కుప్పం ప్రజలు కూడా బాబును నమ్మట్లేదు

– కుప్పంలో సభలకు జనంరాక చిన్న పిల్లలతో జేజేలు కొట్టించుకుంటున్న బాబు
– తప్పు చేసిన టీడీపీ నేతల్ని శిక్షించకూడదన్నదే చంద్రబాబు విధానమా?
– నారాయణ విద్యా సంస్థలు నారాయణవికాక మరెవరివి..?
– వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే, రాష్ట్ర అధికార ప్రతినిధి గడికోట శ్రీకాంత్ రెడ్డి ప్రెస్ మీట్

శ్రీకాంత్ రెడ్డి మాట్లాడుతూ.. ఇంకా ఏమన్నారంటే…
బాబు దిగజారుడు
తాను ప్రాతినిధ్యం వహిస్తున్న సొంత నియోజకవర్గం కుప్పంలో కూడా తన సభలకు జనం రాక, ఆఖరికి చిన్నపిల్లలతో సభలు పెట్టి, “జై తెలుగుదేశం.. సీఎం బాబు..” అంటూ నినాదాలు చేయించుకునే స్థాయికి చంద్రబాబు దిగజారాడు. 40 ఏళ్ళు అనుభవం ఉందని చెప్పుకునే చంద్రబాబు నాయుడు చేస్తున్న దిగజారుడు రాజకీయం చూసి ప్రజలు ముక్కున వేలేసుకుంటున్నారు. ఏనాడైనా ప్రజలకు మంచి చేసి ఉంటే… ఈ ఖర్మ పట్టేది కాదు కదా.. అని కుప్పం ప్రజలే అనుకుంటున్నారు.

తన సభల్లో యువతను, విద్యార్థులను రెచ్చగొడుతూ… ముఖ్యమంత్రి ని అసభ్య పదజాలంతో దూషిస్తున్నాడు. మీకు పౌరుషం లేదా, మీరు నిద్రపోతారా.. అని యువతను రెచ్చగొడుతూ, మరోవైపు పోలీసులను, అధికారులను బెదిరిస్తూ, పూనకం వచ్చినట్టు ఊగిపోతూ ప్రసంగాలు చేస్తున్నాడు. చంద్రబాబు తీరు ఇలా ఉంటే, ఆయన కొడుకు లోకేష్.. నా మాదిరిగా 12 కేసులు ఉంటేనే.. నా దగ్గరకు రండి, మీరు ఎన్ని అరాచకాలు చేయాలో చేయండి.. నేను చూసుకుంటాను.. అంటూ తెలుగు యువతకు పిలుపునిస్తున్నాడు.

దీంతో టీడీపీకి చెందిన వారే అత్యాచారాలు, అఘాయిత్యాలకు పాల్పడటం, ఎక్కడ ఏం జరుగుతుందా వాలిపోదాం, ప్రభుత్వంపై బురదజల్లుదాం అని ఎదురుచూసే తండ్రీకొడుకులు సంఘటన జరిగిన ప్రాంతాలకు వెళ్ళి బాధితులను పరామర్శించడం, నిందితులపై కేసులు పెడితే.. మళ్ళీ వీరే కక్ష సాధింపులు అని మీటింగులు పెట్టి ప్రజలను రెచ్చగొట్టడం చూస్తుంటే.. ఇటువంటి వింతైన, విచిత్రమైన రాజకీయం ఎప్పుడూ ఎవరూ చూసి ఉండరు.

నారాయణ విద్యా సంస్థల్లో పదో తరగతి ప్రశ్నాపత్రాలు మాల్ ప్రాక్టీస్ కు వీళ్ళే పాల్పడతారు. దీనికి ప్రధాన సూత్రధారి అయిన ఆ సంస్థల అధినేత నారాయణను ప్రశ్నాపత్రాల మాల్ ప్రాక్టీస్ కేసులో అరెస్టు చేస్తే.. మళ్ళీ ఇదే చంద్రబాబు ఆయనను వెనకేసుకొస్తూ మాట్లాడుతున్నాడు. అంటే తప్పు చేసిన టీడీపీ వారిని శిక్షించకూడదు అన్నదే మీ విధానమా..?
నారాయణ విద్యా సంస్థలు నారాయణవి కాదా..? అలానే, బ్యాంకులకు వేల కోట్లు ఎగ్గొట్టిన సుజనా సంస్థలు సుజనా చౌదరివి కావా.. ?, వారివి కాకపోతే మరెవరివి..?

విజయవాడలో రమేష్ ఆసుపత్రిలో నిర్లక్ష్యం కారణంగా, 16 మంది మరణిస్తే.. ఈ ఘటనను కూడా చంద్రబాబు రాజకీయ లబ్ధి కోసం వాడుకున్నాడు. రాష్ట్రంలో ఎక్కడ ఏ సంఘటన జరిగినా, గంట, రెండు గంటల లోపలే మేం అరెస్టులు చేసి, నిందితులను జైళ్ళల్లో పెడుతున్నాం. ఎక్కడో ఏదో జరిగితే, ఆ ఘటనలను పట్టుకుని చంద్రబాబు రాజకీయం చేస్తున్నాడు.

