పేపర్ లీక్ కి సీఎం కేసీఆర్ భాధ్యత వహించాలి

-రాజకీయ రంగు పూసి తప్పించుకోవాలని చూడడం అసమర్థ పాలనకు నిదర్శనం
-నిరుద్యోగుల ఆర్థనాదాలు అర్థం చేసుకొనే హృదయం కెసిఆర్ కి ఉందా?
-మాక్సిమం పాలిటిక్స్ మినిమం రూలింగ్
-తల్లుల బాధ కెసిఆర్ కి అర్ధం అవుతుందా?
-నిజాయితీ ఉంటే.. సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలి
-సమయాన్ని వృధా చేసుకున్న నిరుద్యోగులకు నష్టపరిహారం చెల్లించాలి
-బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్

కేసీఆర్ కు ప్రతిదీ రాజకీయం చేయడం పరిపాటి అయ్యింది ధాన్యం కొనుగోలు వ్యవహరం కావచ్చు, కవిత లిక్కర్ కేసు కావచ్చు, పబ్లిక్ సర్వీస్ కమిషన్ పేపర్ లీకేజి కావచ్చు ఇలా ప్రతిదీ రాజకీయం చేసి తన అసమర్థత పాలనను, అవినీతిని పాలనను కప్పిపుచ్చుకోవాలని చూస్తున్నాడు.. ఇది సరైంది కాదు. కోటిఆశలతో పరీక్షలకు ప్రిపేర్ అయ్యే నిరుద్యోగుల పై పిడుగు పడినట్లు అయ్యింది పేపర్ లీక్ వార్త. లీక్ పై దృష్టి పెట్టి సమగ్ర దర్యాప్తు చేయించి కేసీఆర్ తన నిజాయితీ నిరూపించుకోవాలి.

సిట్టింగ్ జడ్జ్ తో విచారణ జరిపించి దోషులు తప్పించుకొకుండా వారికి కఠిన శిక్ష పడేలా చూడాల్సిన సీఎం రాజకీయ రంగు పూసి తప్పించుకోవాలని చూడడం తన అసమర్థ పాలనకు నిదర్శనం. కెసిఆర్ రాజకీయాల పై ఎక్కువ సమయం కేటాయించి పాలన పై తక్కువ సమయం కేటాయిస్తున్నారు.. కెసిఆర్ పాలన ఎలా ఉంది అంటే….. మాక్సిమం పాలిటిక్స్ మినిమం రూలింగ్ అన్నట్లు వుంది.. కోటి కలలతో కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణలో నిరుద్యోగులను, కేసీఆర్ సర్కార్ నిండా ముంచుతోంది. ఉద్యోగాలు భర్తీ సరిగ్గా చెయ్యకపోగా చేసిన కొన్నింటిలో అక్రమాలు యువత భవిష్యత్తును అందకారం చేస్తున్నాయి.

ఉద్యోగం చదువుకున్న వారికి ఒక కల. తెలంగాణ రాష్ట్రంలో 30 లక్షలమంది ప్రభుత్వ ఉద్యోగం కోసం ఎదురుచూస్తున్నారు. ఇంటికో ఉద్యోగం ఇస్తా అని చెప్పిన కెసిఆర్, నోటిఫికేషన్లతో సరిపెడుతున్నారు. ఒకటో అరో పరీక్షలు నిర్వహిస్తే వాటిని కూడా పకడ్బందీగా నిర్వహించలేని నిస్సహాయకస్థితిలో కెసిఆర్ ప్రభుత్వం ఉండడం దురదృష్టకరం. పేపర్ లీక్ అవ్వగానే పరీక్ష రద్దు చేస్తాం అని సింపుల్ గా ప్రకటిస్తున్నారు. కానీ దానివెనుక ఎంతమంది నిరుద్యోగుల ఆర్థనాదాలు ఉన్నాయో అర్థం చేసుకొనే హృదయం కెసిఆర్ కి ఉందా?

