Suryaa.co.in

Editorial

ఫాదర్స్‌ డే.. మదర్స్‌డేలు.. మనకు అవసరమా?

– ఇంగ్లీషోళ్ల తండ్రుల తద్దినాలు మనమెందుకు చేయాలి?
– 250 మంది తండ్రులు సజీవ సమాధి రోజున భారతీయులు ‘ఫాదర్స్‌డే’ చేయాలా?
( మార్తి సుబ్రహ్మణ్యం)

హ్యాపీ ఫాదర్స్‌ డే.. హ్యాపీ మదర్స్‌ డే.. ఇలా ఏడాదికోసారి ‘దినాలు’ చేసుకుంటున్నాం. తల్లిదండ్రులకు ఫోన్లు చేసి చెబుతుంటాం. లేకపోతే వారికి స్వీటు తినిపించి, ఆ ఫొటోను వాట్సాపు, ఫేస్‌బుక్కుల్లో పెట్టి పబ్లిసిటీ చేసుకుంటాం. అదో తుత్తి! ఆరోజు మన టీవీలు, పత్రికలన్నీ ‘నాన్నా.. ఓ నాన్న.. నీ మనసే వెన్న’ అంటూ ఓల్డు సాంగులు, ప్రముఖుల ఫొటోలతో ఊదరకొట్టేస్తాయి. మానన్న గొప్పొడంటూ సెలబ్రిటీలు చెప్పే సొల్లంతా జనం మీద వదిలేస్తాయి. ఇవన్నీ మనం దశాబ్దాల నుంచి చూస్తున్నవే.

వాస్తవానికి ఇవన్నీ మన దేశపు సంస్కృతి కావు. పాశ్చాత్య పోకడ. అక్కడ ఏడాదికోసారి ఈ దినాలు చేసుకుంటారు. కానీ మన దేశంలో ఇవి అవసరమా? అమ్మా.. నాన్నలు బతికున్నప్పుడు వారిని సరిగాmother-father-759 చూసుకుంటే చాలు కదా? వృద్ధాప్యంలో వారికి ఇంత తిండి పెడుతున్నామా? లేదా? గ్రామాల్లో ఉంటే అప్పుడప్పుడు వారివద్దకు వెళ్లి కష్టసుఖాలు తెలుసుకుంటున్నామా ? లేదా? అన్నదే కొడుకులుగా మనకు మనం వేసుకోవలసిన ప్రశ్న. అత్త-మామలను సక్రమంగా చూస్తున్నామా? లేదా? అని కోడళ్లు వేసుకోవలసిన ప్రశ్న. అంతేగానీ.. ఏడాదికోసారి ఎందుకీ మొక్కుబడి తద్దినాలు? అవసరమా? అని కాదు.

ఇంకో విషయం.. చాలామందికి తెలియని వాస్తవమిది. అసలు ఫాదర్స్‌ డే ఎందుకు చేస్తున్నారో తెలుసుకుంటే… అసలు జన్మలో ఇలాంటి తద్దినాలే చేసుకోరు. అవును. నిజం! ఇంగ్లీషు దేశంలో ఒకేరోజు 250 మంది తండ్రులు ఓ గనిలో పనిచేస్తూ ప్రమాదవశాత్తూ సజీవ సమాధి అయ్యారు. అంతేకాదు. క్లేటన్‌ అనే క్రైస్తవ మహిళ తండ్రి చనిపోయిన రోజు అది. దానితో సదరు క్లేటన్‌, అక్కడి చర్చికి వెళ్లి.. ఈరోజు ఇంతమంది తండ్రులు చనిపోయారు కాబట్టి, మనం ఈరోజును ఫాదర్స్‌డేగా పిలుద్దామని చెప్పిందట. దానికి అక్కడి చర్చి ఫాదర్‌ సరేననన్నారట. దానినే యునెస్కో వాళ్లు అధికారికంగా డిక్లేర్‌ చేశారు. ఇక అప్పటినుంచి ఆ గనిలో సజీవ సమాధి అయిన ఆ 250 మందికి నివాళిగా భారతీయులంతా ఫాదర్స్‌డే చేసుకుంటున్నారన్నమాట. అంటే… ఎవరి తండ్రుల తద్దినాలనో మన భారతీయులు ఏడాదికోసారి చేసుకుంటున్నారు. కాస్త ఓపిక చేసుకుని, గూగుల్‌తల్లిని అడిగితే ఇవన్నీ ఆ మాతనే చెప్పేస్తుంది. మనకు అంత ఓపిక లేదు మరి. ఏం చేస్తాం?

ఇక టీచర్స్‌డే, లాఫింగ్‌డే, ఎన్విరాల్‌మెంట్‌డే, వరల్డ్‌ పీస్‌డే, వృద్ధుల దినోత్సవం, చిల్డ్రన్స్‌డే.. మట్టీ మశానం, శ్మశాన దినోత్సవాల వంటి లెక్కలేనని దిక్కుమాలిన ‘డే’లు, డేట్లిచ్చి మరీ మనమీదకు వదిలేసింది యునెస్కో. ఇవన్నీ ఎందుకంటే.. ఇదో మార్కెటింగ్‌ కళ. అదో యాపార యవ్వారమన్నమాట! ఆ పేరుతో వేలు, లక్షల సంఖ్యలో గ్రీటింగ్‌ కార్డులు, బేకరీల్లో కేకులు, బొకేలు అమ్మడం, అమ్మకం కాని గిఫ్టులను డిస్కౌంట్ల రూపంలో ‘తండ్రుల సంతానం’పై వదిలేందుకు, ఆ దినాల్లో పెట్టుకునే బిజినెస్‌ టెక్నిక్‌. ఇదీ.. ఏడాదికోసారి ‘యునెస్కో ప్రకటిత’ ఈ తద్దినాల వెనక ఉన్న అసలు రహస్యం. మరి ఇంకా పరాయి దేశాల వాళ్ల తద్దినాలు చేద్దామా? మీకు అర్ధమవుతోందా?

LEAVE A RESPONSE