మోదీ..కేసీఆర్‌..సేమ్‌ టు సేమ్‌!

14

– తెలంగాణ సెక్రటేరియేట్‌ ప్రారంభానికి గవర్నర్‌ను పిలవని కేసీఆర్‌
– తానే ప్రారంభించిన తెలంగాణ సీఎం కేసీఆర్‌
– మహిళను అవమానించారని మండిపడ్డ తెలంగాణ బీజేపీ నేతలు
– క్షమాపణ చెప్పాలని డిమాండ్‌ చేసిన కమల దళాలు
– గవర్నర్‌కి ఇచ్చే విలువ ఇదేనా అంటూ కమలదళాల కనెర్ర
– పార్లమెంటు భవన ప్రారంభానికి రాష్ట్రపతిని ఆహ్వానించని ప్రధాని మోదీ
– తానే ప్రారంభించనున్న ప్రధాని మోదీ
– మరి తెలంగాణ బీజేపీ నేతలు దానిని ఖండిస్తారా?
– ప్రారంభోత్సవాన్ని బహిష్కరించనున్న 19 పార్టీలు
– పార్లమెంటు భవన అంశంపై బీఆర్‌ఎస్‌ గప్‌చుప్‌
– గిరిజన మహిళకు ఇచ్చే గౌరవం ఇదేనా అన్న చర్చ
-మహిళలకు రాజకీయ పార్టీలు ఇచ్చే విలువ ఇదేనా అంటున్న మహిళా నేతలు
– పేరుకేనా ‘మహిళలకు ప్రాధాన్యం’ మాటలు?
– అనుకున్నదే అమలుచేస్తున్న కేసీఆర్‌, మోదీ
( మార్తి సుబ్రహ్మణ్యం)

మహిళలకు ప్రాధాన్యం ఇచ్చే ఏకైక రాజకీయ పార్టీ మాది మాదే!
రాష్ట్రపతి, గవర్నర్‌, స్పీకర్‌, సీఎంలను చేసిన ఘనత మాదే!!
మహిళలకు పెద్దపీట వేస్తున్న మా పార్టీకే మహిళలు ఓటెయ్యాలి!!!
– మహిళలకు ఇచ్చే ప్రాధాన్యాలపై, వివిధ రాజకీయ పార్టీలు చేసుకునే ఆర్భాటపు ప్రచారాలివి. కానీ వాస్తవంలో మహిళలకు ఇస్తున్న గౌరవ మర్యాదలు మాత్రం, అందుకు పూర్తి భిన్నం. కేవలం మహిళలు రాజకీయ పార్టీ ప్రచారానికే పనికివస్తున్నారే తప్ప, గౌరవమర్యాదలకు నోచుకోవడం లేదు. కావాలంటే మీరే చూడండి.

ఆకర్షణీయమై డిజైన్‌, రాజరికపు దర్పంతో నిర్మించిన తెలంగాణ సెక్రటేరియేట్‌ ప్రారంభోత్సవం కూడా రచ్చగా మారింది. రాష్ట్ర ప్రధమ పౌరురాలయిన గవర్నర్‌ తమిళసైని, సెక్రటేరియేట్‌ ప్రారంభోత్సవానికి ఆహ్వానించలేదు. తెలంగాణ సీఎం కేసీఆర్‌ ఒక్కరే సెక్రటేరియేట్‌ను ప్రారంభించారు. దానిపై బీజేపీ-కాంగ్రెస్‌-బీఎస్పీ-వైఎస్సార్‌టీపీ తీవ్రంగా స్పందించాయి.

