– చింతకాయల విజయ్ ఇంట్లో పోలీసుల తీరుపై టీడీపీ అధినేత చంద్రబాబు మండిపాటు
మాజీ మంత్రి అయ్యన్న పాత్రుడి తనయుడు, టిడిపి యువనేత చింతకాయల విజయ్ ఇంట్లోకి దోపీడీ దొంగల్లా పోలీసులు చొరబడటాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాను. విజయ్ ఇంట్లో చిన్న పిల్లలను, పని వాళ్లను భయభ్రాంతులను చేసేలా సిఐడి పోలీసులు వ్యవహరించిన తీరు దారుణం.
5 ఏళ్ల వయసున్న పసిపిల్లను పోలీసులతో భయపెట్టే నీచమైన స్థితికి జగన్ రెడ్డి దిగజారాడు. సిఐడి పోలీసులు నోటీసులు ఇచ్చేందుకే వస్తే, డ్రైవర్ పై దాడి చెయ్యడం ఎందుకు ? కేసులు, విచారణల పేరుతో పోలీసులను రౌడీల్లా ప్రతిపక్ష నేతలపైకి జగన్ రెడ్డి ఉసిగొల్పుతున్నాడు.
బీసీ నేత అయ్యన్న పాత్రుడు కుటుంబంపై మొదటి నుంచీ కక్షపూరితంగా వ్యవహరిస్తోంది జగన్ రెడ్డి ప్రభుత్వం. గతంలో నర్సీపట్నంలో అయ్యన్న ఇంటిపై ఇలాగే దాడి చేశారు. రాష్ట్రంలో రోజుకో సిఐడి కేసు, వారానికో అరెస్టు తప్ప ఈ ప్రభుత్వం ప్రజలకు మరేమీ చెయ్యడం లేదు. ప్రభుత్వానికి దమ్ము, ధైర్యం ఉంటే ప్రతిపక్షానికి ప్రజాస్వామ్య పద్దతిలో సమాధానం చెప్పాలి. సిఐడి లాంటి విభాగాన్ని అడ్డుపెట్టుకుని వేధింపులతో పాలన సాగించడం సిగ్గుచేటు.