ఇదే విజయవాడలో ఓ విద్యార్థిని తెలుగుదేశం పార్టీ నేత వేధిస్తే, ఆ యువతి ఆత్మహత్యకు పాల్పడితే చంద్రబాబుకు ఎందుకు బాధ కలగలేదు.. అన్ని సంఘటనలపై ఒకే రీతిలో స్పందిచే మనస్తత్వం చంద్రబాబుకు ఎందుకు లేదు..? రాజకీయాల్లో అనుభవం పెరిగేకొద్దీ హుందాతనం కూడా పెంచుకోవాలి. కానీ, చంద్రబాబునాయుడికి అనుభవం, వయసు పెరిగే కొద్దీ.. ఇంకా ఇంకా దిగజారిపోతున్నాడు.

సంక్షేమాన్ని నిర్లక్ష్యం చేసిన బాబు
ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి అమలు చేస్తున్న సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలు గడపగడపకూ చేరుతుంటో, ఇక తన పార్టీ మనుగడ ప్రశ్నార్థకం అవుతుందనే బాధ, భయంతో చంద్రబాబు నోటికొచ్చినట్లు మాట్లాడుతున్నాడు. నోటికి అడ్డూఅదుపూ లేకుండా చంద్రబాబు మాట్లాడుతున్నాడు. చంద్రబాబు హయాంలో ఏ ఒక్క పథకం కూడా శాచురేషన్ విధానంలో అమలు కాలేదు. తాను కొత్తగా ఏ పథకం కూడా అమలు చేయకపోయినా, ఉన్న పథకాలలో కూడా కత్తెర వేసి, కోతలు కోశాడు. అదే జగన్ మోహన్ రెడ్డి పరిపాలనలో కులం, మతం, పార్టీ, జెండాలు చూడకుండా.. అర్హతే ప్రామాణికంగా క్యాలెండర్ ఏర్పాటు చేసి మరీ ప్రతి పథకాన్ని, ప్రజల గడప వద్దకే వెళ్ళి అందిస్తున్నాం.

జగన్ మోహన్ రెడ్డి అమలు చేస్తున్న పథకాలను చంద్రబాబు ఎందుకు అమలు చేయలేకపోయాడు, అర్హతే ప్రాతిపదికగా పథకాలను అర్హులకు ఎందుకు ఇవ్వలేకపోయాడు..? అంటే సమాధానం ఉండదు. చంద్రబాబు అధికారంలో ఉండగా సంక్షేమాన్ని పూర్తిగా నిర్లక్ష్యం చేశాడు. అందుకే చంద్రబాబును కోతల బాబు అని ప్రజలు పిలిచేవారు. ఈ మూడేళ్ళలో రూ. 1.50 లక్షల కోట్లు డీబీటీ ద్వారా ప్రజలకు నేరుగా వారి బ్యాంకు ఖాతాల్లో జమ అయిందంటే.. అది జగన్ మోహన్ రెడ్డి పాలనా దక్షతే.

అభివృద్ధి కాక మరేమిటి…?
అభివృద్ధి ఏదీ అని ప్రశ్నిస్తున్న ప్రతిపక్షాలకు.. ఇదీ అభివృద్ధి అని ప్రతి గ్రామంలో కళ్ళకు కట్టినట్టు చూపిస్తున్నాం. జగన్ మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చాక, సచివాలయ వ్యవస్థ ఏర్పాటుగానీ, నాడు-నేడు ద్వారా స్కూళ్ళు, ఆసుపత్రులు అభివృద్ధిగానీ, రైతు భరోసా కేంద్రాలు ఏర్పాటుగానీ.. ప్రతి విలేజ్ లో హెల్త్ క్లినిక్ లుగానీ.. ఈరోజు ప్రతి గ్రామంలో కనిపిస్తున్నాయి. ఇదంతా అభివృద్ధిగాక మరేమిటి.?

గడపగడపకూ ప్రభుత్వం కార్యక్రమం ఓ పండుగలా రాష్ట్రంలో జరుగుతుంది. దళారులు లేకుండా, ఒక్క పైసా లంచం లేకుండా పూర్తి పారదర్శకంగా ఈరోజు పరిపాలన జరుగుతుంది. గడప గడపకూ ప్రభుత్వం అంటూ.. 35 నెలల మా పాలనలో ఇది చేశాం అని చెప్పేందుకు వెళుతుంటే.. దానిపైనా ప్రతిపక్షాలు, ఎల్లో మీడియా విమర్శలు చేస్తున్నాయి. ఈ కార్యక్రమంలో భాగంగా, తెలుగుదేశం పార్టీ నేతలు, కార్యకర్తల ఇళ్ళకు కూడా మేం వెళతాం. మీకు ఫలనా మంచి చేశామా.. లేదా..? అన్నది అధికారికంగా మేము వారికి చూపించగలుతాం. అదే చంద్రబాబు హయాంలో ఇలాంటి పరిపాలన జరిగిందా..?

