– జర్నలిస్ట్ సుధాకర్ రెడ్డి విశ్లేషణ
ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి,వైకాపా ఎంపి రఘు రామకృష్ణ రాజు మధ్య జరుగుతున్న పోరు వేడి పుట్టిస్తోంది. రఘురామపై అనర్హత వేటు వేయించాలని జగన్ చేస్తున్న ప్రయత్నాలు ఫలించేలా లేవు. అక్రమ కేసులు పెట్టి లొంగదీసుకోడం కుదరలేదు. ఇదే సమయంలో రఘురామ తన ఎంపి పదవికి రాజీనామా చేసి తిరిగి పోటీ చేయడానికి సిద్ధపడుతున్నారు. ఫిబ్రవరి ఐదవ తేదీ లోపల తనపై అనర్హత వేటు వేయించాలని జగన్ కు సవాలు విసిరారు. జగన్ కు చేత కాకుంటే తానే రాజీనామా చేసి పోటీ చేస్తానని, దమ్ముంటే జగనే తమపై పోటీ చేయవచ్చని వెటకారం విసిరారు. అయన అమరావతి రాజధానిగా కొనసాగాలని కోరుతూ రాజీనామా చేస్తానని గతంలోనే ప్రకటించారు. ఈనేపథ్యంలో రాజు రాజీనామా చేసి తిరిగి పోటీ చేస్తే ఎలా ఉంటుంది అన్న చర్చలు, విశ్లేషణలు జోరందుకున్నాయి. గతంలో ఆ నియోజకవర్గంలో జరిగిన ఎన్నికలు, గెలిచిన పార్టీలు, గెలిచిన వారి సామాజిక వర్గాలు లాంటి అంశాలను పరిశీలిస్తున్నారు. ఏ కోణంలో చూసినా రఘు రామకృష్ణ రాజు రెండు, మూడు లక్షల మెజారిటీతో గెలుస్తారని చెపుతున్నారు. 2019 ఎన్నికల్లో వైకాపా అభర్ధి గా పోటీ చేసిన రఘురామ రాజుకు 4,47,594 ఓట్లు వచ్చాయి. అయన సమీప ప్రత్యర్థి టిడిపి అభ్యర్ధి వెంకట శివరామ రాజుకు 4,15,685 ఓట్లు పోలయ్యాయి. దీంతో రాజు 31,909 ఓట్ల మెజారిటీతో గెలిచారు. అయితే ఈ ఎన్నికల్లో జనసేన అభ్యర్ధి నాగబాబుకు 2,50,289 ఓట్లు వచ్చాయి. అలాగే కాంగ్రెస్ అభ్యర్థి కనుమూరి బాపిరాజుకు 13,810 ఓట్లు, బిజెపి అభ్యర్ధి మాణిక్యాల రావుకు 12378 ఓట్లు పోలయ్యాయి.
