Suryaa.co.in

Andhra Pradesh

చంద్రబాబు ప్రజల్లో తిరిగితే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానికి వచ్చిన నష్టం ఏమిటి?!

-ప్రజల్లో చంద్రబాబు నాయుడుని తిరగనివ్వొద్దని సుప్రీంకోర్టును అభ్యర్థించడం వెనుక ఆంతర్యం ఏమిటి??
-గతంలో కన్నా రెట్టించిన ఉత్సాహంతో కొనసాగుతున్న యువ గళం పాదయాత్ర
-నరసాపురం ఎంపీ రఘురామకృష్ణం రాజు

తెదేపా అధినేత, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రజల్లో తిరిగితే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానికి వచ్చిన నష్టం ఏమిటని నరసాపురం ఎంపీ, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు రఘురామకృష్ణం రాజు ప్రశ్నించారు. ఒకపక్క రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ చంద్రబాబు నాయుడు ఎక్కడ ఉన్నా తమకు ఒకటేనని పేర్కొంటుండగా, మరొకవైపు ఆయన్ని ప్రజల్లో తిరగకుండా ఆదేశాలు ఇవ్వాలని సుప్రీంకోర్టును జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అభ్యర్థించడం వెనుకనున్న ఆంతర్యం ఏమిటంటూ నిలదీశారు.

రఘురామకృష్ణంరాజు మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ… సుప్రీంకోర్టులో బాబ్బాబు చంద్రబాబు నాయుడు ని ప్రజల్లో తిరగనివ్వొద్దని అభ్యర్థిస్తున్నారంటే, ఆయన ఏమైనా ఒత్తిడికి గురవుతారని అడుగుతున్నారా? అంటూ అపహాస్యం చేశారు. ప్రజల్లోకి చంద్రబాబు నాయుడుని వెళ్ళనివ్వొద్దని కోరడానికి కారణం భయమే కదా అంటూ సూటిగా ప్రశ్నించారు. చంద్రబాబు నాయుడు ప్రజల్లోకి వెళితే…రానున్న ఎన్నికల్లో తుక్కు తుక్కుగా ఓడిపోతామని తెలిసి, ఆయన్ని ఎలాగైనా అడ్డుకోవడమే ధ్యేయంగా సుప్రీంకోర్టులో ప్రభుత్వం తరఫున న్యాయవాదులు ఈ తరహా వాదనలు వినిపించారు.

స్కిల్ కేసులో పూర్తిస్థాయి బెయిల్ పొందిన చంద్రబాబు నాయుడు రెట్టించిన ఉత్సాహంతో ప్రజల్లోకి వెళ్లడం ఖాయమన్నారు. రాజమండ్రి కేంద్ర కారాగారం నుంచి విడుదలై అమరావతి లోని ఆయన ఇంటికి చేరుకోవడానికి 14 గంటల సమయం పట్టిన విషయం తెలిసిందే. దాని పర్యవసానంగానే ప్రభుత్వ పెద్దలు కోర్టులో తమ అడ్వకేట్ల చేత ఇలా మాట్లాడిస్తున్నారు. పొద్దున్నే తమ సొంత పేపర్ లో దిక్కుతోచని దేశం అంటూ పనికిమాలిన వార్తలు రాసి, మధ్యాహ్నానికి కోర్టులో మాత్రం ప్లీజ్ డోంట్ అలోహిమ్ మూవ్ ఇన్ ది పబ్లిక్ లార్డ్ షిప్ అని అడుక్కునే నీచ స్థాయికి దిగజారారంటేనే రానున్న ఎన్నికల్లో మనం అవుట్ అని స్పష్టమవుతుంది.

పార్టీ నుంచి ఇంకా నన్ను బహిష్కరించలేదు కాబట్టి, ఇంకా మనం అవుట్ అని చెబుతున్నాను. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి, సకల శాఖామంత్రి సజ్జల రామకృష్ణారెడ్డి సుప్రీంకోర్టులో మీ అభ్యర్థన చూసిన తర్వాత దిక్కుతోచని దేశం అనే టైటిల్ కు విరుగుడుగా దిక్కుతోచక, దిక్కులు చూస్తున్న వైకాపా అని రాస్తే బాగుంటుంది. న్యాయస్థానంలో వాదోపవాదనలను చూశాక, భగవంతుడి అనుగ్రహం తెలుగు ప్రజలపై, తెలుగుదేశంపై, ఆ పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు పై ఉందనడానికి మా వారి బేలతనమైన పేలవ ప్రదర్శనను చూస్తే స్పష్టమవుతోంది. సుప్రీం కోర్టు , రాష్ట్ర ప్రభుత్వం తరఫున చేసిన వాదనలను పరిగణలోకి తీసుకోకపోవడం పరిశీలిస్తే, భగవంతుడి అనుగ్రహం తెలుగుదేశం పై ఉందని అర్థమవుతోందని రఘురామ కృష్ణంరాజు అన్నారు.

