Suryaa.co.in

Andhra Pradesh

ఆడలేక మద్దెల ఓడు అన్నట్లుంది వైసీపీ పాలన

*చేతకానితనాన్ని ప్రతిపక్షాలపై రుద్దే ప్రయత్నం
*ముందస్తు ఎన్నికల వ్యూహంలో భాగమే కోనసీమ అరాచకం
*బస్సు యాత్రకు వస్తున్న మంత్రుల్ని యువత నిలదీయాలి
*వైసీపీని బంగాళాఖాతంలో కలిపే రోజులు దగ్గర్లోనే ఉన్నాయి
-జనసేన పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి సుందరపు విజయ్ కుమార్

పాలన చేతకాకే వైసీపీ డైవర్ట్ పాలిటిక్స్ చేస్తోందని జనసేన పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి సుందరపు విజయ్ కుమార్ విమర్శించారు. అధికారంలోకి వచ్చాక ఏ పార్టీ అయినా అభివృద్ధి, సంక్షేమంపై దృష్టి పెడతాయని… వీళ్లు మాత్రం వాళ్ల చేతకానితనాన్ని కప్పి పుచ్చుకోవడానికి ప్రతి పక్షాలపై బుదరజల్లే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు. కులాల కుంపట్లు రాజేసి ఆ మంటల్లో చలి కాచుకోవడం వైసీపీ గేమ్ ప్లాన్ లో భాగమని, వాళ్ల ట్రాప్ లో పడొద్దని యువతకు పిలుపునిచ్చారు. పచ్చని కోనసీమలో వైసీపీ సృష్టించిన కుల చిచ్చుపై శుక్రవారం ఉదయం జనసేన పార్టీ హైదరాబాద్ కేంద్ర కార్యాలయంలో ఆయన మాట్లాడారు.

సుందరపు విజయ్ కుమార్ తన ప్రసంగాన్ని కొనసాగిస్తూ … “వైసీపీ నాయకులకు పాలన చేతకాక రాష్ట్రాన్ని అంధకారంలోకి నెడుతున్నారు. వీళ్ల చేతకానితనాన్ని కప్పి పుచ్చుకోవడానికి జనసేన పార్టీపై, పవన్ కళ్యాణ్ పై బుదరజల్లుతున్నారు. పవన్ కళ్యాణ్ ని తిట్టడానికే వైసీపీ నాయకులకు మంత్రి పదవులు ఇస్తున్నారు. 2019 సార్వత్రిక ఎన్నికలకు ముందు కాపులు ఎక్కువగా ఉన్న ప్రాంతానికి వెళ్లి మీకు రిజర్వేషన్ ఇవ్వడం కుదరదు అని చెప్పి వాళ్లతోనే ఓట్లు వేయించుకునేంత గొప్ప గేమ్ ప్లాన్ వైసీపీది. ఇప్పుడు కూడా ముందస్తు ఎన్నికలకు సిద్ధమై మళ్లీ అదే గేమ్ ప్లాన్ అమలాపురంలో మొదలు పెట్టారు.

డీజిల్ దొంగలకు మీరే ఆదర్శం కొడాలి
మాజీ మంత్రి కొడాలి నాని . పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడం హాస్యస్పదంగా ఉంది. రోడ్ల మీద ఆగి ఉన్న లారీల్లో డీజిల్ దొంగతనం చేసిన వాళ్లంతా ఆయన్ను ఆదర్శంగా తీసుకుంటున్నారు. ఆయన ఏదైనా మెసెజ్ ఇవ్వాలనుకుంటే వాళ్లకు ఇచ్చుకోవచ్చు. మంత్రిగా ఆయన ఏనాడూ ప్రజల కోసం పనిచేసింది లేదు. ఎందుకురా బాబు ఇతనికి ఓట్లు వేశాము అని గుడివాడ ప్రజలు తలదించుకునే పరిస్థితి ఉంది. మూడేళ్లు మంత్రిగా ఉన్నా కూడా గుడివాడలో గుంతలు లేని రోడ్డు లేదు. జనసేనను బుడ్డోళ్ల పార్టీ అంటున్నావు. ఈ యువతే రేపటి దేశ భవిష్యత్తు. ప్రపంచంలోనే అత్యధిక యువ శక్తి మన దేశంలోనే ఉంది.

