Suryaa.co.in

Features

నీరు పల్ల మెరుగు – నిజం దేవుడెరుగు

ఊరికే రావు సామెతలు

విజయవాడ వరదలు, వాటి చుట్టూ అలుముకున్న రాజకీయాలు చూస్తే అర్థమవుతుంది.

గత పది రోజులుగా కొందరు వివిధ కారణాల వలన కొందరు బెజవాడ మునిగిపోయిందని, అమరావతి కొట్టుకు పోయిందని పత్రికల్లో, సోషల్ మీడియా లో ఒకటే రొద.

కావాలని తమ రాజకీయ ప్రయోజనాల కోసం ఒక ప్రాంతం మీద, అక్కడి ప్రజల మీద అక్కసు వెళ్ళ కక్కే వాళ్ళని ఏమి చెయ్యలేం. కానీ ఆ అభాండాలు సత్య దూరమేనని ప్రజలకి తెలియాల్సిన అవసరం ఉంది.

అందుకే బుడమేరు గురించి, ఆ ఏరు ప్రవహించే ప్రాంతాల ఎత్తు పల్లాల గురించి ఈ క్రింద ప్రస్తుతం క్లుప్తంగా వివరణ. హేతు బద్దంగా వివరించటానికి వివిధ పేరొందిన వెబ్సైట్ల నుంచి, జాతీయ సంస్థల నివేదికల నుంచి సేకరించిన వివరాలు ఇస్తున్నాం. ఇక్కడ వాటి ప్రస్తావన చెయ్యకపోయినా, మేము ఇవ్వబోయే పూర్తి నివేదిక లో వాటిని తప్పక తెలియ చేస్తాం.

ఋడమేరు:

ఏ కొండూరు, గంపలగూడెం, ఎర్రుపాలెం మండలాలు కలిసే దగ్గర కొండలలో, చీమలపాడు నుంచి గంపలగూడెం వెళ్ళే దారిలో ఇరువైపులా ఉన్న కొండల వద్ద, చిన్న చిన్న కాలువలుగా పారి మొరుసుమిల్లి దగర చెరువుగా ఏర్పడి . అక్కడి మంచి బుడమేరు పారుతుంది.

సముద్రం కుంటే సుమారు 103 మీటర్లు ఎత్తు ఉండే ఈ ప్రాంతంలో పుటి, మొరుసుమల్లి పుల్లూరు రోడ్డుకు ఉత్తరంగా ప్రవహించి, పుల్లూరు దగ్గర చిలుకులవారి గూడెం వద్ద దక్షిణం వైపు మలుపు తిరుగుతుంది.
ఇలా సాగి పోయే ఋడమేరుకు మరొక వాగు కలుస్తుంది. కుదపక్రింద, రెడ్డిగూడెం కొండల మధ్య చెరువులు, మెట ప్రాంతం కలిగి సముద్ర మట్టానికి 110 మీటర్ల ఎత్తులో మొదలై వాగులు వచ్చి ఓబులాపురం చెరువులో కలుస్తాయి.

ఇకడికి దగ్గర్లో నరుకుళ్ళపాదు దగ్గర మరో వాగు మొదలై, ఓబులాపూరంలో చెరువు నుంచి జాలు నీరు కలుపుంటూ వెళ్లడం, తూర్పు గా సముద్రానికి 50 మీటర్ల ఎత్తులో ప్రహిస్తూ వచ్చి కుంట ముక్కల గ్రామం దగ్గర (కొత్త మాల పల్లెకి పశ్చిమ దిక్కున) సముద్ర మట్టానికి 40 మీటర్ల ఎత్తులో ప్రవహించే బుడమేరులో కలుస్తుంది.

ఇక్కడి నుంచి బుడమేరు వెళ్ళటూరు మీదుగా.. వెలగలేరు దగ్గర ఉన్న రెగ్యూలేటర్ వద్దకు చేరుతుంది. ఈ రెగ్యులేటర్ సముద్ర మట్టానికి సుమారు 28 మీటర్లు ఎత్తు లో నిర్మించారు.

అక్కడి నుంచి క్రిందకు పోయె బుడమేరు ను కుడి వైపుకి డైవర్షన్ కెనాల్ ద్వారా,. విజయవాడ థర్మల్ విద్యుత్ కేంద్రం నుంచి కృష్ణా లో కలపటం కోసం. కృష్ణా లో కలిసే ప్రాంతం సముద్ర మట్టానికి సుమారు 25 మీటర్ల ఎత్తులో ఉంటుంది.

బుడమేరు లో అక్కడ మళ్లించిన నీరు కాక, మిగిలినది కిందకి పారుతుంది. క్రిందకు పారే ఋడమేరు, పైడూరుపాడు కు ఉత్తరాన రెండుగా చీలి.. ఒకటి పైడూరుపాడు చెరువుమీదుగా (22 మీ ఎత్తు) అంబాపురం, జక్కంపూడి, పాబాద్ కొండ దగ్గరగా వై.ఎస్.ఆర్ కాలనీ నుంచి ఒక పాయ వెళ్తుంది.

