ఫ్యామిలీ డాక్టర్‌ సేవలకు సన్నద్ధం కావాలి…

* వైద్య ఆరోగ్య శాఖ మంత్రి రజిని అధ్యక్షతన
ఆ శాఖ బడ్జెట్‌ అంచనాలపై సమీక్ష
* ప్రభుత్వ ఆస్పత్రి భవనాలు, వైద్య కళాశాలల భవనాల నిర్మాణ పురోగతిపైనా చర్చ
*విలేజ్‌ క్లినిక్స్‌లో పూర్తి స్థాయిలో పోస్టుల భర్తీకి ఆదేశాలు
*కంటివెలుగు రోగులకు రవాణా సౌకర్యంపై ఆలోచించాలి
*ఫ్యామిలీ డాక్టర్‌ సేవలకు అన్ని స్థాయుల్లో సంసిద్ధం కావాలి…
*మందుల షాపుల్లో అక్రమ విక్రయాలపై ఉక్కు పాదం మోపాలి
* వైద్య ఆరోగ్య శాఖ అధికారులకు మంత్రి రజిని ఆదేశాలు

మంగళగిరి: మంగళవారం నుంచి అసెంబ్లీ సమావేశాలు ప్రార ంభం కానున్న నేపథ్యంలో సోమవారం ఉదయం మంగళగిరి రాష్ట్రవైద్య ఆరోగ్య శాఖ మంత్రి కార్యాలయంలో ఆ శాఖ మంత్రి విడదల రజిని అధ్యక్షతన సమీక్షా సమావేశం జరిగింది . ఈ సందర్భంగా మంత్రి రజిని వైద్య ఆరోగ్య శాఖలోని వివిధ విభాగాల అధికారులతో ఆయా విభాగాల పురోగతిని సమీక్షించారు. బడ్జెట్‌ అంచనాలు, కంటివెలుగు, ఆరోగ్యశ్రీ, తల్లీబిడ్డ ఎక్స్‌ప్రెస్, 104 వాహనాలు, ఫ్యామిలీ డాక్టర్, విలేజ్‌ క్లినిక్స్‌ పథకాల తీరుతెన్నులపై మంత్రి సమీక్షించారు.

రాష్ట్రంలో డ్రగ్స్‌ నియంత్రణ విభాగం ఆధ్వర్యంలో మందుల షాపుల్లో మత్తుమందులు, ఇతర అనధికారిక విక్రయాలను అరికట్టాలని, ఇందుకోసం రాష్ట్రవ్యాప్తంగా దాడులు నిర్వహించాలని, జల్లెడ పట్టాలని ఆమె సంబంధిత అధికారులను ఆదేశించారు. కంటివెలుగు పథకం మొదటిదశలో 60,393 పాఠశాలలకు చెందిన 66,17613 మంది విద్యార్థులకు కంటి వరీక్షలు చేసి, 4,38,751 మందికి నేత్ర సంబంధిత సమస్యలను గుర్తించామని అధికారులు చెప్పారు.

రెండో దశలో స్క్రీనింగ్‌లో 4,38,751 మంది విద్యార్థుల్లో 1,58,227 మందికి కళ్లద్దాలు పంపిణీ చేశామని, 310 మందికి సర్జరీలు చేయించామని అధికారులు మంత్రికి తెలిపారు. కంటివెలుగు మూడో దశలో అవ్వా–తాతలకు కంటి చికిత్సల్లో భాగంగా ఇప్పటివరకు 24,65,300 మందికి స్క్రీనింగ్‌ చేసి, 4,70, 034 మందికి కేటరాక్టు ఆపరేషన్లు చేశారు. 9,33,413 మందికి మందులు అందచేశారు. 10,61,853 మందికి కళ్లద్దాలు పంపిణీ చేశారు.

కంటివెలుగు మూడో దశలో భాగంగా మిగిలిన 35,42,151 మందికి స్క్రీనింగ్‌ కోసం 376 బృందాలను ఏర్పాటు చేశామని, ఆర్నెల్లలో వీరందరికీ స్క్రీనింగ్‌ పూర్తి చేసి, అవసరమైన వారికి సర్జరీలు చేయాలని, మందులు, కళ్లద్దాలు పంపిణీ చేయాలని అధికారులకు మంత్రి రజిని సూచించారు. చికిత్స కోసం వచ్చే రోగులకు ఇంటి నుంచి ఆస్పత్రికి, చికిత్సానంతరం ఆస్పత్రి నుంచి ఇంటికి చేర్చడానికి రవాణా సౌకర్యం కల్పించే అవకాశాన్ని పరిశీలించాలని మంత్రి అధికారులకు సూచించారు.

అత్యంత ఆవశ్యకమైన కంటివెలుగు పథకం జాయింట్‌ డైరెక్టర్‌ పోస్టును వెంటనే భర్తీ చేయాలని మంత్రి ఆదేశించారు. 146 కొత్త 104 అంబులెన్సులు అందుబాటులోకి వస్తున్న దృష్ట్యా పాత వాటిలో ఎన్ని ‘మహా ప్రస్థానం’ సేవలకు పనికొస్తాయో చూడాలని ఆమె అధికారులకు సూచించారు. ప్రభుత్వ ఆస్పత్రుల్లో మందుల నిల్వలు సమృద్ధిగా ఉండేలా చూసుకోవాలని అధికారులకు తెలిపారు. ఫ్యామిలీ ఫిజీషియన్‌ పథకం జిల్లా నోడల్‌ అధికారి తమ పరిధిలోని అసెంబ్లీ నియోజకవర్గాల్లోని విలేజ్‌ క్లినిక్స్‌ను పరిశీలించి, అక్కడేవైనా లోటుపాట్లు ఉంటే వాటిని సరిచేయాలని మంత్రి అధికారులను ఆదేశించారు.

సరిచేసిన సమాచారాన్ని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ అధికారులకు నివేదిక పంపాలని ఆమె పేర్కొన్నారు. ఫ్యామిలీ డాక్టర్‌ పథకాన్ని ప్రతిష్టాత్మకంగా ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి త్వరలో ప్రారంభించబోతున్న నేపథ్యంలో రాష్ట్రంలోని అన్ని పీహెచ్‌సీలు, వైఎస్సార్‌ విలేజ్‌ క్లినిక్స్‌లో ఎక్కడా వైద్య సిబ్బంది కొరత మాటే లేకుండా అన్ని స్థాయుల పోస్టులను భర్తీ చేయాలని మంత్రి రజిని ఆదేశించారు.

నాడు–నేడు పథకంలో భాగంగా రాష్ట్రంలో చేపట్టిన ప్రభుత్వ ఆస్పత్రి భవనాలు, వైద్య కళాశాలల భవనాల నిర్మాణ పురోగతిని ఈ సందర్భంగా మంత్రి సమీక్షించారు. ఈ సమీక్షలో వైద్య ఆరోగ్య శాఖ ప్రిన్సిపల్‌ సెక్రటరీ కృష్ణబాబు, ఆ శాఖ కమిషనర్‌ నివాస్, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

Leave a Reply