Suryaa.co.in

Editorial

కాంగ్రెస్‌లోకి విజయశాంతి?

– అదే దారిలో మాజీ ఎంపి కొండా విశ్వేశ్వరరెడ్డి?
– గతంలో కిషన్‌రెడ్డి ఉన్నా మధ్యలోనే నిష్ర్కమించిన విజయశాంతి
– తెలంగాణ వ్యతిరేకులతో వేదిక పంచుకోనని రాములమ్మ ట్వీట్‌
– పెద్ద పదవులిచ్చినా జారుతున్న అగ్రనేతలు
– బీఆర్‌ఎస్‌తో లాలూచీ భావనే అసంతృప్తికి కారణం
– అభ్యర్ధుల జాబితాపై అగ్రనేతల పెదవి విరుపు
– బీఆర్‌ఎస్‌కు అనుకూలంగా ఉందంటూ విమర్శలు
– గ్రేటర్‌లో ఒక బలహీనమైన నేతకు ఇచ్చిన సీటుతో నేతల నిర్థరణ
– కావాలనే బలహీనమైన అభ్యర్ధులను ఎంపిక చేశారన్న ఆగ్రహం
– కిషన్‌రెడ్డి నాయకత్వంపై నేతల గరం గరం
( మార్తి సుబ్రహ్మణ్యం)

మాజీ ఎంపి, తెలంగాణ ఫైర్‌బ్రాండ్‌ విజయశాంతి బీజేపీని వీడి కాంగ్రెస్‌లో చేరనున్నారు. ఆ మేరకు కాంగ్రెస్‌ నాయకత్వంతో ఆమె ఇప్పటికే సంప్రదింపులు పూర్తి చేశారన్న చర్చ పార్టీ వర్గాల్లో జరుగుతోంది. నిజానికి విజయశాంతి గత కొంతకాలం నుంచీ ట్విట్టర్‌లో చేస్తున్న వ్యాఖ్యలు, ఆమెలో రగులుతున్న అసంతృప్తిని స్పష్టం చేస్తున్నాయి.

బీఆర్‌ఎస్‌తో పోరాటపంథా విడిచి, రాజీ మార్గంలో నడుస్తున్న బీజేపీ నాయకత్వ తీరుపై విజయశాంతి అసంతృప్తితో రగిలిపోతున్నారు. ఈ క్రమంలో అసంతృప్తిపరుల జాబితాలోని కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి, వివేక్‌ ఇటీవలే బీజేపీకి రాంరాం చెప్పి, కాంగ్రెస్‌లో చేరారు. నాగం వంటి సీనియర్లు బీఆర్‌ఎస్‌లో చేరారు. ఇప్పుడు రాములమ్మ కూడా ‘కమలవనం’ నుంచి బయటకు వచ్చి, కాంగ్రెస్‌ తీర్ధం చేసుకునేందుకు సిద్ధమవుతుండటం కమలంలో కలవరం రేపుతోంది.

తెలంగాణ ఫైర్‌బ్రాండ్‌ విజయశాంతి కాంగ్రెస్‌లో చేరేందుకు సిద్ధమవుతున్నారు. ఇటీవలి కాలంలో బీజేపీ నాయకత్వ వైఖరిపై అసంతృప్తితో రగిలిపోతున్న విజయశాంతి, పార్టీ మారతారన్న ఊహాగానాలు చాలాకాలం నుంచి వినిపిస్తున్న విషయం తెలిసిందే. ఆ మేరకు ఆమె చేస్తున్న ట్వీట్లు కూడా విజయశాంతి అసంతృప్తికి అద్దం పట్టాయి. పార్టీలో సీనియర్‌ అయినప్పటికీ, ఆమెకు తగిన ప్రాధాన్యం ఇవ్వని వైనమే అసంతృప్తికి ప్రధాన కారణంగా కనిపిస్తోంది.

