Suryaa.co.in

Andhra Pradesh

వైద్యశాఖలో ముందుచూపు లేని బదిలీలు

– రోగుల ప్రాణాలమీదకు తెస్తారా?
– నిలిపివేయాలని సీఎం జగన్‌కు ఎమ్మెల్యే అనగాని లేఖ

వైద్యశాఖలో ముందుచూపు లేకుండా చేపట్టిన బదిలీల వల్ల సిబ్బంది అనేక ఇబ్బందులు పడుతున్నారని టీడీపీ ఆందోళన వ్యక్తం చేసింది. ఈ మతిలేని బదిలీ నిర్ణయాల వల్ల ఆరోగ్యశాఖ కుప్పకూలి అది రోగుల ప్రాణాలమీదకు తెస్తోందని టీడీపీ ఎమ్మెల్యే అనగాని సత్యప్రసాద్ ఆవేదన వ్యక్తం చేశారు.

ఈ మేరకు ఆయన సీఎం జగన్‌కు లేఖ రాశారు. లేఖ సారాంశం అదీ.

గౌరవనీయులు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిగారికి నమస్కారములు

విషయం: ముందుచూపు లేకుండా వైద్యులు, సిబ్బంది బదిలీ వల్ల ఆరోగ్య వ్యవస్థ అల్లకల్లోలం, కరెంటు కోతలతో పలు ఆస్పత్రుల్లో చిన్నారుల మృతి, వైద్యుల కొరతతో రోగుల ఇక్కట్లు, బోధనాసుపత్రుల్లో దారుణంగా పరిస్థితులు, నిలిచిన అత్యవసర సేవల గురించి తెలిపేందుకు….

ముందస్తు కసరత్తు లేకుండా ఆరోగ్యశాఖలో చేపట్టిన వైద్యులు, సిబ్బంది బదిలీ ప్రక్రియ వల్ల మొత్తం వైద్య వ్యవస్థే నిర్వీర్యమవుతోంది. ఒకేసారి పెద్ద ఎత్తున వైద్యులను బదలీ చేయడంతో ప్రభుత్వాసుపత్రుల్లో వైద్య సేవలు నిలిచిపోయాయి. ఇప్పటికే కరెంటు కోతల కారణంగా ఆస్పత్రుల్లో టార్చ్ లైట్ల వెలుతురులో పురుళ్లు పోయాల్సిన పరిస్థితి వచ్చింది.

మీ సొంత జిల్లా కడప రిమ్స్ లో కరెంటు కోతలతో ముగ్గురు పసిపిల్లలు మృతిచెందారు. ప్రభుత్వం వైద్యుల బదిలీలపై పెట్టిన శ్రద్ధ చిన్నారుల ప్రాణాలపై పెట్టుంటే ఇలాంటి ఘోరాలు జరిగేవా? ప్రజల ప్రాణాలంటే మీకెందుకంత లెక్కలేనితనం? వైద్యుల కొరత వల్ల బోధనాసుపత్రుల్లో పరిస్థితులు ఎంత దారుణంగా ఉన్నాయో ఒక్కసారి క్షేత్రస్థాయికి వెళ్లి పరిశీలించండి. సరిపడా వైద్యులు లేక సకాలంలో వైద్యం అందక రోగులు నానా ఇక్కట్లు పడుతున్నారు. అత్యవసర విభాగాల్లోని రోగులకు వైద్యసేవలకు తీవ్ర అంతరాయం ఏర్పడుతోంది.