ప్రజల్లోకి వెళ్లి మీటింగులు పెట్టడాన్ని నిషేధించాలన్న ప్రాసిక్యూషన్ తరపు న్యాయవాదులు
తెదేపా అధినేత చంద్రబాబు నాయుడు ప్రజల్లోకి వెళ్లి సభలు, సమావేశాలు, ఊరేగింపులను నిర్వహించడాన్ని నిషేధించాలని సుప్రీంకోర్టుకు రాష్ట్ర ప్రభుత్వం తరపున తరఫున ముకుల్ రోహత్గి, రంజిత్ కుమార్ లు వాదనలు వినిపించారు.. భోజన విరామ అనంతరం ఐటెం నెంబర్ 64 గా బెంచ్ పైకి వచ్చిన ఈ కేసులో 10 నిమిషాల పాటు వాదనలు జరిగాయి. చంద్రబాబు నాయుడును ప్రజల్లో తిరగకుండా ఆదేశాలు ఇవ్వాలని కోరుతూ ప్రభుత్వం తరఫున వాదనలు వినిపించిన మాజీ అటార్నీ జనరల్, మాజీ సోలిసిటర్ జనరల్ ఆఫ్ ఇండియాలు తీవ్రంగానే ప్రయత్నించారు.

కానీ సుప్రీంకోర్టు ధర్మాసనం వారి వాదనలను పరిగణలోకి తీసుకోలేదు. కండిషన్ బెయిల్ మంజూరు చేసినప్పుడు విధించిన షరతులను యధావిధిగా కొనసాగించాలని వారు కోరారు. పూర్తిస్థాయి బెయిల్ మంజూరు చేసిన తర్వాత చంద్రబాబు నాయుడుకు గతంలో విధించిన షరతులను కోర్టు ఎత్తివేసింది. అయితే, కండిషన్ బెయిల్ సందర్భంగా విధించిన షరతులను యధావిధిగా కొనసాగించాలని ప్రభుత్వం తరపు న్యాయవాదులు సుప్రీంకోర్టు ధర్మాసనాన్ని అభ్యర్థించారు. చంద్రబాబు నాయుడు ప్రజల్లోకి వెళ్లి సభలు, సమావేశాలు, ఊరేగింపులు నిర్వహించకుండా నిషేధించమని కోరడం చూస్తుంటే… గజ గజ వనికి పోతున్న వారి తత్వాన్ని బహిర్గతం చేశారనడంలో ఎటువంటి సందేహం లేదు.

స్కిల్ కేసు పై చంద్రబాబు నాయుడు మాట్లాడవద్దని షరతు విధించారు. ప్రభుత్వం తరఫున మాత్రం సిఐడి చీఫ్ సంజయ్, రాష్ట్ర ప్రభుత్వ అడిషనల్ అడ్వకేట్ జనరల్ సుధాకర్ రెడ్డి ఊరూరు తిరిగి మాట్లాడొచ్చు. అన్యాయంగా నాపై కేసు మోపారని, ఆ కేసు గురించి బాధితుడికి చెప్పుకోవడానికి వీలు లేదట. గతంలో ఈ కండిషన్ పెట్టారు. అయితే అదేమీ అసాధారణ కండిషన్ కాదు. కేసు విచారణలో ఉన్నప్పుడు, ఈ తరహా కండిషన్ కోర్టు విధించడం పరిపాటే. పబ్లిక్ మీటింగులలో చంద్రబాబు నాయుడు పాల్గొనడానికి వీలులేదని ఆదేశించాలని ప్రభుత్వం తరఫున వాదనలు వినిపించిన అడ్వకేట్లు బ్రతిమిలాడగా, కోర్టు ఖరాకండిగా తోసిపుచ్చింది.

స్కిల్ కేసులో అవినీతి నిరోధక చట్టంలోని 17 A నిబంధన వర్తింపు పై వాదనలు విన్న సుప్రీం కోర్టు తీర్పును రిజర్వ్ చేసిన విషయం తెలిసింది. ఆ బెంచ్ లో నెంబర్ టు జడ్జిగా ఉన్న, న్యాయమూర్తి 16 నెంబర్ కోర్టులోని బెంచ్ కు సారథ్యం వహించారు. సుప్రీంకోర్టు తీర్పు అనంతరం చంద్రబాబు నాయుడు దైవదర్శనానికి వెళ్ళవచ్చు. తిరుమలలోని కలియుగ దైవమైన శ్రీ వేంకటేశ్వర స్వామిని, విజయవాడలోని దుర్గమ్మ తల్లిని, విశాఖపట్నంలోని సింహాద్రి అప్పన్న ఆయన దర్శించుకోవడానికి ఎటువంటి ఆటంకాలు లేవు. చంద్రబాబు నాయుడు సభలలో, సమావేశాలలో, ఊరేగింపులలో పాల్గొనడానికి ఎటువంటి అభ్యంతరం లేదు.