ఇంత యువ శక్తి ఉండి కూడా మీ పార్టీ వెంట ఒక్కరు కూడా ఎందుకు రావడం లేదో తెలుసా? మీరు చేసే దొంగ, శవ రాజకీయాలకు భయపడి మీకు దూరంగా ఉంటున్నారు. పవన్ కళ్యాణ్ మాత్రమే వాళ్ల భవిష్యత్తుకు భరోసా ఇవ్వగలరు అని నమ్మారు కనుకే ఆయన వెంట నడుస్తున్నారు. ఇంకోసారి మాది బుడ్డోళ్ల పార్టీ అంటే మిమ్మిల్ని గుడ్డలూడదీసి కొడతారు జాగ్రత్త. ముఖ్యమంత్రి జగన్ రెడ్డి మిమ్మల్ని పూచికపుల్ల వాడినట్లు వాడి పక్కన పడేస్తే అడిగే దిక్కు లేదు. నువ్వా మా గురించి మాట్లాడేది. నిన్ను చూసి నువ్వే జాలి పడాలి తప్ప ఎవరూ జాలి పడరు.

ప్రశ్న ప్రత్నాల లీక్ కేసు ఏమైంది బొత్స ?
జిల్లాలకు పేర్లు పెట్టడం నిరంతర ప్రక్రియ అని సీనియర్ మంత్రి బొత్స మాట్లాడటం సబబు కాదు. జిల్లాకు పేరు పెట్టాలంటే ఎంత మేధోమధనం జరగాలి. ఎంత ప్రజాధనం ఖర్చు చేయాలో మీకు తెలుసా? మీ అవకాశవాద రాజకీయాల కోసం నెలకోసారి, రెండు నెలలకోసారి పేర్లు మారుస్తామంటే కుదరదు. స్వార్థ రాజకీయ ప్రయోజనాల కోసం కులాలు, మతాలు, ప్రాంతాల మధ్య విభేదాలు సృష్టించి లబ్ధి పొందాలంటే చూస్తూ ఊరుకోం. జిల్లాలకు పేర్లు మార్చేటప్పుడు నిజంగా ప్రజాభిప్రాయం సేకరించారా? కనీసం మీ ఎమ్మెల్యే అభిప్రాయమైనా తీసుకున్నారా? అంటే అదేం లేదు… జగన్ రెడ్డి ఏం చెబితే ఆ పేరు పెట్టారు.
రాజశేఖర్ రెడ్డి రాజకీయ నాయకుడు కాకముందు డాక్టర్. ఆయన్ను రాజకీయ నాయకుడిగా, ముఖ్యమంత్రిగా చేసింది రాజ్యాంగం. అలాంటి రాజ్యాంగాన్ని రాసింది డాక్టర్ బీఆర్ అంబేద్కర్ . అలాంటి వ్యక్తి పేరును వైసీపీ నాయకులు వివాదాలకు కేంద్ర బిందువుగా మార్చారు. అంబేద్కర్ ఒక్క జిల్లాకో, ఒక్క వర్గానికో నాయకుడు కాదు. దేశానికే నాయకుడు. అలాంటి మహనీయుడి పేరు ఒక్క జిల్లాకు ఏంటి? ఎన్ని జిల్లాలకు పెట్టినా తప్పు లేదు. అంబేద్కర్ మీద నిజంగా ప్రేమ ఉంటే కడప జిల్లాకు అంబేద్కర్ పేరు పెట్టొచ్చు కదా? పోనీ పులివెందుల నియోజకవర్గాన్ని ప్రత్యేక జిల్లాగా ఏర్పాటు చేసి దానికి భీమ్ రావ్ పేరు పెట్టొచ్చు కదా? అలా చేయరు. కులాల మధ్య చిచ్చు పెట్టి, రాజకీయ లబ్ధి పొందడానికే కోనసీమను ఎంచుకున్నారు.