ఒక్కో ఆస్పత్రిలో 80 శాతం పైగా వైద్యులు, సిబ్బందిని బదిలీ చేయడం వల్ల తలెత్తే పరిణామాలేంటో ముందస్తు ఆలోచన చేయకపోవడం దేనికి సంకేతం? రోగుల కష్టాలు చూడలేక కొన్నిచోట్ల వైద్యులే వారిని దగ్గరుండి ప్రైవేటు ఆస్పత్రులను పంపుతున్న ఘటనలకు ముఖ్యమంత్రిగా మీరు ఏం సమాధానం చెప్తారు?
టీడీపీ ప్రభుత్వంలో ఐదేళ్లకు పైబడిన వారందరినీ కాకుండా బదిలీలకు సుముఖంగా ఉన్నవారినే ఇతరల ప్రాంతాలకు పంపించడం జరిగింది. దీనివల్ల వైద్య సేవలకు ఎటువంటి ఇబ్బంది కలగలేదు. లాంగ్ స్టాండ్ లో 20 శాతం మించకుండా బదిలీలు చేశారు. ఇప్పుడా నిబంధనను ఏకపక్షంగా ఎత్తేయడం ఎంతవరకు సమంజసం? పేరుకే ప్రభుత్వాసుపత్రుల్లో ఉంటూ ప్రైవేటు ప్రాక్టీస్ కే ప్రాధాన్యత ఇస్తున్న వైద్యులపై చర్యలు తీసుకోవడంలో, వారిని బదిలీ చేయడంలో తప్పు లేదు.

కానీ 20 శాతం మించని వారిని దృష్టిలో పెట్టుకుని అందరిపై ఇలా బదిలీ వేటు వేయడం సరికాదు. విద్యా సంవత్సరం మధ్యలో బదిలీల వల్ల ఆ ప్రభావం వైద్య విద్యార్థులపై పడుతోంది. అలాగే పదోన్నతులు కల్పించాక బదిలీలు చేస్తే ఇబ్బందులుండవు. కానీ మీరు తెచ్చిన విధానం ప్రకారం బదిలీపై వెళ్లాక పదోన్నతులు కల్పించడంతో నెల వ్యవధిలో రెండుసార్లు కొత్త చోట్లకు వెళ్లాల్సి రావడం రాష్ట్ర చరిత్రలో ఇదే తొలిసారి. ట్రాన్స్ ఫర్ ఇష్టంలేని వారు లాంగ్ లీవ్ పై వెళ్లడం, రాజీనామాకు సిద్ధపడటంతో ఆస్పత్రుల్లో వైద్యుల కొరత పెరిగి రోగులు అవస్థలు పడున్నారు.

కరోనా విపత్తులో ప్రభుత్వం ఆస్పత్రుల్లో కనీస సౌకర్యాలు కల్పించకపోయినా ప్రాణాలకు తెగించి రోగులకు సేవలందించిన వైద్యుల బదిలీల విషయంలో ప్రభుత్వం ఏకపక్షంగా వ్యవహరించడం దుర్మార్గం. కొవిడ్ ఇబ్బందుల నుంచి ఇప్పుడిప్పుడు సాధారణ పరిస్థితులు నెలకొంటున్న సమయంలో బదిలీల కుదుపు ఎంతవరకు సమంజసం?

ప్రభుత్వ అనాలోచిత నిర్ణయాల వల్ల పేద, బడుగు వర్గాల ప్రజలు ప్రభుత్వాసుత్రుల్లో వైద్యం అందక అప్పు చేసి మరీ ప్రైవేటు ఆస్పత్రులకు వెళ్లాల్సి వస్తోంది. అక్కడేమో ప్రభుత్వం గొప్పగా చెప్పే ఆరోగ్యశ్రీ కింద ఉచిత వైద్యం చేయడంలేదు. ఇందుకు మీది బాధ్యత కాదా? కరోనా దెబ్బతో ఇతర రాష్ట్రాలు వైద్య రంగం బలోపేతంపై దృష్టి పెడుతుంటే అందుకు భిన్నంగా రాష్ట్రంలో వ్యవహరించడం సరికాదు. ఇకనైనా ప్రజల ప్రాణాలతో చెలగాటమాడటం ఆపి మెరుగైన వైద్య సేవలు అందించేందుకు చర్యలు తీసుకోండి.

(అనగాని సత్యప్రసాద్)
తెలుగుదేశం శాసనసభ్యులు

LEAVE A RESPONSE