*వేల కోట్ల రూపాయలు ఎవరి జేబుల్లోకి వెళ్తున్నాయో ప్రజలకు చెప్పాలి
* రాష్ట్ర అప్పులు రూ. 7 లక్షల కోట్లకు చేరాయి
*ఒక్కొక్క కుటుంబంపై రుణ భారం రూ. 3 లక్షలు
*దళారులకే ఉపయోగపడుతున్న రైతు భరోసా కేంద్రాలు
*ఆవిర్భావ సభకు పెద్దఎత్తున తరలి రావాలి
*గుంటూరు జిల్లా భట్టిప్రోలు బహిరంగ సభలో జనసేన పీఏసీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్
పాలనలో వర్క్ ఫ్రమ్ హోమ్ విధానాన్ని అవలంభిస్తున్న ముఖ్యమంత్రి… ఇసుక దోపిడిలో మాత్రం ప్రీపెయిడ్ విధానాన్ని అనుసరిస్తున్నారని జనసేన పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ వ్యాఖ్యానించారు. ఒకొక్క ఇసుక రీచ్ నుంచే రోజుకు కోటి రూపాయలు ఖజానాకు వస్తుంటే… ప్రభుత్వం మాత్రం రోజుకు మొత్తం మీద కోటి రూపాయలు మాత్రమే వస్తోందని చెప్పడం దారుణమని అన్నారు.
ఇసుక దోపిడిలో వస్తున్న వేల కోట్లు ఎవరి జేబుల్లోకి వెళ్లిపోతున్నాయో ప్రజలకు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. సాయంత్రం గుంటూరు జిల్లా వేమూరు నియోజకవర్గం భట్టిప్రోలు గ్రామంలో ఆత్మీయ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వైఎస్ఆర్ సీపీ స్టేట్ యూత్ జనరల్ సెక్రటరీ కొరికిపాటి ప్రేమ్ కుమార్ ఆయన అనుచరులతో మనోహర్ సమక్షంలో పార్టీలో చేరారు. ఆయనకు మనోహర్ కండువా కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు.
అనంతరం మనోహర్ మాట్లాడుతూ… “ అధికారంలోకి వస్తే అవినీతి లేని ఇసుక విధానాన్ని తీసుకొస్తామని హామీ ఇచ్చిన జగన్ రెడ్డి … అధికారంలోకి వచ్చిన మూడేళ్లలో ఐదు విధానాలు తీసుకొచ్చారు. ప్రభుత్వ అనాలోచిత నిర్ణయాలతో వేలాది మంది భవన నిర్మాణ కార్మికులు రోడ్డున పడ్డారు. కొంతమంది ఆత్మహత్యలకు పాల్పడ్డారు. వారికి ఆనాడు పవన్ కళ్యాణ్ , జనసేన పార్టీ అండగా నిలబడింది. విశాఖలో నిరసన తెలపడంతో పాటు డొక్కా సీతమ్మ స్ఫూర్తితో మూడు రోజుల పాటు రాష్ట్ర వ్యాప్తంగా భోజనాలు ఏర్పాటు చేశాం. ఆన్ లైన్ విధానం తీసుకొచ్చారు.. అదీ ఫెయిల్ అవ్వడంతో చివరకు ఒక ప్రైవేటు కంపెనీకి ఇసుక రీచ్ లను అప్పగించారు. ఏడాదికి రూ. 380 కోట్లు చెల్లిస్తే రాష్ట్రంలో ఉన్న ఇసుకను దోచుకెళ్లొచ్చు అని చెప్పారు.
ఇసుక అమ్మకాల ద్వారా గతంలో వైసీపీ నాయకులకు ఎంతో కొంత మిగిలేది… ఇప్పుడు సీఎంకు మాత్రమే మిగులుతోంది. కాంట్రాక్టర్లతో ముందే మాట్లాడుకొని, సంవత్సరానికి సరిపడ డబ్బు ముందే తీసుకుంటున్నారు.
రాష్ట్రానికి అప్పు పుట్టడమే గగనమైంది
రాష్ట్రంలోని రోడ్ల దుస్థితిపై జనసేన పార్టీ డిజిటల్ క్యాంపెయిన్ నిర్వహిస్తే దానికి అనూహ్య స్పందన వచ్చింది. దీంతో ముఖ్యమంత్రి, ఆయన కేబినెట్ మంత్రులు ప్రతి ఏడాది రహదారుల మరమ్మతుల కోసం రూ. 1200 కోట్లు ఖర్చు చేస్తున్నామని చెబుతున్నారు. నిజానికి వాళ్లు ఖర్చు చేస్తున్నది కేవలం మూడు నుంచి నాలుగు వందల కోట్లు మాత్రమే. మిగతా సొమ్మును పెట్రోల్, డీజీల్ పై వసూలు చేస్తున్న సెస్ నుంచి ఖర్చు చేస్తున్నారు.