కూలి పని చేసి, కూరగాయలు అమ్మి ఎంతో మంది తల్లులు తమ పిల్లలకుపై చదువులు చెప్పించి, కోచింగ్ ఇప్పించి ఉద్యోగం కోసం ఎదురుచూసే ఆ తల్లుల బాధ కెసిఆర్ కి అర్ధం అవుతుందా?
లక్షల రూపాయల ఖర్చుపెట్టి కోచింగ్ తీసుకొని, సంవత్సరాల తరబడి లైబ్రరీలలో కూర్చొని తిని తినక కష్టపడి చదువుకొని పరీక్ష రాస్తే.. ఆ పరీక్ష రద్దు చేసి వారి ఆశలమీద నీళ్ళు చల్లుతున్నారు. లక్షల మంది భవిష్యత్తును కరాబ్ చేస్తున్నారు. మానసిక ఆందోళనకు గురి చేస్తున్నారు. వారి వేదనకు వెలకట్టగలమా?

సర్వీస్ కమీషన్ పరీక్ష అంటేనే అత్యంత పకడ్బందీగా నిర్వహించాల్సిన పరీక్ష. సమర్ధులను, నమ్మకస్తులను, నిజాయితీపరులకు అక్కడ అవకాశం ఇవ్వాలి. పరీక్షాపత్రాలు లీక్ అవ్వకుండా, అవినీతి జరగకుండా నిఘా పెట్టాలి. కానీ కేసీఆర్ ఇలాంటి వాటి మీద కాకుండా, ప్రత్యర్థి నాయకుల మీద నిఘా పెట్టేందుకు ఇంటెలిజెన్స్ వ్యవస్థను దుర్వినియోగం చేస్తున్నారు. క్రిమినల్స్ మీద, సంఘ విద్రోహ శక్తుల మీద పెట్టల్సిన నిఘా రాజకీయ నాయకుల మీద పెడుతున్నారు.

ప్రీతిలాంటి అమ్మాయిలది ఆత్మహత్యనా, హత్యనా తేల్చడానికి నిఘా పెట్టరు కానీ పక్కవాళ్ళ ఫోన్ల మీద నిఘా పెట్టి ఎవరు ఏం మాట్లాడుకుంటున్నారో వింటున్నారు. ఈ చిల్లర పనులు చేసే బదులు విద్యార్థుల భవిష్యత్తు మీద దృష్టి పెడితే వారికి ఈ మానసిక క్షోభ ఉండేది కాదు కదా. కెసిఆర్ కి రాజకీయాల మీద ఉన్న శ్రద్ధ పాలన మీద ఉంటే ఇలాంటి సంఘటనలు జరిగేవి కాదు.

లక్షల మంది విద్యార్థులు ఆందోళన చెందుతుంటే ముఖ్యమంత్రి హోదాలో ఉండి వారికి మానసిక దైర్యం అందించాలనే ఇంగిత జ్ఞానం లేకపోవడం బాధాకరం. ఇంకో పక్క మంత్రులు, BRS నేతలు దీనిని రాజకీయం చేసి మాట్లాడడం సిగ్గుచేటు. కెసిఆర్ దీనికి భాధ్యత వహించి, ఇప్పటికైనా స్పందించి నిరుద్యోగుల ఆందోళన తొలగించాలి. చిన్న చిన్న ఉద్యోగుల మీద చర్యలు తీసుకొని చేతులు దులుపుకోకుండా బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్న.

ప్రతి అంశానికి రాజకీయ రంగుపూసి తప్పు నుండి బయటపడే అలవాటు ఉన్న కేసీఆర్ & కో. పేపర్ లీక్ విషయాన్ని కూడా పక్క పార్టీ వాళ్ళమీద వేసి తప్పించుకొనే ప్రయత్నం చేస్తున్నారు. కేసీఆర్ ప్రభుత్వానికి నిజాయితీ ఉంటే.. సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలి. ఇంత సమయాన్ని వృధా చేసుకున్న నిరుద్యోగులకు నష్టపరిహారం చెల్లించాలి అని ఈటల రాజేందర్ డిమాండ్ చేశారు.

Leave a Reply