ళ్లీ తేవ‌డం జ‌గ‌న్ నాట‌కంలో భాగ‌మే. 2019 ఎన్నిక‌ల ముందు డిఎస్సీ హామీ ఇచ్చాడు, 2024 ఎన్నిక‌లొస్తున్న‌ప్పుడు ఆ హామీని అమ‌లు చేస్తానంటున్న జ‌గ‌న్ మాయ‌మాట‌లు న‌మ్మొద్దు నిరుద్యోగులారా!

ఎన్నికల ముందు 23 వేల ఖాళీలు ఉన్నాయ‌న్న జ‌గ‌న్‌, ఎన్నికల తరువాత 18 వేల ఖాళీలే అని మాట మార్చాడు. మంత్రి బొత్స ఖాళీగా ఉన్న 8,366 పోస్టులు మాత్రమే భర్తీ చేస్తామని అసెంబ్లీ సాక్షిగా ప్రకటించారు. చివ‌రికి 6 వేల పోస్టులకు డిఎస్సీ నోటిఫికేష‌న్ ఇస్తామ‌ని ఎల‌క్ష‌న్ డ్రామా మొద‌లుపెట్టారు. ఏపీలో 50 వేల టీచర్ పోస్టులు ఖాళీగా ఉన్నాయని పార్ల‌మెంటులో కేంద్రం వెల్ల‌డించింది. ఐదేళ్ల‌కి ముందు 23 వేలు పోస్టులుంటే, జగన్ పాలనలో ఒక్క పోస్టూ భర్తీచేయలేదు, ఈ కాలంలో రిటైరయిన పోస్టులు కలిపితే రెండింతలు కావాలి. అయితే జగన్ మాయతో వేల టీచ‌ర్ పోస్టులు గల్లంతయ్యాయి. దీనిపై నిరుద్యోగ యువ‌త‌కు జగన్ సర్కారు స‌మాధానం చెప్పాలి.

ఎన్నిక‌లు ద‌గ్గ‌ర ప‌డుతున్నప్పుడు డిఎస్పీ నోటిఫికేషన్ ఇస్తే, ఎన్నికల కోడ్ అమల్లోకి వస్తే కనీసం పరీక్ష నిర్వహణ కూడా సాధ్యం కాదు. ఇటువంటి పరిస్థితుల్లో డిఎస్పీ నోటిఫికేషన్ అంటే మ‌రోసారి నిరుద్యోగుల్ని వంచించే కుట్రే.

ఎన్టీఆర్, చంద్ర‌బాబు నేతృత్వంలోని ప్ర‌భుత్వాలు ఇప్ప‌టివ‌ర‌కూ 1,70,000 టీచ‌ర్ పోస్టులు పార‌ద‌ర్శ‌కంగా భ‌ర్తీ చేసిన ఘ‌న‌త దక్కించుకున్నాయి. ఇదే అనుభవంతో టిడిపి-జ‌న‌సేన ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చిన వెంట‌నే ఖాళీగా ఉన్న టీచ‌ర్ పోస్టులు భ‌ర్తీ చేస్తాం.

కొత్త పోస్టులు భర్తీ చేయకపోగా, ఉన్న పోస్టులు ఎత్తేసేందుకు జగన్ ప్రభుత్వం తెచ్చిన 117 జీవో వల్ల 65 వేల పోస్టులు ర‌ద్ద‌యిపోయాయి. వేల టీచరు పోస్టుల్ని మాయం చేసిన జగన్ నాటకం జీవో 117 ఎత్తేస్తాం.

2013లో రద్దయిన అప్రెంటిషిప్ విధానాన్ని అమలు చేస్తూ జగన్ చేస్తోన్న అన్యాయాన్ని సరిదిద్దుతాం. అప్రెంటిషిప్ విధానం రద్దు చేసి పూర్తిస్థాయి పేస్కేల్ అమలు చేస్తాం.
2014, 2019లో రెండు మెగా డిఎస్సీల ద్వారా 16,790 నిరుద్యోగులకు టీచర్ ఉద్యోగాలు కల్పించిన చంద్రబాబు మళ్లీ వస్తున్నారు. జగన్ మోసంతో నిరాశ చెందకుండా డిస్సీకి ఇప్పటి నుంచే సిద్ధం అవ్వండి.

LEAVE A RESPONSE