ఒకవైపు రాష్ట్ర బడ్జెట్ రూ. 2 లక్షల కోట్లకు చేరితే .. అప్పు మాత్రం రూ. 7 లక్షల కోట్లకు చేరింది. రాష్ట్రానికి అప్పులు ఇవ్వడానికి భయపడుతున్నారు. పరిపాలన లేదు, పాలించే దక్షిత లేదు ఈ ముఖ్యమంత్రికి.
రాజధాని రైతులకు తీవ్ర నష్టం కలిగించారు
ఈ ప్రాంతానికి నష్టం కలిగించడానికి ముఖ్యమంత్రి కంకణం కట్టుకున్నారు. 809 రోజుల ఉద్యమం తరువాత హైకోర్టు అమరావతి రైతులకు అనుకూలంగా తీర్పు ఇస్తే.. ముఖ్యమంత్రి, మంత్రులు మాత్రం విపరీతమైన ధోరణితో మాట్లాడుతున్నారు. మూడు రాజధానులకే కట్టుబడి ఉన్నామని మాట్లాడుతున్నారు. ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేయకుండా మూడేళ్లు వృధా చేశారు. తీరని నష్టం చేశారు. ఈ రోజు అమరావతే రాజధానిగా ఉండుంటే వేల కోట్లు పెట్టుబడులు వచ్చేవి.
ఈ ప్రాంతం అభివృద్ధి చెందేది. రైతాంగం సంతోషంగా ఉండేవారు. యువతకు ఉపాధి అవకాశాలు మెరుగయ్యేవి. కానీ ప్రభుత్వ తీరుతో రైతులు ఆస్తులు కోల్పోయారు, విలువలు కోల్పోయి అప్పుల పాలయ్యారు. ప్రభుత్వం నుంచి రావాల్సిన నిధులు కూడా ఇవ్వకుండా ఆపేసి ఇబ్బంది పెడుతుంటే … ఆ రోజు పవన్ కళ్యాణ్ అమరావతి ప్రాంతానికి వచ్చి రైతులకు అండగా నిలబడ్డారు. మీ వెంట మేమున్నామని ఉద్యమం కొనసాగించమని భరోసా ఇచ్చారు.
రూ. 6 వేల కోట్ల విద్యుత్తు భారం పడనుంది
సుపరిపాలన అదిస్తారని అధికారం ఇస్తే … వైసీపీ ప్రభుత్వం ప్రజలను అంధకారంలోకి నెట్టేసింది. రోజుకు దాదాపు 6 గంటల పాటు కరెంటు కట్ చేస్తున్నారు. మార్చిలోనే ఇలాంటి పరిస్థితి ఉంటే ముందు ముందు ఎలాంటి గడ్డు పరిస్థితులు అనుభవించాలో. ముఖ్యమంత్రి జగన్ పుణ్యమా అని వచ్చే నెల నుంచి ప్రజలపై దాదాపు రూ. 6 వేల కోట్లు విద్యుత్తు భారం పడనుంది. దీనిపై మనందరం కలిసి పోరాడాలి. రాష్ట్రంలో ఎన్నో సమస్యలు ఉన్నాయి. ముఖ్యంగా మత్స్యకారుల సమస్యల అధ్యయనానికి ఉభయ గోదావరి జిల్లాల్లో పాదయాత్ర నిర్వహిస్తే… అనేక సమస్యలు మా దృష్టికి వచ్చాయి. మత్స్యకార పల్లెల్లో కనీస మౌలిక వసతులు లేవు. అర్హులైన వారికి పెన్షన్లు అందడం లేదు. మత్స్యకార భరోసా పథకం కేవలం 30 నుంచి 40 శాతం మందికి మాత్రమే అందుతోంది. కనీసం తాగడానికి మంచినీరు లేని దుస్థితిలో తీర ప్రాంత గ్రామాలు ఉన్నాయి.