తెలంగాణ బీజేపీ నాయత్వం ఒక అడుగు ముందుకేసి.. ఒక మహిళకు కేసీఆర్‌ సర్కారు ఇచ్చే గౌరవం ఇదేనా? అని నిలదీసింది. క్షమాపణ చెప్పాలని డిమాండ్‌ చేసింది. గవర్నర్‌ను గౌరవించాలన్న జ్ఞానం లేదా అని మండిపడింది. కేసీఆర్‌కు రాజ్యాంగాన్ని గౌరవించడం తెలియదని రుసరుసలాడింది. మహిళలను గౌరవించడం తెలియని సంస్కారం లేని, సర్కారు వైఖరిని మహిళలు గమనించాలని కమలదళాలు పిలుపునిచ్చాయి. అయితే దానిపై బీఆర్‌ఎస్‌ నుంచి ఎలాంటి ఎదురుదాడి కనిపించలేదు. కాకపోతే.. ‘‘ఎవరు ప్రారంభించాలన్నది రాష్ట్ర ప్రభుత్వ ఇష్టం. గవర్నర్‌ను ఆహ్వానించాలని ఎక్కడైనా రాజ్యాంగంలో ఉందా’’ అని మాత్రం ప్రశ్నించింది.

ఇప్పుడు అచ్చం ఇలాంటి వ్యవహారమే ఢిల్లీ కేంద్రంగా జరగనుంది. అన్ని హంగులతో, సర్వాంగ సుందరంగా నిర్మించిన పార్లమెంటు కొత్త భవనం, ఈనెల 28న ప్రారంభం కానుంది. దానిని ప్రధాని మోదీ ప్రారంభించనున్నారు. ఇది ఇప్పుడు దేశ రాజకీయాల్లో హాట్‌ టాపిక్‌గా మారింది.

ఎందుకంటే.. పార్లమెంటు ప్రారంభోత్సవానికి, భారత రాష్ట్రపతి-గిరిజన ముర్మును ఆహ్వానించడం లేదు. ఆమె రాకుండానే పార్లమెంటు భవనం ప్రారంభమవుతోంది. అదీ వార్త. ప్రతిపక్షాల అభ్యంతరం కూడాఇదే. రాష్ట్రపతిని ఆహ్వానించకుండా, ప్రధాని ఒక్కరే పార్లమెంటును ఎలా ప్రారంభిస్తారన్నది, ఇప్పుడు ప్రతిపక్షాలు కోడె కూస్తున్న ప్రశ్న. ఇప్పటిదాకా బీజేపీ చెబుతున్న ‘మహిళల గౌరవం-మహిళలకు ప్రాధాన్యం’ కబుర్లన్నీ.. కాకికథలేనా అని, విపక్షాలు విరుచుకుపడుతున్నాయి.

ఒక గిరిజన మహిళకు.. బీజేపీ ఇచ్చే గౌరవం ఇదేనా అని విపక్షాలు గళమెత్తుతుంటే, ఎదురుదాడి చేయలేని నిస్సహాయ స్థితి బీజేపీది. దీనికి నిరసనగా దేశంలోని 19 రాజకీయపార్టీలు ఇప్పటికేమూకుమ్మడి సంతకం చేశాయి. పార్లమెంటు భవన ప్రారంభోత్సవాన్ని బహిష్కరించాయి. కాంగ్రెస్‌ యువనేత రాహుల్‌గాంధీ.. ఈ నిర్ణయాన్ని ఖండించారు. ‘‘పార్లమెంటు నిర్మాణం జరిగింది రాజ్యాంగ విలువలతో. అంతే తప్ప అహంకారపు ఇటుకలతో కాదు’’ అంటూ ఘాటుగా ట్వీట్‌ చేశారు.

‘ గిరిజన మహిళను గౌరవించలేని బీజేపీ, అంతమాత్రపు దానికి రాష్ట్రపతి పదవి ఆమెకు ఎందుకు ఇచ్చినట్లు? గిరిజనులకు పదవి ఇచ్చామని ప్రచారం చేసుకోవడానికా’అని విపక్షాలు విరుచుకుపడతున్నాయి. ఈ విమర్శనల వానలో తడిసిముద్దవుతున్న తెలంగాణ బీజేపీ మాత్రం, ఎలాంటి ఎదురుదాడి చేయకుండా మౌనం వహించడం విశేషం. గిరిజన మహిళలకు అవమానం జరిగిందన్న ప్రచారం క్షేత్రస్థాయికి వెళ్లటంతో, కమలనాధుల పరిస్థితి కక్కలేక మింగలేక అన్నట్లుగా మారింది.