ఈ ఎన్నికల్లో టిడిపి, జసేసన, బిజెపి ఓట్లు కలుపుకుంటే వైకాపా కంటే 2,30,758 ఓట్లు ఎక్కువగా ఉన్నాయి. రఘు రామ స్వతంత్రంగా పోటీ చేసినా లేక ఏదైనా పార్టీ అభ్యర్థి అయినా ఈ మూడు పార్టీల మద్దతు ఉంటుందనడంలో సందేహం లేదు. కాంగ్రెస్ మద్దతు ఇచ్చినా, ఇవ్వక పోయినా లాభమే కలుగు తుంది. ఎందుకంటే ఆ పార్టీ పోటీ చేస్తే వైకాపా ఓట్లు మాత్రమే చీలిపోతాయని అంటున్నారు. కాగా 2019 ఎన్నికల్లో ఈ నియోజక వర్గం పరిధిలోని ఎడు అసెంబ్లీ సెగ్మెంట్లలో పాలకొల్లు, ఉండి లలో టిడిపి గెలిచింది. మిగిలిన నరసాపురం, భీమవరం ,ఆచంట, తనుకు, తాడేపల్లి ఐదు చోట్ల వైకాపా అభ్యర్ధులు విజయం సాధించారు. గెలిచిన ఎడుగురిలో ముగ్గురు రాజులు, కాపులు ఇతరులు కలిపి నలుగురు ఉన్నారు. కాగా ఇక్కడ రిజర్వుడు నియోజక వర్గం ఒక్కటి కూడా లేదు. 1952 నుంచి లోక్ సభకు 17 సార్లు ఎన్నికలు జరుగగా 16 సార్లు వివరాలు దొరికాయి. అందులో ఎనిమిది సార్లు కాంగ్రెస్, నాలుగు సార్లు టిడిపి, రెండు సార్లు బిజెపి, కమ్యూనిస్టులు, వైకాపా అభ్యర్ధులు ఒక్కోసారి గెలిచారు. సామాజిక వర్గం ప్రకారం చూస్తే 12 సార్లు రాజులు, నాలుగు సార్లు కాపులు గెలిచారు. ఈ లెక్కల ప్రకారం చూస్తే బిసిలు,
కాపులు, రాజులు, ఎక్కువగా మద్దతు ఇచ్చే టిడిపి, జనసేన, బిజెపి పార్టీల మద్దతుతో పోటీ చేస్తే రఘు రామకృష్ణ రాజు గెలుపు నల్లేరుపై నడకలా సాగిపోతుంది అనడంలో సందేహం లేదు. ఒక వేళ తిరుపతి, బద్వేలు ఉపఎన్నికలు, నెల్లూరు, కుప్పం మునిపల్ ఎన్నికల ఫార్ములా ఇక్కడ ప్రయోగిద్దాం అంటే కుదరదు. ఒక ఊరి రెడ్డి మరొక ఊరిలో వెట్టి అన్నట్టు ఇక్కడ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పాచికలు పారే పరిస్థితులు లేవు.
అందుకే జగన్ మోహన్ రెడ్డి రకరకాల ప్రయత్నాలు చేస్తున్నారు. మెగాస్టార్ చిరంజీవిని మచ్చిక చేసుకునే ప్రయత్నాలు సఫలం కాలేదు. ఇక్కడ కాపు, రాజు లేదా బీసీ సామాజిక వర్గంలో బలమైన అభ్యర్థి కోసం అన్వేషిస్తున్నారు. అయినా ఆ సామాజిక వర్గాల ఓటర్లు జగన్ కు వ్యతిరేకంగా ఉన్నారు. రాష్ట్రంలో జరిగిన అనేక పరిణామాల వల్ల ఇతర సామాజిక వర్గాల ఓటర్లు జగన్ కు దూరమవు తున్నారు. ఇక్కడ మెజారిటీ ఓట్లు ఉన్న సామాజిక వర్గాలు అన్నీ జగన్ కు వ్యతిరేకంగా ఉన్నాయి. ఇక్కడ జగన్ సామాజిక వర్గీయులను వేళ్ళ మీద లెక్కించవచ్చు. పోలీసులు, వాలంటీర్లు, ఇతరుల ద్వారా దొంగ ఓట్లు వేయించడం కుదరదు. ఈ నేపథ్యంలో ఎటు చూసినా రఘు రామకృష్ణ రాజు చేతిలో జగన్ భంగ పడక తప్పదు. గుడ్డి కంటే మెల్ల మేలు అన్నట్టు, రఘురామ రాజును పార్టీ నుంచి బహిష్కరించడమే మేలని పరిశీలకుల భావన. జగన్ తెలివిగా వ్యవహరించి పరువు నిలుపు కుంటారా ? లేక మొండిగా వ్యవహరించి పరాభవం చవి చూస్తారా అన్నది తెలియాలంటే వేచి చూడాల్సిందే.