– సీఎం జగన్‌కు టీడీపీ ప్రధాన కార్యదర్శి లోకేష్ లేఖ
కేంద్రం గ్రామాలకు ఇచ్చిన నిధులను దారిమళ్లించిన జగన్ ప్రభుత్వం నుంచి నిధులు డిమాండ్ చేసిన సర్పంచులపై పెట్టిన అక్రమ కేసులను ఎత్తేయాలని టీడీపీ ప్రధాన కార్యదర్శి లోకేష్ డిమాండ్ చేశారు. ఆ మేరకు ఆయన సీఎం జగన్‌కు లేఖ రాశారు. లేఖ సారాంశం ఇదీ..
తేది.12.10.2022
గౌరవ వై.ఎస్.జగన్మోహన్ రెడ్డి
ముఖ్యమంత్రి, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం
విషయం : 14, 15 ఆర్ధిక సంఘం నిధులు అక్రమంగా మళ్లించుకున్న వైసీపీ సర్కారు దోపిడీపై ఆందోళనకి దిగిన సర్పంచులపై నమోదు చేసిన అక్రమ కేసులను ఉపసంహరించుకోవాలి.
పల్లెలే ప్రజాస్వామ్యానికి పట్టుకొమ్మలు అని మహాత్మా గాంధీ పేర్కొన్నారు. మహాత్ముడి ఆశయాలకు అనుగుణంగా పని చేస్తున్నస్థానిక సంస్థలను మూడున్నర సంవత్సరాలుగా నిర్వీర్యం చేసేలా ప్రభుత్వ చర్యలు ఉన్నాయి. కేంద్ర ప్రభుత్వం 14, 15 ఆర్ధిక సంఘం నుండి మంజూరు చేసిన రూ.7,660 కోట్లను పంచాయతీల ఖాతాల నుండి దారి మళ్లించారు. ఇటీవల కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిన రూ.948 కోట్ల రూపాయల నిధులను కూడా రాష్ట్ర ప్రభుత్వం పక్క దారి పట్టించే ప్రయత్నం చెయ్యడం అన్యాయం.
పైగా ఆ సొమ్మును విద్యుత్ బిల్లులకు చెల్లించామని పేర్కొనడం దుర్మార్గం. 1984 నుండి గ్రామ పంచాయతీలకు ఉచితంగా విద్యుత్ సరఫరా చేస్తుంటే ఇప్పుడు కేంద్రం ఇచ్చిన నిధులు విద్యుత్ బిల్లుల పేరుతో లాక్కోవడం ఎంత వరకు సమంజసం? ఒక వేళ చెల్లించినా కేంద్ర ఆర్ధిక సంఘం నిధులలో కేవలం 10 శాతం మాత్రమే విద్యుత్ అవసరాలకు వాడాలని ఆర్ధిక సంఘం నిబంధనల్లో ఉంటే.. మొత్తం నిధులు విద్యుత్ అవసరాలకంటూ లాక్కోవడం పంచాయతీలను నిర్వీర్యం చేయడమే. నిజంగా పంచాయతీల విద్యుత్ బిల్లుల కోసమే చెల్లించినట్లైతే సర్పంచులకు చెప్పకుండా, చెక్కులపై సర్పంచుల సంతకాలు లేకుండా నిధులు లాక్కోవడం దొంగిలించడమే అవుతుంది.
రాష్ట్ర ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే గ్రామాల్లోని విద్యుత్ దీపాలకు మీటర్లు, వాటి బిల్లుల వివరాలతో శ్వేతపత్రం విడుదల చేయాలి. ఒకవేళ విద్యుత్ బకాయిల కోసమే ఆర్థికసంఘం నిధులు మళ్లించడం నిజమైనా ప్రభుత్వ లెక్కల ప్రకారం రాష్ట్రంలోని ఒక్కో పంచాయతీకి సగటున రూ.60 లక్షల బిల్లు వచ్చిందనడం సాధ్యమేనా? ప్రభుత్వ చర్యల కారణంగా… పంచాయతీల ఖాతాల్లో నిధులు లేక సర్పంచులు పాలనని గాలికొదిలేశారు. గ్రామాల్లో తాగునీరు, రోడ్లు, డ్రైనేజీ, శానిటేషన్, లైటింగ్ వంటి ఎన్నో సమస్యలపై ప్రజలు నిలదీస్తుండడంతో తప్పని పరిస్థితుల్లో అప్పులు చేసి పనులు చేస్తున్నారు. ఇప్పటికే వందలాది మంది సర్పంచులు చేసిన అప్పులు తీర్చలేక పనులకి వెళ్లి కుటుంబాలను పోషించుకుంటున్నారు. రోడ్లు ఊడ్చేవారికి జీతాలు ఇవ్వలేక కొంత మంది తామే ముందుకు వచ్చి రోడ్లు ఊడుస్తున్నారు. మరికొంత మంది ఉపాధి కోసం ఇతర రాష్ట్రాలకు వెళ్లిన ఘటనలూ వెలుగులోకి వచ్చాయి.
మరోవైపు 14, 15 ఆర్ధిక సంఘం నిధులు వెనక్కి ఇవ్వాల్సిందిగా డిమాండ్ చేస్తూ, ఆందోళనకు దిగిన సర్పంచుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు పాపారావుతో సహా 32 మందిపై కేసులు పెట్టి, అరెస్టు చేయడం దుర్మార్గం. తమ పంచాయతీల నిధులు అక్రమంగా మళ్లించవద్దని శాంతియుతంగా సర్పంచులు నిరసన తెలపడం నేరమా సీఎం గారూ? పంచాయతీ ఖాతాల నుండి దోచేసిన సొమ్మును తక్షణమే ఆయా ఖాతాల్లో జమ చేయాలి. సర్పంచులపై నమోదు చేసిన కేసుల్ని విత్ డ్రా చేయాలి. పంచాయతీల అభివృద్ధికి అదనంగా నిధులివ్వాల్సిన మీ సర్కారు కేంద్రం విడుదల చేస్తున్న ఆర్థిక సంఘం నిధులు దోచేయడం నేరం కాదా సీఎం గారూ. ఇప్పటికైనా రకరకాల పేర్లతో పంచాయతీల నిధులు అక్రమ మళ్లింపుని ఆపాలి. సర్పంచులు న్యాయబద్దంగా డిమాండ్ చేస్తున్న గౌరవ వేతనం, హెల్త్ కార్డ్స్, బీమా, ప్రోటోకాల్ అంశాలు వెంటనే పరిష్కరించాలి.
నారా లోకేష్
టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి