కేంద్ర హోం మంత్రిత్వ శాఖ అలసత్వాన్ని ఇదొక ప్రబల నిదర్శనం!

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ మధ్య పెండింగ్‌లో ఉన్న సమస్యలపై చర్చించడానికి కేంద్ర హోం మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేసిన “వివాద పరిష్కార ఉపసంఘం” మొదటి సమావేశం ఎజెండాను రూపొందించడంలో ఎంతటి నిర్లక్ష్యం ప్రదర్శించారో గమనిస్తే అమిత్ షా నేతృత్వంలోని హోం మంత్రిత్వ శాఖ ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టం -2014 అమలు, ప్రత్యేక తరగతి హోదా అంశంపై ఎలా అలసత్వం ప్రదర్శిస్తున్నదో ఎవరికైనా బోధపడుతుంది.

17వ తేదీన జరిగే ఆన్ లైన్ సమావేశం అజెండాలో రెవెన్యూ లోటు, రాయలసీమ – ఉత్తరాంధ్ర ప్రాంతంలోని 7 వెనుకబడిన జిల్లాలకు “డెవలప్మెంట్ గ్రాంట్, ప్రత్యేక తరగతి హోదా అంశాలను కూడా మొదట పొందుపరచి రెండు రాష్ట్రల సంబంధిత ప్రభుత్వాధికారులకు పంపారు. ఈ అంశాలతో తెలంగాణకు ఎలాంటి సంబంధం లేదు. ఈ అంశాలు చర్చించాల్సిన అంశాలు కూడా కాదు. మోడీ ప్రభుత్వం విధిగా అమలు చేయాల్సిన అంశాలు. కానీ, మోడీ ప్రభుత్వం అమలు చేయకుండా ఏడేళ్లుగా ఆంధ్రప్రదేశ్ కు దగా చేస్తున్నది.

కేంద్ర హోం మంత్రిత్వ శాఖ సబ్ – కమిటీ అజెండాలో చేర్చడంతో ఉలిక్కిపడ్డ బిజెపి రాజ్యసభ సభ్యులు జీ.వి.యల్. నరసింహారావు , వెంటనే హోం మంత్రిత్వ శాఖ ఉన్నతాధికారులతో మాట్లాడారట. ఈ విషయాన్ని తెలియజేస్తూ ఆయనే చిన్న వీడియోను సామాజిక మాధ్యమం ద్వారా విడుదల చేశారు.

పర్యవసానంగా నాలుక కరుచుకొన్న హోం మంత్రిత్వ శాఖ సబ్ – కమిటీ అజెండాలోని ఆ అంశాలను తొలగించి, మార్చిన అజెండాను రెండు రాష్ట్రాలకు మళ్ళీ పంపినట్లు సమాచారాన్ని వెల్లడించారు. దీన్నిబట్టి ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టం – అమలు, ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేక తరగతి హోదా కల్పించే అంశంలో కేంద్ర హోం మంత్రిత్వ శాఖ ఎంత గందరగోళంలో ఉన్నదో అర్థమవుతున్నది.

– టి.లక్ష్మీనారాయణ
కన్వీనర్,
ఆంధ్రప్రదేశ్ సమగ్రాభివృద్ధి అధ్యయన వేదిక, విజయవాడ

Leave a Reply