-మహిళలు, బాలికలకు రక్షణ కరవు
-వైయస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయంలో పార్టీ ఎస్సీ సెల్ -అధ్యక్షుడు, మాజీ ఎమ్యెల్యే టీజేఆర్ సుధాకర్‌బాబు
తాడేపల్లి: రాష్ట్రంలో పరిపాలన పూర్తిగా గాడి తప్పిందని, మహిళలు, బాలికలకు రక్షణ లేకుండా పోయిందని వైయస్సార్‌సీపీ ఎస్సీ సెల్ అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే టీజేఆర్ సుధాకర్‌బాబు ఆక్షేపించారు.
ప్రతీకారం తీర్చుకోవడానికే ప్రజలు అధికారం ఇచ్చారనే తీరుతో ప్రభుత్వం పని చేస్తున్నట్లు ఉందని ఆయన తెలిపారు. శాంతి భద్రతలకు విఘాతం కలుగుతుంటే.. ప్రజలకు భరోసా కల్పించాల్సిన సీఎం చంద్రబాబు కనీసం పరిస్థితిని సమీక్షించడం లేదని విమర్శించారు.
శాంతి భద్రతల విషయంలో ప్రభుత్వం పూర్తిగా వైఫల్యం చెందిందన్న మాజీ ఎమ్మెల్యే.. అరాచకాలను సీఎం చంద్రబాబు అదుపు చేయడం లేదని, మహిళలపై దాడులను అస్సలు పట్టించుకోవడం లేదని, ఇప్పుడు దిశ యాప్ ఉండి ఉంటే, ఇన్ని ఘటనలు జరిగేవి కావని స్పష్టం చేశారు.
రాజకీయంగా కక్ష సాధింపునకు, తప్పుడు కేసుల నమోదుకు పోలీసులను వాడుకుంటున్నారని, తప్పుడు వాంగ్మూలాలు ఇప్పించి, వాటితో వైయస్సార్‌సీపీ నాయకులను వేధిస్తున్నారని తెలిపారు. ప్రతీకారేచ్ఛతో వైయస్సార్‌సీపీ దళిత నాయకులపైనా కేసులు నమోదు చేస్తున్నారని చెప్పారు.
హోం మంత్రికి సెల్ఫీల మీద ఉన్న శ్రద్ధ మహిళా రక్షణ మీద లేదన్న సుధాకర్‌బాబు, తాజాగా బద్వేలు ఘటనలో బాలిక చేతిలో దిశ యాప్ ఉండుంటే ఆమె ప్రాణాలు పోయేవి కావని తేల్చి చెప్పారు. కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత, ఈ నాలుగు నెలల్లో మహిళలు, బాలికలపై జరిగిన అనేక దాడులు, అత్యాచార ఘటనలకు దిశ యాప్ వంటి నియంత్రించే వ్యవస్థ లేకపోవడమే కారణమని స్పష్టం చేశారు.
ఈ నాలుగు నెలల్లో మహిళలు, బాలికలపై అత్యాచారాలు, హత్యలకు సంబంధించి 74 ఘటనలు చోటు చేసుకున్నాయన్న ఆయన, కనీసం ఒక్క కేసులో అయినా శిక్ష పడి ఉంటే, ఇన్ని ఘటనలు జరిగేవి కావని అభిప్రాయపడ్డారు.