రగిలింది విప్లవాగ్ని ఈరోజు..!

మన్యం పోరాటానికి వందేళ్లు..

వంద సంవత్సరాల క్రితం
ఇదే రోజున
మన్యం గర్జించింది..
తెల్లోడి గుండె ఉలిక్కిపడింది..!

అక్షరం ముక్క రాని తెగలో
ఎంతకైనా వెనకాడని తెగింపు..
అదిగదిగో తెల్లవాడి గుండెల్లో
నిదురుంచిన వాడు..
దైన్యం నిండిన మన్యంలో
నిదిరించిన పౌరుషాగ్ని
రగిలించిన వాడు..
చిమ్మచీకట్లో సూరీడు
పట్టపగటి వెన్నెలరాజు
అల్లూరి సీతారామరాజు!

అది ఆగస్టు 22..
1922..
కుదిరింది ముహూర్తం..
గర్జించింది సింహం..
ఉలిక్కిపడింది తెల్ల గ్రామసింహం..
మ్రోగింది రణభేరి..
అదే చింతపల్లి…
అక్కడే ఉదయించింది
పట్టపగలే జాబిల్లి..!

అదనపు బలగాలు మోహరించిన
ఠానాకే లేకపోయింది
ఠికానా..
ముందే చెప్పి చేసిన దాడి..
అల్లూరి రామరాజు ముట్టడి..
ఆయుధాలు స్వాధీనం..
దర్జాగా రికార్డుల్లో దస్తకం..
గడగడలాడింది
బ్రిటిష్ రాజ్యం
ఆపాదమస్తకం..
తుపాకీ గుండు
పేలని సమరం..
గిరిజన తండాల్లో
తొలి సంబరం..!

త్యాగాలే సహిస్తాం..
కష్టాలే భరిస్తాం..
నిశ్చయమ్ముగ నిర్భయమ్ముగ
నీ వెంటనే నడుస్తామని
కదిలింది గంటయ్య దండు..
తిరుగుబాటు..స్వాతంత్య్రం
స్వేచ్ఛావాయువు..
ఈ పదాలకు అర్థమే తెలియని అమాయకత్వం..
దొర చెప్పిందే నమ్మే తత్వం..
రాజు మాటే శాసనం
గీసిందే గీత..!

ఇక అదే పని..
రోజు దాటి రోజు..
ఒకటి తర్వాత ఇంకొకటి
పోలీస్ స్టేషన్లు కొల్లగొట్టడం
ఆయుధాలు స్వాధీనం..
మాటే వేదం..
రాజే దేవుడు..!

ఈ దేశం..ఈ రాజ్యం
నాదేనని శాసించి..
ప్రతి మనిషి తొడలు కొట్టి
శృంఖలాలు పగులకొట్టి
చురకత్తులు పదునుపెట్టి
తుది సమరం మొదలు పెట్టి
ఇదే దొర పిలుపు..
అప్పుడే మొదలైంది గెలుపు!

స్వరాజ్యానికి పొడిచింది తొలిపొద్దు..
అల్లూరి ఎగరేసిన సమరపతాకం
నేతాజీ ధరియించాడు..
మధురస్వప్నం
మహిత స్వరాజ్యం
గాంధీ నెహ్రూ తెచ్చారు…
జననికి విడుదల
జాతికి పండుగ
జెండా ఊంచా
రహే హమారా!

స్వరాజ్య సాధన..
అల్లూరి పెట్టిన తొలికేక..
జాతికి ఆవేశమై..
తిరుగుబాటు సన్నివేశమై..
విప్లవం భరతజాతి పథమై..
ఆయుధమే తన విధమై..
స్వతంత్రమే శపథమై..!

ఎలిశెట్టి సురేష్ కుమార్
9948546286
విజయనగరం

Leave a Reply