కొందరికే చేరుతున్న సంక్షేమ పథకాలు
తుపాన్ బాధిత రైతులను పరామర్శించడానికి పవన్ కళ్యాణ్ ఈ ప్రాంతంలో పర్యటించారు. వర్షంలో కూడా రైతులతో మాట్లాడారు. వారి సమస్యలు తెలుసుకున్నారు. బాధిత రైతులకు రూ. 25 వేల చొప్పున నష్టపరిహారం అందించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తే స్పందించలేదు. రైతాంగంతో కలిసి ఛలో అసెంబ్లీ కార్యక్రమాన్ని నిర్వహిస్తామని హెచ్చరిస్తే… కరోనా పరిస్థితులను సాకుగా చూపి శాసనసభ సమావేశాలను నిలిపివేశారు. రాష్ట్రానికి రూ. 7 లక్షల కోట్ల అప్పు ఉంది అంటే ఒక్కొక్క కుటుంబం నెత్తిన దాదాపు రూ.2 నుంచి 3 లక్షల రుణ భారం పడుతున్నట్లు.
అప్పుల భారం అందరిపై పడుతుంటే ప్రభుత్వం ఇస్తున్న సంక్షేమ పథకాలు మాత్రం కొందరికే చేరుతున్నాయి. ముఖ్యంగా రైతు భరోసా కేంద్రాలు దళారుల కోసం మాత్రమే ఉపయోగపడుతున్నాయి. రైతులకు ఎరువులు, విత్తనాలు ఇవ్వడం లేదు. ప్రకృతి విపత్తులతో నష్టపోయిన రైతులను ఆదుకోలేదు. కేవలం ప్రచారానికి మాత్రమే ఈ ప్రభుత్వం పరిమితమయ్యింది.
జనసేనానిని దెబ్బతీయటం మీ వల్ల కాదు
రాష్ట్రంలో సమస్యలు సృష్టించేది, వాటిని పరిష్కరించేలా కలరింగ్ ఇచ్చేది ముఖ్యమంత్రే. సినిమా టికెట్లు, చికెన్ షాపులు, మటన్ షాపులపై ఉన్న శ్రద్ధ ఆయనకు పాలనపై లేదు. కొల్లూరులో ప్రభుత్వ యంత్రాంగాన్ని ఉపయోగించుకొని భీమ్లా నాయక్ సినిమాను ఆపించేశారు. రాజకీయాలు వేరు సినిమాలు వేరు. సినిమా ఫలితాన్ని నిర్ణయించేది ముఖ్యమంత్రి కాదు ప్రజలు.
ఇంతమంది వచ్చి నన్ను కలుస్తారు… ఈయన మాత్రం రాడని, ఆయన్ని ఆర్ధికంగా దెబ్బకొట్టాలని ప్రయత్నిస్తున్నారు. అది మీ వల్ల కాదు. ముఖ్యమంత్రి ఇంటి పక్కనే అమరావతి రైతులు ఉంటారు. రాజధాని కోసం దాదాపు 34 వేల మంది రైతులు భూములు ఇచ్చారు. అరగంట సేపు వాళ్ల కోసం కేటాయించలేరా? వాళ్లపై కేసులు పెట్టి, అవమానాలకు గురి చేశారు. విచిత్రంగా ఎస్సీలపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులు పెట్టారు.
ఆవిర్భావ సభకు ముమ్మరంగా ఏర్పాట్లు
గుంటూరు జిల్లా మంగళగిరి నియోజకవర్గం ఇప్పటం గ్రామంలో ఈ నెల 14వ తేదీన ఆవిర్భావ సభ నిర్వహించడానికి ఏర్పాట్లు చక చక సాగుతున్నాయి. దాదాపు 25 ఎకరాలను సభ కోసం సిద్ధం చేస్తున్నాము. రాజకీయ ఒత్తిళ్లతో నాలుగు స్థలాలు మార్చిన తరువాత ఈ స్థలాన్ని ఎంపిక చేశాం. ఈ సభ వేదిక నుంచి అధ్యక్షులు పవన్ కళ్యాణ్ జనసైనికులకు దిశా నిర్దేశం చేస్తారు. పార్టీ భవిష్యత్తు కార్యాచరణ ఏంటి? ఏ విధంగా ముందుకు వెళ్లబోతున్నాం? క్షేత్రస్థాయిలో రాజకీయ శక్తిగా ఎలా ఎదగాలి అనే అంశాలపై మాట్లాడతారు. ఈ ఆవిర్భావ సభకు రాష్ట్ర నలుమూలల నుంచి జనసైనికులు, వీర మహిళలు తరలి రావాలని పార్టీ తరపున అందరినీ ఆహ్వానిస్తున్నామని” తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా నాయకులు, నియోజకవర్గ ఇంఛార్జులు, మండల అధ్యక్షులు, వేలాది మంది జనసైనికులు పాల్గొన్నారు.