మరొకటి రాయనపాడు (22 మీ) చెరువు మీదగా విజయవాడ, కొండపల్లి రైల్వే లైనుకు ఉత్తరంగా ఒక పాయ వెళ్తుంది.

ఇవి రెండూ వచ్చి మరలా విజయవాడ నగరంలోని.. చెనుమొలు వెంకటరావు వంతెన దగర కలిసి, సముద్ర మట్టానికి సుమారు 20 మీటర్ల ఎత్తులో మరల పెద్ద ఏరుగా మారి బెజవాడ లో అడుగిడుతుంది.

విజయవాడ లో రాజరాజేశ్వరరావు పేట మీదుగా, వాంబే కాలనీ క్రిందగా వచ్చి.. రామవరప్పాడు ఫ్లైఓవర్ పక్కునుంచి సుమారు సముద్రమటానికి 18 మీటర్ల ఎత్తులో పారుతుంది.

తర్వాత నిడమానూరు, గన్నవరం బాపులపాడు మండలాల మీదగా కొల్లేరు అభయారణ్యం(5వ కంటూరు) అభయారణ్యంలో ప్రవేశించి పేదుమాకలంక దగ్గర సుముద్రానికి 4మీటర్ల ఎత్తులో పారుతుంది.

కొల్లేరు లో కొన్ని ప్రాంతాలు సముద్ర మట్టాని కంటే లోతులో ఉంటాయి. దాని వలన అవి చిత్తడి నేలలుగా లేక చెరువులు గా ఉంటాయి.

అందు వలన ఇక్కడ విస్తరించి, చివరగా వెళ్ళి తమ్మిలేరులో కలసి, అక్కడ నుంచి ఉప్పుటేరు తో కలిసి ఆకివీడు మీదగా ప్రవహించి చిన్న గొల్ల పాలెం వద్ద ఒకపాయ. ఏటి పోరు దగ్గర రెండో పాయ సముద్రంలో కలుస్తాయి.

ఆగస్టు 29 రాత్రి నుంచి ఖమ్మం జిల్లాలో కుండపోత వానలు కురిశాయి. బుడమేరు మొదలయ్యే ఎర్రుపాలెం మండలంలో సుమారుగా 19 సెం.మీటర్ల వాన కురిసింది.

మైలవరంలో కూడా 18 సెం, మీటర్ల వర్షం 31 ఆగస్టున పడింది జి కొండురు లో 20 సెం.మీ., గంపలగూడెం, ఏ కొండురు లొ 12 సెం.మీ. రెడిగూడెంలో 10 సెం.మీ వాన నమోదు అయ్యింది. విజయవాడ మండలాల్లో 18 సెం. మీ వాన పడింది.

బుడమేరుకు వచ్చే వరద డైవర్షన్ కెనాల్ ద్వారా కృష్ణాలో కలవాలి. కానీ కృష్ణా నది అప్పటికే సుమారుగా 11 లక్షల క్యూసెక్కుల ల తో పరిగెడుతుంది. పులిచింతల నుంచి 4 మంచి 5 లక్షల క్యూసెక్కుల వరద వస్తుండగా, మున్నేరు నుంచి అధికారిక లెక్కల ప్రకారం 5 నుంచి 6 లక్షల క్యూసెక్కుల వరద వచ్చి కలిసింది.

అంటే అక్కడ బుడమేరు కలవాల్సిన చోట (పవిత్ర సంగమం) కృష్ణా నది పొంగి పొర్లటం వలన, బుడమేరు నీరు అక్కడే ఆగిపోయింది. దానితో అక్కడ (25 మీ ఎత్తు కంటే) పైన వరద పారుతుండడంతో బుడమేరు నీరు కలిసే ఆస్కారం లేదు.

అప్పటికే ఖమ్మం, కృష్ణా జిల్లాలో విపరీతంగా వానలు పడటంతో, ఉధృతమైన బుడమేరు కట్టలు తెంచుకుని శనివారం రాత్రి కొండపల్లి రైల్వే స్టేషన్ లో సహా ఇతర ప్రాంతాలను చుట్టుముట్టింది.

పైడూరుపాడు, రాయనపాడు చెరువులు వరదలతో నింపి విద్యాధరపురం, జక్కంపూడి, రాజరాజేశ్వరపేట, రామవరప్పాడు, ముంచెత్తింది. సముద్ర మట్టానికి పవిత్ర సంగమం 25 మీటర్ల ఎత్తులో ఉండగా, విజయవాడలోని పరివాహక ప్రాంతాలు కేవలం 18 – 20 మీటర్ల ఎత్తులో ఉండటంలో నీరు నగరం మీదకి దండెత్తింది.