అయితే.. ఇటీవలి కాలంలో ప్రతి అంశంపైనా నేరుగా ప్రధాని మోదీపై మాటల దాడి చేస్తున్న బీఆర్‌ఎస్‌ మాత్రం, పార్లమెంటు ప్రారంభోత్సవ అంశంపై గప్‌చుప్‌గా ఉండటం ఆశ్చర్యం కలిగిస్తోంది. యావత్‌ ప్రతిపక్షాలన్నీ ఏకతాటిపైకొచ్చి, గిరిజన మహిళ అయిన రాష్ట్రపతిని ఆహ్వానించకుండానే పార్లమెంటు భవన ప్రారంభోత్సవాన్ని ఖండించాయి.

అందుకు నిరసనగా రాసిన లేఖపై సంతకం పెట్టి, ప్రారంభోత్సవానికి వచ్చేది లేదని ఖరాఖండీగా స్పష్టం చేశాయి. ఈ మొత్తం నిరసన ప్రక్రియలో, బీఆర్‌ఎస్‌ ఎక్కడా కనిపించకపోవడం చర్చనీయాంశమయింది. తాము పార్లమెంటు భవన ప్రారంభోత్సవానికి వెళ్లకపోవచ్చని.. బీఆర్‌ఎస్‌ కె.కేశవరావు చెప్పారే తప్ప, కారణాలు వివరించకపోవడం గమనార్హం.

ఈ అంశంలో బీఆర్‌ఎస్‌ ఇరుకునపడటంలో ఆశ్చర్యమేమీ లేదు. గవర్నర్‌ లేకుండానే సెక్రటేరియేట్‌ ప్రారంభించిన బీఆర్‌ఎస్‌కు… తమను విమర్శించే హక్కు లేదని బీజేపీ ఎదురుదాడి చేస్తే, దానికి జవాబు చెప్పడం కష్టమే. అందుకే బీఆర్‌ఎస్‌ నేతలు పార్లమెంట్‌ ప్రారంభోత్సవ వ్యవహారంపై, మౌనాన్ని ఆశ్రయించినట్లు కనిపిస్తోంది.

అయితే ఈ మొత్తం వ్యవహారంలో, తెలంగాణ బీజేపీ నేతల పరిస్థితి సంకటంలో పడినట్లయింది. ఇప్పుడు పార్లమెంటు ప్రారంభోత్సవానికి వెళ్లని బీఆర్‌ఎస్‌ను, విమర్శించలేని నైతిక సంకటం. గవర్నర్‌ లేకుండా సెక్రటేరియేట్‌ ప్రారంభించినందుకు క్షమాపణ చెప్పాలని డిమాండ్‌ చేసిన తెలంగాణ బీజేపీ… ఇప్పుడు రాష్ట్రపతి లేకుండా ప్రారంభిస్తున్న ప్రధాని క్షమాపణ చెప్పాలని డిమాండ్‌ చేయలేని నిస్సహాయ పరిస్థితి.

రాష్ట్రపతి ముర్ము లేకుండానే, పార్లమెంటు భవన ప్రారంభోత్సం చేస్తున్న ప్రధానిని విమర్శించలేని స్వధర్మ ఇరకాటం. కాకపోతే.. గవర్నర్‌ లేకుండానే సెక్రటేరియేట్‌ను ప్రారంభించిన బీఆర్‌ఎస్‌.. పార్లమెంటు భవన ప్రారంభోత్సవానికి గైర్హాజరవడం, వింతగా ఉందన్న .. ఒక్క ముక్క విమర్శతో గప్‌చుప్‌ కావచ్చు. అదొక్కటే బీజేపీకి అందుబాటులో ఉన్న అస్త్రం.

అయితే ఇటు కేసీఆర్‌.. అటు మోదీ.. ఇద్దరూ తాము అనుకున్నది అమలుచేస్తున్నారే తప్ప, విమర్శలు పట్టించుకోవటం లేదని స్పష్టమవుతూనే ఉంది. ఎవరి స్థాయిలో వారు తమ అధికారాలు వినియోగించుకుని, రాజ్యాంగాన్ని పెద్దగా పట్టించుకోవడం లేదన్న వాస్తవాన్ని, ఈ రెండు ఘటనలు రుజువుచేస్తున్నాయి.