ఇటీవల మోదీ-అమిత్‌షా హైదరాబాద్‌కు వచ్చినప్పటికీ, విజయశాంతి వారిని కలవకుండా ముఖం చాటేయడం చర్చనీయాంశమయింది. తన సేవలు ఎందుకు వినియోగించుకోవడం లేదో నాయకత్వాన్ని మీరే ప్రశ్నించండి అని ఓ సందర్భంలో విజయశాంతి మీడియాతో వ్యాఖ్యానించిన విషయం తెలిసిందే. దాన్ని బట్టి తనకు పార్టీలో ప్రాధాన్యం లేదని, తనకు సరైన బాధ్యతలు అప్పగించడం లేదన్న అసంతతృప్తి, విజయశాంతిలో స్థాయిలో ఉందో స్పష్టమవుతోంది. కాగా ఆమె రేపు కాంగ్రెస్‌లో చేరవచ్చని పార్టీ వర్గాల సమాచారం.

ఇక మాజీ ఎంపి కొండా విశ్వేశ్వరరెడ్డి కూడా, బీజేపీకి రాంరాం చెప్పేందుకు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. తన పార్లమెంటు పరిథిలో 30 శాతం ఓటర్లు ఉన్న శేరిలింగంపల్లి సీటును జనసేనకు ఇవ్వవద్దని, తాను సిఫార్సు చేసిన రవికుమార్‌ యాదవ్‌కు ఇవ్వాలని కొండా పట్టుపడుతున్నారు. ఒకవేళ కాదని మరొకరికి సీటు ఇస్తే, తాను పార్టీలో ఉండనని ఆయన తెగేసి చెప్పినట్లు పార్టీ వర్గాల సమాచారం.

ఇప్పటికే వివేక్‌, కోమటిరెడ్డి వంటి అగ్రనేతలు కాంగ్రెస్‌లో చేరగా, విజయశాంతి కూడా వారి బాట పట్టేందుకు సిద్ధమవుతున్నారు. ఈ నేపథ్యంలో విశ్వేశ్వరరెడ్డి కూడా పార్టీలో కొనసాగడకం అనుమానమేనని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. శేరిలింగపల్లి సీటు సాకుతో ఆయన కూడా బయటకు రావడం ఖాయమంటున్నారు.

అయితే విచిత్ర ంగా పార్టీలో ఉన్నత పదవులు తీసుకున్నప్పటికీ.. అగ్రనేతలెవరూ సంతృప్తిగా లేకపోవడమే ఆశ్చర్యం. విజయశాంతికి జాతీయ కార్యవర్గ సభ్యురాలితోపాటు, ఆందోళన కమిటీ చైర్మన్‌ పదవి ఇచ్చారు. వివేక్‌కు మేనిఫెస్టో కమిటీ చైర్మన్‌తో పాటు, అదనంగా పబ్లిసిటీ కమిటీ పదవి ఇచ్చారు. కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డికి జాతీయ కార్యవర్గంలో స్థానం లభించింది.

ఇన్ని ప్రధాన పదవులు తీసుకున్నప్పటికీ.. అధికార బీఆర్‌ఎస్‌తో తమ పార్టీ యుద్ధం చేయడం లేదన్నది, వీరి ప్రధాన అసంతృప్తి. దానిపై జాతీయ నాయకత్వం నుంచి ఎలాంటి స్పష్టత రాకపోగా, రాష్ట్ర పార్టీలో ఉన్న గ్రూపు రాజకీయాలు కూడా వీరంతా కాంగ్రెస్‌లో చేరేందుకు కారణంగా కనిపిస్తోంది. దానికితోడు ప్రజల్లో కాంగ్రెస్‌కు సానుకూలత కనిపించడం, రేవంత్‌రెడ్డి అధ్యక్షుడయిన తర్వాత కాంగ్రెస్‌ తిరిగి అధికారంలోకి వస్తుందన్న భావన కనిపిస్తుండటంతో బీజేపీ అగ్రనేతలు కాంగ్రెస్‌ వైపు చూస్తున్నట్లు స్పష్టమవుతోంది.

