Suryaa.co.in

Andhra Pradesh

జగన్ పడుకున్నారో..మేలుకున్నారో ?

– ఉద్యోగుల పోరాటం సఫలీకృతం కావాలి
– దేశంలో లౌకికవాదానికి ప్రమాదం
– ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు డాక్టర్ సాకే శైలజనాథ్

అనంతపురం : అత్యధికమైన పీఆర్సీ ఇచ్చిన పార్టీ కాంగ్రెస్ పార్టీ అని ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు డాక్టర్ సాకే శైలజనాథ్ అన్నారు. గురువారం మీడియాతో మాట్లాడుతూ పీఆర్సీ కోసం ఉద్యోగుల చేస్తున్న పోరాటం సఫలీకృతం కావాలని ఆకాంక్షించారు. మాయ మాటలతో ప్రజలను, ఉద్యోగులను మోసం చేసి అధికారంలోకి వచ్చిన జగన్ రెడ్డి ఇప్పుడు అంకెల గారడీతో జీతాలు తగ్గించలేదని మళ్లీ మోసం చేస్తున్నారన్నారని శైలజానాథ్ విమర్శించారు.

ప్రతిపక్ష నేతగా జగన్ రెడ్డి ఇచ్చిన హమీలను ఉద్యోగులు ప్రశ్నించడమే తప్పా అని అన్నారు. చలో విజయవాడ కార్యక్రమంలో పాల్గొనే ఉద్యోగుల విషయంలో జగన్ సర్కారు అనుసరించిన అణిచివేతను శైలజనాధ్ దుయ్యబట్టారు. రాష్ట్రవ్యాప్తంగా ఉద్యోగులను ముందస్తు అరెస్టులు చెయ్యడం దుర్మార్గమని ధ్వజమెత్తారు. ఉద్యోగుల నిరసనలపై గతంలో ఏ ప్రభుత్వం కూడా ఇలా నియంతృత్వంగా వ్యవహరించలేదని మండిపడ్డారు. పీఆర్సీ విషయంలో ప్రభుత్వం చేసిన మోసంపై నిరసన తెలిపే హక్కు ఉద్యోగులకు లేదా అని ప్రశ్నించారు. శాంతియుత నిరసనలకు వస్తున్న ఉపాధ్యాయులు, ఉద్యోగుల సంఘాల ప్రతినిధులను తీవ్రవాదుల్లా అరెస్టులు చేశారని శైలజనాథ్ ఆక్షేపించారు. ప్రభుత్వ ఉద్యోగులు ప్రభుత్వంలో భాగం అంటూనే మానసికంగా, భౌతికంగా హింసిస్తున్నారని వాపోయారు.

డిమాండ్లు పరిష్కరించాలని రోడ్డెక్కితే..పోలీసుల్ని ఉసిగొల్పి ఉద్యోగుల ఆత్మగౌరవాన్ని దారుణంగా దెబ్బతీశారని శైలజానాథ్ ధ్వజమెత్తారు. దేశంలో లౌకికవాదానికి ప్రమాదం : బీజేపీ జగన్మోహన్ రెడ్డి ఆడే డ్రామాకు తెరతీసి అమరావతే రాజధాని అని నరేంద్రమోడీ ప్రకటించాలని డిమాండ్ చేశారు. కేంద్ర బడ్జెట్పై మాట్లాడే ధైర్యం లేని పిరికి వాళ్లు జగన్మోహన్ రెడ్డి పార్టీ వాళ్లు అని వ్యాఖ్యలు చేశారు. జగన్ పడుకున్నారో మేలుకున్నారో మాట్లాడుతున్నారో అర్థం కావడం లేదన్నారు. స్టిక్కర్లు వేసుకుని రోడ్లపై తిరగడం, ల్యాండ్ స్కాంలలో ఎమ్మెల్యేలు ఇన్వాల్వ్ అవుతూ వ్యవస్థలను నాశనం చేస్తున్నారని మండిపడ్డారు.

భారతీ సిమెంట్స్ కోసం కాకపోయినా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విభజన హామీల అమలు కోసం నోరు తెరవాలని డిమాండ్ చేశారు. దేశంలో లౌకికవాదానికి ప్రమాదం వస్తోందన్నారు. దేశ ప్రజల ఆస్తులను ఒకరిద్దరికి అమ్మే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. అనంతలో రోడ్ల దుస్థితిపై ప్రత్యక్ష కార్యాచరణకు ఈ నెల 10న ప్రచార కార్యక్రమంతో పాటు కార్యాలయాల ముట్టడి చేయనున్నట్లు శైలజానాథ్ తెలిపారు.

LEAVE A RESPONSE