అధికారం చేపట్టిన మొదటిరోజే, ఐఏఎస్, ఐపీఎస్ ల సమావేశంలో తెలుగుదేశం పార్టీ నేతలు ఏం చేసినా చూసిచూడనట్టు వదిలేయమని చంద్రబాబు చెప్పాడు. ఈ ప్రభుత్వంలో కూడా అదే జరగాలని మీరు అనుకుంటున్నారు. కానీ అది జరగదు. ముఖ్యమంత్రి జగన్ సొంత బంధువులైనా కూడా వదిలిపెట్టేది లేదని ఈరోజు చర్యలు తీసుకుంటున్నారు. చట్టం తన పని తాను చేసుకుపోతుంది. ఇంత పారదర్శకమైన ప్రభుత్వం ఎప్పుడైనా చూశారా..?

అదే చంద్రబాబు హయాంలో ప్రభుత్వ అధికారులపై దాడులు, దౌర్జన్యాలు చేస్తే.. పంచాయితీలు చేసి పంపించాడు. ఎమ్మార్వో వనజాక్షి దగ్గర నుంచి ఐపీఎస్ అధికారి సుబ్రహ్మణ్యంపై టీడీపీకి చెందిన నేతలు దౌర్జన్యాలకు పాల్పడితే మీరు పంచాయితీలు చేసి, బాధిత అధికారులనే బెదిరించి పంపించారు.చంద్రబాబు నాయుడు పాలనకు.. జగన్ గారి పరిపాలనకు ఎంత తేడా ఉందో ప్రజలు ఈరోజు గమనిస్తున్నారు.

నిర్దోషి అని నిరూపించుకోండి బాబూ..
మీకు చిత్తశుద్ధి ఉంటే.. మీరు నిర్దోషి అయితే, మీ అక్రమాస్తులు, మీమీద ఉన్న అవినీతి కేసులపై విచారణకు సిద్ధమా..? వాటిల్లో ఉన్న స్టేలు అన్నీ వెకేట్ చేయించుకుని విచారణకు ఎదుర్కొని నిర్దోషిగా బయటకు వస్తే, మీరు సీనియర్ నాయకుడని ఒప్పుకుంటాం. సీనియర్ నాయకులు అనేవారు రాజకీయాల్లో రోల్ మోడల్ గా ఉండాలేగానీ, అరాచకాలు చేయండి, దౌర్జన్యాలు చేయండి, కేసులు పెట్టించుకుని నా దగ్గరకు రండి.. అని పిలుపునిస్తూ ప్రజలను రెచ్చగొట్టడం కాదు.

7సార్లు కుప్పంలో ఎమ్మెల్యేగా గెలిచినా, మూడు సార్లు ముఖ్యమంత్రి అయినా, మీరు కుప్పంను రెవెన్యూ డివిజన్ కూడా చేయలేకపోయారు అంటేనే మీ నాయకత్వం యొక్క సమర్థత ఏమిటో ప్రజలకు అర్థం కావడం లేదా..? స్థానిక ఎన్నికల ముందు వరకు కుప్పం మొహం చూడని మీరు.. ఈరోజు చిన్న పిల్లలతో కూడా సభలు పెట్టుకుని, భయంతో రోజుల తరబడి ప్రచారం చేస్తున్నారంటే అక్కడ కూడా మీకు విలువ లేదని అర్థం కావడం లేదా…?

కుప్పం నియోజకవర్గంలో అన్ని స్థానిక సంస్థల ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ప్రజలు పట్టం కట్టడంతో వచ్చిన భయంతోనే చంద్రబాబు ఇటువంటి దిగజారుడు రాజకీయాలు చేస్తున్నాడు. ఆఖరికి కుప్పంలో అయినా తన పలుకుబడి పెంచుకోవాలని ఆరాటపడుతున్నాడు. వైఎస్ఆర్ జిల్లా అధ్యక్షుడు, మేయర్ కే. సురేష్ బాబు మాట్లాడుతూ.. 2014కు ముందు కూడా చంద్రబాబు ఇదేవిధంగా కల్లబొల్లి మాటలు ఎన్నో చెప్పాడు. నేను మారాను, నా అనుభవం చూసి నాకు ఓటెయ్యండి అని చెప్పి, ఎన్నికల మేనిఫెస్టోలో 600కు పైగా హామీలు ఇచ్చి, ఆఖరికి పేదలకు ఒక సెంటు స్థలం ఇవ్వలేదు. అన్ని కులాలు, మతాల వారిని అన్యాయం చేసిన వ్యక్తి చంద్రబాబు.

కనీసం కుప్పంలో సొంత ఇల్లు కూడా ఏర్పాటు చేసుకోకుండా, ఇప్పటికీ చుట్టపు చూపుగా వెళ్ళివస్తున్న చంద్రబాబుకు కుప్పం ప్రజలు తగిన గుణపాఠం చెప్పారు. ఈరోజు గడపగడపకు ప్రభుత్వం కార్యక్రమం ద్వారా.. మా ప్రభుత్వం ప్రతి కుటుంబానికి సంక్షేమ కార్యక్రమాలు అందించిందని, కాలర్ ఎగురవేసి మరీ ప్రజల ముందుకు వెళుతున్నాం.

Leave a Reply