మనుషుల యొక్క ప్రవర్తన చాలా విచిత్రంగా ఉంటుంది. తాము ఎన్నో తప్పులు చేస్తారు. ఆ తప్పులు సులభంగా పోగొట్టుకోవడానికి వాళ్ళు సులభమైన మార్గాలు వెతుకుతూ ఉంటారు. ఎన్నో పాపాలు చేసేస్తారు. ఆ పాపాలను కడుక్కొవడానికి కావాల్సిన అనుకూలాల్ని సృష్టించుకుంటారు. మన దేశంలో కావలసినన్ని గుళ్ళు, గోపురాలు కదా! వాటిని సందర్శిస్తే ముడుపులు చెల్లిస్తే చేసిన పాపం పటాపంచలు అవుతుంది అని అనుకుంటారు. ఇంకా కొత్త పాపాలు చేయడానికి సిద్ధపడతారు.
పాప ప్రక్షాళనకి మనకి పవిత్ర స్థలాలు, పవిత్రమైన నదులు ఉన్నాయి కదా! ఆ ఆలయాలని సందర్శిస్తే, ఆ నదుల్లో స్నానం చేస్తే పాపాలు పటాపంచలు అవుతాయి. మళ్ళీ మనం తాజాగా కొత్త కొత్త పాపాలు చేయడానికి సిద్దం కావచ్చు అనుకుంటాం. ఎక్కడ చూసినా ఇదే తంతు. ఇదే వ్యవహారం.
మనిషి లోపలికి చూసుకోవడం మానేసి పరిష్కారం కోసం బయట వెతుక్కుంటూ ఉంటాం. దేవుడికి ముడుపులు చెల్లిస్తే పవిత్ర కలశ జలాల్ని పైన చల్లుకుంటే పవిత్ర స్నానాలు చేస్తే పాపం పటాపంచలు అవుతుంది అనుకోవడం సర్వసాధారణం అయిపోయింది. మనసులో, ప్రవర్తనలో మార్పు కాకుండా బాహ్యమైన ఆచారాలతో మార్పు వస్తుంది అని భ్రమ పడతారు.
ఒక సారి ఒక భక్తుడు శ్రీ రామకృష్ణ పరమహంస దగ్గరకు వచ్చి ‘స్వామీ! నేను గంగా నదిలో స్నానం చేయడానికి వెళుతున్నాను నన్ను ఆశీర్వదించి అనుమతించండి ‘ అన్నాడు. పరమహంస ‘ఎందుకు అంత శ్రమ తీసుకుంటున్నావు? గంగలో స్నానం చేయాలనుకుంటున్నావు? నువ్వు కష్టపడటమే కాకుండా గంగానదిని కూడా కష్టపెడుతున్నావు . నువ్వే కాదు. నీలాంటి వాళ్ళు లక్షల మంది గంగానదిలో స్నానం చేస్తున్నారు. ఇంత మంది స్నానానికి రావడంతో గంగా నది బెంబేలెత్తి పోతుంది. పైగా వాళ్ళు ఊరికే గంగా నదిలో స్నానం చేయడానికి వెళ్ళడం లేదు.
పవిత్ర స్నానాలు చేయడానికి వెళుతున్నారు. పాప ప్రక్షాళనకి వెళుతున్నారు. అంటే తాము చేసే పాపాల్ని కడుక్కోవడం కోసం వెళుతున్నారు. అంటే స్వచ్ఛంగా ఉన్న గంగా నదిని తమ పాపాలతో నింపడానికి వెళుతున్నారు. అందు వలన గంగానదీ జనాల్ని చూస్తూనే హడలిపోతుంది. ఇంతకూ నువ్వు కూడా అందుకే వెళుతున్నావా? అని అడిగాడు రామకృష్ణ పరమహంస. ఆ భక్తుడు స్వామి గంగా నది పవిత్రమైనది. ఆ తల్లి నా పాపాలను పోగొడుతుంది అని ఆ నదిలో స్నానం చేయడానికి వెళుతున్నాను. అనుమతించండి అన్నాడు. రామకృష్ణ పరమహంస ఆ భక్తుణ్ణి చూసి “గంగా నది ఒడ్డున పెద్ద పెద్ద చెట్లు ఉన్నాయి. ఆ చెట్లు ఎందుకు ఉన్నాయో నీకు తెలుసా? అన్నాడు. భక్తుడు”తెలియదు స్వామి ” అన్నాడు.
రామకృష్ణ పరమహంస గంగా నది పవిత్రమైనది. స్వఛ్ఛమైంది. అలాంటి నదిలో స్నానం చేస్తే పాపాలు పటాపంచలు అవుతాయి అని నమ్ముతారు కదా! నిజమే. పవిత్ర నదిని పాపాలు అంటవు. నువ్వు నదిలో దిగుతావు. నీలో ఉన్న పాపాలు పవిత్ర నదీ జలాలంటే భయపడతాయి. ఆ భయం వలన అవి నిన్ను వదిలి పెడతాయి. అవి ఎక్కడికో వెళ్ళిపోవు. నది గట్టులో ఉన్న చెట్లమీద కూర్చుని ఉంటాయి. ఎందుకు అంటే నీ కోసం ఎదురు చూస్తూ ఉంటాయి. నువ్వు ఎప్పుడు వస్తావా అని!!? అని కాచుకొని ఉంటాయి.
ఎందుకు అంటే నువ్వు నదిలోనే ఉండవు కదా ! గంట ఉంటావు మహ అయితే రెండు గంటలు ఉంటావు. రోజుల తరబడి ఉండలేవు కదా!? నువ్వు బయటకి వస్తూనే మళ్ళీ అవి నిన్ను పట్టుకుంటాయి. కాబట్టి అనవసరంగా శ్రమ పడకు. నువ్వు బాధపడి, గంగానదిని కూడా బాధపెట్టకు. చెట్లను బాధపెట్టకు. ఈ అల్పమైన పనుల వలన ఆత్మ ప్రక్షాళన కాదు. శరీరాన్ని కడుక్కుంటే పాపాలు పటాపంచలు అవుతాయి అంటే ఈపాటికి ప్రపంచం స్వర్గంగా మారిపోయేది. మనం చేసే వన్నీ ఇలాగే ఉంటాయి.
బయట ప్రయత్నాలతో అన్నీ పరిష్కారం అవుతుంది అని భ్రమ పడతాం. మనలోని సంకుచిత భావాలు, కల్మషం అలాగే ఉండి పోతాయి. వాటికి చలనం ఉండదు. బయటకి చూస్తే కంటి తుడుపు చర్యల ద్వారా మనలోపలి కాల్యుష్యాన్ని దాచుకుంటాం. నిజానికి నువ్వే చేసే తప్పుడు పనులు నిన్ను ఎప్పుడూ ఎత్తి చూపుతూ ఉంటాయి. వాటి నుంచి తప్పించుకోవడానికి ఇలాంటి నాటకాలు ఆడుతూ ఉంటారు అన్నాడు రామకృష్ణ పరమహంస….. భక్తుడు నోరు వెళ్ళబెట్టాడు…
– ఆర్కే