అప్పటికి జడివానలో చిక్కుకున్న విజయవాడ నగరంలోని ఉత్తర భాగం నుంచి, నీరంతా బుడమేరుకు అవుట్ ఫాల్ డ్రైన్ల ద్వారా ప్రవహించటంతో, సుమారుగా రెండులక్షల మంది ప్రజలు ముంపునకు గురయ్యారు.

జక్కంపూడి లో ప్రభుత్వం ఇచ్చిన ఇళ్ళ, రాజరాజేశ్వరి పేట, ఆజిత్ సింగ్ నగర్, గుణదల, రామవరప్పాడులొ బుడమేరు జాలు జలాల (వరదపారే – బఫర్) జోన్.

వీటిలో చాలా నిర్మాణాలు వె లిశాయి. దానితో బుడమేరు కుంచించుకు పోయింది. మురుగు గుర్రపు డెక్క తొలగించకపోవటంతో నీరు మరింతగా ముంచేసింది.

దీనికి తోడుగా, రామవరప్పాడు దగ్గర కొత్తగా నిర్మించిన భవనాలన్నీ కూడా, బుడమేరు పరివాహక ఎత్తు కంటే దిగువలో ఉండటంతో, అవి కుడా ముంపునకు గురయ్యాయి.

గన్నవరం, బాపులపాడు మండలాలోని చేపల చెరువులు బుడమేరులోనే కట్టలు కట్టి నిర్మించారు. కొల్లేరు సరస్సు ఆక్రమణలు గురించి ఎవరికీ తెలియనిది కాదు. సుమారు మూడు వందల చదరపు కిలో మీటర్లు ఉండాల్సిన కొల్లేరు (5వ కాంటూరు వరకు) మూడు వంతులు ఆక్రమణలకు గురయ్యింది. కొల్లేరు నుంచి బయటకు పారె ఉప్పుటేరు పరిస్థితి కూడా ఇదే.

ఈ పరిస్థితి ఇలా ఉండగా, కృష్ణా నదిలోకి మళ్లించడం బుడమేరుకి అసాధ్యం. కృష్ణా లో ఒడ్డు కంటే.. క్రింద నీరు ఉన్నప్పుడు మాత్రమే బుడమేరు నీరు కలిసే అవకాశం ఉంటుంది.

బుడమేరు పైన ఎటువంటి రిజర్వాయర్ గానీ, డ్యాం కానీ లేదు. కేవలం రెగ్యులేటర్ మాత్రమే ఉంది. అది కేవలం ఏరు పారే దశని మార్చటం కోసం మాత్రమే. ఆది కూడా కృష్ణా నది కంటే, కేవలం 3 మీటర్ల ఎత్తులో ఉండటం వలన నీటి ప్రవాహం అటు వెళ్ళటం కష్టం. పై పెచ్చు ఈ డైవర్షన్ కెనాల్ సామర్ధ్యం కేవలం 10500 క్యూసెక్కులు మాత్రమే.
వంద చదరపు కిలోమీటర్లకు సుమారు 28 సెంటీమీటర్ల వాన కురిస్తే, సుమారు ఒక టిఎంసి నీరు వస్తుంది. ఇందులో భూమి లోకి ఎంత ఇంకుతుంది? ఎంత ఆవిరై పోతుంది అన్నది, ఎక్కడికక్కడ స్థానిక పరిస్థితుల బట్టి ఉంటుంది.

11000 కూసెక్కులు ఒక రోజంతా పారితే, ఒక టిఎంసి నీరు ఒక చోటికి చేరుతుంది. ఇలా బుడమేరు కి ఎంత క్యాచ్మెంట్ ఏరియా ( పరివాహక ప్రాంతం) అన్నది, సరైన లెక్కలు ఇంకా మాకు దొరకలేదు.

ఇది ఇలా ఉంటే అమరావతి వైపు కృష్ణా నది సుమారుగా 23 మీటర్లు ఉండగా.. కట్ట ( ఒడ్డు) 26-28 మీటర్లు సముద్రమట్టానికి ఎత్తులో ఉంటుంది. ఆ తదుపరి హైకోర్టు, సచివాలయం లాంటివన్నీ 24-25 మీటర్ల ఎత్తులో ఉంటాయి.

ఈ పరిస్థితులలో కృష్ణానది వలన అమరావతి ఏవిధంగా మునిగింది అని ప్రచారం చేస్తున్నారో? ఎందుకు చేస్తున్నారో?.. బుడమేరు లోతటు ప్రాంతానికి కాకుండా, ఎత్తులో ఉన్న కృష్ణా నది వైపు పూర్తిగా ఎలా వెళ్తుందో, ఆ కళ్లున్న కబోదులకే తెలియాలి. నీరు పల్లమెరుగు – నిజం దేవుడికి ఎరుగు.

– రవితేజ పదిరి,
ఆంధ్ర ప్రదేశ్ హైకోర్టు న్యాయవాది,
టీంస్వేచ్ఛ సలహాదారు

LEAVE A RESPONSE