రాజకీయాల్లో ఒక మాట మాట్లాడాం అంటే దానికి కట్టుబడి ఉండాలి. కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పుడు జగన్ ను నోటికొచ్చినట్లు తిట్టిన బొత్స ఇప్పుడు జగన్ పార్టీలో కలిసిపోయారు. మనిషన్నాక కొంచెమైనా నిజాయతీ ఉండాలి. మీ శాఖలో ప్రశ్నపత్రాలు లీక్ అయితే దానిని అరికట్టే దమ్ము లేదు. వాళ్ల మీద వీళ్ల మీద తోసేసి చేతులు దులుపుకున్నారు. ఎమ్మెల్సీ అనంతబాబు తన మాజీ డ్రైవర్ ను చంపలేదు కనుకే ధైర్యంగా తిరుగుతున్నాడని చెప్పారు. ఆయనే ఇప్పుడు పోలీసుల ముందు నేనే చంపానని ఒప్పుకున్నారు. డ్రైవర్ ను చంపుతున్నప్పుడు గన్ మెన్లు ఏం చేస్తున్నారు? మంత్రి ఇంటిని తగలబెడితే ఇంటిలిజెన్స్ ఏం చేస్తోంది? మర్డర్ చేసిన వ్యక్తిని జిల్లా ఎస్పీ…. గారు అని సంభోదించడం ఏంటి? ఇవన్నీ చూస్తుంటే పోలీస్ వ్యవస్థను మీరు ఎంత కంట్రోల్ చేస్తున్నారో అర్థమవుతోంది.

చిన్న పిల్లల దగ్గర డబ్బులు వసూలు చేసే మీరా చెప్పేది?
పే అండ్ ప్లే పేరుతో చిన్న పిల్లల దగ్గర డబ్బులు వసూలు చేయడానికి సిగ్గుండాలి రోజా గారు. దావోస్ కు స్పెషల్ ఫ్లయిట్ లో వెళ్లడానికి డబ్బులు ఉంటాయి… ప్రభుత్వ కార్యాలయాలకు మీ పార్టీ రంగులను వేయడానికి రూ. 1400 కోట్లు ప్రజాధనం దుబారా చేయడానికి అవకాశం ఉంటుంది… కానీ పిల్లల ఆటల కోసం రూ. 50 ఖర్చు చేయడానికి మాత్రం మీ దగ్గర డబ్బులు లేవా? ఇలాంటి విధానాల్లో పని చేసే మీరా మా పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడేది..? ఎన్నికలు ఉన్నప్పుడు ఒకలా.. అయిపోయాక మరోలా మాట్లాడటం మాకు చేతకాదు. చనిపోయిన కౌలు రైతులకు సొంత డబ్బులు ఇస్తున్నా ఎక్కడా మా పార్టీ జెండా కూడా కట్టలేదు.

అది మా నాయకుడి గొప్పతనం. మీ స్వార్థ రాజకీయాల కోసం ప్రజల మధ్య చిచ్చు పెట్టి, ప్రాంతాల వారీగా విభజిస్తున్నారు. రాష్ట్ర భవిష్యత్తును రోడ్డున పడేస్తున్నారు. యువతరం వాళ్ల ట్రాప్ లో పడొద్దు. బస్సు యాత్ర అని మీ ఊరు వచ్చినప్పుడు ఉద్యోగ, ఉపాధి హామీలు ఏమయ్యాయని నిలదీయండి. దళితుల ఉన్నతికి ఉపయోగపడే 29 పథకాలను ఎందుకు అటకెక్కించారో ప్రశ్నించండి. పెట్రోల్, డీజిల్ ధరలు కేంద్రం తగ్గిస్తే రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు తగ్గించడం లేదు అని అడగండి. వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో ప్రజల ఆశీర్వాదాలతో పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి అయితే వైసీపీ చేసిన అరాచకాలు, అవినీతి చిట్టాను బయటకు తీస్తాం. వైసీసీ, జగన్ రెడ్డి ‘‘ఇన్ జ్యూరియస్ టూ ఆంధ్రప్రదేశ్’’. మిమ్మిల్ని, మీ పార్టీనీ ప్రజలే బంగాళాఖాతంలో కలిపేసే రోజులు దగ్గర్లోనే ఉన్నాయి’’ అని హెచ్చరించారు.

LEAVE A RESPONSE