ఈ ప్రభుత్వ అవినీతిని, ధమనకాండను ఎత్తిచూపుతూ తన రాజకీయ ఎజెండా ను నిరభ్యంతరంగా ఆయన ప్రచారం చేసుకోవచ్చు. ఇసుక ఉచితంగా అందజేస్తే మా ఖజానాకు బొక్క పడిందన్న కేసు, లిక్కర్ లో ఎవరిపైనో పెనాల్టీ విధిస్తే వేవ్ చేశారని వాసుదేవ రెడ్డి, గనుల శాఖ డైరెక్టర్ వెంకట్ రెడ్డి లు ఫిర్యాదు చేయగా నమోదు చేసిన కేసుల గురించి చంద్రబాబు నాయుడు స్వేచ్ఛగా మాట్లాడవచ్చు.. మాట్లాడుతారా లేదా అన్నది ఆయన ఇష్టం. అలాగే ప్రజలు కూడా ఈ కేసుల గురించి నిరభ్యంతరంగా మాట్లాడవచ్చు. ఈ కేసు విచారణ అనంతరం నేను కొంతమంది న్యాయ నిపుణులతో మాట్లాడాను.

అవినీతి నిరోధక చట్టంలోని 17 A నిబంధన గురించి అభ్యంతరాలు ఉంటే తెలియజేయమని న్యాయస్థానం కోరింది. డిసెంబర్ 8వ తేదీలోగానే ఈ కేసు తీర్పు వెలువడే అవకాశం ఉంది. ఎనిమిదవ తేదీ లోగానే వస్తుందా లేదా అన్నది… చూడాలన్నారు. గతంలో సుప్రీంకోర్టు తీర్పుల అనుగుణంగానే ఈ తీర్పు వెలువడే అవకాశం ఉందని, అవినీతి నిరోధక చట్టంలోని 17 A నిబంధన ఈ కేసులోనూ వర్తిస్తుందని తీర్పు వెలువడుతుందని ఆశిస్తున్నట్లుగా రఘురామ కృష్ణంరాజు తెలిపారు.

హవ్వ… ఇవేమీ రాతలు
దిక్కుతోచని స్థితిలో దేశం, ముఖ్యమంత్రి కున్న జనాదరణ చూసి చంద్రబాబు నాయుడు గ్యాంగ్ లో గుబులు అంటూ సాక్షి దినపత్రికలో ఒక సరదా కథనాన్ని రాశారని రఘురామకృష్ణం రాజు ఎద్దేవా చేశారు. టిడిపి గెలిచిన స్థానాలలో బలమైన అభ్యర్థులను బరిలోకి దించాలని నిర్ణయించినట్లుగా పేర్కొంటూనే, సామాజిక సాధికార యాత్రకు ప్రజల నుంచి అనూహ్య స్పందన లభిస్తుందనడం హాస్యాస్పదంగా ఉంది. ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే 175 స్థానాలలో వైకాపా విజయం సాధిస్తుందని పేర్కొన్నారు.

ఇప్పటికీ ఇప్పుడు ఎన్నికలు జరగవని, ఏప్రిల్ లో జరిగే ఎన్నికలలో ఓడిపోతామన్నది వారి భావన కావచ్చునని అన్నారు. ఓట్లు తొలగిస్తున్నారని పచ్చ మీడియా విష రాతలు రాస్తుందన్నారు. ప్రతిపక్ష పార్టీల సానుభూతిపరుల ఓట్లను వీరు తొలగించవచ్చు. లేని వారి పేరిట ఓట్లను నమోదు చేయించవచ్చు… ఒక్కొక్కరి పేరిట మూడేసి ఓట్లను, చనిపోయిన వారి పేరిట దొంగ ఓట్లను నమోదు చేయించవచ్చు… దిక్కుమాలిన వాలంటీర్లను ప్రజలపైకి వదిలివేసి, వారి చేత వెట్టి చాకిరి చేయించుకుంటూ తీవ్రమైన అక్రమాలకు, అన్యాయాలకు పాల్పడుతుంటే… అవి పచ్చ మీడియా రాతలు… రామోజీరావు రాతలు అంటే జనాలు ఏమైనా పిచ్చివారా? వారికి నిజ, నిజాలు తెలియదా అంటూ ప్రశ్నించారు.

తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ నిర్వహిస్తున్న యువ గళం రెండవ దఫా పాదయాత్ర, మొదటి దఫా పాదయాత్ర కంటే రెట్టించిన ఉత్సాహంతో కొనసాగుతోంది. అప్పుడు రివాల్వర్ మాదిరిగా కనిపించిన నారా లోకేష్, ఇప్పుడు ఏకే 47 రేంజ్ లో ప్రభుత్వ అవినీతి అక్రమాలపై ఫైర్ అవుతున్నారని రఘురామ కృష్ణంరాజు తెలిపారు .

LEAVE A RESPONSE