అయితే తమ అసంతృప్తిని చల్చార్చేందుకు, తమను బుజ్జగించేందుకే నాయకత్వం పదవులిచ్చిన విషయం తమకు తెలుసని ఓ అగ్రనేత వ్యాఖ్యానించారు.

‘మేం కేసీఆర్‌పై వ్యతిరేకతతో బీజేపీలో చేరాం. అప్పుడు బండి సంజయ్‌ సర్కారుపై పోరాడారు. ఆయనను హటాత్తుగా మార్చి కిషన్‌రెడ్డిని నియమించిన తర్వాత పార్టీ పూర్తిగా పడకేసింది. బీఆర్‌ఎస్‌ను ఓడించే బదులు కాంగ్రెస్‌ అధికారంలోకి రాకూడదన్న సిద్ధాంతమే మా పార్టీ నాయకత్వంలో కనిపిస్తోంది. ఈరోజు బీజేపీ అభ్యర్ధుల జాబితా చూసిన తర్వాత మా అనుమానం పూర్తిగా బలపడింది. హైదరాబాద్‌లోని ఒక నియోజకవర్గ అభ్యర్ధిగా ఒక సబ్‌ జూనియర్‌, నాయకుల చుట్టూ తిరిగే వ్యక్తికి సీటు ఇచ్చిన తర్వాత ఇంకా కాంగ్రెస్‌లో ఉండటం ఆత్మహత్యాసదృశమే’నని కుండబద్దలు కొట్టారు.

తాజా బీజేపీ అభ్యర్ధుల జాబితా పరిశీలిస్తే, ఓట్లు చీల్చి బీఆర్‌ఎస్‌కు లబ్ది చేకూర్చే ప్రయత్నమేనన్న వ్యాఖ్యలు పార్టీ వర్గాల్లో వినిపిస్తున్నాయి. చాలామందిని బలహీనమైన అభ్యర్ధులు నిలబెట్టారన్న చర్చ పార్టీ వర్గాల్లో జరుగుతోంది.

వివిధ పార్టీల నుంచి బీజేపీలో చేరిన అగ్రనేతలకు, కిషన్‌రెడ్డి నాయకత్వ నిర్ణయాలు రుచించడం లేదు. గెలుపు గుర్రాలకు కాకుండా, ఎంపిక చేసుకున్న వారికి సీట్లు ఇస్తున్న వైనంపై అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.

గతంలో కిషన్‌రెడ్డి సమక్షంలో పార్టీ సమావేశానికి హాజరైన మాజీ సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి రాకను విజయశాంతి జీర్ణించుకోలేక, బయటకు వెళ్లిపోవడం పార్టీలో హాట్‌టాపిక్‌ అయిన విషయం తెలిసిందే. ఆ తర్వాత తెలంగాణను అడ్డుకున్న వారితో వేదిక పంచుకోవడం ఇష్టం లేకనే మధ్యలో వెళ్లిపోయానని చేసిన ట్వీట్‌, కిషన్‌రెడ్డి తీరుపై ఆమె అసంతృప్తికి అద్దం పట్టింది.

సికింద్రాబాద్‌ పార్లమెంటు పరిథిలో అసెంబ్లీ సీట్లు ఇచ్చిన వారిలో ముగ్గురు మినహాయించి, మిగిలినవారెవరూ కనీస పోటీ ఇచ్చే స్ధాయి అభ్యర్ధులు లేరన్న చర్చ పార్టీ వర్గాల్లో జరుగుతోంది. జనంలో కాకుండా తన చుట్టూ తిరిగే ఒక నేతకు సీటు ఇచ్చిన వైనం పరిశీలిస్తే.. ఎన్నికల్లో బీజేపీ గెలవాలన్న భావన-పట్టుదల, పార్టీ నాయకత్వంలోనే లేదని స్పష్టమవుతోందని సీనియర్లు స్పష్టం చేస్తున్నారు.

LEAVE A RESPONSE