ధర్నాకు దిగిన ప్రధాని సోదరుడు

132

ప్రధాని నరేంద్ర మోదీ సోదరుడు ప్రహ్లాద్ మోదీ ధర్నా చేశారు. ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద ఆయన ధర్నాకు దిగారు. అఖిల భారత చౌక ధరల దుకాణాల డీలర్ల సంఘానికి ప్రహ్లాద్ మోదీ ఉపాధ్యక్షుడు అన్న సంగతి తెలిసిందే. తమ సంఘం డిమాండ్లను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ ఆయన ధర్నా చేపట్టారు. జీవన వ్యయం భారీగా పెరిగిన నేపథ్యంలో రేషన్ దుకాణాలను నడపడం చాలా కష్టంగా ఉందని ఆయన చెప్పారు.

బియ్యం, గోధుమలు, పంచదారపై తమకు ఇచ్చే కమిషన్ లో కేంద్ర ప్రభుత్వం కేజీపై కేవలం 20 పైసలు మాత్రమే పెంచడం దారుణమని ప్రహ్లాద్ మోదీ అన్నారు. రేషన్ డీలర్లను ఆర్థిక కష్టాల నుంచి గట్టెక్కించాలని… సాయాన్ని ప్రకటించాలని డిమాండ్ చేశారు. రేపు డీలర్ల సంఘం నాయకులంతా సమావేశమై భవిష్యత్ కార్యాచరణపై చర్చిస్తామని చెప్పారు. రేపు ప్రధాని మోదీని కలిసి వినతిపత్రాన్ని అందజేస్తామని అన్నారు. లోక్ సభ స్పీకర్ ఓం బిర్లాను కూడా కలుస్తామని చెప్పారు.